
కాకినాడ: భార్య వివాహేతర సంబంధంతో జీవితంపై విరక్తి చెంది కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్న యువకుడి కేసులో ముగ్గురిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఎస్‌ఐ ఎం.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు మండలం ఖండవల్లి గ్రామానికి చెందిన చల్లా దుర్గారావు (29) ఈ నెల 25 వ తేదీన పెరవలి లాకుల వద్ద మోటార్ సైకిల్ వదలి కాల్వలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడి 26వ తేదీన ఇరగవరం మండలం రాపాక వద్ద శవమై తేలిన విషయం తెలిసిందే. అతడు రాసిన సూసైడ్ నోట్ ప్రకారం తన చావుకు కారణమైన ఖండవల్లి గ్రామానికి చెందిన మోత్రపు అమోఘ్, మోత్రపు శివ ప్రసాద్, మృతుడి భార్య చల్లా దివ్య కుమారి కారణమని పేర్కొన్నాడు.
ఫిర్యాదుదారు చల్లా వెంకట సుబ్బారావు ఇచ్చిన వివరాలు, గ్రామ పెద్దల సమాచారం, సాంకేతిక ఆధారాల మేరకు వారి ముగ్గురిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరచినట్టు తెలిపారు. తన భార్య అదే గ్రామానికి చెందిన మోత్రపు అమోఘ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయాన్ని దుర్గారావు, కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామ పెద్దలు అమోఘ్‌ను ఇంటికి వెళ్లి నిలదీశారు. దీంతో అతడితో పాటు తండ్రి శివప్రసాద్‌లు దుర్గారావును దుర్భాషలాడి అవమానించారు.
దీంతో అతడు మనస్తాపం చెంది తన చావుకు వారు ముగ్గురే కారణమని, తాను దుబాయి వెళ్లి సంపాదించినదంతా దివ్యకుమారి ప్రియుడికి దోచిపెట్టిందని, దీంతో తాను ఆర్థికంగా చితికిపోయానని, వివాహేతర సంబంధంతో తీవ్ర మనస్తాపం చెందానని సూసైడ్ నోట్ రాసి కాల్వలోకి దూకాడు. నిందితులను రిమాండ్ నిమిత్తం తణుకు కోర్టులో శుక్రవారం హాజరు పరిచినట్టు ఎస్సై తెలిపారు.