ఇది వేళ్లాడే వంతెన. ఉంగాట్ నది మీద ఉంది. అభివృద్ధి చెందిన నగరాలన్నీ నగరం మధ్యలో ఉన్న చెరువు మీద ఇనుప చువ్వలతో వేళ్లాడే వంతెనలను కడుతున్నాయి. కానీ ఉంగాట్ నది మీద కనిపించేవి వేళ్లతో కట్టిన వంతెనలు. అది కూడా చెట్టు నుంచి వేరు చేసిన వేళ్లు కాదు, సజీవంగా ఉన్న వేళ్ల వంతెనలు. ఈ నైపుణ్యం ప్రపంచంలో మనదేశానికే సొంతం, అది కూడా మేఘాలయ వంటి మరికొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరించిన నైపుణ్యం. ఈ నది డాకీ పట్టణం నుంచి ప్రవహిస్తోంది. వంతెన డాకీ పట్టణంలో ఉంది. అందుకే డాకీ రూట్ బ్రిడ్జిగా వ్యవహారంలోకి వచ్చింది. ఇలాంటి వంతెనలు డాకీ పట్టణంలో మాత్రమే కాదు. మేఘాలయలో చాలా చోట్ల విస్తారంగా ఉంటాయి. కానీ మేఘాలయ పర్యటనకు వెళ్లిన వాళ్లు తప్పకుండా డాకీ పట్టణంలోని రూట్ బ్రిడ్జి మీద నడిచి మురిసిపోతారు. ఎందుకంటే ఇది దేశానికి చివరి వంతెన. డాకీ దాటితే బంగ్లాదేశ్‌లో అడుగుపెడతాం.
మనిషికి జీవన నైపుణ్యాలు అవసరాన్ని బట్టి వృద్ధి చెందుతాయనడానికి నిదర్శనం ఈ వంతెనలు. ఇనుము, సిమెంటు వంటి భవన నిర్మాణ సామగ్రిని తరలించడం సాధ్యం కాని చోట్ల ప్రకృతి ఇచ్చిన మెటీరియల్‌తో జనం తమకు అవసరమైన విధంగా మలుచుకోవడం అంటే ఇదే. మేఘాలయలో నివసించే ఖాసీ, జైంతియా తెగల వాళ్లు నదికి రెండు వైపులా ఉన్న రబ్బరు చెట్ల వేళ్లను ఒకదానితో మరొక దానిని జడలాగ అల్లుతూ ఒక ఒడ్డు నుంచి మరొక ఒడ్డుతో కలుపుతారు.
ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు చేరడానికి వంతెన రెడీ. సిమెంటు వంతెనలు ఎప్పుడు కూలిపోతాయో తెలియదు కానీ ఈ వేళ్ల వంతెనలను ఒకసారి అల్లితే వందేళ్లకు కూడా చెరగవు, పైగా మరింత దృఢమవుతూ ఉంటాయి. మరీ లేత వేళ్లను కాకుండా ఒక మోస్తరు ముదురు వేళ్లతో వంతెన అల్లుతారు. కాలం గడిచే కొద్దీ చెట్టు పెద్దదవుతుంది, వేళ్లు శక్తిపుంజుకుంటూ ఉంటాయి. మరో విచిత్రం ఏమిటంటే... ఈ వేళ్లు నది నీటిని అందుకోవడానికి మాన్‌గ్రోవ్‌లాగ పిల్ల వేళ్లను పెంచుకుంటాయి.
కొత్త వంతెనలు మనం నడిచేటప్పుడు బరువుకు తగినట్లు ఊగుతుంటాయి. ముదురు వంతెనలు కదలవు. ఈ వంతెనల మీద నుంచి రాకపోకలు సాగించేది మనుషుల మాత్రమే కాదు, జింకలు, చిరుతపులులతోపాటు ఇతర జంతువులు కూడా ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు వంతెనల మీదనే వెళ్తాయి. ఇప్పటి వరకు వంతెన గొప్పదనాన్నే మాట్లాడుకున్నాం. కానీ ఉంగాట్ నదికి కూడా ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన విశేషణం ఉంది.
మనదేశంలో అత్యంత పరిశుభ్రమైన నదుల్లో ఉంగాట్ నది ఒకటి. ఈ నదిలో పడవలో విహరిస్తుంటే నీటి కింద నేల అద్దంలో కనిపించినంత స్వచ్ఛంగా ఉంటుంది. వేళ్ల వంతెన మీద నడవడంతోపాటు పడవ ఎక్కి ఈ నదిలో విహరించడం కూడా గొప్ప అనుభూతి.
రాముడు కూడా కట్టాడు
నది మీద చెట్ల వేళ్లతో వంతెన నిర్మించే నైపుణ్యం ఇతిహాస కాలం నాటిదని చెబుతారు. వనవాస కాలంలో సీతారామ లక్ష్మణులు అడవుల్లో నివసించినట్లు చెప్పుకుంటాం. గంగానది తీరాన నివసించిన రోజుల్లో ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు చేరడానికి రాముడు, లక్ష్మణుడు నదిలో ఈదుతూ వెళ్లేవారని, ప్రతిరోజూ నది దాటడం సీతమ్మకు కష్టం కావడంతో ఆమె కోసం వంతెన నిర్మించారని చెబుతారు.
గంగానది మీద రిషికేశ్ దగ్గర రామ్‌ఝాలా, లక్ష్మణ్ ఝాలా ఉన్నాయి. బ్రిటిష్ పాలన కాలంలో ఈ వంతెనలను ఇనుముతో పునర్నిర్మించారు. రిషికేశ్‌లో గంగానది మీద ఇప్పుడు మనకు కనిపించేవి కొత్త నిర్మాణాలు.
వాకా మంజూలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
(చదవండి: తాత మొండి పట్టుదల ఎంత పనిచేసింది..! ఏకంగా ఇంటి చుట్టూ..)
Comments
Please login to add a commentAdd a comment