కుటుంబ కలహాలతో భార్యను హత్య చేసిన భర్త
పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు?
కంభం(ఒంగోలు): కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య పై అనుమానంతో ఉన్న భర్త దాడి చేసి ఆమెను హత్య చేసిన ఘటన ఆదివారం కంభంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మండలంలోని తురిమెళ్ల గ్రామానికి చెందిన అర్థవీటి నాగ అంజలి(40)కి 26 సంవత్సరాల క్రితం కంభం పట్టణంలోని సాదుమియా వీధికి చెందిన శివరంగయ్యతో వివాహమైంది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఉండగా ముగ్గురికి వివాహాలయ్యాయి. శివరంగయ్య లారీడ్రైవర్ గా పనిచేస్తూ చిన్నపాటి ఫైనాన్స్ లు నడుపుకుంటుండగా, భార్య పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్లో ఆయాగా పనిచేస్తోంది.
ఈ నేపథ్యంలో భార్య, భర్తల మద్య గొడవ జరగగా భార్యను చెక్కతో కొట్టడంతో ఆమె తలకు బలమైన గాయాలై మంచంపై పడి మృతి చెందింది. విషయం తెలుసుకున్న సీఐ కె.మల్లిఖార్జున, ఎస్సై నరసింహారావు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మార్కాపురం డీఎస్పీ నాగరాజు సంఘటన జరిగిన ఇంటి వద్దకు వచ్చి విచారించారు. మార్కాపురం క్లూస్ టీమ్ బృందం వేలిముద్రలు సేకరించారు. కంభం ప్రభుత్వ వైద్యశాలలో మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
అనుమానంతోనే హత్య చేశాడా..:
భార్య, భర్తల మధ్య అప్పుడప్పుడూ చిన్నపాటి గొడవలు జరుగుతుండేవని తెలిసింది. శనివారం రాత్రి 9 గంటల సమయంలో అల్లుడు తన కుమార్తెతో గొడవపడుతున్నాడని తన మనుమరాలు ఫోన్ చేసి చెప్పిందని, తెల్లవారే సరికే ఇలా రక్తపు గాయాలతో చనిపోయి పడి ఉందని మృతురాలి తల్లి పోలీసులకు తెలిపింది. తన కూతురిపై అనుమానంతోనే అల్లుడు కొట్టి చంపేశాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల అదుపులో నిందితుడు?
భార్య మృతి చెందిన విషయం తెలుసుకున్న శివరంగయ్య ఆదివారం తెల్లవారుజామునే పోలీస్‌స్టేషన్ కు వెళ్లి జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పి లొంగిపోయినట్లు సమాచారం. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment