
మీకు భారం కాలేను
పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య
శ్రీకాకుళం: ‘సారీ నాన్న.. నాకెంతో చేశారు.. నేను కొంచెం కూడా మీకు ఉపయోగపడలేదు. ఇంత వయస్సు వచ్చినా మీకు సహాయం కాకుండా నేను ఉన్నాను. యూజ్‌లెస్‌గా ఉండటం కంటే మీకు దూరంగా ఉంటేనే కరెక్టని నాకు అనిపించింది. మిమ్మల్ని కష్టపెట్టాలనినాకు లేదు..’ అని వాట్సాప్ డీపీలో మెసేజ్ పెట్టి ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన నందిగాం మండలం ఆనందపురం ఊర చెరువు వద్ద చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వజ్రపుకొత్తూరు మండలం అనంతగిరికి చెందిన ఇచ్ఛాపురం హరికృష్ణ(24) విజయనగరంలో వివిధ పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకునేవాడు. 15 రోజుల క్రితం గ్రామానికి వచ్చాడు. గురువారం ఉదయం విజయనగరం వెళ్తాను డబ్బులు ఇవ్వు అని తల్లిని అడిగాడు. కొద్ది రోజుల్లో ఇంటి సంబరం ఉందని, అదయ్యాక వెళ్లు అని చెప్పి రూ.550 ఇచ్చింది. డబ్బులు తీసుకొని బయటకు వెళ్లిన హరికృష్ణ పురుగుల మందు కొని ఆనందపురం చెరువు వద్దకు వెళ్లి తాగాడు.
అనంతరం తన గ్రామానికి చెందిన స్నేహితుడు మామిడి విజయ్‌కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో విజయ్ కుటుంబసభ్యులకు, గ్రామస్తులకు తెలియజేసి ఆనందపురం వెళ్లారు. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న హరికృష్ణను పలాసలో ఒక ప్రైవేటు ఆస్పత్రికి, అక్కడి నుంచి శ్రీకాకుళం మెడికవర్‌కు తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతదేహాన్ని పోలీసులు రిమ్స్‌కు తరలించారు. మృతుడి తల్లి ఆదిలక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిగాం ఎస్సై షేక్‌మహమ్మద్ అలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదువులో మంచి ప్రతిభ కనబరిచే హరికృష్ణ ఇలా అర్ధంతరంగా తనువు చాలించడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment