'ఉనకోటి': నేలకు దిగివచ్చిన కైలాసం..! | Tripuras Unakoti Mystical Sculptures Secrets | Sakshi
Sakshi News home page

'ఉనకోటి': నేలకు దిగివచ్చిన కైలాసం..!

Published Mon, Jan 13 2025 10:43 AM | Last Updated on Mon, Jan 13 2025 10:43 AM

Tripuras Unakoti Mystical Sculptures Secrets

నేలకు దిగివచ్చిన కైలాసం. ఉనకోటి అంటే కోటికి ఒకటి తక్కువ.  త్రిపురలోని అందమైన పర్యాటక ప్రదేశం. ప్రకృతి ఒడిలో కొలువైన భారీ శిల్పాలు. హెరిటేజ్‌ సైట్‌ హోదా సొంతమైన చరిత్ర.

ఈశాన్య రాష్ట్రాల టూర్‌లో ప్రకృతి పచ్చదనానిదే పైచేయి. జనారణ్యానికి దూరంగా వెళ్లే కొద్దీ అచ్చమైన స్వచ్ఛత ఒడిలోకి చేరుకుంటాం. చెట్లు చేమలు నిండిన పచ్చటి కొండలు బారులుతీరి ఉంటాయి. రఘునాథ హిల్స్‌లో పచ్చదనం లోపించిన కొండవాలు ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పరికించి చూస్తే అందమైన రూపాలు కనువిందు చేస్తాయి. విఘ్నేశ్వరుడు, ఈశ్వరుడు, దుర్గాదేవి, గంగ, ఇతర కైలాసగణమంతా కొలువుదీరినట్లు ఉంటుంది. ఇంతటి భారీ శిల్పాలను ఎవరు చెక్కి ఉంటారు? ఎప్పుడు జరిగిందీ వింత? 

ఉనకోటి శిల్పాల సముదాయాన్ని ఏడు నుంచి తొమ్మిది శతాబ్దాల మధ్యలో చెక్కి ఉండవచ్చనేది ఆర్కియాలజిస్టుల అంచనా. ‘కల్లు కుమ్‌హార్‌’ అనే గిరిజన శిల్పకారుడు ఈ శిల్పాలను చెక్కినట్లు స్థానికులు చెబుతారు. కైలాస పర్వతంలోని శివపార్వతులను దర్శించుకోవడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు కాబట్టి, ఆ రూపాలను, కైలాసాన్ని కళ్లకు కట్టడానికే ఈ శిల్పాలను చెక్కాడని చెబుతారు.

క్రీ.శ 16వ శతాబ్దంలో కాలాపహాడ్‌ అనే మొఘలు గవర్నర్‌ భువనేశ్వర్‌లోని శివుడిని, ఉనకోటికి సమీపంలో ఉన్న తుంగేశ్వర శివుడిని ధ్వంసం చేశాడని, ఈ ప్రదేశం మీద దాడిచేయడానికి అతడు చేసిన ప్రయత్నం కుదరక వదిలేసినట్లు చెబుతారు. ఇక్కడ ఏటా ఏప్రిల్‌ మాసంలో జరిగే ‘అశోకాష్టమి మేళా’లో ఈశాన్యరాష్ట్రాలన్నింటి నుంచి వేలాదిగా భక్తులు పాల్గొంటారు. 

జనపద కథనం...
శివుడితోపాటు కోటిమంది కైలాసగణం కాశీయాత్రకు బయలుదేరింది. ఈ ప్రదేశానికి వచ్చేసరికి చీకటి పడింది. ఆ రాత్రికి ఈ అడవిలోనే విశ్రమించారంతా. తెల్లవారక ముందే నిద్రలేచి ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టాలని, ఆలస్యమైతే రాళ్లలా మారిపోతారని, నిద్రకుపక్రమించే ముందు శివుడు అందరినీ హెచ్చరిస్తాడు. చెప్పిన సమయానికి శివుడు తప్ప మరెవరూ నిద్రలేవలేకపోవడంతో మిగిలిన వారంతా శిలలుగా మారిపోయారు. 

కోటి మంది బృందంలో శివుడు మినహా మిగిలిన వారంతా శిలలు కావడంతో ఈ ప్రదేశానికి ‘ఉనకోటి’ అనే పేరు వాడుకలోకి వచ్చిందని స్థానికులు ఆసక్తికరమైన కథనం చెబుతారు. ఆ కథనం ప్రకారమైతే ఈ శిల్పాల సముదాయంలో శివుడి శిల్పం ఉండకూడదు, కానీ శివుడి శిల్పం కూడా ఉంది. దేశంలో అత్యంత పెద్ద శివుడి శిల్పం ఇదే. వాస్తవాల అన్వేషణకు పోకుండా ఆ శిల్పాల నైపుణ్యాన్ని ఆస్వాదిస్తే ఈ టూర్‌ మధురానుభూతిగా మిగులుతుంది. 

పెద్ద శివుడు 
ఈ భారీ శివుడి పేరు ఉనకోటేశ్వర కాలభైరవుడు. విగ్రహం 30 అడుగుల ఎత్తు ఉంటుంది. తలమీద ఎంబ్రాయిడరీ చేసిన తలపాగా ధరించినట్లు చెక్కారు. ఆ తలపాగా ఎత్తు పది అడుగులుంది. తలకు రెండు వైపులా సింహవాహనం మీద దుర్గాదేవి, గంగామాత శిల్పాలుంటాయి. నంది విగ్రహం సగానికి నేలలో కూరుకుపోయి ఉంటుంది. 

గణేశుడు ప్రశాంతంగా మౌనముద్రలో ఉంటాడు. ఈ శిల్పాలు కొన్ని ఎకరాల విస్తీర్ణంలో పరుచుకుని ఉన్నాయి. ప్రధానమైన వాటిని చూడడంతోనే మనకు శక్తి తగ్గిపోతుంది. కొన్ని శిల్పాలను సమీప గ్రామాల వాళ్లు ఇళ్లకు పట్టుకుపోగా మిగిలిన వాటి కోసం ఇండియన్‌ ఆర్కియాలజీ సర్వే నోటిస్‌ బోర్డులుంటాయి. ఏఎస్‌ఐ అడవినంతా గాలించి, పరిశోధించింది. ఏఎస్‌ఐ ప్రమాణాల ప్రకారం ఈ ప్రదేశం హెరిటేజ్‌ సైట్‌ల జాబితాలో చేరింది. యునెస్కో గుర్తించి సర్టిఫికేట్‌ జారీ చేసే లోపు చూసివద్దాం.

ఉనకోటి ఎక్కడ ఉంది!
త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తల నగరానికి 178 కి.మీ.ల దూరంలో ‘కైలాస్‌హర’ పట్టణానికి దగ్గరగా ఉంది. 

ఎలా వెళ్లాలంటే... 
సమీప విమానాశ్రయం అగర్తలలో ఉంది. 
సమీప రైల్వేస్టేషన్‌ కుమార్‌ఘాట్‌లో ఉంది. 
ఇది ఉనకోటికి 20 కి.మీ.ల దూరంలో ఉంది.

ఎప్పుడు వెళ్లవచ్చు!
ఇది పర్వతశ్రేణుల ప్రదేశం కాబట్టి వర్షాకాలం మంచిది కాదు. అక్టోబర్‌ నుంచి మే నెల మధ్య
వాతావరణం అనువుగా ఉంటుంది.  
– వాకామంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి 

(చదవండి: భావోద్వేగాల 'కిజిక్‌ తివాచీ'..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement