paparao
-
ఎట్టకేలకు కదలిక
సాక్షి, అమరావతి/గుర్ల: విజయనగరం జిల్లా గుర్ల డయేరియా ఘటనలపై ఎట్టకేలకు ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఈ నెల 13న డయేరియా వ్యాప్తి మొదలై 470 మందికిపైగా దీని బారినపడగా.. వారిలో శనివారం నాటికి 11 మంది మరణించారు. తాజాగా ఆదివారం మరో ఐదు కేసులు నమోదు కాగా, ఎన్.పాపారావు(62) మృత్యువాతపడ్డారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు సర్కారు ఏమాత్రం చలనం లేనట్టుగా వ్యవహరించింది. బాధితులను ఆస్పత్రులకు తరలించి మెరుగైన వైద్యసేవలు అందించడంలో విఫలమైంది. బాధితులకు ప్రభుత్వ పాఠశాలలోని బల్లలపై పడుకోబెట్టి సెలైన్ ఎక్కిస్తూ, చికిత్స చేయడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం తీవ్రస్థాయిలో ఎండగట్టారు. ఓ పక్క ప్రజల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం మొద్దునిద్రలో ఉందని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు సైతం బాధితుల పక్షాన నిలిచారు. దీంతో ఆదివారం హుటాహుటిన సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్‌తో విచారణకు ఆదేశించారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ సిరి సైతం ఆదివారం డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. సోమవారం డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ గుర్ల పర్యటనకు సిద్ధమయ్యారు. కాగా.. డయేరియా ప్రబలి పలువురు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో వైద్య శాఖ నిర్లక్ష్యం, ప్రభుత్వ అలక్ష్యాన్ని ఎండగడుతూ నాలుగు రోజులుగా ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలకు అధికార యంత్రాంగం ఎట్టకేలకు స్పందించింది. రోగులకు అవసరమైన బెడ్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. గ్రామంలోని జెడ్పీ హైసూ్కల్లో చికిత్స పొందుతూ కోలుకున్న వారిని ఇళ్లకు పంపించేశారు. మిగిలిన బాధితులను గుర్ల పీహెచ్‌సీకి తరలించారు. పీహెచ్సీలో అదనంగా 8 బెడ్లు, సెలైన్ స్టాండ్లు ఏర్పాటు చేసినట్టు గుర్ల పీహెచ్సీ వైద్యాధికారి చెన్నయ్ తెలిపారు. మరణాలు లేవంటూ బుకాయింపు గుర్లలో డయేరియా మరణ మృదంగం సృష్టిస్తుంటే ప్రభుత్వం మాత్రం అక్కడ ఏమీ జరగనట్టుగానే వారం రోజులపాటు వ్యవహరించింది. 470 మందికిపైగా డయేరియా బారినపడినట్టు స్థానికులు చెబుతున్నారు. తమ వాళ్లు డయేరియాతోనే మృతి చెందారని 12 మంది కుటుంబాల వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం డయేరియా కారణంగా ఇప్పటివరకు ఒక్కరు మాత్రమే మరణించినట్టు ఆదివారం ప్రకటించింది. ప్రతిపక్షం బాధితుల పక్షాన నిలవడంతో చేసేదేమీ లేక ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించిందని విజయనగరం జిల్లా వాసులు చర్చించుకుంటున్నారు.నేడు పవన్‌కళ్యాణ్ పర్యటన గుర్లలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ సోమవారం పర్యటిస్తారని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అతిసారం ప్రబలిన ప్రాంతాల్లో ఆయన పర్యటించి, అక్కడి పరిస్థితులపై సమీక్షిస్తారని పేర్కొంది.నీటి కాలుష్యమే కారణం: వైద్యశాఖ గుర్లలో డయేరియా ప్రబలడానికి నీటి కాలుష్యమే ప్రధాన కారణమని వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఆదివారం తెలిపారు. తాగునీటి నమూనాలను ప్రయోగశాలకు పంపగా.. కలుíÙతమైనట్టు తేలిందని పేర్కొన్నారు. స్థానిక వైద్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, డయేరియా వ్యాప్తికి కారణాలపై అధ్యయనం చేసి సమగ్ర నివేదికను అందజేయాలని ఆదేశాలిచ్చామని తెలిపారు. ఆ ప్రాంతంలో ప్రజలు బహిరంగ మల విసర్జన చేయడంతో భూగర్భ జలాలు కలుషితమయ్యాయని, ఈ నెల 13న ఒక కేసుతో ప్రారంభమై 18వ తేదీ వరకూ వరుసగా కేసులు నమోదైనట్టు తెలిపారు. మరణాల సంఖ్యపై వివిధ రకాల వార్తలొస్తున్నాయని, వాస్తవంగా డయేరియాతో ఒక్కరే మరణించగా, ఏడుగురు ఇతర వ్యాధులతో మరణించారని వివరించారు. -
‘వైఎస్ జగన్‌ది మేనిఫెస్టో.. చంద్రబాబుది మోసఫెస్టో’
సాక్షి, గుంటూరు: వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చింది మేనిఫెస్టో అయితే చంద్రబాబు ప్రవేశపెట్టింది మోసఫెస్టోనని మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఈ అంశాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలని అన్నారు. మేనిఫెస్టో గురించి చంద్రబాబు మాట్లాడుతుంటే సిగ్గేస్తోందని విమర్శించారు. గతంలో చంద్రబాబు ఎంతమంది పేదలను దనవంతులుగా చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. వాగ్ధానాలు చేసి మోసగించిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. వైఎస్ జగన్ మేనిఫెస్టో.. చంద్రబాబు మోసఫెస్టోపై ఇంటింటా చర్చ జరగాలని అన్నారు. గుంటూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘మేనిఫెస్టో అంటే జగన్’ అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ చర్చలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, ఆర్థికరంగ విశ్లేషకులు పాపారావు, మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీలు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, యేసు రత్నం, మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఆదివారం అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లో సీఎం జగన్ ట్రెండ్ సెట్టర్. ఆయన పాలన ప్రజలకు స్వర్గం.. బాబు, ఎల్లో మీడియాకు నరకం. రాజకీయ నాయకులు భష్టు పట్టించిన మేనిఫెస్టోకు పవిత్రత తెచ్చిన వ్యక్తి సీఎ జగన్. జగన్ మోహన్ రెడ్డి రెండు పేజీల మేనిఫెస్టో ఇచ్చారు. అందులో పేర్కొన్నట్లే సంక్షేమ ఫలాలను ఇంటింటికీ తీసుకెళ్లి ప్రజలకు ఇస్తున్నాం. మీకు మేలు చేస్తేనే ఓటేయమని అడుగుతున్నాం. పేదలకు మేలు చేస్తే ఓటేయండి...లేకపోతే వద్దని దమ్ముగా చెప్పిన ఒకే ఒక్కడు వైఎస్ జగన్మోహన్రెడ్డి’ అని అంబటి వ్యాఖ్యానించారు. చదవండి: ఇంకా 25 మంది కాంటాక్ట్‌లోకి రాలేదు: మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు టీడీపీ కుట్రలను బహిర్గతం: డొక్కా మాణిక్య వరప్రసాద్ చెప్పిన ప్రతి అంశాన్ని అమలు పరచిన గొప్ప ముఖ్యమంత్రి జగన్ అని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. మేనిఫెస్టో అంటే బైబిలు, ఖురాన్, భగవద్గీత అని ముఖ్యమంత్రి అన్నారని.. అందుకే మేనిఫెస్టో అంటే జగన్‌దేనని అన్నారు. ప్రజలను మోసపూరిత మాటలతో చంద్రబాబు మోసం చేస్తున్నారని విమర్శించారు. గుంటూరు జిల్లాలోని ప్రజలకు నిజానిజాలు తెలిపి టీడీపీ కుట్రలను బహిర్గతం చేయాలనే ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలు చించేశారు: ఎమ్మెల్సీఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ‘రాజకీయ పార్టీలు తాము గెలిచిన తరువాత ప్రజలకు చేయబోయే పథకాలను తెలియజేస్తారు.కొన్ని పార్టీలు ఎన్నికలకు ముందు విడుదల చేసిన మేనిఫెస్టో గెలిచిన తరువాత చించుతున్నారు. గతంలో చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోను ప్రజలు చెక్ చేస్తే అప్పటికే దానిని చించారని గుర్తించారు. వైఎస్సార్సీపీ తీసుకు వచ్చిన మేనిఫెస్టోను నాయకుల ముందు ఉంచి ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించి 98 శాతం అమలు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్’ మేనిఫెస్టోను వెబ్సైట్ నుంచి మాయం చేసిన వ్యక్తి చంద్రబాబు: కొమ్మినేని శ్రీనివాసరావు గతంలో చంద్రబాబు మేనిఫెస్టోలో చెప్పింది ఒక్కటి కూడా అమలు కాలేదని, 2019లో వైఎస్ జగన్ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీ అంశం అమలు చేశారని ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. తన మేనిఫెస్టోను వెబ్ సైట్ నుంచి మాయం చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ కొమ్మినేని దుయ్యబట్టారు. ‘‘మేనిఫెస్టోను భగద్గీత,ఖురాన్,బైబిల్ గా భావించిన వ్యక్తి సీఎం జగన్. మేనిఫెస్టో అంటే సీఎం జగన్ దృష్టిలో ప్రజలకు ఇచ్చిన హామీ. మేనిఫెస్టో అంటే చంద్రబాబు దృష్టిలో ప్రజలను నమ్మించే ఓ కాగితం. దేశమంటే మట్టికాదోయ్.. మనుషులోయ్ అన్నారు గురజాడ.. ఆయన మాటలను తూచా తప్పకుండా పాటిస్తున్న వ్యక్తి వైఎస్ జగన్. ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు మరోసారి సిద్ధమయ్యారు. సోనియా గాంధీని ఎదిరించి సీఎం జగన్ ఎన్నో ఇబ్బందులు పడ్డారు’’ అని కొమ్మినేని అన్నారు. చంద్రబాబు మేనిఫెస్టో కలగూరగంప: ఆర్ధిక రంగ విశ్లేషకులు పాపారావు వైఎస్ జగన్ మేనిఫెస్టోను తప్పుపట్టిన చంద్రబాబు ఇప్పుడు అదే మేనిఫెస్టోను ఫాలో అవుతున్నాడు. ఏపీ శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేశారు. చంద్రబాబు మేనిఫెస్టో కలగూరగంప. జగన్ అవునన్నదల్లా చంద్రబాబు కాదన్నాడు. జగన్ ఎస్ అంటే నో అన్నాడు..నో అంటే ఎస్ అన్నాడు. చంద్రబాబు మేనిఫెస్టోపై ఆయన పార్టీలోనూ చర్చ జరగడం లేదు. మేనిఫెస్టోలో చెప్పిందే జగన్ చేస్తున్నాడు. పేద ప్రజలను మోసం చేయడం లేదు. ఆయన వల్ల ఎవరూ దగాపడలేదు. అమరావతిలో పేదలకు ఇళ్లిస్తామంటే చంద్రబాబు చీదరించుకున్నాడు. పేదలు అమరావతిలో ఉండకూడదా? జనానికి ఉపయోగపడేలా రాజకీయం చేయాలి. పేదలకు వ్యతిరేకంగా భావజాలంతో ఉన్న వారిని తరిమికొట్టాలి మళ్లీ జగనే సీఎం: మర్రి రాజశేఖర్ మేనిఫెస్టోను తూచ తప్పకుండా అమలు చేస్తున్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి జగన్ అని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పేర్కొన్నారు. సీఎ జగన్ మేనిఫెస్టోకు ఒక విలువ తెచ్చారని ప్రశంసించారు. భారతదేశానికే ఆదర్శవంతమైన వైఎస్ జగన్.. చంద్రబాబులాగా అబద్ధాలు చెప్పుంటే 2014లో సీఎం అయ్యుండేవారని అన్నారు. ఒక్కరూపాయి కూడా లంచం తీసుకోకుండా ప్రజలకు సేవలు అందేలా చేస్తున్న వ్యక్తి వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోకు ప్రజల నుంచి స్పందన రావడం లేదని ఈ రాష్ట్రానికి మళ్లీ జగనే సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. -
పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను ప్రోత్సహించాలి
‘‘దాదాపు 16 ఏళ్లుగాపాపారావుగారితో నాకు పరిచయం ఉంది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారునిగా చేశారాయన.పాపారావుగారు ‘మ్యూజిక్ స్కూల్’ సినిమా తీస్తున్నారని న్యూస్‌పేపర్స్‌లో చూసి తెలుసుకున్నాను. మంచిగా సినిమా చేయాలని కోరుకున్నాను. మ్యూజిక్ స్కూల్ ట్రైలర్, సాంగ్స్ బాగున్నాయి. ఈ సినిమా టైటిల్ ‘మ్యూజిక్ స్కూల్’. కానీ నాకు ఇప్పుడు మ్యూజిక్ యూనివర్సిటీ (ఇళయరాజాని ఉద్దేశించి) పక్కన నిలబడే అవకాశం కలిగింది’’ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. శ్రియా శరన్, శర్మాన్ జోషి, షాన్ ప్రధాన ప్రాత్రల్లో నటించిన ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’. ఇళయరాజా సంగీత సారథ్యంలోపాపారావు బియ్యాల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న రిలీజ్ కానుంది. తెలుగురాష్ట్రాల్లో ‘దిల్’ రాజు, హిందీలో ‘పీవీఆర్’ ద్వారా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ‘మ్యూజిక్ స్కూల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో తెలంగాణ మంత్రి కేటీఆర్, ఇళయరాజా సంయుక్తంగా ‘మ్యూజిక్ స్కూల్’ ఆడియోను విడుదల చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ – ‘‘అయితే ఇంజనీర్ కావాలి.. లేకపోతే డాక్టర్ కావాలి అంటూ పిల్లల్లో ఆర్ట్స్ పట్ల ఉండే సృజనాత్మకను చంపేస్తున్నాం. అలా చేయకూడదు’ అనే అంశంతో ‘మ్యూజిక్ స్కూల్’ సినిమా తీశామనిపాపారావుగారు చెప్ప్రారు. నా కొడుకుకి 17 ఏళ్లు. ఒక ప్రాట ప్రాడానని, రిలీజ్ చేస్తున్నానని మూడు నెలల క్రితం ‘గోల్డెన్ ఆర్’ అనే ఆల్బమ్ కవర్ చూపించాడు. మ్యూజిక్‌లో శిక్షణ తీసుకోనప్పటికీ తన స్కిల్స్, వాయిస్ చూసి చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఇలా చాలా మంది పిల్లల్లో ప్రతిభ దాగి ఉంటుంది. ఆ ప్రతిభను మనం తొక్కేయకుండా వారి (పిల్లలు) మనసుకు నచ్చింది చేసేలా ప్రోత్సహించాలంటూ ఈ ‘మ్యూజిక్ స్కూల్’ తీసినందుకుపాపారావుగారికి అభినందనలు’’ అన్నారు. ‘‘ఇరవయ్యేళ్ల క్రితం ఓ డాక్యుమెంటరీ తీశాను. అది చూసి రమేష్ ప్రసాద్‌గారు నాకు జాతీయ అవార్డు వస్తుందన్నారు. ఆయన చెప్పినట్లే ఆరు నెలల తర్వాత ఆ డాక్యుమెంటరీ ఫిల్మ్‌కి అవార్డు వచ్చింది. ఇళయరాజాగారి వద్దకు ‘మ్యూజిక్ స్కూల్’ స్క్రిప్ట్ తీసుకుని వెళ్లి, ‘ఈ సినిమాలో 11 ప్రాటలు ఉన్నాయి సార్’ అనగానే.. పది నిమిషాల్లో ఓకే అన్నారు. ఇళయరాజాగారు ఈ ప్రాజెక్ట్‌లోకి రాకపోయి ఉంటే నేను రాసిన కొన్ని స్క్రిప్ట్స్లాగే ఈ కథని కూడా పక్కన పెట్టేవాడిని’’ అన్నారుపాపారావు. ‘‘ఓ సినిమాకు, ఓ ఐఏఎస్ ఆఫీసర్‌కు సంబంధం లేదు. ఎంతో ఫ్యాషన్ ఉండబట్టిపాపారావుగారు ఈ సినిమాను నిర్మించి, దర్శకత్వం వహించారు. పిల్లలకు, తల్లిదండ్రులకు ఈ సినిమా ఓ మంచి సందేశంలాంటిది. ‘మ్యూజిక్ స్కూల్’ను స్కూల్స్‌లోనూ ప్రదర్శించాలనుకుంటున్నాం’’ అన్నారు ‘దిల్’ రాజు. -
ఆర్థికంగా... అడకత్తెరలో బ్రిటన్?
భారత సంతతికి చెందిన రిషీ సునాక్ బ్రిటన్ ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించడంతో... సమస్యల నుండి ఆయన దేశాన్ని ఎలా బయటపడ వేయగలడా అనే చర్చ జరుగుతోంది. మాజీ ప్రధాని లిజ్ ట్రస్ తన మినీ బడ్జెట్లో బ్యాంకర్లకు బోనసులు పెంచటం, కార్పొరేట్లకు పన్నులను తగ్గించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని ప్రయత్నించారు. కానీ మార్కెట్ ఆమె సంస్కరణలను తిరస్కరించింది. ఫలితంగా పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే రిషీ సునాక్ అయినా, మరొకరు అయినా కూడా స్థూలంగా ఈ కార్పొరేట్ అనుకూల చట్రం నుంచి బయటకు రాలేనంత కాలమూ, నయా ఉదారవాద సంస్కరణల చట్రాన్ని బద్దలు కొట్టనంతకాలమూ బ్రిటన్ ఆర్థిక పరిస్థితిలో ఏ మార్పూ ఉండదు. బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా భారతీయ మూలాలున్న రిషీ సునాక్ పదవిని చేపట్టారు. అంతకుముందరి ప్రధాని లిజ్ ట్రస్ కేవలం 45 రోజులపాటు మాత్రమే బ్రిటన్ ప్రధానిగా కొనసాగగలిగారు. గత రెండు నెలల కాలంలో బ్రిటన్‌లో ముగ్గురు ప్రధానులు మారారు. ఇటువంటి పరి స్థితి సాధారణంగా మనం ధనిక దేశాలలో, అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్యాలు అనబడే వాటిలో చూడం. మరి ప్రస్తుతం ఈ దుఃస్థితి బ్రిటన్‌కి ఎందుకు దాపురించింది? ఈ కారణాలలోకి పోయేముందు – కొత్త ప్రధాని సునాక్ అయినా నిల దొక్కుకోగలడా? అన్న ప్రశ్న ఎటూ ఎదురవుతూనే ఉంది. దీనికి జవాబుగా ‘గార్డియన్’ పత్రిక మూడు అంశాలను ముందుకు తెచ్చింది: 1. నిన్నటి ప్రధాని లిజ్ ట్రస్ ఏ సమస్యలను అయితే ఆర్థిక రంగంలో ఎదుర్కొన్నారో అదే సమస్యలు నేడు సునాక్ ముందు∙అలాగే అపరిష్కృతంగా నిలబడి ఉన్నాయి. 2. సునాక్ తాలూకూ కన్జర్వేటివ్ పార్టీ వారే ఆయనను ప్రజల మద్దతుతో ఎంపిక అయిన ప్రధానిగా చూడటం లేదు. 3. పైగా, కన్జర్వేటివ్ పార్టీలోని అనేక మంది అభిప్రాయం ప్రకారం – పార్టీని సమైక్యంగా ముందుకు తీసుకెళ్లగలగటం కష్టమైపోతోంది. అదీ పరిస్థితి! అంటే స్థూలంగా కన్జర్వేటివ్ పక్షంలోనే అనేక గందరగోళాలున్నాయి. వీటన్నింటికీ మూలం, వెనుకన ఉన్నది – బ్రిటన్ దేశంలో అపరిష్కృతంగా ఉండిపోయిన ఆర్థిక సమస్యలు. బెడిసికొట్టిన లిజ్ ట్రస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్ తాలూకు సారాంశం – ఆ దేశంలో అమలు జరుగుతోన్న ఆర్థిక విధానాల లోపాన్ని పట్టి ఇస్తుంది. ఆ బడ్జెట్లోని కీలక అంశాలు – బ్యాంకర్లు పొందగల బోనస్ మొత్తం పరిమితిని పెంచేయటం, కార్పొరేట్ ట్యాక్స్‌లను తగ్గించటం. ఈ చర్యలు – ఇప్పటికే భారీ బోనస్‌లు పొందుతోన్న బ్యాంకర్లకు, బ్రిటన్ కార్పొరేట్లకు మాత్రమే లాభం కలిగించేవి. అయితే ఈ చర్యలతోనే బ్రిటన్ పురోగతిని సాధిస్తుందని లిజ్ ట్రస్ అభిప్రాయాల సారాంశం. కానీ, ఆమె ఆలోచనలను – కడకు ఆ దేశం తాలూకు ఫైనాన్స్ మార్కెట్లు కూడా తిప్పికొట్టాయి. అయితే ఈ ఆలోచనలు కేవలం లిజ్ ట్రస్వి మాత్రమే కాదు. అవి ఆ దేశంలో మొదలై నేడు ప్రపంచ వ్యాపితంగా అమలు జరుగుతోన్న ఉదారవాద సంస్కరణల ఆత్మగా ఉన్నాయి. సామాన్య జనం, కింది వర్గాలకు కాకుండా... పై వర్గాల వారైన ధనికులూ, కార్పొరేట్లకూ మరిన్ని రాయితీలు ఇస్తే ఆర్థికాభివృద్ధి మరింత బాగా జరుగుతుందనీ, ఈ వర్గాల పెట్టుబడుల వల్ల ప్రజలకు మరింతగా ఉపాధి కల్పించబడుతుందనీ ఈ విధాన సారాంశం. 1979–80లలో ఆరంభమైన ఈ ప్రపంచీకరణ విధానాలు... సంక్షో భాలు లేని ఆర్థిక వ్యవస్థ కోసం ప్రజల కొనుగోలు శక్తి బాగుండటం (మార్కెట్లో డిమాండ్ ఉండటం) అనే అంశాన్ని విస్మరించాయి. ఈ విధానాలతోపాటుగా రంగ ప్రవేశం చేసిందే – ‘ద్రవ్యలోటు ఉండటం తప్పనే’ ఆర్థిక సిద్ధాంతం. ఒక దేశ ప్రభుత్వం తాలూకు ఖర్చులు, దాని ఆదాయంకంటే ఎక్కువగా ఉండరాదనే దీని అర్థం. దీనివల్ల ద్రవ్యోల్బణం పెరిగిపోతుందని అంటున్నారు. దీనిని నియం త్రించేందుకు ప్రభుత్వాలు పొదుపు చర్యలను పాటించాలనీ... ఖర్చు లను తగ్గించుకోవాలనీ బోధిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచం లోని పలు ఇతర దేశాలలోలాగానే – బ్రిటన్‌లో కూడా ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలపై రానురానూ కోతలు పెరిగి పోతున్నాయి. కాగా, కోవిడ్ కాలంలో అనివార్యమైన అధిక ప్రభుత్వ వ్యయాల వల్ల బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం కట్టలుదాటింది. నేడు అది 10.1 శాతంగా ఉంది. పెరిగిన ధరలతో వారి కొనుగోలు శక్తి పడి పోయింది. ఫలితంగా నేడు ప్రతి ఐదుగురిలో ఒకరు రోజూ పస్తులు ఉండవలసిన పరిస్థితి దాపురించింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధంవల్ల ఇంధన ధరలు బ్రిటన్‌లో కూడా నింగినంటాయి. దీనికోసం ప్రభుత్వం ప్రజలకు మరింతగా ఇంధన వ్యయాల రాయితీలు ఇవ్వడం, సంక్షేమాన్ని మెరుగుపరచాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, మరోపక్కన ఈ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసే పేరిట బ్రిటన్ కేంద్ర బ్యాంక్ వడ్డీరేట్లను పెంచుతోంది. ఫలితంగా ప్రజల కొనుగోలు శక్తి మరింత పడిపోతోంది. అలాగే, ఆర్థిక వృద్ధి రేటు కూడా మందగిస్తోంది. అంటే ద్రవ్యోల్బణం అదుపుకు వడ్డీరేట్లు పెంచితే అది అసలుకే ముప్పు తెచ్చి ఆర్థిక వృద్ధి రేటును దిగజారు స్తోందన్నమాట! ఫలితంగా నిరుద్యోగం పెరిగిపోతోంది. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాలలాగానే బ్రిటన్ కూడా ఈ ద్రవ్యోల్బణం – వృద్ధి రేటు పతనం అడకత్తెరలో చిక్కుకుంది. అంటే, వృద్ధి రేటు పడి పోయి... నిరుద్యోగం పెరిగిపోతోందని తిరిగి మరలా వృద్ధి రేటును పెంచేందుకు ఆర్థిక వ్యవస్థలోకి ఉద్దీపనల రూపంలో డబ్బును పంప్ చేస్తే– రెండోపక్కన ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. అలాగని ద్రవ్యోల్బ ణాన్ని అదుపు చేసేందుకు – వడ్డీ రేట్ల పెంపుదల వంటి డబ్బు చలామణిని తగ్గించే చర్యలు తీసుకుంటే వృద్ధి రేటు మరలా తక్షణమే పతనం అవుతోంది. ఈ ద్రవ్యోల్బణ సమస్య కేవలం ప్రజలకే కాక, షేర్ మార్కెట్లలో అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడిదారుల పెట్టుబడులకూ... అలాగే, కార్పొరేట్ల లాభాల మార్జిన్లకూ కూడా కంటగింపుగానే ఉంది. నిజా నికి నేడు బ్రిటన్‌లో కావచ్చూ, ఇతర దేశాలలోనూ కావచ్చు... ఆయా దేశాల ప్రభుత్వాలు ద్రవ్యోల్బణం అదుపు పేరిట బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచడం... ప్రజలను ధరల పెరుగుదల నుంచి కాపాడేందుకు కాదు. ప్రధానంగా షేర్ మార్కెట్లలోని ఫైనాన్స్ పెట్టుబడిదారుల మదుపుల తాలూకు విలువను కాపాడటం. అంటే, ఒక ఫైనాన్స్ పెట్టుబడి దారుడు షేర్ మార్కెట్లో 100 పౌండ్లు పెట్టుబడి పెట్టి దానిపై మరో పది పౌండ్లు లాభం సంపాదిస్తే గనుక... ఈ అసలు+లాభం (110 పౌండ్లు) తాలూకు సంపూర్ణ ఫలితం అతనికి దక్కా లంటే – పౌండ్ కరెన్సీ విలువ కాపాడబడాలి. అంటే, అతను ఆ పెట్టుబడి పెట్టే నాటి కంటే – దానిని సొమ్ము చేసుకునే నాటికి గనుక పౌండ్ విలువ తగ్గితే, ఆ మేరకు అతని రాబడి తాలూకు నికర విలువ తగ్గిపోతుంది. కాబట్టి ఫైనాన్స్ పెట్టుబడిదారుల రాబడులను కాపాడాలంటే ద్రవ్యోల్బ ణాన్ని నిలువరించాలి. అదీ కథ. ఆయా దేశాలలోని సామాన్య జనం తాలూకు ప్రయోజనాలూ, వారిపై పడుతోన్న ధరాభారానికి పరిష్కారం అనేవి కేవలం ముసు గులు మాత్రమే. అందుచేతనే ప్రస్తుతం నిరుద్యోగం పెరిగి... ధరలూ పెరిగిపోయి సతమతమవుతోన్న జనాన్ని ఆదుకునేందుకు ఆర్థిక ప్రణాళికలను రూపొందించే బదులు... ప్రస్తుత బ్రిటన్ ప్రభుత్వం కార్పొరేట్ రాయితీలు ఇచ్చి సమస్యను పరిష్కరించ జూస్తోంది. ఇక నేడు రిషీ సునాక్ కూడా కొద్దిపాటిగా ప్రజలకు కొన్ని రాయితీలు ఇచ్చే ప్రయత్నం చేసినా– స్థూలంగా కార్పొరేట్ అనుకూల చట్రం నుంచి ఆయన కూడా బయటకు రాలేడు. అంతిమంగా అది సునాక్ అయినా, మరొకరయినా ఈ కార్పొరేట్, షేర్ మార్కెట్ అనుకూల చట్రం నుంచీ బయటపడలేనంత కాలం సమస్యలు పరిష్కారం కావు. రష్యా విప్లవనేత వ్లాదిమిర్ లెనిన్ బోధించిన విప్లవ పరిస్థితి గురించిన 3 అంశాలలోని ఒకటి ఇక్కడ గమనించి తీరవలసింది. ఒక దేశంలో విప్లవాత్మక (రచయిత: హింసాత్మకమే కానక్కర లేదు) మార్పునకు పరిస్థితి ముంచుకొచ్చిందనటానికి ఒక ప్రధాన తార్కాణం – ఆ దేశం లోని పాలక వర్గం ఇక ఎంతమాత్రమూ పాత పద్ధతులలో పరిపా లించ లేకపోవడం! ప్రస్తుతం ప్రపంచమంతటా జరుగుతుంది ఇదే. వివిధ ప్రభుత్వాలు నయా ఉదారవాద సంస్కరణల ఊబిలో కూరుకు పోయి – ద్రవ్యోల్బణం – వృద్ధి పతనం అడకత్తెరకు పరిష్కారం చూప లేక ఒకదాని తరువాత ఒకటిగా సంక్షోభంలోకి పోతున్నాయి. ఈ చట్రాన్ని బద్ధలు కొట్టనంతవరకు ఏ దేశంలోని ప్రజలకూ స్థిమితం ఉండదు... పాలకులకు స్థిరత్వం ఉండదు! డి. పాపారావు వ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు ‘ 98661 79615 -
అయితే... రైతులు ధనవంతులు కాకూడదా?
దేశ రాజధాని ఢిల్లీని చుట్టుముట్టిన రైతుల ఆందోళన 16 రోజులు పైబడింది. కేంద్రం ఆమోదించిన 3 వ్యవసాయ బిల్లులనూ, విద్యుత్ చట్టాన్నీ రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర పెద్దలకూ, రైతులకూ ఈ విషయమై రెండు దఫాల చర్చలు జరిగాయి. చట్టాల రద్దు మినహా మరి దేనికీ ఒప్పుకోమంటూ రైతులు దృఢంగా నిల బడటంతో చర్చలు ఫలించలేదు. కాగా, ఇక్కడ ఒక ప్రధాన ప్రశ్న. ఈ అంశంలో మీడియా పాత్ర ఏమిటి? దీనికి సంబంధించి రైతులు, ప్రజానీకంలోని పెద్ద వర్గం ఇప్పటికే ఆగ్రహంతో ఉన్నారు. స్థూలంగా కోటిమందికి పైగా రైతులు పాల్గొంటున్నారని చెబుతున్న ఈ ఆందోళనకు తగిన కవరేజీ ఉందా? ఉదాహరణకు ఒక ఆంగ్ల భాషా వాణిజ్య పత్రిక ప్రకారం ఈ ఆందోళనలో ప్రధాన భాగస్వాములు పంజాబ్ రైతులే. కాకుంటే హరియాణా రైతులు. వీరు ఇతర రాష్ట్రాల రైతుల కంటే ‘సుసంపన్నం’గా ఉన్నారట. వీరు ప్రభుత్వాల చేత అతిగా గారాబం చేయబడు తున్నారంటూ ఆ పత్రిక నిందించింది. అందుకే వారు చిన్న విషయాలకు కూడా నిరసనలకు దిగుతున్నారంటూ సెలవిచ్చింది. రైతు వ్యతిరేక, ఉదారవాద సంస్కరణల అనుకూల ఈ నిందారోపణల వెనుక ఉన్న సత్యం ఏమిటి? కొంచెం పాత గణాంకాలే అయినా 2013లో దేశంలోని వివిధ రైతు కుటుం బాల సగటు నెలసరి ఆదాయాలను చూద్దాం. అది పంజాబ్‌లో 18,059 రూపాయలు. హరియాణాలో 14,434 రూపాయలు. కాగా పేద రాష్ట్రాలైన బిహార్ రైతు కుటుంబ నెలసరి ఆదాయం రూ. 3,558. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇది రూ. 4,701. జార్ఖండ్‌లో రూ. 4,721. ఉత్తరాఖండ్‌లో రూ. 4,923. ఇక పశ్చిమ బెంగాల్లో రూ. 3,980. అంటే దేశం లోని పేద రాష్ట్రాల రైతు కుటుంబాల నెలవారీ సగటు ఆదాయం 5,000 లోపే. దేశవ్యాప్తంగా ఈ సగటు రూ. 6,426. అయితే, 2018– 2019 అంచనాల ప్రకారం ఇది 10,329 రూపాయలు. ఇక్కడ గమనించవలసింది ఇది రైతు కుటుంబాల తాలూకు మొత్తం ఆదాయం. సాధారణ అంచనా ప్రకారం కుటుంబంలో ఐదుగురు సభ్యులు ఉన్నట్లుగా లెక్కిస్తారు. అత్యధిక చిన్న, సన్నకారు, మధ్య తరహా రైతు కుటుంబాల్లో దాదాపు ఇంట్లోని వారంతా తమ బతుకుదెరువైన సాగుబడిలో పాలుపంచుకుంటారు. మరో పక్కన ఈ పరిస్థితిని, నగర ప్రాంతాల కార్మికుల, ఉద్యోగుల పరిస్థితితో పోల్చి చూద్దాం. ‘2019 వేతన చట్టం’ ప్రకారం దేశవ్యాప్తంగా కనీస వేతనం రోజువారీగా 178 రూపాయలు ఉండాలి. ఇది తలసరి సగటు అనే విషయం మరువరాదు. కుటుంబంలో ఇద్దరు పనిచేస్తే దొరికేది రోజుకు 356 రూపాయలు. ఇది నెలకు రూ. 10,700 మేరకు ఆదాయంగా ఉంటుంది. అయితే, కనీస వేతనంగా 178 రూపాయలని నిర్ణయించడానికి వ్యతిరేకంగా బలమైన వాద నలు ఉన్నాయి. నిజానికి కార్మిక మంత్రిత్వశాఖ తాలూకు అత్యున్నత ప్యానల్ సిఫార్సు ప్రకారమే ఈ కనీస వేతనం రోజుకు తలకు 375 రూపాయలు ఉండాలి. మరో పక్కన ఏడవ కేంద్ర వేతన సంఘం మేరకు న్యాయబద్ధమైన రోజువారీ వేతనం కనీసం రూ. 700 ఉండాలి. ఈ చివరి సూచన ప్రకారమే చూసినా నగర ప్రాంతాల్లో కుటుంబం లోని ఒక్కరు పని చేసినా నెలవారీ ఆ కుటుంబానికి 21,000 రూపాయల మేర ఆదాయం ఉండాలి. పరిస్థితి ఇలావుండగా పంజాబ్, హరియాణా రైతుల ఆదాయాలను, దుర్భర దారిద్య్రంలో వున్న రాష్ట్రాల ఆదాయాలతో పోల్చి ఈ రెండు రాష్ట్రాల రైతులు గారాబం చేయబడ్డారంటూ విమర్శించడం పరిహాసాస్పదం. వాస్తవానికి, దేశంలోని అన్ని రాష్ట్రాల రైతాంగానికి కనీస స్థాయిలో కావాల్సింది పంజాబ్, హరియాణా రైతుల తాలూకు ఆదాయస్థాయి. రాను రాను, వ్యవసాయంలో వాడే ఉత్పాదకాల వ్యయం పెరిగిపోతోంది. పాత్రికేయుడు, వ్యవసాయ నిపుణుడు పి.సాయినా«థ్ ప్రకారం 1971లో ఒక క్వింటాల్ పత్తిని అమ్మితే 15 గ్రాముల బంగారాన్ని కొనుగోలు చేయగలిగేవాళ్లు. నేడు ఎన్ని క్వింటాళ్ల పత్తిని అమ్మితే 10 గ్రాముల బంగారాన్ని రైతు కొనగలడనేది ప్రశ్న. రాను రాను రైతాంగానికి లభించే ఆదాయాల స్థాయి పడిపోతోంది. దీన్ని నగర ప్రాంతాలకు అనుకూలంగానూ, గ్రామీణ ప్రాంతాలకు వ్యతిరేకంగానూ ‘వాణిజ్య లావాదేవీల సమతుల్యత’ రోజురోజుకూ మొగ్గు తుండటంగా చెప్పవచ్చు. గ్రామీణ వ్యవసాయదారుల ఉత్పత్తుల ధరలు పడిపోతుండగా, నగర ప్రాంతాల పారిశ్రామిక ఉత్పత్తుల ధరలు పెరగడం. ఈ పరిణామం సహజ సిద్ధంగా జరుగుతున్నది కాదు. స్థూలంగా ఆర్థిక సంస్కరణల పేరిట కార్పొరేట్, నగర ప్రాంతాల అనుకూల విధానం ఇది. దీని కారణంగానే, గ్రామీణ ఉత్పత్తుల ధరలను పెరగకుండా కృత్రిమంగా అదుపు చేస్తున్నారు. దీనంతటికీ కారణం గ్రామీణ వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరిగితే గనక, నగర ప్రాంతాలలో నిత్యావసరాల ధరలు హెచ్చుగా ఉంటాయి. ఇదంతా నగర ప్రాంతాలలో నిత్యావసరాల ధరలు ఒక పరిమితికి దాటకుండా అదుపు చేయటం ద్వారా, నగర ప్రాంతాలలోని మధ్య తరగతి వారు, కార్మికులు అధిక వేతనాల కోసం కార్పొరేట్లను డిమాండ్ చేయకుండా బుజ్జగించేందుకే. తద్వారా కార్పొరేట్లు తాము చెల్లించే వేతనాలను తక్కువగా ఉంచి, వారి లాభాలను పెంచుకోగలరు. ఇక రెండవ కారణం, గ్రామాల నుంచి నగరాలకు నిరంతరంగా కార్మికుల సరఫరాను హామీ చేయటం. వ్యవసాయం లాభసాటిగా ఉంటే ఇది జరగదు. ఇదే జరిగితే, నగరాల్లో కార్మికుల కొరత ఏర్పడి అధిక వేతనాల డిమాండుకు దారి తీస్తుంది. కాకు లను కొట్టి గద్దలకు వేసినట్లు గ్రామీణ రైతాంగాన్ని దెబ్బతీసి, నగర ప్రాంతాల కార్పొరేట్లకు అనుకూల విధా నాలను అనుసరించటం ఆర్థిక సంస్కరణల్లో ఒక భాగం. ఈ క్రమంలో నష్టపోయిన రైతాంగాన్ని వ్యవసాయం నుంచి వైదొలిగేలా చేసి ఆ స్థానంలో రక్తపాత రహితంగానే కార్పొ రేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఈ విధానాల తాలూకు రెండవ పార్శ్వం. ఈ కారణాల చేతనే దేశవ్యాప్తంగా ఉన్నట్లే పంజాబ్, హరియాణా పిల్లల్లోనూ సరైన ఆహారం లేక శారీరక ఎదుగు దల తక్కువస్థాయిలో ఉంటోంది. గ్రామీణ ప్రాంతాలలో సగటున 50 శాతం మంది పిల్లలు తమ వయసుకు తగ్గ ఎత్తు లేరు. కానీ ఈ కార్పొరేట్ అనుకూల, సంస్కరణల అను కూల మీడియా కోవిడ్ సంక్షోభ కాలంలో ఒకవైపు సామా న్యుల ఆదాయాలు పడిపోతుండగా కొత్త బిలియనీర్లు పుట్టుకొస్తుంటే వేలెత్తి చూపలేదు. కానీ, కోట్లాదిమంది సాధారణ రైతులు పెనం మీద నుంచి తమను పొయ్యిలోకి పడేయవద్దని అడుగుతుంటే మాత్రం ఈ మీడియాకు కంపరంగా ఉంది. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు డి. పాపారావు మొబైల్: 98661 79615 -
ఇంతగా సాష్టాంగపడాలా?
ప్రస్తుతం ప్రపంచంలో నడుస్తోన్న వాణిజ్య యుద్ధాలు అందరికీ తెలిసినవే. వీటిని ఆరంభించింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఆయన ప్రధాన టార్గెట్ చైనాతో అమెరికాకున్న భారీ వాణిజ్య లోటును తగ్గించుకోవడం. కానీ, చైనాతోపాటు మెక్సికో, యూరోపియన్ యూనియన్ దేశాలూ, భారత్‌తో సహా ప్రపంచంలోని పలు ప్రాంతాలూ, దేశాలూ ఇవాళ ట్రంప్ వాణిజ్య యుద్ధ పరిధిలో ఉన్నాయి. అమెరికా ఇన్నేళ్లుగా ప్రపంచంలో ప్రధాన వినియోగదారు, దిగుమతిదారుగా ఉంది. అమెరికా నుంచి ప్రపంచ దేశాలకు జరిగే ఎగుమతులు ఆయుధాల అమ్మకం వంటి వాటికే పరిమితం. అంటే అమెరికా చేసే ఎగుమతులకన్నా, ఇతర దేశాల నుంచి అది చేసుకునే దిగుమతులు అనేక రెట్లు అధికం. తన కరెన్సీ డాలర్‌కు ఉన్న పలుకుబడితో, బలంతో అమెరికా ఈ వ్యవస్థను ఇన్నాళ్లూ కొనసాగించగలిగింది. కానీ, 2008 ప్రపంచ ఆర్ధిక, ఫైనాన్స్ సంక్షోభం అమెరికా అంతర్జాతీయ ఆధిపత్యానికీ, అస్తిత్వానికే ముప్పు తెచ్చిపెట్టింది. ఈ క్రమంలోనే 2016లో అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ కొద్ది కాలానికే ఇతర దేశాల సరుకులపై భారీ సుంకాలు అనే ఆయుధంతో విరుచుకుపడ్డాడు. వాషింగ్మెషీన్లు మొదలుకొని ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై సుంకాల పెంపుతో తన వాణిజ్య యుద్ధం మొదలుపెట్టాడు. తద్వారా, ఈ సరుకులు అమెరికాలో ఖరీదైనవిగా మారి, ప్రత్యామ్నాయంగా వాటి ఉత్పత్తి అమెరికాలోనే జరుగుతుందనీ, దాని వలన అమెరికాలో ఉపాధి కల్పన కూడా పెరుగుతుందనేది ట్రంప్ వాదన. అలాగే విదేశాలకు తరలిపోయిన అమెరికా పరిశ్రమలు తిరిగి అమెరికాకు వచ్చేస్తాయన్నది కూడా ఆయన ఆశ. ఈ ఆలోచనలతోనే గత కొంతకాలంగా ఆయన చైనాతో భారీ స్థాయి వాణిజ్య యుద్ధానికి దిగాడు. ఈ క్రమంలో చైనా కూడా అమెరికా సరుకులపై దిగుమతి సుంకాలను పెంచేసింది. అలాగే మెక్సికో, యూరోపియన్ యూనియన్‌తో కూడా ట్రంప్ వాణిజ్య యుద్ధానికి దిగాడు. భారత్, టర్కీ వంటి దేశాలకు 1970లలో కల్పించిన ‘‘జనరలైజ్డ్ సిస్టం ఆఫ్ ప్రిఫరెన్సెస్’’ అనే ఎగుమతుల వెసులుబాటును (అమెరికాకు ‘సున్నా’ శాతం సుంకాలతో ఎగుమతులు చేసుకొనే అవకాశం) రద్దు చేశాడు. ఈ రకంగా నయానా, భయానా అమెరికా దేశాన్ని తిరిగి ప్రపంచ నంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలనేది ట్రంప్ ప్రయత్నం. కాగా, ప్రపంచంలోని అతి పెద్ద వినియోగ మార్కెట్‌గా ఉన్న అమెరికాలోకి వచ్చే విదేశీ సరుకులపై టారిఫ్‌ల (సుంకాలు) పెంపు యుద్ధం ప్రకటించినా ఇప్పటికీ అమెరికా వాణిజ్యలోటు అనేక దేశాలతో పెరిగిపోతూనే ఉంది. ట్రంప్ ప్రధాన టార్గెట్ అయిన చైనా దేశం ఎగుమతులు, వాణిజ్య యుద్ధం మొదలైన అనంతరం 2018లో అమెరికాకు ఒక శాతం మేర పెరిగాయి. కాగా, ట్రంప్ ఆశలకు భిన్నంగా చైనాకు అమెరికా ఎగుమతులు మాత్రం 21% అంటే 33 బిలియన్ల డాలర్ల మేరన పడిపోయాయి. ఫలితంగా, ట్రంప్ వ్యూహం బెడిసికొట్టి చైనాతో అమెరికా వాణిజ్య లోటు మరింత పెరిగింది. అలాగే అమెరికాకు అధికంగా ఎగుమతులు చేసే దేశాలలో మరొకటైన మెక్సికోతో సహా ప్రపంచంలోని మిగతా అనేక దేశాలతో కూడా అమెరికాకు ఇదే పరిస్థితి ఎదురయ్యింది. కాగా, ట్రంప్ బెదిరింపులు, హూంకరింపులు ప్రపంచంలోని వేళ్ళ మీద లెక్కించగల కొద్ది దేశాలను మాత్రం అదరగొట్టాయి. వాటిలో దక్షిణ కొరియాతో పాటుగా, భారత్ కూడా ఉండటం గమనార్హం. వాణిజ్య యుద్ధాల ముందరి నుంచే (2017 నుంచి) అమెరికాతో భారత్‌కు ఉన్న వాణిజ్య మిగులును తగ్గించుకునే ‘‘కృషి’’ లో మన ప్రభుత్వం నిమగ్నం అయింది. ఆయుధాలు, ఇంధన దిగుమతుల ద్వారా అమెరికాను మెప్పించే పనిలో మన పాలకులు బిజీ అయ్యారు. సరుకుల దిగుమతులలో భారత్‌తో అమెరికా వాణిజ్యలోటు, 2017లోని 22.9 బిలియన్ల డాలర్ల నుంచి, 2018లో 21.3 బిలియన్ల డాలర్లకు తగ్గింది. అంటే, మన దేశంతో అమెరికా వాణిజ్య లోటు 2017–18 కాలంలో 7% మేరన (1.6 బిలియన్లు) తగ్గింది. ఈ మధ్యన ఫ్రాన్స్‌లో ట్రంప్‌ను కలిసిన సందర్భంలో మోదీ అమెరికాకు భారత్‌తో ఉన్న వాణిజ్యలోటు తగ్గింపునకు సాయపడతానంటూ సెలవిచ్చారు. అమెరికా నుంచి భారత్‌కు 4 బిలియన్ల మేరన చమురుతోపాటు అదనపు దిగుమతులు జరిపేందుకు అంతా సిద్ధమైందంటూ మోదీ, ట్రంప్‌కు చెప్పారు. మరోవైపున అమెరికా ఆంక్షలకు తలవొగ్గి, మనం, మన చిరకాల మిత్రదేశం ఇరాన్ నుంచి చమురు దిగుమతులు తగ్గించేసుకున్నాం. మనకు అవసరం ఉన్నా లేకపోయినా, అమెరికా నుంచి మనం చేసుకునే దిగుమతులు పెంచుకుంటూ పోతున్నాం. అమెరికా మాత్రం టారిఫ్‌ల పెంపుతో, మనకు గతం నుంచి ఇచ్చిన వాణిజ్య రాయితీల రద్దుతో తమదేశంలోకి ఎగుమతి అయ్యే మన సరుకులకు అడ్డుకట్ట వేస్తోంది. మన సాఫ్ట్వేర్ నిపుణుల వంటివారికి ఇచ్చే హెచ్1 వీసాల సంఖ్యను కుదించివేస్తోంది. ఇతర దేశాల చేతులు మెలిపెట్టి, మెడపై కత్తి పెట్టి అమెరికా సాగిస్తోన్న ఈ దాష్టీకానికి లొంగిపోవటం.. 24 /7 రోజులూ దేశభక్తి మంత్రం పఠించే మోదీ ప్రభుత్వ నిజస్వరూపానికి నిదర్శనమేమో ఆలోచించాలి...!! వ్యాసకర్త: డి. పాపారావు, ఆర్థికరంగ విశ్లేషకులు మొబైల్ : 98661 79615 -
కొనుగోలు శక్తికి ఉద్దీపన కరువు
భారతదేశ ఆర్థిక వ్యవస్థ గడ్డు కాలంలో ఉంది. ఒకవైపున మోదీ 2024 నాటికి ఆర్థికవ్యవస్థ స్థాయిని 5 లక్షల కోట్ల రూపాయలకి తీసుకువెళ్ళాలనే లక్ష్యాన్ని ప్రకటిస్తున్నారు. మరో ప్రక్కన దేశ ఆర్థ్ధికవ్యవస్థపై మాంద్యం తాలూకు కారుమబ్బులు కమ్ముకుంటున్నాయనే వార్తలు వస్తున్నాయి. ‘ప్రభుత్వం బయటకు చెప్పకపోయినా, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకుల నుంచి అందుతోన్న సంకేతాల మేరకు గడచిన 34 సంవత్సరాల నుంచీ వృద్ధి రేటు తగ్గుతూ వస్తోంద’ని బజాజ్ ఆటోకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ అన్నారు. ‘పెట్టుబడులకు, డిమాండ్‌కి ఊతం ఇచ్చేందుకు ప్రభుత్వం ఏవిధంగానూ ప్రయత్నించడం లేద’ని కూడా ఆయన చెబుతున్నారు. ఆయన ఈ మాటలు అన్నది 2019 జూలై మాసం చివరిలో. కాగా, ఇంతటి తీవ్ర పరిస్థితులలో కూడా నేటి వరకూ ఆర్ధికమాంద్యం నుంచి గట్టెక్కించే చర్యలు తీసుకోవటంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. మరో ప్రక్కన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ మాటల ప్రకారం జూన్ మాసంలో ‘ద్రవ్య విధాన కమిటీ’ సమావేశం జరిగిన నాటికే దిగజారివున్న ఆర్థిక స్థితి, ఈ కొద్ది కాలంలో మరింత అధోముఖంగా జారిపోయింది. ఈ స్థితి నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు రిజర్వ్ బ్యాంకు తన వంతుగా ఇప్పటివరకూ వడ్డీ రేట్లను 1.1% మేరన తగ్గించింది. అయితే, ప్రభుత్వం తన వంతుగా ఉద్దీపన వంటివి చేపట్టడం కూడా తప్పనిసరి అని రిజర్వ్‌బ్యాంకు పెద్దల అభిప్రాయం. కాగా, కడకు నేడు ఉద్దీపన ప«థకం ఏదీ ఇచ్చే ఉద్దేశం లేదంటూ ప్రధానమంత్రి ప్రధాన ఆర్థ్ధిక సలహాదారు చావు కబురు చల్లగా చెప్పారు. కానీ, షేర్మార్కెట్లలో పతనం గురించి మాత్రం ప్రభుత్వం మెరుపు వేగంతో ప్రతిస్పందిస్తోంది. మొన్నటి బడ్జెట్ అనంతరం అత్యంత ధనవంతుల మీద పెంచిన పన్ను మొత్తం తాలూకు భారం అనేక విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపుదారులను తాకింది. దాంతో వారు షేర్ మార్కెట్ల నుంచిపెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. దీనితో సెబీ విదేశీ ఫోర్ట్‌ఫోలియో మదుపుదారులకు సంబంధించిన పలు నిబంధనలను సరళీకరించింది. తద్వారా పతన దిశగా సాగుతోన్న షేర్ మార్కెట్‌కు కొంత ఊతాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం తాపత్రయపడుతోంది. 2008లో అమెరికాలో ఆరంభమైన ఆర్థ్ధిక మాంద్యం మనల్ని తాకకపోవడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి, మన జాతీయం చేయబడిన బ్యాంకులు. రెండవది దేశంలోని జాతీయ ఉపాధి హామీ ప«థకం. నాడు మన జాతీయ బ్యాంకులు అడ్డగోలు రుణవితరణ చేయలేదు. అవి ఇచ్చిన రుణాలు మొండి బకాయిలుగా మారలేదు. అలాగే, జాతీయ ఉపాధి హామి పధకం వలన దేశంలోని కోట్లాది మందికి కొనుగోలు శక్తి పెరిగింది. నేడు జాతీయ బ్యాంకులలో మొండి బకాయిలు పెరిగిపోయాయి. రుణవితరణలో పెద్ద పాత్ర ఉన్న బ్యాంకింగేతర ఆర్థ్ధికసంస్థల స్థితి కూడా దివాలా బాట పట్టింది. మన నీతిఆయోగ్ ప్రకారమే నేడు ఆర్థ్ధిక సంస్థల స్థితి 70 సంవ త్సరాలలో కనీవినీ ఎరుగనంత దయనీయంగా ఉంది. ఇక, జాతీయ ఉపాధి హామి పథకం పట్ల విముఖత కారణంగా కూలీల వేతనాల చెల్లింపు జాప్యం అవుతోంది. వ్యవసాయ రంగం స్థితి కూడా దిగజారి గ్రామీణ ఆర్థ్ధిక ఆరోగ్యం çకుదేలైపోతోంది. గ్రామాల ఆర్థిక స్థితికి కొలబద్ద అయిన ట్రాక్టర్లు, బైక్‌ల అమ్మకం దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోయింది. అలాగే, తల నూనెలు, సబ్బులు, కడకు బిస్కెట్ల వంటి చిన్న చిన్న వినియోగ వస్తువుల అమ్మకాలు కూడా నేడు గ్రామీణ ప్రాంతాలలో, నగర ప్రాంతాలలో కంటే దారుణంగా దెబ్బతిని ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఆసియా దేశాల కరెన్సీల విలువలో కూడా పతనం నెలకొంది. మన రూపాయి విలువ మరింత అధికంగా పతనం చెందింది. అలాగే, మనదేశం నుంచి ఎగుమతి అయ్యే కార్ల అమ్మకాలు ఇతర దేశాలలో డిమాండ్ పతనం వలన 4.2% మేరకు తగ్గాయి. మన దేశీయ మార్కెట్లో ఈ అమ్మకాల తగ్గుదల 19% మేరకు ఉంది. అలాగే, జూలై 2019 మధ్యనాటి స్థితి ప్రకారంగా ప్రపంచంలోని అతిపెద్ద 10 షేర్ మార్కెట్లలో ప్రతికూల ఫలితాన్ని ఇచ్చింది (2.8%) భారతదేశ షేర్ల సూచీయే ! అలాగే గత నాలుగేళ్లలో భారతదేశ ఎగుమతుల వృద్ధి రేటు సగటున 0.2%గా మాత్రమే ఉంది. ప్రపంచదేశాల ఎగుమతుల సగటు వృద్ది రేటు 0.6% గా ఉంది. 2010 2014లో ప్రపంచ దేశాల సగటు ఎగుమతుల వృద్ధి సాలీనా 5.5% గా ఉండగా, మన దేశంలో అది 9.2% గా ఉంది. అంటే, ప్రపంచంలోని ఇతర దేశాలలో కంటే భారత్‌లో మరింత తీవ్ర మాంద్య పరిస్థితులు నెలకొంటున్నాయి. దీనికి ప్రధాన కారణం 2016లో జరిగిన పెద్ద నోట్ల రద్దు ప్రభావం మన ఆర్థిక రంగాన్ని ఇప్పటికీ వెంటాడటమే. ఇక నోట్ల రద్దుతోపాటుగా హడావుడిగా అమలు జరిగిన జీఎస్టీ వలన కూడా సమస్యలు మరింత జటిలం అయ్యాయి. నిరుద్యోగ సమస్య 45 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరిందని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. ప్రభుత్వం మాంద్యం పరిష్కారానికి చేపడుతోన్న చర్యలు కూడా అరకొరగానే మిగిలిపోయాయి. ఒక ఉద్దీపన పథకం అవసరం అయిన దశలో దానిని తిరస్కరించి; కార్పొరేట్లపై పన్ను శాతాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందనే వార్తలు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థ్ధిక వ్యవస్థ కోలుకునే అవకాశం కనుచూపు మేరలో లేదని ‘మింట్ స్థూల ఆర్థిక పరిశీలక సూచీ’ చెబుతోంది. ఈ పరిస్థితిలో ప్రభుత్వం ద్రవ్యలోటును కట్టడి చేసే ఆలోచనలు మానుకొని తన యథాశక్తి ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపనను ఇవ్వడం తప్పనిసరి. మరీ ముఖ్యంగా ఈ ఉద్దీపన గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తిని పెంచే దిశగా ఉండాలి., 2024 నాటికి 5 లక్షల కోట్ల ఆర్థ్ధిక వ్యవస్థ కల కనే ముందు, నేడు మనం స్థూలవృద్ధి రేటులో ప్రపంచంలో ఆరవ స్థానం నుంచి ఏడవ స్థానానికి పడిపోయిన వాస్తవాన్ని గమనంలో ఉంచుకోవాలి. పీ.ఎస్: శుక్రవారం ఆర్థికమంత్రి ప్రకటించింది–సామాన్య జనాభా, మధ్యతరగతి వర్గాల కొనుగోలు శక్తిని పెంచే ఉద్దీపన పథకం కాదు. అది కేవలం వడ్డీ రేట్ల తగ్గింపు లేదా బ్యాంకుల ద్రవ్యలభ్యతను పెంచేది మాత్రమే. కానీ, ఎస్బీఐ చైర్మన్ ప్రకారం అసలు ప్రజలకు కొనుగోలు శక్తి లేకపోవడమేగానీ, బ్యాంకుల వద్ద ద్రవ్య లభ్యత లేకపోవ డం కాదు. కాబట్టి సామాజిక రంగంలోన, మౌలిక వసతుల రంగంలో ఉపాధిని పెంచే చర్యలు మాత్రమే ప్రస్తుత స్థితిలో నిజమైన ఆర్థిక ఉద్దీపనకు దోహదపడతాయి. వ్యాసకర్త: డి. పాపారావు, ఆర్థికరంగ విశ్లేషకులు మొబైల్ : 98661 79615 -
ప్రైవేట్ ట్రావెల్స్‌పై రవాణాశాఖ కొరడా
హైదరాబాద్ : నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాపారావు కొరడా ఝుళిపించారు. ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టి యథేచ్చగా తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌పై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు.. ప్రభుత్వ ఆదేశాల మేరకు విస్తృత తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పాపారావు ఆధ్వర్యంలో పలు బృందాలుగా ఏర్పడిన రవాణాశాఖ అధికారులు ఆదివారం అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు జరిపారు. పాపారావు కూడా తనిఖీల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు, బెంగళూరు వైపు వెళ్లే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఆదివారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు జరిగిన ఈ దాడుల్లో అధికారులు దాదాపు 200 బస్సులను తనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన 44 బస్సులపై అధికారులు కేసు నమోదు చేశారు. ఈ ఆకస్మిక తనిఖీల వల్ల రవాణా శాఖకు రూ. 22 లక్షల ఆదాయం రావడం గమనార్హం. ఈ తనిఖీలకు సంబంధించి పాపారావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి రవాణాశాఖ అధిక ఆదాయాన్ని చేకూర్చే వనరుగా ఉందన్నారు. ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా తిరుగుతున్న వాహనాలపై జరిమానాలు విధించి ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని మరింతగా పెంచాలన్నారు. అక్రమంగా తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌పై ఆకస్మిక తనిఖీలు చేపట్టిన అధికారులపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
ఆర్థికాన్ని బడ్జెట్ ఆదుకునేనా..?
కేంద్రప్రభుత్వ 2019– 20 ఆర్థిక సంవత్సరం పూర్తి స్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ జూలై 5, 2019న పార్ల మెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ప్రధానంగా, దేశీయ ఆర్థికవ్యవస్థకు సంబంధించిన జీడీపీ, నిరుద్యోగం, పన్నుల ఆదాయాల వంటి అనేక సరికొత్త గణాంకాలు అన్నీ ప్రతికూల దిశగానే సాగుతున్నాయని నేడు గణాం కాలు చెబుతున్నాయి. ప్రస్తుతం, దేశ ఆర్థికస్థితి తీవ్ర మందగమనంలో ఉంది. 2018–19 తాలూకు చివరి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు కేవలం 5.8 శాతంగానే ఉంది. కాగా, మొత్తంగా 2018–19 ఆర్థిక సంవత్సరానికి గాను అది 6.6 శాతం స్థాయిలోనే ఉంది. అలాగే, నిరుద్యోగ గణాంకాలు కూడా 45 ఏళ్ల గరిష్ట స్థాయిలో 6.1 శాతంగా ఉన్నాయి. ఇక, బ్యాంకింగ్ రంగంలో పేరుకుపోయిన మొండి బకాయిలు, బ్యాంకింగేతర ఫైనాన్స్ రంగ సంస్థలలో సంక్షోభ పరిస్థితుల వలన దేశీయంగా రుణాల మంజూరు తీవ్రంగా కుంటుపడింది. అలాగే, గ్రామీణ వ్యవసాయ సంక్షోభం నేడు పరాకాష్టలో ఉంది. పైగా, మన ప్రభుత్వం వేసుకొన్న పన్నుల రాబడి అంచనాలు కూడా తమ లక్ష్యాలను చేరలేకపోయాయి. 2018–19లో ప్రభుత్వ పన్నుల ఆదాయంలో నికరంగా 19 శాతం వృద్ధి ఉంటుం దని అంచనా వేసుకున్నారు. కాగా, అది కేవలం 6 శాతంగానే ఉంది. అంటే ప్రభుత్వం రూ. 14.84 లక్షల కోట్ల మేరకు పన్నుల ఆదాయాన్ని ఆశించగా, వాస్తవంలో అది కేవలం రూ.13.17 లక్షల కోట్లు గానే ఉంది. దీనితో పాటుగా, రిజర్వ్ బ్యాంక్‌లోని అదనపు నిధులకు సంబంధించి ఏర్పరచిన బిమాల్ జలాన్ కమిటీ నివేదిక బడ్జెట్‌లోపే వస్తుందనీ, దాని వలన ప్రభుత్వ ఖజానాకు రిజర్వ్ బ్యాంకు ‘‘అదనపు’’ నిధుల నుంచి భారీగా వనరులు వచ్చి చేరుతాయని ప్రభుత్వం పెట్టుకున్న ఆశ, నిరాశే అయింది. ఈ బడ్జెట్ ఒక ప్రక్కన ఆదాయ కొరతలూ, మరో ప్రక్కన ఆర్థిక మందగమనాన్ని పరిష్కరించవలసిన అడకత్తెర స్థితిలో ఉంది. దీన్నుంచి బయటపడేందుకు, ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఏదో ఒక రూపంలో కనీస ఆదాయ పథకాన్ని ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి పథకానికి సుమారు 2.5 నుంచి 3 లక్షల కోట్ల రూపాయల మేరకు ఖర్చు కాగలదని ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. కాగా, నేడు కేంద్రప్రభుత్వం అన్ని రకాల సంక్షేమ ప«థకాల మీదా కలగలిసి పెడుతోన్న మొత్తం ఖర్చు రూ. 3.4 లక్షల కోట్లు. కాబట్టి, మిగతా అన్ని సంక్షేమ పథకాల స్థానంలో కనీస ఆదాయ ప«థకం వంటి దానిని ప్రవేశపెడితే, అది ప్రభుత్వానికి సుమారు రూ. 40 వేల కోట్లనుంచి రూ. 90 వేల కోట్ల మేరకు ఆదా చేయగలదు. ఈ బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పన వ్యయాలు రెండవ ప్రధాన అంశం. ఇప్పటికే, ప్రధాని మోదీ రానున్న 5 ఏళ్లలో వ్యవసాయరంగంలో రూ. 25 లక్షల కోట్ల పెట్టుబడులను ప్రతిపాదించడం తెలిసిందే. అటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇటు ప్రధాని కూడా ఈ పెట్టుబడులు ప్రధానంగా గిడ్డంగులు, శీతల గిడ్డంగులు, ఆహారశుద్ధి, గ్రామీణ మౌలిక సదుపాయాల వంటి వాటిలో రావాలనీ, దీనిలో కార్పొరేట్లు భాగస్వాములు కావాలనీ చెప్పి ఉన్నారు. అంటే, వ్యవసాయక పెట్టుబడుల రంగంలో కార్పొరేట్ వ్యవసాయానికి అనుకూల దిశగానే ఉండవచ్చును. చివరగా, బడ్జెట్ కేటాయింపులలో 30,000 నుంచి 40,000 కోట్ల రూపాయల మేరన మొండిబకాయిలతో కుదేలై ఉన్న బ్యాంకులకు మూలధనంగా అందవచ్చును. ఇక కార్పొరేట్లు, తమపై విధిస్తోన్న పన్నులను తగ్గించమన్న డిమాండ్ నిరంతరంగా ఉండేదే. నేడు ప్రపంచంలో వివిధ దేశాల మధ్యన విదేశీ పెట్టుబడుల కోసం, అలాగే దేశీయ ప్రైవేటు పెట్టుబడులకు ప్రోత్సాహం కోసం నెలకొన్న పోటీలో కార్పొరేట్ పన్నును తగ్గించడం అవసరమంటూ ప్రభుత్వం బహుశా ఈ దిశగా నిర్ణ యం తీసుకోవచ్చును. కాగా, మధ్యతరగతి వేతన జీవుల ఆశ అయిన ఆదాయపు పన్ను రాయితీలు అందే అవకాశం అంతంతమాత్రమే. ఇప్పటికే, ఆశించిన మేరకు పన్నుల రాబడిలో వృద్ధి లేదని భావిస్తోన్న ప్రభుత్వం నికరంగా, ఖచ్చితంగా వచ్చి తీరే ఈ వ్యక్తిగత పన్ను ఆదాయవనరును తగ్గించుకునేందుకు, ఎంతవరకు సిద్ధపడగలదు? అనేది ఇక్కడి ప్రశ్న. దేశంలో రోజురోజుకూ పెరిగి పోతోన్న నిరుద్యోగ సమస్యకు ఉపశమనాన్ని ఇచ్చేందుకు కూడా ఎగుమతులకు ప్రోత్సాహకాలు అవసరం. అలాగే పెద్ద నోట్ల రద్దు, హడావుడి జీఎస్టీ నిర్ణయాల వలన దెబ్బతిన్న చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకొనే రాయితీలూ, రుణ సదుపాయాల పెంపుదల, పన్నుల సంస్కరణ లాంటి నిర్ణయాలు అనివార్యం. వ్యాసకర్త ఆర్థికరంగ విశ్లేషకులు మొబైల్ : 98661 79615 డి. పాపారావు -
ఆర్చరీ సమాఖ్య అధ్యక్షుడిగా పాపారావు
న్యూఢిల్లీ: జాతీయ ఆర్చరీ సమాఖ్య అధ్యక్షుడిగా తెలంగాణకు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి బీవీ పాపారావు ఎన్నికయ్యారు. శనివారం ఇక్కడ జరిగిన ఎలక్షన్స్‌లో త్రిపురకు చెందిన రూపక్ దేబ్‌రాయ్‌పై ఆయన 13 ఓట్ల తేడాతో విజయం సాధించారు. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా హైకోర్టు ద్వారా నియమితులైన పర్యవేక్షకుడి సమక్షంలో జరి గిన ఎన్నికల్లో పాపారావుకు 49 ఓట్లు రాగా, రూపక్‌కు 36 ఓట్లు పడ్డాయి. కొత్తగా ఎన్నికైన ప్యానల్లో మహాసింగ్ కార్యదర్శిగా, డీకే విద్యార్థి కోశాధికారిగా, సునీల్ శర్మ సీనియర్ ఉపాధ్యక్షుడుగా, రాజేంద్ర సింగ్ తోమర్, పూర్ణిమ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. తాజా ఎన్నికల ఫలితంతో ఆర్చరీ సమాఖ్యలో నాలుగు దశాబ్దాల పాటు సాగిన విజయ్ మల్హోత్రా ఆధిపత్యానికి తెర పడింది. 1973 నుంచి 2012 వరకు అధ్యక్షుడిగా వ్యవహరించిన మల్హోత్రా కొత్త స్పోర్ట్స్ కోడ్ ప్రకారం పదవినుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే తన మనిషి రూపక్‌ను ఆయన ఎన్నికల బరిలోకి తెచ్చి మళ్లీ అధికారం అందుకునే ప్రయత్నం చేశారు. ఎన్నికలు ముగిసిన అనంతరం లింబారామ్, చక్రవోలు స్వురో తదితర ఆర్చర్లు కేంద్ర క్రీడాశాఖ మంత్రికి లేఖ రాస్తూ ఎన్నికలు ప్రజాస్వామికంగా జరిగాయని, వీటిని గుర్తించాలని కోరారు. అస్సాం కేడర్‌కు చెందిన పాపారావు గతంలో ఈశాన్య రాష్ట్రాల ఆర్చరీ సంఘం ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. 1985–90 మధ్యలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)లో ప్రత్యేకాధికారిగా పని చేసిన సమయంలో స్పెషల్ ఏరియా గేమ్స్ నిర్వహించి లింబారామ్ తదితర ఆటగాళ్లను వెలుగులోకి తీసుకొచ్చారు. రిటైర్మెంట్ అనంతరం అశ్విని నాచప్ప, పర్గత్ సింగ్ వంటి మాజీ ఆటగాళ్లతో కలిసి ‘క్లీన్ స్పోర్ట్స్ ఇండియా’ పేరుతో ఉద్యమాన్ని నడిపించారు. ‘సాయ్’ గవర్నింగ్ బాడీలో సభ్యుడిగా కూడా పని చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ సలహాదారుల్లో ఒకరిగా వ్యవహరించిన పాపారావు ఆర్చరీ ఎన్నికల కోసం తన పదవికి రాజీనామా చేశారు. -
అన్న కుడితేనే చెల్లికి సంబురం
ఎస్ఎస్ తాడ్వాయి: కన్నెపల్లి జాబిలమ్మ సారలమ్మను గద్దెల మీదకు తీసుకువచ్చే ముందు ప్రధాన పూజారి కాక సారయ్యను సారలమ్మ రూపంలో అలంకరించి పట్టు చీరె, పట్టు జాకెట్ తొడిగించి ఆదివాసీ సంప్రదాయంగా తీసుకువస్తారు. ఈ వస్త్రాలను ప్రత్యేకంగా ఆదివాసీ బిడ్డ అయిన మంగపేటకు చెందిన మద్దెల పాపారావు కుట్టిన వస్త్రాలను తొడగడం ఆనవాయితీగా వస్తోంది. సారలమ్మ అవతారమెత్తిన కాక సారయ్యకు వరుసకు అన్న అయిన పాపారావు కుట్టిన దుస్తులనే ధరిస్తారు. అన్న కుడితేనే చెల్లెకు సంబురంగా పండుగ జరుపుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన పాపారావుకు సారలమ్మకు ప్రత్యేకంగా దుస్తులను కుట్టడంతో పాటు, హనుమాన్ జెండాను స్వయంగా పవిత్రంగా ఉపవాస దీక్షలతో తయారు చేయడం విశేషం. ఈ దుస్తులు కూడా కాక సారయ్య ఇంటి వద్దనే నియమనిష్టలతో కుట్టడం విశేషం. -
పాపారావుగారి వ్యాఖ్యలు బాధాకరం : శివాజీ రాజా
కళాబంధు టి. సుబ్బిరామిరెడ్డి ఇటీవల మోహన్ బాబుకు విశ్వ నట సార్వభౌమ బిరుదును ప్రధానం చేస్తూ సన్మానించిన సంగతి తెలిసిందే. కాకతీయ కళావైభవోత్సవాలు పేరుతో జరిగిన కార్యక్రమంలో ఈ సన్మానం చేయటాన్ని కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ కు చెందిన పాపారావు తప్పుపట్టారు. ఈ విషయంపై ఆర్టిస్టు, మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ అధ్యక్షులు శివాజీ రాజా స్పందించారు. ‘సినిమా, సమాజం ఎప్పుడూ వేరు వేరు కాదు. ప్రజలతో మమేకమైన కళ సినిమా.. సినిమా కళాకారులు తొలినాళ్ల నుండి ప్రజల పట్ల స్పందిస్తూ సహాయమందించడం తెలియని విషయం కాదు. అలాంటి గొప్ప సినిమా రంగానికి సంబంధించిన సినీ నిర్మాత డా॥టి. సుబ్బిరామిరెడ్డిగారు సినిమా నటీనటులని సన్మానించే భాగంలో తొలుతగా డా॥మోహన్‌బాబు గారిని సన్మానించారు. ఇంకా ఎన్నో చోట్ల ఎన్నో వైవిధ్యమైన కార్యక్రమాలు జరగాల్సి ఉన్నాయి. ఈ సమయంలో శ్రీ పాపారావుగారు ‘సినిమా నటీనటులను సన్మానించకూడదు’ అని వ్యాఖ్యానిస్తూ హెచ్చరించడం బాధాకరం. ఒకవైపు మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర్రావుగారు తెలుగు భాషకి మరింత గౌరవాన్ని తెచ్చే విధంగా ‘ప్రపంచ తెలుగు మహా సభలు’ జరిపి తనదైన ఔన్నత్యాన్ని చాటి భాషకు ఎల్లలు లేవు. కళకు సరిహద్దులు, భాషా బేధం లేదు అన్న రీతిలో తెలుగు సినీ నటీనటులను ఆహ్వనించి ఎంతో గొప్పగా ఘనంగా సన్మానించారు. శ్రీ కె.టి.ఆర్ గారు కూడా ప్రతీ నటిని, నటున్ని పేరు పేరున పలకరిస్తూ తనదైన అభిమానాన్ని చాటుకున్నారు. మంత్రి శ్రీ తలసాని శ్రీనివాసయాదవ్‌గారు కూడా సినీ పరిశ్రమ పట్ల, నటీనటుల పట్ల తనదైన స్నేహభావాన్ని ప్రకటిస్తూ.. ఏ సహాయానికైనా వెనుకాడకుండా ఆదరిస్తున్నారు. మొన్నటికి మొన్న తెలుగు సినిమా నటుడు శ్రీ గుండు హన్మంతరావు అనారోగ్య పరిస్థితులు తెలుసుకుని వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ నుండి 5లక్షల రూపాయలు అందించారు కె.టి.ఆర్ గారు. సినిమా నటీనటుల పట్ల తనదైన గౌరవాన్ని చాటుకున్న శ్రీ కె.సి.ఆర్ గారి పరిపాలనకి కృతజ్ఞతలు. ఇలాంటి సమయంలో శ్రీ పాపారావుగారు ‘సినిమా నటీనటులను సన్మానించకూడదు’ అని హెచ్చరించడం ఎంత వరకు సబబు అన్నది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం.. ఇలాంటి వ్యాఖ్యలను ప్రభుత్వం కూడా సమర్థించదని అనుకుంటున్నాం’. అంటూ పాపారావు వ్యాఖ్యలను ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. -
కనికట్టుతో కైవల్యం!
అభిప్రాయం నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేని కేంద్ర ప్రభుత్వం ఉపాధి భావననే పునర్ని ర్వచించేందుకు పూనుకుంటోంది. ఉపాధి కల్పన గణాంకాలకు అసంఘటితరంగ వివరాలను జోడిస్తే నిరుద్యోగం హాంఫట్ అవుతుందన్నది ప్రభుత్వ అంచనా మన దేశంలో నిరుద్యోగ సమస్య భారీగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. గతంలో పరిపాలించిన యూపీఏ హయాం నాటికంటే ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తరువాతి 3 ఏళ్ల కాలంలో ఈ సమస్య మరింత తీవ్రతరం అయ్యింది. దీనికి తార్కాణంగా కొన్ని గణాంకాలను చూడవచ్చు. భారత లేబర్ బ్యూరో గణాంకాల ప్రకారం 2009వ సం‘‘లో జరిగిన ఉపాధి కల్పన 8.89 లక్షలుగా ఉంది. 2014లో ఈ సంఖ్య 4.21 లక్షలు గానూ, 2015లో 1.35 లక్షలు గానూ, 2016లో 2.31 లక్షలు గానూ ఉంది. ఇక 2016 అక్టోబర్, 2017 జనవరి మాసాల నడుమ ఈ సంఖ్య 1.22 లక్షలుగా ఉంది. కాగా, ఈ కాలంలోనే (2016 అక్టోబర్ – 2017 జనవరి) నోట్ల రద్దు క్రమంలో 1.5 లక్షల మంది తాత్కాలిక కార్మికులు ఉపాధిని కోల్పోయారు. కాగా, ప్రస్తుతం దేశంలో రోజురోజుకూ పెరిగిపోతోన్న నిరుద్యోగ సమస్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. నేటి గుజరాత్ ఎన్నికలలో కూడా ఇదొక ముఖ్యమైన అంశంగా ఉంది. ఈ నేపథ్యంలోనే, ప్రస్తుతం అసలు ‘‘ఉపాధి’’ అంటే ఏమిటి? అనే దానినే పునర్నిర్వచించాలని నేడు కేంద్ర ప్రభుత్వం తలపెట్టింది. ఈ కొత్త నిర్వచనంలోకి, ఇంతకు ముందు ఉపాధి కల్పన గణాంకాల కింద లెక్కలోకి రాని అసంఘటిత రంగ ఉపాధి కల్పనను కూడా తీసుకురావాలనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. తద్వారా కచ్చితంగా, మరింత పెద్దదైన ఉపాధి కల్పన తాలూకు గణాంకం, మన ముందు ప్రత్యక్షమవుతుంది. ఎన్డీఏ పాలకులకు కావల్సింది కూడా అదే!! తమ హయాంలో నిరుద్యోగం మరింతగా పెరిగిపోతుండటం, దానితో పాటుగా స్వయంకృతాపరాధమైన ‘‘పెద్ద’ నోట్ల రద్దు ఈ సమస్యను మరింత తీవ్రతరం చేయడం గురించిన విమర్శల నుంచి బయట పడేం దుకు పాలక పక్షానికి బహుశా ఇది మాత్రమే దారిగా కనబడి ఉండవచ్చు! నిజానికి, ఉపాధి కల్పనా సంఖ్యను గణించేందుకు సంఘటిత రంగంలోని ఉపాధి కల్పనతో పాటుగా, అసంఘటిత రంగ గణాంకాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం, పైకి చూడటానికి సరైనదే కావచ్చు. కానీ, అటు అసంఘటిత రంగం తాలూకు గణాంకాలు విశ్వసనీయంగా అందుబాటులో ఉండటంతో పాటుగా, ఈ రంగంలోని ఉపాధి తాలూకు నిలకడా, వేతనాల స్థాయి, పని పరిస్థితులవంటివి అన్నీ కూడా కచ్చితంగా ప్రశ్నార్థకాలే. ఒక అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారంగా కూడా, ఆర్థిక సంక్షోభాల కాలంలో, సంఘటిత రంగంలో పెరిగిపోతోన్న నిరుద్యోగంతో పాటుగా, రెండో వైపున అసంఘటిత రంగంలో ఉపాధి కల్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న వారి సంఖ్య కూడా పెరిగిందన్నది గమనార్హం. అలాగే ఆర్థిక పరిస్థితులు కుదుటపడిన కాలంలో అసంఘటిత రంగంపై ఆధారపడుతోన్న వారి సంఖ్య తగ్గిపోయి, సంఘటిత రంగ ఉపాధి పెరగడం మనం గమనించాలి. అంటే మరే దారీ లేనప్పుడూ మాత్రమే అత్యధికులు అల్ప వేతనాలు, అభద్రతతో కూడిన అసంఘటిత రంగం దిశగా వెళతారు! అంతిమంగా ఎన్డీఏ పాలకులు దేశంలోని నిరుద్యోగ సమస్య తాలూకు చర్చను సద్దుమణిగించేం దుకూ, తిమ్మిని బమ్మిని చేసేందుకూ మాత్రమే ప్రయత్నిస్తున్నారు అన్నది సుస్పష్టం. ఇటువంటి ప్రయత్నాన్నే వీరు 2015లో స్థూల జాతీయ ఉత్పత్తి (జి.డి.పి) సంఖ్యపై చేసి ఉన్నారు. ఏటికేడాదిగా పడిపోతోన్న జీడీపీ సంఖ్యను, అది తమ హయాంలో మెరుగుపడిందని చెప్పుకునేందుకు దానిని లెక్కించే పద్ధతినే వారు మార్చేశారు అన్న విమర్శలు సర్వత్రా వినపడుతున్నవే. ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతి విజేత అయిన ఆంగస్ డీటన్ కూడా భారతదేశంలోని జీడీపీ సంఖ్యల విశ్వసనీయత గురించి విమర్శలు చేయడాన్ని మనం పరిగణనలోకి తీసుకోవాలి. నిజానికి, జీడీపీని లెక్కించే పద్ధతిని.. ప్రాతిపదిక సంవత్సరాన్ని మార్చడం ద్వారా ఏ ప్రభుత్వమైనా మారుస్తుందనేది నిజం. కానీ, 2015 లో ఎన్డీఏ చేసిన ఈ ప్రయత్నంలోని లొసుగులు తీవ్ర విమర్శలకు తావిచ్చాయి. అంటే, ప్రస్తుతం జరుగుతోన్న ఉపాధి కల్పన గణాంకాలను గుణించే తీరులో మార్పు వ్యవహారం మొదటిదేమీ కాదు. 2015లో జరిగిన సందేహాస్పద జీడీపీ పునర్నిర్వచనం తీరు కూడా ఎన్డీఏ ఖాతాలోనే పడుతుంది. ఇక, పెట్రోలియం ధరలను రిటైల్ బంకులలో రోజువారీ మార్చే పద్ధతికి శ్రీకారం చుట్టడం ద్వారా కూడా ఈ ప్రభుత్వం అప్రతిష్టను మూటగట్టుకుం టోంది. ఈ ధరలను రోజువారి సవరించే విధానంలో, ఆ ధరల పెరుగుదల.. పైకి పెద్దగా కనపడని చిల్లర పైసల రూపంలో జరిగిపోతోందనీ, దీనితో ధరల పెరుగుదల తాలూకు వినియోగదారుల ఆగ్రహం నుంచి కేంద్రం, చమురు సంస్థలూ బయటపడ చూస్తున్నాయన్న విమర్శలు కూడా నేడు అందరం వింటున్నవే. కాబట్టి, నిజ ఆర్థిక పరిస్థితులనూ, ప్రజల జీవన ప్రమాణాలనూ మెరుగుపరచలేని అసమర్థ, అవకతవక విధానాలను అనుసరిస్తున్న ప్రభుత్వం దానిని కప్పిపెట్టుకోవడానికి అంకెల గారడీ, కనికట్టుకు దిగుతోందా అనే సందేహం ఎవరికైనా వస్తుంది. వాస్తవ జీవితంలో ఆర్థిక సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న సామాన్యుడి విషయంలో ఇది మరింత నిజం! వ్యాసకర్త ఆర్థికరంగ విశ్లేషకులు ‘ 98661 79615 డి. పాపారావు -
ట్రంప్ ఆంక్షలు స్వేచ్ఛామార్కెట్ ప్రతిఫలనమే
సందర్భం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సాప్ట్వేర్ రంగంలో హెచ్.1 బి వీసాలు, అవుట్ సోర్సింగ్‌లపై ప్రకటించిన యుద్ధం తాలుకు ప్రభావాలు ఇప్పుడిప్పుడే కనపడుతున్నాయి. ఇన్ఫోసిస్ సంస్థ అమెరికాలోని తన కార్యాలయాలలో వచ్చే రెండేళ్ల కాలంలో 10,000 మంది స్థానికులనే నియమిస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఇక అలాగే కాగ్నిజెంట్ సంస్థ తన దేశీయ (హైదరాబాద్‌తో సహా) శాఖలలో వేల సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేస్తోందని వార్తలు. విప్రో వంటి సంస్థలు కూడా ఇదే బాటలో ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే, ఐటీ రంగంలో కూడా పెరిగిపోయిన ఆటోమేషన్ వలన, సంబంధిత కోర్సులు చదివిన విద్యార్థులకు పలువురికి ఉద్యోగాలు వచ్చే అవకాశం లేకుండా పోయింది. మెుత్తంగా మన దేశ స్థూల ఆర్థిక వృద్ధి రేటులోని సుమారు 60%గా ఉన్న సేవారంగంలోని అతి పెద్ద విభాగమైన ఐటీ, బీపీఓ రంగం నేడు తీవ్ర ఆటుపోట్లలో ఉంది. దీని ప్రభావం మెుత్తం దేశీయ (ముఖ్యంగా బెంగుళూరు, హైదరాబాద్ వంటి నగరాలు) ఆర్ధిక వ్యవస్థపై పెద్ద స్థాయిలో ప్రతికూలంగా పడుతుంది. ఇప్పటికే దేశంలోని విద్యాధిక యువజనులలో నిరుద్యోగం భారీ ఎత్తున పెరిగిపోతోంది. మరోవైపున అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఉవ్విళ్ళూరుతూన్న మన పాలకులు మాత్రం, ట్రంప్ విధానాల తాలుకు ఈ తీవ్ర ఆర్థిక పర్యవసానాల పట్ల కేవలం పొడి పొడి మాటలూ, బలహీనమైన విజ్ఞప్తులతో కాలం వెళ్ళబుచ్చుతున్నారు. అమెరికాను గనుక ఈ సమస్యమీద నిలదీస్తే, మన దేశంలోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గిపోతాయనే ఆందోళనలో మన ప్రభుత్వం ఉంది. అంతే కాకుండా, గత పలు సంవత్సరాలుగా (యూపీఏ పాలనలో కూడా) దేశీయ ప్రయోజనాలను బలిపెట్టయినా, అమెరికా ప్రయోజనాలను కాపాడటమే పనిగా పెట్టుకున్నాయి మన ప్రభుత్వాలు. 2008లో అమెరికాతో జరిగిన పౌర అణు ఒప్పందం తదితరాలు అన్నీ ప్రధానంగా అమెరికా కార్పోరేట్లకూ, ఆ దేశంలో పెద్ద వేతనాల ఉపాధి కల్పనకు మాత్రమే ఉపయోగపడేవి అన్నది ఇక్కడ గమనార్హం! మరో ప్రక్కన మన మధ్య తరగతి, ఉన్నత వర్గాల వారు నిరంతరంగా జపించే ప్రెవేటీకరణ మంత్రం నేడు వారికే బెడిసి కొడుతున్నది. దేశం, దేశీయ ప్రజల ప్రయోజనాలకు చిల్లిగవ్వ విలువనివ్వని, కేవలం లాభాపేక్షే అంతిమ లక్ష్యంగా పనిచేసే ఐటీ రంగంలోని కార్పోరేట్లు నేడు అమెరికాలోని స్థానికులనే ఉద్యోగాలలోకి తీసుకునే పేరిట, అమెరికా అధినేతకు భజంత్రీలుగా మారుతున్నాయి. దేశీయ ఉపాధిపై కూడా కోతలు పెడుతున్నాయి. నిన్నటి దాకా కార్పోరేట్ సామాజిక బాధ్యతల పేరిట తాము సంపాదించిన బిలియన్ల కొద్ది డాలర్లలో స్వల్పభాగాన్ని విదిలించి, ఈ సంస్థల యజమానులు ముఖ్యంగా విద్యాధికుల దృష్టిలో ఉన్నత ‘ఆదర్శాలు’ గల, మెుత్తం సమాజంలోని అందరికీ గొప్ప నమూనాలుగా చలామణి అయిన వారే. కానీ నేడు అమెరికాలో తమ వ్యాపారాలను కాపాడుకునే యత్నంలో ఈ పెద్దలు తమ అసలుసిసలు (దేశ) భక్తి లాభాల పట్ల ఆపేక్షలోనే ఉందని మరోమారు రుజువు చేస్తున్నారు. మన విద్యాధిక వర్గాలూ, కులీనులూ ఇన్ని సంవత్సరాలుగా ఆరాధించి, ఆకాశానికెత్తేసిన స్వేచ్ఛామార్కెట్ వ్యవస్థ తాలూకూ అసలు సారం ఇదే ! కాగా, నేడు అమెరికా మన టెకీలను కాదనుకుంటే ఏమి.. వారు స్వదేశానికి తిరిగి వచ్చేస్తే వారి టాలెంట్ అంతా మన దేశ అభివృద్ధికే ఉపయోగపడుతుందనే అమాయకపు వాదనలూ ఉన్నాయి. కానీ నిజానికి ఇప్పటికీ తగిన మేర పారిశ్రామికీకరణే జరగని, ప్రధానంగా వ్యవసాయక దేశమైన మన దేశంలో ఉన్నత స్థాయి నిపుణతల ఐటీ సేవల అవసరం బహు స్వల్పం. కాబట్టి అత్యాధునిక దేశమైన అమెరికాలాగా, మన దేశానికి ఐటీ సేవలు అవసరం లేదు. అంతేకాకుండా, అభివృద్ధి క్రమంలో, మనం వ్యావసాయక దేశ స్థితినుంచి నేరుగా సేవారంగం వైపు అడుగులు వేశాం. ఈ రెండు రంగాలకు మధ్యలోని వంతెన వంటి సరుకు ఉత్పత్తి రంగం అభివృద్ధిని తీవ్రంగా నిర్లక్ష్యం చేశాం. దీంతో నేడు మన దేశీయ ఆర్థిక రంగంలో సమతుల్యత లోపించింది. ఈ సమస్యనే మనం మేకిన్ ఇండియా పేరిట పారిశ్రామిక అభివృద్ధి ద్వారా అధిగమించ చూస్తున్నాం. కానీ నేడు అంతర్జాతీయ మార్కెట్లో మాంద్య పరిస్థితులూ, దేశీయ డిమాండ్ రాహిత్యాల వలన మన పారిశ్రామికీకరణ కలలు నెరవేరే అవకాశం బహు స్వల్పం. పైగా ప్రపంచంలో నేటి పారిశ్రామికీకరణ యావత్తులోనూ యాంత్రీకరణ, రోబోట్లదే పెద్ద పాత్ర. కాబట్టి ఎంతో కొంత పారిశ్రామికీకరణ జరిగినా దాని వలన లభించే ఉపాధి అవకాశాలు స్వల్పమే. అంటే నేడు ఐటీ; బీపీఓల వంటి సేవారంగ పరిశ్రమలపై అధికంగా ఆధారపడిన మన దేశ ఆర్ధిక రంగం, దాని నిర్మాణం తాలూకు లోపాలకు ప్రజలు మూల్యం చెల్లించే పరిస్థితి ఏర్పడుతోంది! దీని ఫలితం ప్రపంచంలోనే యువజనులు అధికంగా ఉన్న మన దేశీయ సామాజిక రంగంపై నిరుద్యోగం, అర్హతకు తగిన ఉపాధి లేకపోవటం, అభద్రతల రూపంలో తీవ్రమైన స్థాయిలో ప్రతిబింబించగలదు!! దీనికి పరిష్కారం నేటి వరకూ నిర్లక్ష్యం పాలైన, దేశంలోని అత్యధికులు ఆధారపడి ఉన్న వ్యవసాయరంగంపై ఇనుమడించిన శ్రద్ధను పెట్టగలగటమే!!. వ్యాసకర్త ఆర్థిక రంగ విశ్లేషకులు : డి. పాపారావు 98661 79615 -
సార్వజనీన ఆదాయం కనికట్టు!
విశ్లేషణ సంక్షోభాల్లో ఉన్న ప్రజానీకం తిరుగుబాట్ల వైపు పోకుండా నిలువరించడానికి క్విడ్ ప్రో కో రూపంలో పేదలకు కొంత డబ్బును అందించి కాస్త ఉపశమనాన్ని కల్పించ డమే సార్వత్రిక కనీస ఆదాయ పథకం లక్ష్యం. అసమానతలను ఇది తొలగించలేదు. ‘సార్వజనీన కనీస ఆదాయం’ అనేది ఈ మధ్య కాలంలో, ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా చర్చనీయాంశంగా ఉంటోన్న అంశం. వివిధ దేశాలలోని ప్రజా నీకానికి ఆయాదేశాల ప్రభు త్వాలు, నెలవారీ నిర్దిష్ట మెుత్తాన్ని నగదు చెల్లింపుగా అందజేయ టమే ఈ సార్వజనీన కనీస ఆదాయ (సా.క.ఆ.) భావన తాలూకు సారాంశం. పేద రికం, నిరుద్యోగ సమస్యలతో సతమతమవుతోన్న తమ తమ దేశాల సామాన్య ప్రజల కష్టాలను కొంత మేరకు ఉపశమింపజేసేందుకు సా.క.ఆ భావనను పలు ప్రభు త్వాలు ఆశ్రయిస్తున్నాయి. స్థూలంగా 2008 నుంచి ఏర్ప డిన ఆర్థికమాంద్య పరిస్థితులలో ప్రపంచ దేశాలన్నింటి లోనూ పెరిగిపోతోన్న నిరుద్యోగం, ఆర్థిక అసమానతల భారం నుంచి సామాన్యులకు ఉపశమనం కల్పించేందుకు ఈ సా.క.ఆ ను ఫిన్లాండ్ దేశంలో 2016 డిసెంబర్ నుంచి పైలెట్æ ప్రాజెక్టుగా అమలు జరుపుతున్నారు. దీనిలో భాగంగా ఆ దేశంలోని ప్రజలందరికీ నిర్దిష్ట నగదును నెల వారీ అందించే ప్రయోగం జరుగుతోంది. గత కొంత కాలంగా భారతదేశంలో కూడా ఈ అంశం ఉన్నతస్థాయి చర్చలలో ఉంటోంది. ఈ క్రమంలోనే 2017– 2018 కేంద్ర బడ్జెట్‌ను సమర్పించేందుకు ఒక రోజు ముందుగా అంటే జనవరి 31వ తేదీన ప్రభుత్వం పార్ల మెంట్లో ప్రవేశపెట్టే ఆర్థిక సర్వేలో ఈ సా.క.ఆ.భావనను ఒక విస్తృత చర్చనీయాంశంగా ముందుకు తెచ్చే ఆలోచన ఉందని వార్తలు వస్తున్నాయి. నిజానికి గత యూపీఏ ప్రభుత్వ హయాంలోనే 2010లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 2 గ్రామాలలో ఈ సా.క.ఆ. ఆలోచనకు సంబంధించిన పైలెట్ ప్రాజెక్టును అమలుపరిచారు. అటు యు.పి.ఎ. లేదా ఇప్పటి ఎన్.డి.ఎ ప్రభుత్వాలు ఎన్ని వాగ్దానాలు చేసినా, అవి రెండూ అనుసరించిన, అనుసరిస్తోన్న ఆర్థిక సంస్కర ణల వలన దేశంలో నిరుద్యోగం, అసమానతలు భారీగా పెరిగిపోతున్నాయి. ఉదాహరణకు 2015లో, అంటే ‘‘మేక్ ఇన్ ఇండియా’’ నినాదం అమలులోకి వచ్చిన తరువాత మన దేశంలో కేవలం 1,35,000 మందికి మాత్రమే ఉపాధి కల్పించారు. కాగా, అంతకుముందర 2014–2015 సంవ త్సరాలలో ఉపాధికల్పనా స్థాయి సాలీన 4 లక్షలకు పైబడే ఉంది. మన దేశంలో కూడా 2008 ఫైనాన్స్ సంక్షోభం అనం తరం మెల్లమెల్లగా ఆర్థిక పరిస్థితులు దిగజారుతున్నాయి. కాగా, మన దేశంలో సగటున సంవత్సరానికి ఉపాధి మార్కెట్లోకి వస్తోన్న సుమారు 10 లక్షల మంది యువకు లకు మనం తగిన మేర జీవికను చూపలేకపోతున్నాము. ప్రపంచ బ్యాంక్ అంచనాల ప్రకారమే 2014లో మన దేశ యువజనులలోని ప్రతి ముగ్గురిలో కేవలం ఒక్కరికి మాత్రమే ఉపాధి లభించింది. పైగా ప్రపంచమంతటా ‘ఉపాధిరహిత అభివృద్ధి’ అంటున్న నేటి యాంత్రీకరణ, రోబో యుగంలో, మన దేశంలోనూ ఉపాధి అవకాశాలు రాను రాను మరింతగా దిగజారిపోతున్నాయి. అందుచేతనే నీతిఆయోగ్ సంస్థ సి.ఇ.ఓ అమితాబ్ కారిత్ ఒక ఇంట ర్వూ్యలో చెప్పిన ప్రకారంగా ‘యాంత్రీకరణ వలన ఉపాధి మార్కెట్లో ఏర్పడుతోన్న విచ్ఛితిని తట్టుకొనేందుకు ఈ సా.క.ఆ పథకం అవసరం.’ నిరుద్యోగ యువత, ఆర్థిక అసమానతల పీడితులలో అసంతృప్తి, ఆందోళనలు తీవ్రంగా పెరిగిపోయి, అవి సామాజిక సంక్షోభానికి దారితీయకుండా, నియంత్రిం చేందుకే ఈ సా.క.ఆ పథకాలను వివిధ రూపాలలో ప్రవేశ పెట్టేందుకు అనేక దేశాల ప్రభుత్వాలు ఆలోచనలు చేస్తున్నాయి. నిజానికి ఈ ఆలోచనల సారాంశం 18వ శతాబ్దం లోనే నాటి తత్వవేత్త, క్రియాశీల రాజకీయవేత్త అయిన థామస్ పెయిన్ చెప్పినట్లుగా: ‘‘ప్రభుత్వం ప్రజలకు కనీస ఆదాయాన్ని హామీ చేయటం.. ప్రైవేట్ ఆస్తిని కాపాడు కోగలిగేటందుకు ‘క్విడ్ ప్రో కో’గా ఉండగలదు.’’ అంటే ఆర్థిక అసమానతలు, నిరుద్యోగ భారం క్రింద నలిగిపో తోన్న కోటానుకోట్ల మంది ప్రజానీకం తిరుగుబాట్ల బాట పట్టకుండా నిలువరించడానికి ఈ సా.క.ఆ. పథకం రూపంలో క్విడ్ ప్రో కోగా కొద్దిపాటి ఉపశమనాన్ని కల్పించడమే పలుదేశాల పాలకుల ఉద్దేశ్యం. అయితే ఈ సా.క.ఆ రూపంలో పేద ప్రజలకు కొద్దిపాటి డబ్బును అందించగలిగినా అది మెుత్తంగా ఆర్థిక అసమానతల స్థితిని ఏ మాత్రం పరిష్కరించలేదు. ఈ సందర్భంలోనే భవిష్యత్ కాలంలో పెట్టుబడిదారీ వ్యవస్థలలో తీవ్రతరం కానున్న నిరుద్యోగం వంటి సమస్య లను ముందుగానే గ్రహించి ఆ వ్యవస్థను హెచ్చరించిన కమ్యూనిస్టు సిద్ధాంతకారుడు కార్ల్‌మార్క్స్ మాటలను మనం గుర్తు చేసుకోవాలి. ఆయన తమ కమ్యూనిస్టు ప్రణా ళికలో ఇలా చెప్పారు: ‘‘..ఆధునిక కార్మికుడు పరిశ్రమలు అభివృద్ధి అయ్యేకొద్దీ పైకిSరాకుండా ఇంకా కిందికి పోతు న్నాడు; కార్మిక జీవన వి«ధానానికి కూడా అంటిపెట్టుకోలేక దినదినానికి అడుక్కు, ఇంకా లోతుకు పోతున్నాడు. కార్మి కుడు బుక్కాపకీరవుతున్నాడు... కాబట్టి ఒక విషయం స్పష్టపడుతున్నది: సమాజంలో పాలకవర్గంగా వుండడానికి బూర్జువా వర్గానికి ఇక ఎంత మాత్రమూ యోగ్యత లేదు.. సమాజాన్ని పాలించడానికి అది అనర్హం: ఎందుకంటే, తన బానిసకు బానిస బతుకునైనా నమ్మకంగా చూపించగల సామర్థ్యంలేదు దానికి; తన బానిస బిచ్చమెత్తుకోవలసిన దుస్థితికి దిగజారిపోతే, బానిస శ్రమ మీద తాను బతక డానికి బదులు తన బిచ్చం మీద బానిసగా బతకవలసిన దుస్థితి సంభవిస్తే, ఏమీ చేయడానికి సామర్థ్యంలేదు దానికి...’’ డి. పాపారావు వ్యాసకర్త ఆర్థిక విశ్లేషకులు ‘ మెుబైల్: 98661 79615 -
51సార్లు రక్తదానం
రక్తదాత బాదె పాపారావుకు నర్సాపూర్‌లో సన్మానం నర్సాపూర్: 51 సార్లు రక్తదానం చేసిన నర్సాపూర్‌కు చెందిన బాదె పాపారావును ఆదర్శంగా తీసుకుని యువకులు రక్తదానం చేయాలని హనుమాన్ సేన అధికార ప్రతినిధి వాల్దాస్ మల్లేశ్‌గౌడ్ అన్నారు. మంగళవారం మణికొండ ఫంక్షనహాలులో హనుమాన్ సేన ఆధ్వర్యంలో రక్తదానంపై విద్యార్థులకు కల్పించిన అవగాహన సదస్సులో 51 సార్లు రక్తదానం చేసిన పాపారావును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మల్లేశ్‌గౌడ్ మాట్లాడుతూ నర్సాపూర్‌కు చెందిన పాపారావు తన 49 ఏళ్ల వయస్సులో 51సార్లు రక్తదానం చేయడం గొప్ప విషయమన్నారు. హనుమాన్‌సేన అధ్యక్షుడు రాజిరెడ్డి మాట్లాడుతూ రక్తదానంపై విద్యార్థులకు,యువకులకు అవగాహన కల్పించేందుకే పాపారావుకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పెద్దచింతకుంట ఉన్నత పాఠశాల హెడ్మాష్టరు గుండం మోహన్‌రెడ్డి మాట్లాడుతూ యువకులు రక్తదానం చేయడానికి ముందుకు రావాలన్నారు. లయన్స్‌క్లబ్ కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ తన వయస్సు కన్నా ఎక్కువ సార్లు రక్తదానం చేసిన పాపారావును అందరూ ఆదర్శంగా తీసుకుని రక్తదానం చేయాలన్నారు. సోమవారం నాటికి 51సార్లు రక్తదానం: పాపారావు నర్సాపూర్‌లో సోమవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో తాను రక్తదానం చేశానని, దీంతో 51సార్లు రక్తదానం చేశానని రక్తదాత బాదె పాపారావు చెప్పారు. కార్యక్రమంలో అశోక్‌కుమార్, నాగరాజుగౌడ్, పద్మనాభం, తదితరులు పాల్గొన్నారు. -
500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
నిజాంపట్నం మండలం దిండి గ్రామంలో ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. సుమారు 500 లీటర్ల బెల్లం ఊటను అధికారులు ధ్వంసం చేసి..15 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. ఏమినేని పాపారావు అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మద్యం అమ్ముతున్న ముగ్గురి అరెస్టు
మద్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను గుంటూరు జిల్లా రేపల్లె ఎక్సైజ్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని మైనేనివారి పాలెం గ్రామానికి చెందిన రాయని సాంబయ్య, ఉయ్యూరు పాపారావుతోపాటు చెరుకుపల్లి మండలం గూడవల్లికి చెందిన అద్దంకి శివనాగేశ్వరరావులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ వెంకట్‌రెడ్డి తెలిపారు. -
సింగవరంలో వృద్ధుడు సజీవదహనం
వైరామవరం: తూర్పుగోదావరి జిల్లా వైరామవరం మండలం సింగవరంలో ప్రమాదవశాత్తూ పాపారావు(80) అనే వృద్ధుడు సజీవదహనమయ్యాడు. గురువారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో వృద్ధ దంపతులు ఇంట్లో నిద్రిస్తుండగా దీపం అంటుకుని ఇల్లంతా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో పాపారావు సజీవదహనం అవ్వగా, వృద్ధుడి భార్య లక్ష్మమ్మ(70) అదృష్టవశాత్తూ బయటపడింది. లక్ష్మమ్మ కేకలు వేసినా సరైన సమయంలో ఇరుగుపొరుగు వారు రావడంలో ఆలస్యం కావడంతో వృద్ధుని కాపాడలేకపోయాడు. -
వ్యాపారి దారుణ హత్య
విశాఖపట్నం: పనస వ్యాపారి దారుణ హత్యకు గురైన సంఘటన విశాఖపట్టణం జిల్లా చింతపల్లి మండలం తాజంగిలో ఆదివారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గాజువాకకు చెందిన పాపారావు శనివారం తాజంగి గ్రామానికి చేరుకున్నాడు. సాధారణంగా వచ్చిన రోజే గ్రామంలోని పనస చెట్లను కొనుగోలు చేసి, కాయలు తెంపుకుని వెంటనే వాహనంలో తరలించుకుని వెళ్లిపోతుంటాడు. అయితే, సాయంత్రం పనస తోటలోకి వెళ్లిన ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. ఆదివారం ఉదయం విగతజీవిగా కనిపించటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
టీడీపీ నేత.. చిన్నారుల విక్రేత?
* తన బిడ్డను రూ.20 లక్షలకు అమెరికాలో అమ్మేశాడని ఓ తండ్రి ఆరోపణ * అడిగిన సొమ్ము ఇవ్వలేదన్న కక్షతోనే ఆరోపణలంటున్న టీడీపీ నేత పాపారావు * ఆయనపై చాలా ఏళ్ల నుంచి ఇలాంటి అభియోగాలు * చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరి, పాదయాత్ర చేసిన పాపారావు సాక్షి ప్రతినిధి, కాకినాడ : ‘నేరగాళ్లను తరిమి కొడతా’నని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రగల్భాలు పలుకుతుంటారు. అదే చంద్రబాబు హత్యకేసులో నిందితులకు టిక్కెట్టిచ్చి, ఎమ్మెల్యేని చేసి శాసనసభలో పక్కన కూర్చోబెట్టుకుంటారు. ఆయన నైజాన్ని గ్రహించే కాబోలు.. పేద, అనాథ పిల్లలను విదేశాలకు అక్రమంగా పంపి, సొమ్ము గడిస్తున్నట్టు ఆరోపణలున్న వ్యక్తి మొన్నటి ఎన్నికల్లో టీడీపీలో చేరి, కాకినాడ నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని ఆరాటపడ్డారు. సదరు వ్యక్తిపై గతం నుంచీ ఇలాంటి ఆరోపణలున్నా.. సోమవారం నాటి గ్రీవెన్స్‌సెల్‌లో ఓ బాధితుడు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో మరోసారి వార్తలకెక్కారు. . ఆ పార్టీకి చెందిన ఒక నాయకుడిపై ఏకంగా బాలల అక్రమ రవాణాతో సంబంధం ఉన్నట్టు ఫిర్యాదులు రావడం కాకినాడలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీడీపీలో క్రియాశీలక నాయకుడైన కాకినాడకు చెందిన యేల్చూరి పాపారావు తన బిడ్డను అక్రమంగా అమెరికాకు పంపి, రూ.20 లక్షలకు అమ్ముకున్నాడని సీతానగరం మండలం ముగ్గళ్లకు చెందిన పాస్టర్ చింతపర్తి సాల్మన్‌రాజు సోమవారం కాకినాడలో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌లో కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనితో కలెక్టర్ దర్యాప్తునకు జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌కు సిఫార్సు చేశారు. సాల్మన్‌రాజు ఫిర్యాదు వివరాలిలా ఉన్నాయి. పదేళ్లుగా పాప ఆచూకీ లేదు.. సాల్మన్‌రాజుకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పిల్లల చిన్నప్పుడేభార్య నిర్మలకుమారి మృతి చెందింది. చిన్న కుమార్తె సువర్ణను కాకినాడలో ఉన్న తన బావ పాపారావు నిర్వహించచే హాస్టల్లో చేర్పిద్దామని తొర్రేడుకు చెందిన కె.మనసయ్య సాల్మన్‌రాజుకు చెప్పారు. దాంతో సువర్ణను పదేళ్ల కిందట ఆమెకు ఐదేళ్ల వయసున్నప్పుడు పాపారావు హాస్టల్లో చేర్పించారు. కొన్నిరోజులయ్యాక సువర్ణను అమెరికాలో దొరగారి ఇంటికి పంపిస్తే భవిష్యత్తు బాగుంటుందని పాపారావు సాల్మన్‌రాజుకు చెప్పారు. ఏటా సువర్ణను భారత్‌కు తీసుకొచ్చి చూపించి తిరిగి పంపిస్తుంటామని నమ్మించారు. పాపను అమెరికా పంపించాక.. తాను ఏనాడు వెళ్లి అడిగినా పాపారావు అతడి మనుషులతో దాడి చేయించే వాడని, తాను ప్రాణ భయంతో పారిపోయి కాకినాడ రెండో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినా పాపారావు అంగబలంతో ఎవరూ పట్టించుకోలేదని సాల్మన్‌రాజు ఆరోపించారు. అప్పటి నుంచీ ఎన్నిసార్లు తిరిగినా సువర్ణ ఆచూకీ లభించలేదని, పాపారావు నుంచి సరైన సమాధానం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన బిడ్డను కుమార్తెను పాపారావు రూ.20 లక్షలకు అమ్మేశాడని ఆరోపించారు. కాకినాడ నుంచి పోటీకి యత్నించిన పాపారావు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న పాపారావు గత సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసేందుకు చంద్రబాబు కేబినెట్లో నంబర్-2గా ఉన్న యనమల రామకృష్ణుడు ద్వారా గట్టి ప్రయత్నాలే చేశారు. సీటు ఇస్తే కాకినాడ పార్లమెంటు స్థానం పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో ఎన్నికల ఖర్చు అంతా పాపారావే పెట్టుకుంటాడనే ప్రచారం పార్టీలో విస్తృతంగా సాగింది. ఈ నేపథ్యంలోనే గత ఏప్రిల్ ఒకటిన ‘వస్తున్నా మీ కోసం’ పాదయాత్రలో భాగంగా కాకినాడ వచ్చిన చంద్రబాబుకు పాపారావు భారీగా స్వాగతం పలికారు. అప్పట్లో విద్యుత్ సమస్యపై కాకినాడలో లాంతర్లతో చంద్రబాబు నిర్వహించిన పాదయాత్రలో ప్రస్తుత కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుతో పాటు పాపారావు వెంట ఉన్నారు. అప్పటి నుంచి పార్టీ వ్యవహారాల్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు పాపారావుపై అక్రమంగా మనుషులను రవాణా చేస్తున్నట్టు ఫిర్యాదులు రావడం తీవ్ర చర్చకు దారితీసింది. అప్పుడే వచ్చిన ఆరోపణలు గప్‌చుప్ పాపారావు మిషన్స్ టు ద నేషన్స్ అనే స్వచ్ఛంద సంస్థ పేరుతో పలు కార్యక్రమాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే కాకినాడ గొడారిగుంటలో న్యూ లైఫ్ పబ్లిక్ స్కూల్, వృద్ధాశ్రమం, ఫౌండేషన్ హాస్పటల్, న్యూ లైఫ్పేరుతో ప్రార్థనామందిరంతో పాటు ఒక ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. సేవ ముసుగులో సొమ్ము చేసుకుంటున్నాడంటూ.. పాపారావుపై 1996లో కూడా ఇవే రకమైన ఆరోపణలు వెల్లువెత్తాయి. నిరుపేదలను నమ్మించి, వారికి రూ.ఐదు వేల నుంచి రూ.10 వేలు ముట్టచెప్పి వారి బిడ్డలను, అనాథ బాలలను విదేశీయులకు రూ.10 లక్షలకు విక్రయిస్తున్నారని అప్పట్లో పోలీసులకు ఫిర్యాదులు కూడా అందాయి. ఈ రకంగా సుమారు వంద మంది పిల్లలను విదేశాలకు పంపించారని ఆరోపణలు వచ్చాయి. పెద్దల జోక్యంతో అవి సర్దుబాటు అయ్యాయంటారు. ఇప్పుడు మళ్లీ అవేరకమైన ఫిర్యాదు రావడంతో పాపారావు నేపథ్యం మరోసారి చర్చకు వచ్చింది. ఈసారైనా ఆయన చేశాడంటున్న అక్రమ రవాణా నిగ్గు తేల్చుతారో లేక నీరుగారుస్తారో వేచి చూడాలి. డబ్బివ్వలేదని తప్పుడు ఆరోపణ కాగా ఇల్లు కట్టుకోవడానికి రూ.లక్ష ఇవ్వాలని సాల్మన్‌రాజు తనను అడిగితే నిరాకరించానని పాపారావు అంటున్నారు. ఆ కోపంతోనే తనపై తప్పుడు ఆరోపణ చేస్తున్నాడన్నారు. సువర్ణను చట్టబద్ధంగానే ఓ అమెరికన్‌కు దత్తత ఇచ్చినట్టు చెప్పారు. -
అక్కడ రిలీవ్ కాకుండానే.. ఇక్కడ రాజభోగం!
పేరుకు అతను చిరుద్యోగే.. కానీ రెండు ప్రభుత్వ శాఖలను రెండేళ్లుగా ముప్పు తిప్పలు పెడుతున్నారు. డైట్ కళాశాల నుంచి రెండేళ్ల క్రితం బదిలీ అయిన ఈయనగారు.. ఇప్పటికీ అక్కడి బాధ్యతలను తన స్థానంలో వచ్చిన ఉద్యోగికి అప్పగించలేదు. ఫలితంగా అక్కడ కార్యకలాపాల నిర్వహణ ఇబ్బందికరంగా మారింది. పాత స్థానంలో బాధ్యతలు అప్పగించకుండా వచ్చేసిన ఈ ఉద్యోగికి ఆర్వీఎం అప్పటి అధికారులు రెడ్ కార్పెట్ పరిచారు. డైట్ అధికారులు ఎన్ని లేఖలు రాసినా పట్టించుకోలేదు సరికదా.. ఎస్ఆర్ లేకుండానే జీతాలు, ఇంక్రిమెంట్లు యథోచితంగా ఇచ్చేశారు. కొద్ది నెలల క్రితం ఆర్వీఎం కొత్త పీవో ఆరా తీయడంతో డొంకంతా కదులుతోంది. శ్రీకాకుళం: డైట్ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేసిన పాపారావు రెండేళ్ల క్రితం శ్రీకాకుళం రాజీవ్ విద్యా మిషన్(ఆర్వీఎం)కు బదిలీ అయ్యారు. అయినా అక్కడ బాధ్యతలు అప్పగించకుండానే ఇక్కడ విధుల్లో చేరిపోయారు. ఈ విషయమై రెండేళ్ల నుంచి డైట్ అధికారులు లేఖలు రాస్తున్నా ఇటీవలి వరకు ఆర్వీఎం అధికారులు కూడా స్పందించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎట్టకేలకు కొత్త పీవో వచ్చిన తర్వాత ఇటీవలే హెచ్చరించడంతో బాధ్యతలు అప్పగిస్తానని చెప్పిన ఆ ఉద్యోగి 20 రోజులకు పైగా విధులకు గైర్హాజరయ్యారు. అధికారులు మెమోలు జారీ చేసినా వాటిని స్వీకరించకపోవడంతో, చివరికి ఆయన ఇంటికి నోటీసు అతికించాల్సి వచ్చింది. ఇంత జరిగినా ఆ ఉద్యోగి డైట్లో బాధ్యతలు అప్పగించిన దాఖలాలు లేవు. ఆర్వీఎంలో విధులకు మాత్రం హాజరు అవుతుండడంతో గైర్హాజరైన కాలాన్ని సెలవుగా పరిగణించారు. ఆర్వీఎంలో మతలబు డైట్లో బాధ్యతలు అప్పగించక పోవడంతో పాపారావుకు చెందిన ఎస్ఆర్(సర్వీస్ రిజిస్టర్)ను డైట్ అధికారులు ఆర్వీఎంకు అప్పగించలేదు. ఎస్ఆర్ లేకుండా ఏ ఉద్యోగికైనా ఇంక్రిమెంట్లు మంజూరు చేయకూడదు. ఆర్వీఎం అధికారులు ఈ నిబంధనను పట్టించుకోలేదు. అలాగే రాష్ట్ర విభజన సమయంలో ఉద్యోగులు 66 రోజులు సమ్మె చేసినప్పుడు రెండు నెలల జీతాన్ని అడ్వాన్స్‌గా ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం, సమ్మె కాలాన్ని ఎస్‌ఆర్‌లో నమోదు చేసి ఆర్జిత సెలవుగా పరిగణించాలని కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా చేస్తేనే అడ్వాన్స్‌గా ఇచ్చిన మొత్తం సర్దుబాటు అవుతుంది. అలా జరగనప్పుడు రెండు నెలల జీతం నిలిపివేయాల్సి ఉంటుంది. దీన్ని కూడా రాజీవ్ విద్యామిషన్ అధికారులు అమలు చేయలేదు. ఆ ఉద్యోగికి ఉదారంగా జీతం ఇచ్చేస్తున్నారు. అలాగే కొద్ది రోజుల క్రితమే ఈ ఉద్యోగి ఆర్జిత సెలవులను నగదుగా మార్చుకునేందుకు బిల్లులు సమర్పించినట్లు తెలిసింది. అయితే దీన్ని విద్యాశాఖాధికారులు తిరస్కరించినట్లు సమాచారం. ప్రతి బిల్లును నిశితంగా పరిశీలించి చిన్న లోపాలున్నా తిరస్కరించేసే ఆర్వీఎంలోని గణాంక అధికారి ఈ ఉద్యోగి విషయంలో ఇన్ని ఆర్థిక వ్యవహారాలను చూసీచూడనట్లు ఎలా వదిలేశారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు డైట్లో బాధ్యతలు అప్పగించక పోవడం వల్ల అక్కడ పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. ఇప్పటికైనా జిల్లా అధికారులు జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. విషయాన్ని రాజీవ్ విద్యామిషన్ పీవో గణపతిరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా తాను ఫిబ్రవరిలో పీవోగా బాధ్యతలు స్వీకరించానని అంతకు ముందే ఈ బిల్లులన్నీ మంజూరయ్యాయన్నారు. తాను మెమో ఇచ్చిన మాట వాస్తవమేనని తెలిపారు. ఆ ఉద్యోగి ఈఎల్స్ బిల్లులు పెట్టినా మంజూరు కాకపోవడం, 20 రోజుల పాటు విధులకు గైర్హాజరు కావడం కూడా నిజమేనన్నారు. ఎస్‌ఆర్‌లో నమోదు చేయకుండా డీఏ ఇవ్వరని, సమ్మె కాలం కూడా ఎస్‌ఆర్‌లో నమోదు చేయాల్సి ఉందని అలా ఎందుకు చేయలేదో తనకు తెలియదన్నారు. ఉద్యోగికి సంబంధించిన దస్త్రాన్ని ఎన్నిసార్లు అడిగినా కిందిస్థాయి ఉద్యోగులు ఇవ్వడం లేదన్నారు. సోమవారం ఇవ్వకుంటే ఉన్నతాధికారులకు విషయాన్ని నివేదిస్తానన్నారు. డైట్ ప్రిన్సిపల్ ఉత్తరాలు రాయడం కూడా నిజమేనని పేర్కొన్నారు.