
భర్త చేతిలో భార్య హతం
మద్యం మత్తులో హత్య
ఎచ్చెర్ల మండలం సంతసీతారాంపురంలో ఘటన
ఇరవై రెండేళ్లు కాపురం చేశారు. ఇద్దరు బిడ్డలను పెంచి పెద్ద చేశారు. కూతురి పెళ్లిని కూడా ఘనంగా చేశారు. చేతికి దొరికిన పనిచేస్తూ బతుకును చక్కగా పండించుకున్నారు. కానీ మద్యం మత్తు మగవాడి ఆలోచనను మార్చేసింది. కష్టసుఖాల్లో ఇన్నేళ్లుగా తోడుగా ఉండి నీడలా నడిచిన జీవన సహచరిపై కోపం పెంచుకునేలా చేసింది. అతడి మనసులో అనుమానపు విషాన్ని కలిపింది. దాని ఫలితం భార్య మరణం.. భర్తకు ఖైదు. కొడుక్కి జీవితకాలపు విషాదం. ఎచ్చెర్ల మండలం సంతసీతారాంపురంలో భర్త చేతిలో భార్య హతమైంది.
శ్రీకాకుళం: ఎచ్చెర్ల మండలంలోని సంత సీతారాంపురంలో గాలి నాగమ్మ(42) అనే మహిళను ఆమె భర్త అప్పలరెడ్డి సోమవారం రాత్రి దారుణంగా నరికి చంపేశాడు. ఈ హత్య స్థానికంగా సంచలనం రేకెత్తించింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
అప్పలరెడ్డి, నాగమ్మ దంపతులకు ఇద్దరు బిడ్డలు. రెండేళ్ల కిందటే అమ్మాయికి పెళ్లి చేశారు. కొడుకు త్రినాథరావుతో కలిసి విశాఖలో ఉండేవారు. త్రినాథరావు తాపీమేస్త్రీ కాగా.. తల్లిదండ్రులు భవన నిర్మాణ కార్మికులుగా పనిచేసేవారు. కుటుంబం మొత్తం కష్టాన్నే నమ్ముకుని బతికేది. గత నెలే వీరు స్వగ్రామం సంతసీతారాంపురం వచ్చేశారు. ఇక్కడ సొంతిల్లు ఉండడంతో కుమారుడికి పెళ్లి చేసి మళ్లీ విశాఖ వెళ్లిపోవాలని అనుకునేవారు. స్థానికంగా ఉండటంతో సరుగుడు, నీలగిరి చెట్లు కొట్టటం, తొక్క తీయటం వంటి పనులు చేస్తున్నారు.
సోమవారం కూడా రణస్థలంలో నీలగిరి తోట కొట్టేందుకు, తొక్క తీసే పనికి భార్యాభర్తలు వెళ్లారు. సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు. రాత్రి భోజనం చేశారు. కుమారుడు ఇంటి బయట మంచం వేసుకొని పడుకున్నారు. రాత్రి దంపతుల మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారి తీసింది. అప్పలరెడ్డికి మద్యం తాగే అలవాటు ఉంది. దీంతో మందు తాగి గొడవపడడం, భార్యను అనుమానించడం వంటి పనులు చేసేవాడు. రాత్రి కూడా ఇలాగే దంపతులిద్దరూ గొడవ పడ్డారు. అయితే రాత్రి పది గంటల సమయంలో ఒక్కసారిగా సరుగుడు, నీలగిరి చెట్లు నరికే కత్తితో ఆమెపై దాడికి తెగబడ్డాడు. మద్యం మత్తులో అతి కిరాతకంగా కత్తితో మెడ, తలపై దాడి చేశాడు. నాగమ్మ పెద్దగా కేకలు వేయడంతో కుమారుడు, చుట్టుపక్కల వారు కంగారు పడి ఇంటిలోకి వెళ్లబోతుండగా.. అప్పలరెడ్డి తలుపులు తీసి బయటకు వెళ్లిపోయాడు. లోపల చూస్తే నాగమ్మ విగతజీవిగా పడి ఉంది.
హత్య చేసిన వ్యక్తి అర్ధరాత్రి సమయంలో ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. జేఆర్‌పురం సీఐ ఎం.అవతారం, ఎస్‌ఐ వి.సందీప్‌కుమార్, క్లూస్ టీమ్ సంఘటన స్థలాన్ని సందర్శించింది. కుమారుడు త్రినాథరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాగమ్మ మృతదేహానికి శ్రీకాకుళం రిమ్స్‌లో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మంగళవారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ హత్యతో గ్రామమంతా విషాదం నెలకొంది. జేఆర్ పురం సీఐ అవతారం కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment