అనిల్ జైన్‌పై అవిశ్వాస తీర్మానం ఉపసంహరణ
అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా)లో అనూహ్య పరిణామం... అధ్యక్షుడు అనిల్ జైన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఎనిమిది రాష్ట్రాలకు చెందిన టెన్నిస్ సంఘాలు శనివారం ఢిల్లీలో అసాధారణ సర్వసభ్య సమావేశం (ఈజీఎం) ఏర్పాటు చేశాయి. చిత్రంగా వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) నిర్వహించతలపెట్టిన రోజే ఈజీఎం ఏర్పాటు చేశారు. ఓవైపు ఎన్నికల కోసం ఏజీఎం నిర్వహించాల్సి ఉండగా... కోర్టు మార్గదర్శకాల మేరకు ఫలితాలను సీల్డ్ కవర్‌లో ఢిల్లీ హైకోర్టుకు సమర్పించాల్సి ఉంది.
కారణం ఇదే..
మరోవైపు.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందిన రాజ్యసభ ఎంపీ అనిల్ జైన్ తన కుటుంబంతో సహా చేసే విదేశీ పర్యటనల ఖర్చులను రాష్ట్ర సంఘాలపై మోపుతున్నారని అస్సాం, గుజరాత్, జమ్మూకశ్మీర్, హరియాణా, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, త్రిపుర సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే జైన్ మాట్లాడుతూ ఉన్నపళంగా ఈజీఎం నిర్వహణ నియమావళికి విరుద్ధమన్నారు.
ఇదంతా కుట్ర!
ఇది నిర్వహించాలంటే కనీసం మూడు వారాల ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. దీనిపై చట్టబద్ధంగా పోరాడుతానని, ‘ఐటా’ నియమావళిలోని 15వ క్లాజ్ ప్రకారం ఇలాంటి సమావేశాలు చట్ట విరుద్ధం. ఈ నెల 23న నోటీసు ఇచ్చి అంతలోనే 28న ఈజీఎం నిర్వహించాలనుకోవడం ఏంటని ప్రశ్నించారు. ‘ఇదంతా కుట్ర! నేను ఐటా, రాష్ట్రాల సంఘాల్లో స్పోర్ట్స్ కోడ్‌ను అమలు చేయాలని కోరినందుకే వారంతా కక్ష గట్టి నాపై బదులు తీర్చుకుంటున్నారు’ అని దుయ్యబట్టారు.
స్పోర్ట్స్ కోడ్ సమస్యే కాదు
మరోవైపు.. రాష్ట్ర సంఘాల ప్రతినిధులు స్పోర్ట్స్ కోడ్ సమస్యే కాదన్నారు. ‘కోడ్‌కు ఎవరూ వ్యతిరేకంగా లేరు. కేంద్ర క్రీడాశాఖ ప్రకారం అమలు చేయాల్సిందే. అనిల్ జైన్ చెబుతున్నట్లు ఇదే సమస్య అయితే గత నెల ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లో ఎందుకు మాట్లాడలేదు? ఏజీఎం, ఎన్నికల ప్రక్రియను ప్రకటించినపుడు ఎందుకు చర్చించలేదు’ అని రాష్ట్ర సంఘం అధికారి ఒకరు చెప్పారు. ఈసారి ‘ఐటా’ను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలనుకుంటున్నామని, క్రీడాకారులకు మద్దతుగా ఇవ్వాలనుకుంటున్నామని తద్వారా భారత టెన్నిస్ ముఖచిత్రాన్ని మార్చుతామని ఆయన తెలిపారు. అయితే, అనిల్ జైన్‌పై అవిశ్వాస తీర్మానం ఉపసంహరించుకున్నట్లు తాజా సమాచారం. ఏఐటీఏ వర్గాలు వార్తా సంస్థ పీటీఐతో ఈ విషయాన్ని పంచుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment