
న్యూఢిల్లీ: జాతీయ ఆర్చరీ సమాఖ్య అధ్యక్షుడిగా తెలంగాణకు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి బీవీ పాపారావు ఎన్నికయ్యారు. శనివారం ఇక్కడ జరిగిన ఎలక్షన్స్‌లో త్రిపురకు చెందిన రూపక్ దేబ్‌రాయ్‌పై ఆయన 13 ఓట్ల తేడాతో విజయం సాధించారు. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా హైకోర్టు ద్వారా నియమితులైన పర్యవేక్షకుడి సమక్షంలో జరి గిన ఎన్నికల్లో పాపారావుకు 49 ఓట్లు రాగా, రూపక్‌కు 36 ఓట్లు పడ్డాయి. కొత్తగా ఎన్నికైన ప్యానల్‌లో మహాసింగ్ కార్యదర్శిగా, డీకే విద్యార్థి కోశాధికారిగా, సునీల్ శర్మ సీనియర్ ఉపాధ్యక్షుడుగా, రాజేంద్ర సింగ్ తోమర్, పూర్ణిమ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. తాజా ఎన్నికల ఫలితంతో ఆర్చరీ సమాఖ్యలో నాలుగు దశాబ్దాల పాటు సాగిన విజయ్ మల్హోత్రా ఆధిపత్యానికి తెర పడింది. 1973 నుంచి 2012 వరకు అధ్యక్షుడిగా వ్యవహరించిన మల్హోత్రా కొత్త స్పోర్ట్స్ కోడ్ ప్రకారం పదవినుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే తన మనిషి రూపక్‌ను ఆయన ఎన్నికల బరిలోకి తెచ్చి మళ్లీ అధికారం అందుకునే ప్రయత్నం చేశారు. ఎన్నికలు ముగిసిన అనంతరం లింబారామ్, చక్రవోలు స్వురో తదితర ఆర్చర్లు కేంద్ర క్రీడాశాఖ మంత్రికి లేఖ రాస్తూ ఎన్నికలు ప్రజాస్వామికంగా జరిగాయని, వీటిని గుర్తించాలని కోరారు.
అస్సాం కేడర్‌కు చెందిన పాపారావు గతంలో ఈశాన్య రాష్ట్రాల ఆర్చరీ సంఘం ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. 1985–90 మధ్యలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)లో ప్రత్యేకాధికారిగా పని చేసిన సమయంలో స్పెషల్ ఏరియా గేమ్స్ నిర్వహించి లింబారామ్ తదితర ఆటగాళ్లను వెలుగులోకి తీసుకొచ్చారు. రిటైర్మెంట్ అనంతరం అశ్విని నాచప్ప, పర్గత్ సింగ్ వంటి మాజీ ఆటగాళ్లతో కలిసి ‘క్లీన్ స్పోర్ట్స్ ఇండియా’ పేరుతో ఉద్యమాన్ని నడిపించారు. ‘సాయ్’ గవర్నింగ్ బాడీలో సభ్యుడిగా కూడా పని చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ సలహాదారుల్లో ఒకరిగా వ్యవహరించిన పాపారావు ఆర్చరీ ఎన్నికల కోసం తన పదవికి రాజీనామా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment