చట్టబద్ధమైన పన్నులు కట్టాల్సిందే..
నోటీసులను వేధింపులుగా భావించనక్కర్లేదు
ఎగవేతదారులకు భారత్
స్వర్గధామం కాదు
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ: చట్టబద్ధమైన పన్నులు కట్టాలంటూ నోటీసులివ్వడాన్ని పన్నులపరమైన వేధింపులుగా పరిగణించనక్కర్లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. పన్ను బకాయిలను తప్పనిసరిగా చెల్లించాల్సిందేనన్నారు. అలాగే, భారత్‌ను పన్ను రహిత స్వర్గధామంగా భావించరాదని ఆయన చెప్పారు. దాదాపు 100 విదేశీ సంస్థాగత ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలకు 5-6 బిలియన్ డాలర్ల మేర పన్నుల నోటీసులు ఇవ్వడాన్ని సమర్థించిన జైట్లీ .. భారత్‌లో చట్టబద్ధమైన పన్నులను చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పారు.
పరిశ్రమల సమాఖ్య సీఐఐ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. చట్టబద్ధమైన ప్రతీ పన్ను డిమాండ్‌నూ ట్యాక్స్ టైజం అంటూ వ్యాఖ్యానిస్తే వెనక్కి తగ్గిపోయేంత బలహీన పరిస్థితిలో భారత్ లేదని జైట్లీ స్పష్టం చేశారు. గడిచిన కొన్నాళ్లుగా భారత మార్కెట్లలో పన్నులు చెల్లించకుండా పొందిన లాభాలపై తాజాగా 20 శాతం కనీస ప్రత్యామ్నాయ పన్నులు (మ్యాట్) కట్టాలంటూ ఆదాయ పన్ను శాఖ దాదాపు 100 ఎఫ్‌ఐఐలకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
పన్నుల నోటీసులపై ఏవైనా అభ్యంతరాలు ఉన్న పక్షంలో కావాలంటే న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని, అయితే చట్టబద్ధంగా చెల్లించాల్సిన వాటిని మాత్రం చెల్లించి తీరాల్సి ఉంటుందని జైట్లీ చెప్పారు. పెట్టుబడులకు కేంద్రంగా ఎదగాలనుకునే ఏ వర్ధమాన దేశం కూడా ట్యాక్స్ టైజం వంటి వాటికి పాల్పడే దుస్సాహసం చేయబోదన్నారు. మరోవైపు ఎఫ్‌ఐఐలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లపై (ఎఫ్‌పీఐ) మ్యాట్ విధింపునకు ముందు అన్ని అంశాలను క్షుణ్నంగా పరిశీలించినట్లు రెవెన్యూ శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ చెప్పారు. అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ (ఏఏఆర్)కు కూడా మ్యాట్ వర్తిస్తుందని చెప్పిన మీదటే ఆదాయ పన్ను అసెసింగ్ అధికారులు డిమాండ్ నోటీసులు పంపినట్లు ఆయన తెలిపారు.
పన్నుల చట్టాలు సరళతరం..
పన్నుల రేట్లను క్రమబద్ధీకరించే దిశగా ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధానాలను సరళతరం చేసే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందని జైట్లీ చెప్పారు. బ్లాక్‌మనీపై కొత్త చట్టాన్ని ప్రస్తావిస్తూ.. విదేశాల్లో నల్లధనం దాచిపెట్టుకున్న వారు స్వచ్ఛందంగా వెల్లడించి, తగు పన్నులు కట్టేందుకు తగినంత సమయం ఇస్తామన్నారు. ఇక వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానంపై విస్తృత ఏకాభిప్రాయం ఉందని, ఏప్రిల్ 20న మొదలయ్యే తదుపరి బడ్జెట్ సెషన్లో ఇందుకు సంబంధించిన సవరణ బిల్లు ఆమోదం పొందగలదని జైట్లీ ధీమా వ్యక్తం చేశారు. పన్నులపరమైన సంస్కరణల్లో దేశ చరిత్రలోనే ఇది అత్యంత ముఖ్యమైనది కాగలదని ఆయన చెప్పారు. అటు భూసేకరణ చట్టంలో సవరణలకు ఆమోదం పొందడం పెను సవాలేనని జైట్లీ పేర్కొన్నారు.
కంపెనీల కష్టాలపై కమిటీ..
కొత్త కంపెనీల చట్టం సజావుగా అమలయ్యేలా చూసే దిశగా.. కార్పొరేట్లు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించేందుకు కేంద్రం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు జైట్లీ చెప్పారు. కంపెనీల చట్టంలో ప్రతిపాదిత సవరణలకు పార్లమెంటు ఆమోదం పొందటం తమ తక్షణ ప్రాధాన్యతాంశంగా ఆయన తెలిపారు. ఒక చట్టం అమల్లోకి వచ్చిన మరుసటి ఏడాదే దానికి సవరణలు కూడా చేయాల్సి రావడం చాలా అరుదంటూ.. గత ప్రభుత్వానికి చురకలు వేశారు.
అవినీతి నిరోధక చట్టానికి సవరణలు..
వివిధ కుంభకోణాల్లో పలువురు పరిశ్రమ దిగ్గజాలు, విధానకర్తలపై క్రిమినల్ కేసులు దాఖలవుతున్న నేపథ్యంలో అవినీతి నిరోధక చట్టానికి సవరణలు చేపట్టాలని యోచిస్తున్నట్లు జైట్లీ చెప్పారు.