
శివరాత్రివేళ ఒక్కసారిగా పుణ్యనదులు, పుణ్యక్షేత్రాలు జనవాహినితో సందడిగా ఉంటాయి. ఒక సమైక్యతకీ, సమన్వయానికీ సంకేతమిది. భాషలు, ఆచార వ్యవహారాలు, కట్టూ బొట్టూ ఇలాంటి తేడాలు ఎన్ని ఉన్నా భారతీయులందరూ ఒకే శివభావంతో ఒక్కటిగా మసలే సుదినమిది. దేవదానవులు క్షీరసాగర మథనం చేసినప్పుడు ముందుగా పుట్టిన హాలాహలాన్ని ఉండలా చేసుకుని కంఠంలో ఉంచి కాపాడిన వాడు శివుడు. ఆ తరువాతపాలకడలిని మధించగా వచ్చిన అద్భుతమైన వస్తువులన్నింటినీ దేవదానవులే పంచుకున్నారు. అవేవీ శివుడు స్వీకరించలేదు. ఆశించలేదు. ఈ లీలద్వారా జగత్పాలకుడైన శివుడు,పాలకులు ఎలా ఉండాలో బోధించాడు.
ఒకపాలకుడిగా ప్రజల ధనాలనీ, ప్రయోజనాలనీ తాను అనుభవించకుండా, సుఖాలను మాత్రం అందకి పంచి, కటువైన విషాన్ని తాను దిగమింగిన అమృతమూర్తి రుద్రుడు. భూమికోసం... తన పితరుల మోక్షం కోసం భగీరథుని ప్రార్థన మేరకు గంగను తన జటాజూటాల నుంచి దించిన వేల్పు శివుడు. లోకక్షేమంకోసం ఎంతటి భారాన్నైనా స్వీకరించి నిర్వహించే సమర్థత, సౌజన్యం శివుని సహజ స్వభావం. లోకకంటకులైన త్రిపురాసురాది దుష్టుల్ని నిగ్రహించి, తన పరాక్రమాన్ని, ప్రసన్నతనీ ప్రదర్శించిన పరమాత్ముడు. ‘శివం’ అంటే ‘మేలు, మంచి’. లోకాలకి మేలు చేసే స్వభావం కలవాడు కనుకనే శివుడు. ప్రాణికోటికి శుభాన్ని కోరేవాడు, శ్రేయస్సును కలిగించే వాడు శివుడు.
రుద్రుడు – దుఃఖాన్నిపోగొట్టేవాడు;
శంకరుడు – సుఖాన్నీ, శాంతినీ కలిగించేవాడు;
శంభుడు – శాంతికిమూలమైన వాడు;
సదాశివుడు – ఎల్లవేళలా శుభస్వరూపుడు.
⇒ ఇలా శివుని నామాలన్నీ ఆయనలోని ‘మేలు’ గుణాల్ని చెబుతున్నాయి. ఈ స్వభావాలను మనలో పెంచుకునేలా చేసేదే శివభావన, శివారాధన.
⇒ ‘శివుని పూజించడం – అంటే తపస్సునీ, జ్ఞానాన్నీ, త్యాగాన్నీ ఆరాధించడమే. భారతీయుల ఆదర్శాలివి. అందుకే నిరంతరం త΄ోరూపంలో ఉన్న శివుని ఆరాధిస్తున్నారు’’ అని స్వామి వివేకానందుల వాగ్భావన. ఈ సుదినాన శివ తత్త్వాన్ని అర్థం చేసుకుందాం.. చేతనైన మేరకు శివరాత్రిని జరుపుకుందాం.
మన చిత్తాలను శుద్ధి చేసుకొని, పవిత్ర భావనతో అంతర్ముఖులమై మనలోని పరమాత్మని ధ్యానించడమే ముఖ్య శివారాధన. అంతర్ముఖత్వానికి సంకేతమే రాత్రి. సత్యాన్ని మరువకుండా జాగరూకతతో మెలగడమే జాగరణ. ఇంద్రియ చపలత్వాన్ని నిగ్రహించడమే ఉపవాసం. సద్భావనలతో పరమాత్మను ఆరాధించడమే అభిషేకం.
– డి.వి.ఆర్.
Comments
Please login to add a commentAdd a comment