టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన సోదరుడు తేజస్వి జైస్వాల్‌పై ప్రశంసలు కురిపించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో తొలి అర్ధ శతకం బాదినందుకు అతడిని అభినందించాడు. కాగా ఉత్తరప్రదేశ్‌లో జన్మించిన యశస్వి జైస్వాల్‌కు ముగ్గురు తోబుట్టువులు.. ఇద్దరక్కలు, ఓ అన్న ఉన్నారు.
ఇటీవలే అరంగేట్రం
యశస్వి సోదరుడు తేజస్వి కూడా క్రికెటర్‌గా రాణించాలనే ఆశయంతో ఉన్నాడు. ఈ క్రమంలో దేశవాళీ క్రికెట్‌లో ఇటీవలే అరంగే ట్రం చేవాడు. త్రిపుర జట్టుకు ఆడుతూ.. తాజా రంజీ ట్రోఫీ సీజన్‌లో సూపర్ హాఫ్ సెంచరీ సాధించాడు. బరోడాతో మ్యాచ్‌లో 159 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 82 పరుగులు రాబట్టాడు.
అంతేకాదు.. ఈ మ్యాచ్‌లో ఒక వికెట్‌ను కూడా తేజస్వి జైస్వాల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో త్రిపుర- బరోడా మ్యాచ్‌కు సంబంధించిన స్కోరు కార్డును యశస్వి జైస్వాల్ ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశాడు. అన్న తేజస్వి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను హైలైట్ చేసి అతడిని అభినందించాడు.
డ్రాగా ముగిసిన మ్యాచ్
కాగా రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌లో భాగంగా అగర్తల వేదికగా త్రిపుర- బరోడా జట్ల మధ్య నవంబరు 6న మ్యాచ్ మొదలైంది. ఇందులో టాస్ గెలిచిన త్రిపుర తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బరోడా జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌట్ అయింది.
ఇందుకు బదులుగా ఆతిథ్య త్రిపుర తమ మొదటి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల నష్టానికి 482 పరుగుల వద్ద స్కోరును డిక్లేర్ చేసింది. అయితే, ఈ నాలుగు రోజుల మ్యాచ్‌లో శనివారమే చివరి రోజు. ఈ క్రమంలో వికెట్లు పడకుండా జాగ్రత్త పడ్డ బరోడా.. ఆట ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 241 పరుగుల వద్ద నిలిచింది. దీంతో ఫలితం తేలక మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఒకే ఒక్క విజయం
కాగా తేజస్వి జైస్వాల్ తమ్ముడు యశస్వి మాదిరే ఎడమచేతి వాటం బ్యాటర్. అయితే, ఆల్‌రౌండర్ అయిన తేజస్వి రైటార్మ్ మీడియం పేసర్ కావడం విశేషం. ఇక ఈ సీజన్‌లో త్రిపుర తొలుత ఒడిశాతో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. తర్వాతి మ్యాచ్‌లో మేఘాలయపై ఇన్నింగ్స్ 17 పరుగుల తేడాతో గెలిచింది.
టీమిండియా ఓపెనర్‌గా పాతుకుపోయిన యశస్వి
అనంతరం.. ముంబైతో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. తాజాగా బరోడా జట్టుతో మ్యాచ్‌లోనూ ఫలితం తేల్చలేకపోయింది. ఇదిలా ఉంటే.. యశస్వి జైస్వాల్ దేశవాళీ క్రికెట్లో ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్‌లోనూ సత్తా చాటిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. ప్రస్తుతం టీమిండియాలో టెస్టు, టీ20 ఓపెనర్‌గా పాతుకుపోయాడు.
ముఖ్యంగా టెస్టు అరంగేట్రం(2023)లోనే 23 ఏళ్ల యశస్వి భారీ శతకం(171) బాదాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ కెరీర్‌లో 14 టెస్టులు ఆడి 1407 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇందులో మూడు సెంచరీలు, రెండు ద్విశతకాలు ఉండటం విశేషం. ఇక భారత్ తరఫున 23 టీ20లు ఆడిన యశస్వి ఓ శతకం సాయంతో 723 రన్స్ చేశాడు. తదుపరి అతడు ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో బిజీకానున్నాడు.
చదవండి: స్టార్ ఓపెనర్ రీ ఎంట్రీ.. శ్రేయస్ అయ్యర్ కూడా! కానీ అతడు మిస్!
Comments
Please login to add a commentAdd a comment