అక్కడ రిలీవ్ కాకుండానే.. ఇక్కడ రాజభోగం! | Diet Assistant Junior College Paparao in Srikakulam | Sakshi
Sakshi News home page

అక్కడ రిలీవ్ కాకుండానే.. ఇక్కడ రాజభోగం!

Published Mon, Aug 18 2014 1:55 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

అక్కడ రిలీవ్ కాకుండానే.. ఇక్కడ రాజభోగం! - Sakshi

అక్కడ రిలీవ్ కాకుండానే.. ఇక్కడ రాజభోగం!

 పేరుకు అతను చిరుద్యోగే.. కానీ రెండు ప్రభుత్వ శాఖలను రెండేళ్లుగా ముప్పు తిప్పలు పెడుతున్నారు. డైట్ కళాశాల నుంచి రెండేళ్ల క్రితం బదిలీ అయిన ఈయనగారు.. ఇప్పటికీ అక్కడి బాధ్యతలను తన స్థానంలో వచ్చిన ఉద్యోగికి అప్పగించలేదు. ఫలితంగా అక్కడ కార్యకలాపాల నిర్వహణ ఇబ్బందికరంగా మారింది. పాత స్థానంలో బాధ్యతలు అప్పగించకుండా వచ్చేసిన ఈ ఉద్యోగికి ఆర్వీఎం అప్పటి అధికారులు రెడ్ కార్పెట్ పరిచారు. డైట్ అధికారులు ఎన్ని లేఖలు రాసినా పట్టించుకోలేదు సరికదా.. ఎస్‌ఆర్ లేకుండానే జీతాలు, ఇంక్రిమెంట్లు యథోచితంగా ఇచ్చేశారు. కొద్ది నెలల క్రితం ఆర్వీఎం కొత్త పీవో ఆరా తీయడంతో డొంకంతా కదులుతోంది.
 
 శ్రీకాకుళం: డైట్ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేసిన పాపారావు రెండేళ్ల క్రితం శ్రీకాకుళం రాజీవ్ విద్యా మిషన్(ఆర్వీఎం)కు బదిలీ అయ్యారు. అయినా అక్కడ బాధ్యతలు అప్పగించకుండానే ఇక్కడ విధుల్లో చేరిపోయారు. ఈ విషయమై రెండేళ్ల నుంచి డైట్ అధికారులు లేఖలు రాస్తున్నా ఇటీవలి వరకు ఆర్వీఎం అధికారులు కూడా స్పందించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎట్టకేలకు కొత్త పీవో వచ్చిన తర్వాత ఇటీవలే హెచ్చరించడంతో బాధ్యతలు అప్పగిస్తానని చెప్పిన ఆ ఉద్యోగి 20 రోజులకు పైగా విధులకు గైర్హాజరయ్యారు. అధికారులు మెమోలు జారీ చేసినా వాటిని స్వీకరించకపోవడంతో, చివరికి ఆయన ఇంటికి నోటీసు అతికించాల్సి వచ్చింది. ఇంత జరిగినా ఆ ఉద్యోగి డైట్‌లో బాధ్యతలు అప్పగించిన దాఖలాలు లేవు. ఆర్వీఎంలో విధులకు మాత్రం హాజరు అవుతుండడంతో గైర్హాజరైన కాలాన్ని  సెలవుగా పరిగణించారు.
 
 ఆర్వీఎంలో మతలబు
  డైట్‌లో బాధ్యతలు అప్పగించక పోవడంతో పాపారావుకు చెందిన ఎస్‌ఆర్(సర్వీస్ రిజిస్టర్)ను డైట్ అధికారులు ఆర్‌వీఎంకు అప్పగించలేదు. ఎస్‌ఆర్ లేకుండా ఏ ఉద్యోగికైనా ఇంక్రిమెంట్లు మంజూరు చేయకూడదు. ఆర్‌వీఎం అధికారులు ఈ నిబంధనను పట్టించుకోలేదు. అలాగే రాష్ట్ర విభజన సమయంలో ఉద్యోగులు 66 రోజులు సమ్మె చేసినప్పుడు రెండు నెలల జీతాన్ని అడ్వాన్స్‌గా ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం, సమ్మె కాలాన్ని ఎస్‌ఆర్‌లో నమోదు చేసి ఆర్జిత సెలవుగా పరిగణించాలని కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా చేస్తేనే అడ్వాన్స్‌గా ఇచ్చిన మొత్తం సర్దుబాటు అవుతుంది. అలా జరగనప్పుడు రెండు నెలల జీతం నిలిపివేయాల్సి ఉంటుంది. దీన్ని కూడా రాజీవ్ విద్యామిషన్ అధికారులు అమలు చేయలేదు. ఆ ఉద్యోగికి ఉదారంగా జీతం ఇచ్చేస్తున్నారు.
 
 అలాగే కొద్ది రోజుల క్రితమే ఈ ఉద్యోగి ఆర్జిత సెలవులను నగదుగా మార్చుకునేందుకు బిల్లులు సమర్పించినట్లు తెలిసింది. అయితే దీన్ని  విద్యాశాఖాధికారులు తిరస్కరించినట్లు సమాచారం. ప్రతి బిల్లును నిశితంగా పరిశీలించి చిన్న లోపాలున్నా తిరస్కరించేసే ఆర్‌వీఎంలోని గణాంక అధికారి ఈ ఉద్యోగి విషయంలో ఇన్ని ఆర్థిక వ్యవహారాలను చూసీచూడనట్లు ఎలా వదిలేశారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు డైట్‌లో బాధ్యతలు అప్పగించక పోవడం వల్ల అక్కడ పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
 
 అయినా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. ఇప్పటికైనా జిల్లా అధికారులు జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. విషయాన్ని రాజీవ్ విద్యామిషన్ పీవో గణపతిరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా తాను ఫిబ్రవరిలో పీవోగా బాధ్యతలు స్వీకరించానని అంతకు ముందే ఈ బిల్లులన్నీ మంజూరయ్యాయన్నారు. తాను మెమో ఇచ్చిన మాట వాస్తవమేనని తెలిపారు. ఆ ఉద్యోగి ఈఎల్స్ బిల్లులు పెట్టినా మంజూరు కాకపోవడం, 20 రోజుల పాటు విధులకు గైర్హాజరు కావడం కూడా నిజమేనన్నారు. ఎస్‌ఆర్‌లో నమోదు చేయకుండా డీఏ ఇవ్వరని, సమ్మె కాలం కూడా ఎస్‌ఆర్‌లో నమోదు చేయాల్సి ఉందని అలా ఎందుకు చేయలేదో తనకు తెలియదన్నారు. ఉద్యోగికి సంబంధించిన దస్త్రాన్ని ఎన్నిసార్లు అడిగినా కిందిస్థాయి ఉద్యోగులు ఇవ్వడం లేదన్నారు. సోమవారం ఇవ్వకుంటే ఉన్నతాధికారులకు విషయాన్ని నివేదిస్తానన్నారు. డైట్ ప్రిన్సిపల్ ఉత్తరాలు రాయడం కూడా నిజమేనని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement