అభిప్రాయం
నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేని కేంద్ర ప్రభుత్వం ఉపాధి భావననే పునర్ని ర్వచించేందుకు పూనుకుంటోంది. ఉపాధి కల్పన గణాంకాలకు అసంఘటితరంగ వివరాలను జోడిస్తే నిరుద్యోగం హాంఫట్ అవుతుందన్నది ప్రభుత్వ అంచనా
మన దేశంలో నిరుద్యోగ సమస్య భారీగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. గతంలో పరిపాలించిన యూపీఏ హయాం నాటికంటే ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తరువాతి 3 ఏళ్ల కాలంలో ఈ సమస్య మరింత తీవ్రతరం అయ్యింది. దీనికి తార్కాణంగా కొన్ని గణాంకాలను చూడవచ్చు. భారత లేబర్ బ్యూరో గణాంకాల ప్రకారం 2009వ సం‘‘లో జరిగిన ఉపాధి కల్పన 8.89 లక్షలుగా ఉంది. 2014లో ఈ సంఖ్య 4.21 లక్షలు గానూ, 2015లో 1.35 లక్షలు గానూ, 2016లో 2.31 లక్షలు గానూ ఉంది. ఇక 2016 అక్టోబర్, 2017 జనవరి మాసాల నడుమ ఈ సంఖ్య 1.22 లక్షలుగా ఉంది. కాగా, ఈ కాలంలోనే (2016 అక్టోబర్ – 2017 జనవరి) నోట్ల రద్దు క్రమంలో 1.5 లక్షల మంది తాత్కాలిక కార్మికులు ఉపాధిని కోల్పోయారు.
కాగా, ప్రస్తుతం దేశంలో రోజురోజుకూ పెరిగిపోతోన్న నిరుద్యోగ సమస్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. నేటి గుజరాత్ ఎన్నికలలో కూడా ఇదొక ముఖ్యమైన అంశంగా ఉంది. ఈ నేపథ్యంలోనే, ప్రస్తుతం అసలు ‘‘ఉపాధి’’ అంటే ఏమిటి? అనే దానినే పునర్నిర్వచించాలని నేడు కేంద్ర ప్రభుత్వం తలపెట్టింది. ఈ కొత్త నిర్వచనంలోకి, ఇంతకు ముందు ఉపాధి కల్పన గణాంకాల కింద లెక్కలోకి రాని అసంఘటిత రంగ ఉపాధి కల్పనను కూడా తీసుకురావాలనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. తద్వారా కచ్చితంగా, మరింత పెద్దదైన ఉపాధి కల్పన తాలూకు గణాంకం, మన ముందు ప్రత్యక్షమవుతుంది. ఎన్డీఏ పాలకులకు కావల్సింది కూడా అదే!!
తమ హయాంలో నిరుద్యోగం మరింతగా పెరిగిపోతుండటం, దానితో పాటుగా స్వయంకృతాపరాధమైన ‘‘పెద్ద’ నోట్ల రద్దు ఈ సమస్యను మరింత తీవ్రతరం చేయడం గురించిన విమర్శల నుంచి బయట పడేం దుకు పాలక పక్షానికి బహుశా ఇది మాత్రమే దారిగా కనబడి ఉండవచ్చు! నిజానికి, ఉపాధి కల్పనా సంఖ్యను గణించేందుకు సంఘటిత రంగంలోని ఉపాధి కల్పనతో పాటుగా, అసంఘటిత రంగ గణాంకాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం, పైకి చూడటానికి సరైనదే కావచ్చు. కానీ, అటు అసంఘటిత రంగం తాలూకు గణాంకాలు విశ్వసనీయంగా అందుబాటులో ఉండటంతో పాటుగా, ఈ రంగంలోని ఉపాధి తాలూకు నిలకడా, వేతనాల స్థాయి, పని పరిస్థితులవంటివి అన్నీ కూడా కచ్చితంగా ప్రశ్నార్థకాలే.
ఒక అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారంగా కూడా, ఆర్థిక సంక్షోభాల కాలంలో, సంఘటిత రంగంలో పెరిగిపోతోన్న నిరుద్యోగంతో పాటుగా, రెండో వైపున అసంఘటిత రంగంలో ఉపాధి కల్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న వారి సంఖ్య కూడా పెరిగిందన్నది గమనార్హం. అలాగే ఆర్థిక పరిస్థితులు కుదుటపడిన కాలంలో అసంఘటిత రంగంపై ఆధారపడుతోన్న వారి సంఖ్య తగ్గిపోయి, సంఘటిత రంగ ఉపాధి పెరగడం మనం గమనించాలి. అంటే మరే దారీ లేనప్పుడూ మాత్రమే అత్యధికులు అల్ప వేతనాలు, అభద్రతతో కూడిన అసంఘటిత రంగం దిశగా వెళతారు!
అంతిమంగా ఎన్డీఏ పాలకులు దేశంలోని నిరుద్యోగ సమస్య తాలూకు చర్చను సద్దుమణిగించేం దుకూ, తిమ్మిని బమ్మిని చేసేందుకూ మాత్రమే ప్రయత్నిస్తున్నారు అన్నది సుస్పష్టం. ఇటువంటి ప్రయత్నాన్నే వీరు 2015లో స్థూల జాతీయ ఉత్పత్తి (జి.డి.పి) సంఖ్యపై చేసి ఉన్నారు. ఏటికేడాదిగా పడిపోతోన్న జీడీపీ సంఖ్యను, అది తమ హయాంలో మెరుగుపడిందని చెప్పుకునేందుకు దానిని లెక్కించే పద్ధతినే వారు మార్చేశారు అన్న విమర్శలు సర్వత్రా వినపడుతున్నవే.
ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతి విజేత అయిన ఆంగస్ డీటన్ కూడా భారతదేశంలోని జీడీపీ సంఖ్యల విశ్వసనీయత గురించి విమర్శలు చేయడాన్ని మనం పరిగణనలోకి తీసుకోవాలి. నిజానికి, జీడీపీని లెక్కించే పద్ధతిని.. ప్రాతిపదిక సంవత్సరాన్ని మార్చడం ద్వారా ఏ ప్రభుత్వమైనా మారుస్తుందనేది నిజం. కానీ, 2015 లో ఎన్డీఏ చేసిన ఈ ప్రయత్నంలోని లొసుగులు తీవ్ర విమర్శలకు తావిచ్చాయి. అంటే, ప్రస్తుతం జరుగుతోన్న ఉపాధి కల్పన గణాంకాలను గుణించే తీరులో మార్పు వ్యవహారం మొదటిదేమీ కాదు. 2015లో జరిగిన సందేహాస్పద జీడీపీ పునర్నిర్వచనం తీరు కూడా ఎన్డీఏ ఖాతాలోనే పడుతుంది.
ఇక, పెట్రోలియం ధరలను రిటైల్ బంకులలో రోజువారీ మార్చే పద్ధతికి శ్రీకారం చుట్టడం ద్వారా కూడా ఈ ప్రభుత్వం అప్రతిష్టను మూటగట్టుకుం టోంది. ఈ ధరలను రోజువారి సవరించే విధానంలో, ఆ ధరల పెరుగుదల.. పైకి పెద్దగా కనపడని చిల్లర పైసల రూపంలో జరిగిపోతోందనీ, దీనితో ధరల పెరుగుదల తాలూకు వినియోగదారుల ఆగ్రహం నుంచి కేంద్రం, చమురు సంస్థలూ బయటపడ చూస్తున్నాయన్న విమర్శలు కూడా నేడు అందరం వింటున్నవే.
కాబట్టి, నిజ ఆర్థిక పరిస్థితులనూ, ప్రజల జీవన ప్రమాణాలనూ మెరుగుపరచలేని అసమర్థ, అవకతవక విధానాలను అనుసరిస్తున్న ప్రభుత్వం దానిని కప్పిపెట్టుకోవడానికి అంకెల గారడీ, కనికట్టుకు దిగుతోందా అనే సందేహం ఎవరికైనా వస్తుంది. వాస్తవ జీవితంలో ఆర్థిక సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న సామాన్యుడి విషయంలో ఇది మరింత నిజం!
వ్యాసకర్త ఆర్థికరంగ విశ్లేషకులు ‘ 98661 79615
డి. పాపారావు
Comments
Please login to add a commentAdd a comment