దేవుని దేశం తిరిగొద్దాం..! చూడాల్సిన జాబితా చాలా పెద్దదే.. | Tourist Destinations Of Kerala More Best Places Visit There | Sakshi
Sakshi News home page

దేవుని దేశం తిరిగొద్దాం..! చూడాల్సిన జాబితా చాలా పెద్దదే..

Published Mon, Feb 3 2025 9:58 AM | Last Updated on Mon, Feb 3 2025 10:59 AM

Tourist Destinations Of Kerala More Best Places Visit There

గాడ్స్‌ ఓన్‌ కంట్రీ... చూడాల్సినవి ఇవి అని చెప్పుకోవడం కష్టం. జాబితా వేళ్ల మీద లెక్కపెట్టేటంత చిన్నదిగా ఉండదు. ఆర్ట్‌ అండ్‌ కల్చర్, ఆధ్యాత్మికం, ధార్మికం, వీకెండ్‌ పిక్‌నిక్‌ స్పాట్స్, బీచ్‌లు, బ్యాక్‌ వాటర్స్, పర్వతాలు, కొండవాలులో టీ తోటలు, సముద్రం మీద సూర్యాస్తమయాలు, జలపాతాలు, వన్యప్రాణులు, హాలిడే రిసార్టులు... ఇలా పరస్పరం
వైవిధ్యభరితమైన పర్యటనల నిలయం ఈ రాష్ట్రం. 

కేరళలో ఆధ్యాత్మికం కూడా ఆద్యంతం అలరిస్తుంది. త్రివేండ్రంలోని పద్మనాభ స్వామి ఆలయం మొదలు అంబళంపుర శ్రీకృష్ణుడు, చెట్టికుళాంగుర భగవతి, శబరిమల అయ్యప్ప, కొట్టరక్కర గణపతి, తిరునెల్లి ఆలయం, చర్చ్‌లు, మసీదులు ప్రతిదీ టూరిస్టులకు కనువిందు చేస్తాయి.

శబరిమలైకి మహిళలను అనుమతించడం కోసం తృప్తి దేశాయ్‌ చేసిన ఉద్యమంతో ఉత్తరాదివాసుల దృష్టి కూడా కేరళ మీద కేంద్రీకృతమైంది. ఇప్పుడు కేరళలో హిందీవాళ్లు కూడా కనిపిస్తున్నారు.

అరబిక్‌ కడలి
కేరళ టూర్‌కి కాలంతో పని లేదు. అరేబియా తీరం– పశ్చిమ కనుమల మధ్య విహారానికి ఎప్పుడైనా రెడీ కావచ్చు. ఎండకాలం చల్లగా అలరిస్తుంది. జూన్‌ నుంచి చిరు వానలు పలకరిస్తాయి. శీతాకాలం పచ్చదనం తన గాఢతను ప్రదర్శిస్తుంది. 

తలలు వాల్చి ఆహ్వానం పలికే కొబ్బరితోటలు, కోమలత్వాన్ని తాకి చూడమనే అరటి గుబుర్లు, ఎటూ వంగని పోకచెట్లు, ఏ చెట్టు దొరుకుతుందా అల్లుకుపోదామని వెతుక్కునే మిరియాల తీగలు, కాయల బరువుతో భారంగా వంగిపోతున్న కాఫీ చెట్లు, టూర్‌కి మినిమమ్‌ గ్యారంటీ ఇచ్చే అరేబియా సముద్రం మీద సూర్యాస్తమయాలు... ఇవన్నీ ప్రకృతి ప్రసాదితాలు.

ఆది శంకరుడు పుట్టిన నేల
కాలడి ఓ చిన్న పట్టణం. పెరియార్‌ నది ఒడ్డున ఎర్నాకుళం జిల్లాలో ఉంది. ఆది శంకరాచార్యుడు పుట్టిన ప్రదేశం ఇది. ఇక్కడ ఆయన నివసించిన ఇల్లు, ఆయన తల్లి సమాధి ఉన్నాయి. ఇక్కడి స్నానఘట్టంలో ముత్తల కడవు (మొసలి మడుగు) ను కూడా చూడవచ్చు. ఆది శంకరుడు సన్యసించాలనుకున్నప్పుడు తల్లి అంగీకరించలేదు. ఆమె అంగీకారం కోసం ఆది శంకరుడు నాటకం ఆడిన ఘట్టం ఇది. 

స్నానఘట్టంలో దిగి మొసలి పట్టుకున్నదని, సన్యసించడానికి ఒప్పుకుంటేనే వదులుతుందని తల్లిని మాయ చేసి అంగీకారం పొందిన కథనాన్ని చెబుతారు పూజారులు. పెరియార్‌ నది కొచ్చి ఎయిర్‌పోర్టులో దిగడానికి ముందే పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తుంది. పచ్చటి చేనులో నీలిరంగు వస్త్రాన్ని మలుపు తిప్పుతూ పరిచినట్లు 
ఉంటుంది దృశ్యం.

కళల నిలయం
కేరళ ప్రకృతిసోయగంతోపాటు కళలతోనూ ఆకట్టుకుంటుంది. కలరిపయట్టు వంటి యుద్ధ క్రీడ, మోహినీ అట్టం, కథాకళి వంటి నాట్యరీతులు, రాజారవివర్మ చిత్రలేఖన సమ్మేళనం ఇక్కడే పుట్టాయి. భరత్‌పుఱ నది తీరాన త్రిశూర్‌ జిల్లాలోని చెరుత్తురుతి పట్టణంలో కేరళ కళామండలం ఉంది. కళల సాధన కోసం ఏర్పాటు చేసిన ఈ కళామండలంలో నిత్యం సంప్రదాయ నాట్యరీతుల సాధన జరుగుతూ ఉంటుంది. 

మరో హాలులో కేరళ సంప్రదాయ నాట్య రీతుల నాట్య ముద్రలు, భంగిమలు, ఆహార్యంతో ఉన్న బొమ్మల మ్యూజియం ఒక ఎడ్యుకేషన్‌. ఈ కళల కోసమే కాదు, కేరళ కళామండలం భవన నిర్మాణశైలిని చూడడం కోసం ఆర్కిటెక్చర్‌ విద్యార్థులు వెళ్లాల్సిన ప్రదేశం.

వాస్కోడిగామా ఎంట్రీ!
కేరళ రాష్ట్రంలో సగం తీర్రప్రాంత జిల్లాలైతే మిగిలిన సగం కొండ్రప్రాంత జిల్లాలు. రైలు ప్రయాణంలో తమిళనాడు నుంచి కేరళకు వెళ్లేటప్పుడు పాలక్కాడ్‌ నుంచే మార్పు కనిపిస్తుంది. మనదేశంలో వలస పాలనలో మగ్గి΄ోవడానికి దారులు పడింది కూడా ఈ రాష్ట్రం నుంచే. పోర్చుగీసు నావికుడు వాస్కోడిగామా మనదేశంలోకి ప్రవేశించింది కోళికోద్‌ పట్టణానికి సమీపంలోని కప్పడ్‌ అనే చిన్న తీరగ్రామంలో. 

కప్పడ్‌ బీచ్‌లో వాస్కోడిగామా జ్ఞాపకచిహ్నాలున్నాయి. చర్చ్‌లు యూరోపియన్‌ నిర్మాణశైలిలో అందంగా ఉంటాయి. నది తీరాన నిర్మించడంలో గొప్ప అభిరుచి వ్యక్తమవుతుంటుంది. ఎర్నాకుళంలో సెయింట్‌ మేరీస్‌ బాసిలికా చర్చ్, మలయత్తూర్‌ చర్చ్, శాంతాక్రజ్‌ కేథడ్రల్, జార్జ్‌ ఫ్రాన్సిస్‌ చర్చ్, సముద్రతీరాన నిర్మించిన వల్లర΄ాదమ్‌ చర్చ్‌లు ప్రశాంత వాతావరణంలో మౌనముద్ర దాల్చి ఉంటాయి. ముఖ్యమైన మసీదులు ముప్పైకి పైగా ఉంటాయి.

ఆరోగ్యదేవుడు ధన్వంతరి
ఆయుర్వేదంలో వైద్యానికి మూల పురుషుడు ధన్వంతరి. ధన్వంతరికి ‘ముక్కిడి’ పేరుతో 35 ఔషధాల మిశ్రమాన్ని నివేదిస్తారు. త్రిశూర్‌ జిల్లా, నెల్లువాయ్‌ గ్రామంలో ఉన్న ఆలయం పురాతనమైనది. దేవతలు, రాక్షసులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు వచ్చిన అమృతభాండాన్ని ధన్వంతరి పట్టుకుని వస్తాడు. 

ఒక చేతిలో శంకు, ఒక చేతిలో చక్రం, ఒకచేతిలో అమృతభాండం, మరో చేతిలో జలూకం(జలగ, ఆయుర్వేద వైద్యంలో జలగను ఉపయోగిస్తారు)తో ఉద్భవించాడు ధన్వంతరి. ఆ మూర్తినే ఇక్కడ ప్రతిష్టించారని చెబుతారు. మున్నువరువట్టం, గురువాయూర్‌లలో కూడా ధన్వంతరి ఆలయం ఉంది. శబరిమలకు వెళ్లిన వాళ్లు ఈ ఆలయాన్ని కూడా దర్శించుకుంటారు.

టీ తోటల మునార్‌
మున్నార్‌ అంటే మూడు నదుల కలయిక. ముథిరాప్పుజ, నల్లతన్ని, కుండలి నదుల మధ్య ఉన్న హిల్‌స్టేషన్‌ ఇది. టీ తోటలు విస్తారంగా ఉంటాయి. ఈ తోటల మధ్య జలపాతాలు తెల్లగా పాలధారలను తలపిస్తుంటాయి. వర్షాకాలంలో దట్టంగా అలముమున్న నల్లటి మేఘాలను చీల్చుకుంటూ భూమ్మీద పాలను కుమ్మరిస్తున్నట్లు ఉంటుంది అట్టుకడ జలపాతం. 

ఈ టూర్‌లో ఎరవి కులమ్‌ నేషనల్‌ పార్క్‌ను, నీలగిరులు అనే పేరు రావడానికి కారణమైన నీలకురింజి మొక్కలను చూడాలి. మున్నార్, ఊటీ, కొడైకెనాల్‌ వంటి ప్రదేశాలను ఒకసారి చూసిన వాళ్లు కూడా కురింజి పూలు పూసినప్పుడు మళ్లీ చూడాలని ఆశపడతారు. బొటానికల్‌గా ఇవి 50 రకాల జాతులున్నాయి. కాని మనకు చూడడానికి అన్నీ నీలంగానే ఉంటాయి, షేడ్‌లు మాత్రం ఏ చిత్రకారుడూ మిక్స్‌ చేయలేనంత లలితంగా ఉంటాయి.

 నీలకురింజి పూలు పన్నెండేళ్లకోసారి పూస్తాయి. 2018లో పూశాయి, మళ్లీ పూసేది 2030లోనే. కోవిడ్‌ సమయంలో కూర్గ్‌ కొండల్లో కొన్ని చోట్ల విరిశాయి. కానీ సీజన్‌లో పూసినట్లు కొండ మొత్తం విస్తరించలేదు. ఇక్కడ జంతు సంచారం కూడా ఎక్కువ. నీలగిరి థార్‌ ఇక్కడ మాత్రమే కనిపించే జింక జాతి.

కోటలు... తోటలు!
కేరళ గ్రామాల్లో మన దగ్గర ఉన్నట్లు ఇళ్లన్నీ ఒక చోట, పొలాలు ఒకచోట ఉండవు. రెండు – మూడు ఎకరాల స్థలంలో కొబ్బరి చెట్లు, మధ్యలో ఇల్లు ఉంటుంది. తోట పక్కన మరొక తోట... ఆ తోటలో ఒక ఇల్లు... చాలా ఇళ్లకు పై కప్పు ఎర్ర పెంకులే ఉన్నాయి. రెండస్తుల ఇల్లు కూడా పై కప్పు వాలుగా, ఎర్ర పెంకులతో ఉంటుంది. రాజుల ప్యాలెస్‌లు కూడా భారీ నిర్మాణాలేమీ కాదు. రాజస్థాన్‌ కోటలు, ప్యాలెస్‌లను చూసిన కళ్లతో ఇక్కడి ప్యాలెస్‌లను చూస్తే కళ్లు విప్పార్చలేం. 

కానీ ప్రకృతి సహజమైన, శాంతియుతమైన జీవనశైలికి నిదర్శనంగా కనిపిస్తాయి. పాలక్కాడ్, తలస్సెరి కోటలు పర్యాటకులను అలరిస్తుంటాయి. చిన్న చిన్న ప్యాలెస్‌లను రిసార్టులుగా మార్చేశారు. భరత్‌పుర నది ఒడ్డున ఉన్న ప్యాలెస్‌ను ‘ది రివర్‌ రిట్రీట్‌’ పేరుతో హెరిటేజ్‌ ఆయుర్వేదిక్‌ రిసార్టుగా మార్చారు. అందులో భోజనం చేయడం జిహ్వకు వైద్యం.

మీన్‌ ముట్టి జలపాతం
వయనాడు... కేరళ రాష్ట్ర్రంలో అత్యున్నత స్థాయి ప్రకృతి సౌందర్యాన్ని ఇముడ్చుకున్న ప్రదేశం. ఆ రాష్ట్రానికి శిఖరాగ్రం కూడ ఇదే. మీన్‌ముట్టి వాటర్‌ ఫాల్స్‌కి రెండు కిలోమీటర్ల దూరం దట్టమైన అడవిలో ట్రెకింగ్‌ చేయాలి. ఈ కొండ మీద మీన్‌ముట్టి వాటర్‌ఫాల్స్‌ దగ్గర నుంచి చూస్తే ఒక వైపు తమిళనాడు నీలగిరులు, మరోవైపు కర్నాటకకు చెందిన కూర్గ్‌ కొండలు దోబూచులాడుతుంటాయి. 

వరదలు ముంచెత్తినప్పటికీ పర్యాటకం తిరిగి మామూలు స్థితికి చేరుకుంటోంది. ట్రీ హౌస్‌లో బస చేయాలనే సరదా తీరాలంటే ముందుగానే ΄్లాన్‌ చేసుకోవాలి. ఇక్కడ పర్యటిస్తే కేరళ వాళ్లు తమ రాష్ట్రాన్ని ‘గాడ్స్‌ ఓన్‌ కంట్రీ’ అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదనిపిస్తుంది.

గిన్నిస్‌ బుక్‌లో జటాయుపురా
జటాయు నేచర్‌ పార్క్‌... కొల్లం జిల్లా, చాదయమంగళం పట్టణం, జటాయుపురాలో ఉంది. రామాయణంలో సీతాపహరణం ఘట్టంలో రావణాసురుడితో జటాయువు పోరాడిన ప్రదేశం ఇదేనని చెబుతారు. నేచర్‌ పార్కులో 65 ఎకరాల విస్తీర్ణంలో డిజిటల్‌ మ్యూజియమ్‌ ఉంది. లైట్‌ అండ్‌ సౌండ్‌ షోలో రామాయణంలోని జటాయువు ఘట్టాన్ని ప్రదర్శిస్తారు. 

ప్రపంచంలో ‘లార్జెస్ట్‌ ఫంక్షనల్‌ స్టాచ్యూ ఆఫ్‌ ఎ బర్డ్‌’ కేటగిరీలో ఈ పార్కు గిన్నిస్‌ రికార్డులో నమోదైంది. ఈ కొండ మీదకు ట్రెకింగ్, రాక్‌ క్లైంబింగ్, బైక్‌ రైడింగ్‌తోపాటు ఆర్చరీ వంటి యాక్టివిటీస్‌ ఉన్నాయి. పిల్లలు, యువత, సీనియర్‌ సిటిజెన్‌ అందరికీ ఈ టూర్‌ అందమైన జ్ఞాపకంగా మిగులుతుంది. వెయ్యి అడుగుల ఎత్తులో జటాయువు పక్షిని నిర్మించడం, పక్షి ఆకారం లోపల మ్యూజియాన్ని ఏర్పాటు చేయడం ప్రపంచంలో ఎనిమిదో వింత అని చెప్పవచ్చు.

త్రివేండ్రం పద్మనాభుడు
అనంత పద్మనాభ స్వామి ఆలయం అప్పుడప్పుడూ వార్తల్లో కనిపిస్తుంటుంది. తలుపులు తెరుచుకోని ఆరోగది మీదనే అందరి దృష్టి. అంతకంటే గొప్ప ఆసక్తి ఇక్కడి పద్మనాభుడి రూపం. ఈ ఊరికి తిరువనంతపురం అనే పేరు రావడానికి కారణం ఈ ఆలయమే. కేరళ రాజధాని నగరం ఇది. బంగారు గోపురం ఉన్న ఈ ఆలయం టావెన్‌కోర్‌ రాజవంశం సంపన్నతకు ప్రతీక.

అలెప్పీ హౌస్‌బోట్‌
హౌస్‌బోట్‌లో ప్రయాణం చేయకపోతే కేరళ టూర్‌ వృథా అనే చెప్పాలి. ఇప్పుడు హౌస్‌బోట్‌లు మరింత పెద్దవిగా క్రూయిజ్‌లుగా మారాయి. టూర్‌ ప్యాకేజ్‌లో డే క్రూయిజ్‌ ప్యాకేజ్‌ కూడా ఉండేటట్లు చూసుకోవాలి. ఈ ప్రయాణంలో కేరళ సంప్రదాయ భోజనంలో రకరకాలను ఆస్వాదించవచ్చు. 

భోజనాన్ని అరిటాకులో వడ్డించడం మాత్రమే కాదు అరటికాయ చిప్స్, చేపను అరిటాకులో చుట్టి వేయించిన ఫిష్‌ఫ్రై ఇక్కడ ప్రత్యేకం. చికెన్‌ కర్రీలో కొబ్బరి ముక్కలు కూడా చాలా రుచిగా ఉంటాయి. కొబ్బరి నూనె వంటల మీద అపోహ ఉంటుంది. కానీ ఈ వంటలు చాలా రుచిగా ఉంటాయి.

షాపింగ్‌
జరీ అంచు హాఫ్‌వైట్‌ చీర లేదా లంగా–ఓణీ తెచ్చుకోవడం మరువద్దు. ఉడెన్‌ కార్వింగ్‌ బాక్సులు, హోమ్‌ డెకరేషన్‌ ఐటమ్స్‌ అందంగా ఉంటాయి. కొబ్బరి, అరటి నారతో చేసిన టేబుల్‌ మ్యాట్స్, కోషెలు, హ్యాండ్‌బ్యాగ్‌లు, వాల్‌ హ్యాంగింగ్స్‌ కొనుక్కోవచ్చు. 

ఇవి తినాలి
కోకోనట్‌ హల్వా, అరటికాయ చిప్స్, అరటికాయ బజ్జీ ప్రసిద్ధి. కొబ్బరి బోండాం తప్పకుండా తాగాలి. 

వేడుకలివి
ఫిబ్రవరి 14 నిషగంధి డాన్స్‌ ఫెస్టివల్‌ జరుగుతుంది. ఫిబ్రవరి 19 నుంచి 25 వరకు పరియాణమ్‌ పేట్‌ పూరమ్, పాలక్కాడ్, భగవతి టెంపుల్, త్రిశూర్‌ ఆలయంలో ఉత్రాళిక్కవు పూరమ్‌ వేడుకలు జరుగుతాయి. 

ప్యాకేజ్‌లిలా...
సౌత్‌ కేరళ 4 రాత్రులు 5 రోజులకు 55 వేలు. 5 రాత్రులు 6 రోజులకు దాదాపుగా అరవై వేలు. ఎంటైర్‌ కేరళకు ఆఫర్‌ నడుస్తోంది. పది రాత్రులు 11 రోజులకు 55 వేలు. ఈ ఆఫర్‌ మార్చి 30 వరకు మాత్రమే వర్తిస్తుంది. 

ఇందులో కొదుండుళూర్‌లోని చేరమాన్‌ జుమా మసీద్, చీయప్పార జలపాతం, వాలర జలపాతం, ఇడుక్కి దేవికులమ్‌ హిల్స్, కొచ్చిలోని బోల్గట్టీ ఐలాండ్, హౌస్‌బోట్, విలేజ్‌ లైఫ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ మొదలైనవి కవర్‌ అవుతాయి. సెంట్రల్‌ కేరళ ప్యాకేజ్‌ కి20 వేలు. ఇందులో అళప్పుఱ, పెరియార్‌ టైగర్‌ రిజర్వ్, తెక్కడి, మునార్, ఫోర్ట్‌ కొచ్చి మొదలైనవి ఉంటాయి. 

--వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

(చదవండి: అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణం చూతము రారండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement