ఎట్టకేలకు కదలిక | Establishment of eight beds in Gurla PHC of Vizianagaram district | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు కదలిక

Published Mon, Oct 21 2024 3:59 AM | Last Updated on Mon, Oct 21 2024 3:59 AM

Establishment of eight beds in Gurla PHC of Vizianagaram district

విజయనగరం జిల్లా గుర్ల పీహెచ్‌సీలో ఎనిమిది బెడ్స్‌ ఏర్పాటు 

సాక్షి, అమరావతి/గుర్ల: విజయనగరం జిల్లా గుర్ల డయేరియా ఘటనలపై ఎట్టకేలకు ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఈ నెల 13న డయేరియా వ్యాప్తి మొదలై 470 మందికిపైగా దీని బారినపడగా.. వారిలో శనివారం నాటికి 11 మంది మరణించారు. తాజాగా ఆదివారం మరో ఐదు కేసులు నమోదు కాగా, ఎన్‌.పాపారావు(62) మృత్యు­వాత­ప­డ్డారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు సర్కారు ఏమాత్రం చలనం లేనట్టుగా వ్యవహరించింది. బాధితులను ఆస్పత్రులకు తరలించి మెరుగైన వైద్యసేవలు అందించడంలో విఫలమైంది. బాధితులకు ప్రభుత్వ పాఠశాలలోని బల్లలపై పడుకోబెట్టి సెలైన్‌ ఎక్కిస్తూ, చికిత్స చేయడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. 

ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం తీవ్రస్థాయిలో ఎండగట్టారు. ఓ పక్క ప్రజల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం మొద్దునిద్రలో ఉందని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు సైతం బాధితుల పక్షాన నిలిచారు. దీంతో ఆదివారం హుటాహుటిన సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి విజయానంద్‌తో విచారణకు ఆదేశించారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్‌ సిరి సైతం ఆదివారం డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. 

సోమవారం డిప్యూ­టీ సీఎం పవన్‌కళ్యాణ్‌ గుర్ల పర్యటనకు సిద్ధమయ్యారు. కాగా.. డయేరియా ప్రబలి పలువురు ప్రాణా­లు కోల్పోయిన నేపథ్యంలో వైద్య శాఖ నిర్లక్ష్యం, ప్రభుత్వ అలక్ష్యాన్ని ఎండగడుతూ నాలుగు రోజులుగా ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలకు అధికార యంత్రాంగం ఎట్టకేలకు స్పందించింది. రోగులకు అవసరమైన బెడ్‌లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. గ్రామంలోని జెడ్పీ హైసూ్కల్‌లో చికిత్స పొందుతూ కోలుకున్న వారిని ఇళ్లకు పంపించేశారు. మిగిలిన బాధితులను గుర్ల పీహెచ్‌సీకి తరలించారు. పీహెచ్‌సీలో అదనంగా 8 బెడ్‌లు, సెలైన్‌ స్టాండ్లు ఏర్పాటు చేసినట్టు గుర్ల పీహెచ్‌సీ వైద్యాధికారి చెన్నయ్‌ తెలిపారు.  

మరణాలు లేవంటూ బుకాయింపు 
గుర్లలో డయేరియా మరణ మృదంగం సృష్టిస్తుంటే ప్రభుత్వం మాత్రం అక్కడ ఏమీ జరగనట్టుగానే వారం రోజులపాటు వ్యవహరించింది. 470 మందికిపైగా డయేరియా బారినపడినట్టు స్థానికులు చెబుతున్నారు. 

తమ వాళ్లు డయేరియాతోనే మృతి చెందారని 12 మంది కుటుంబాల వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం డయేరి­యా కారణంగా ఇప్పటివరకు ఒక్కరు మాత్రమే మరణించినట్టు ఆదివారం ప్రకటించింది. ప్రతిపక్షం బాధితుల పక్షాన నిలవడంతో చేసేదేమీ లేక ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించిందని విజయనగరం జిల్లా వాసులు చర్చించుకుంటున్నారు.

నేడు పవన్‌కళ్యాణ్‌ పర్యటన 
గుర్లలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ సోమ­వారం పర్యటిస్తారని  జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.  అతిసారం ప్రబలిన ప్రాంతాల్లో ఆయన పర్యటించి, అక్కడి పరిస్థితులపై సమీక్షిస్తారని పేర్కొంది.

నీటి కాలుష్యమే కారణం: వైద్యశాఖ 
గుర్లలో డయేరియా ప్రబలడానికి నీటి కాలుష్యమే ప్రధాన కారణమని వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఆదివారం తెలిపారు. తాగునీటి నమూనాలను ప్రయోగశాలకు పంపగా.. కలుíÙతమైనట్టు తేలిందని పేర్కొన్నారు. స్థానిక వైద్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, డయేరియా వ్యాప్తికి కారణాలపై అధ్యయనం చేసి సమగ్ర నివేదికను అందజేయాలని ఆదేశాలిచ్చామని తెలిపారు. 

ఆ ప్రాంతంలో ప్రజలు బహిరంగ మల విసర్జన చేయడంతో భూగర్భ జలాలు కలుషితమయ్యాయని, ఈ నెల 13న ఒక కేసుతో ప్రారంభమై 18వ తేదీ వరకూ వరుసగా కేసులు నమోదైనట్టు తెలిపారు. మరణాల సంఖ్యపై వివిధ రకాల వార్తలొస్తున్నాయని, వాస్తవంగా డయేరియాతో ఒక్కరే మరణించగా, ఏడుగురు ఇతర వ్యాధులతో మరణించారని వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement