ట్రంప్ ఆంక్షలు స్వేచ్ఛామార్కెట్ ప్రతిఫలనమే
సందర్భం
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సాప్ట్‌వేర్ రంగంలో హెచ్.1 బి వీసాలు, అవుట్ సోర్సింగ్‌లపై ప్రకటించిన యుద్ధం తాలుకు ప్రభావాలు ఇప్పుడిప్పుడే కనపడుతున్నాయి. ఇన్ఫోసిస్ సంస్థ అమెరికాలోని తన కార్యాలయాలలో వచ్చే రెండేళ్ల కాలంలో 10,000 మంది స్థానికులనే నియమిస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఇక అలాగే కాగ్నిజెంట్ సంస్థ తన దేశీయ (హైదరాబాద్‌తో సహా) శాఖలలో వేల సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేస్తోందని వార్తలు. విప్రో వంటి సంస్థలు కూడా ఇదే బాటలో ఉన్నాయని తెలుస్తోంది.
ఇప్పటికే, ఐటీ రంగంలో కూడా పెరిగిపోయిన ఆటోమేషన్ వలన, సంబంధిత కోర్సులు చదివిన విద్యార్థులకు పలువురికి ఉద్యోగాలు వచ్చే అవకాశం లేకుండా పోయింది. మెుత్తంగా మన దేశ స్థూల ఆర్థిక వృద్ధి రేటులోని సుమారు 60%గా ఉన్న సేవారంగంలోని అతి పెద్ద విభాగమైన ఐటీ, బీపీఓ రంగం నేడు తీవ్ర ఆటుపోట్లలో ఉంది. దీని ప్రభావం మెుత్తం దేశీయ (ముఖ్యంగా బెంగుళూరు, హైదరాబాద్ వంటి నగరాలు) ఆర్ధిక వ్యవస్థపై పెద్ద స్థాయిలో ప్రతికూలంగా పడుతుంది. ఇప్పటికే దేశంలోని విద్యాధిక యువజనులలో నిరుద్యోగం భారీ ఎత్తున పెరిగిపోతోంది.
మరోవైపున అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఉవ్విళ్ళూరుతూన్న మన పాలకులు మాత్రం, ట్రంప్ విధానాల తాలుకు ఈ తీవ్ర ఆర్థిక పర్యవసానాల పట్ల కేవలం పొడి పొడి మాటలూ, బలహీనమైన విజ్ఞప్తులతో కాలం వెళ్ళబుచ్చుతున్నారు. అమెరికాను గనుక ఈ సమస్యమీద నిలదీస్తే, మన దేశంలోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గిపోతాయనే ఆందోళనలో మన ప్రభుత్వం ఉంది. అంతే కాకుండా, గత పలు సంవత్సరాలుగా (యూపీఏ పాలనలో కూడా) దేశీయ ప్రయోజనాలను బలిపెట్టయినా, అమెరికా ప్రయోజనాలను కాపాడటమే పనిగా పెట్టుకున్నాయి మన ప్రభుత్వాలు. 2008లో అమెరికాతో జరిగిన పౌర అణు ఒప్పందం తదితరాలు అన్నీ ప్రధానంగా అమెరికా కార్పోరేట్లకూ, ఆ దేశంలో పెద్ద వేతనాల ఉపాధి కల్పనకు మాత్రమే ఉపయోగపడేవి అన్నది ఇక్కడ గమనార్హం!
మరో ప్రక్కన మన మధ్య తరగతి, ఉన్నత వర్గాల వారు నిరంతరంగా జపించే ప్రెవేటీకరణ మంత్రం నేడు వారికే బెడిసి కొడుతున్నది. దేశం, దేశీయ ప్రజల ప్రయోజనాలకు చిల్లిగవ్వ విలువనివ్వని, కేవలం లాభాపేక్షే అంతిమ లక్ష్యంగా పనిచేసే ఐటీ రంగంలోని కార్పోరేట్లు నేడు అమెరికాలోని స్థానికులనే ఉద్యోగాలలోకి తీసుకునే పేరిట, అమెరికా అధినేతకు భజంత్రీలుగా మారుతున్నాయి. దేశీయ ఉపాధిపై కూడా కోతలు పెడుతున్నాయి. నిన్నటి దాకా కార్పోరేట్ సామాజిక బాధ్యతల పేరిట తాము సంపాదించిన బిలియన్ల కొద్ది డాలర్లలో స్వల్పభాగాన్ని విదిలించి, ఈ సంస్థల యజమానులు ముఖ్యంగా విద్యాధికుల దృష్టిలో ఉన్నత ‘ఆదర్శాలు’ గల, మెుత్తం సమాజంలోని అందరికీ గొప్ప నమూనాలుగా చలామణి అయిన వారే. కానీ నేడు అమెరికాలో తమ వ్యాపారాలను కాపాడుకునే యత్నంలో ఈ పెద్దలు తమ అసలుసిసలు (దేశ) భక్తి లాభాల పట్ల ఆపేక్షలోనే ఉందని మరోమారు రుజువు చేస్తున్నారు. మన విద్యాధిక వర్గాలూ, కులీనులూ ఇన్ని సంవత్సరాలుగా ఆరాధించి, ఆకాశానికెత్తేసిన స్వేచ్ఛామార్కెట్ వ్యవస్థ తాలూకూ అసలు సారం ఇదే !
కాగా, నేడు అమెరికా మన టెకీలను కాదనుకుంటే ఏమి.. వారు స్వదేశానికి తిరిగి వచ్చేస్తే వారి టాలెంట్ అంతా మన దేశ అభివృద్ధికే ఉపయోగపడుతుందనే అమాయకపు వాదనలూ ఉన్నాయి. కానీ నిజానికి ఇప్పటికీ తగిన మేర పారిశ్రామికీకరణే జరగని, ప్రధానంగా వ్యవసాయక దేశమైన మన దేశంలో ఉన్నత స్థాయి నిపుణతల ఐటీ సేవల అవసరం బహు స్వల్పం. కాబట్టి అత్యాధునిక దేశమైన అమెరికాలాగా, మన దేశానికి ఐటీ సేవలు అవసరం లేదు. అంతేకాకుండా, అభివృద్ధి క్రమంలో, మనం వ్యావసాయక దేశ స్థితినుంచి నేరుగా సేవారంగం వైపు అడుగులు వేశాం. ఈ రెండు రంగాలకు మధ్యలోని వంతెన వంటి సరుకు ఉత్పత్తి రంగం అభివృద్ధిని తీవ్రంగా నిర్లక్ష్యం చేశాం. దీంతో నేడు మన దేశీయ ఆర్థిక రంగంలో సమతుల్యత లోపించింది. ఈ సమస్యనే మనం మేకిన్ ఇండియా పేరిట పారిశ్రామిక అభివృద్ధి ద్వారా అధిగమించ చూస్తున్నాం. కానీ నేడు అంతర్జాతీయ మార్కెట్‌లో మాంద్య పరిస్థితులూ, దేశీయ డిమాండ్ రాహిత్యాల వలన మన పారిశ్రామికీకరణ కలలు నెరవేరే అవకాశం బహు స్వల్పం. పైగా ప్రపంచంలో నేటి పారిశ్రామికీకరణ యావత్తులోనూ యాంత్రీకరణ, రోబోట్‌లదే పెద్ద పాత్ర. కాబట్టి ఎంతో కొంత పారిశ్రామికీకరణ జరిగినా దాని వలన లభించే ఉపాధి అవకాశాలు స్వల్పమే.
అంటే నేడు ఐటీ; బీపీఓల వంటి సేవారంగ పరిశ్రమలపై అధికంగా ఆధారపడిన మన దేశ ఆర్ధిక రంగం, దాని నిర్మాణం తాలూకు లోపాలకు ప్రజలు మూల్యం చెల్లించే పరిస్థితి ఏర్పడుతోంది! దీని ఫలితం ప్రపంచంలోనే యువజనులు అధికంగా ఉన్న మన దేశీయ సామాజిక రంగంపై నిరుద్యోగం, అర్హతకు తగిన ఉపాధి లేకపోవటం, అభద్రతల రూపంలో తీవ్రమైన స్థాయిలో ప్రతిబింబించగలదు!! దీనికి పరిష్కారం నేటి వరకూ నిర్లక్ష్యం పాలైన, దేశంలోని అత్యధికులు ఆధారపడి ఉన్న వ్యవసాయరంగంపై ఇనుమడించిన శ్రద్ధను పెట్టగలగటమే!!.
వ్యాసకర్త ఆర్థిక రంగ విశ్లేషకులు :
డి. పాపారావు 98661 79615