
భారత స్టాక్ మార్కెట్‌లో ఇటీవల పెద్దమొత్తంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐ) తమ పెట్టుబడులను ఉపసంహరిస్తున్నారు. రోజూ సుమారు రూ.3,000 కోట్లకు పైగా విక్రయాలు చేస్తున్నారు. ఈ ప్రభావం పెరుగుతుండటంపై కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకులు ఉదయ్‌కోటక్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన ‘ఛేజింగ్ గ్రోత్ 2025 ఇన్వెస్టర్ ఈవెంట్’లో ఆయన మాట్లాడారు. స్టాక్ మార్కెట్‌లో నిరంతరం పెట్టుబడి పెడుతున్న దేశీయ రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి ఎఫ్ఐఐలు ఎలా ప్రయోజనం పొందుతున్నారో వివరించారు.
‘భారత్‌లో స్టాక్ వాల్యుయేషన్లు పెరగడం వల్ల విదేశీ ఇన్వెస్టర్లు తమ నిధులను ఉపసంహరించడం అధికమైంది. దేశం అంతటా రిటైలర్లు రోజూ ఈక్విటీల్లో పెట్టుబడి పెడుతున్నారు. ఇది దేశీయ సంస్థాగత ప్రవాహాలకు సాయపడుతుంది. అయితే, ఎఫ్ఐఐలు లాభాలు సంపాదించడానికి కూడా ఇదే కారణమవుతుంది. భారత మార్కెట్‌లో వారు లాభాలు గడించి ఇతర ప్రపంచ మార్కెట్లకు వాటిని తరలిస్తున్నారు. యూఎస్ డాలర్ బలపడుతుండడంతో ఎఫ్‌ఐఐలు భారతదేశం సహా వర్ధమాన మార్కెట్ల నుంచి మూలధనాన్ని ఉపసంహరించుకుంటున్నారు. ప్రస్తుతం 4.5 శాతానికి పైగా ఉన్న అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ పెరగడం కూడా భారత మార్కెట్లు కుప్పకూలడానికి కారణం’ అని చెప్పారు.
ఇదీ చదవండి: తేమ నుంచి తాగునీటి ఉత్పత్తికి ఏర్పాట్లు చేసిన ఐసీఐసీఐ బ్యాంక్
ఇప్పటికే ఎఫ్‌ఐఐలు, ఎఫ్‌డీఐలు భారత్‌లోని చాలా కంపెనీల నుంచి భారీగా తమ ఇన్వెస్ట్‌మెంట్లను ఉపసంహరించుకున్నాయని కోటక్ తెలిపారు. అధిక వాల్యుయేషన్ల కారణంగా వర్ల్‌పూల్, హ్యుందాయ్ వంటి కంపెనీలు భారత్‌లో తమ హోల్డింగ్స్‌ను తగ్గించుకున్నాయని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఈ ఉపసంహరణ తంతు కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయని చెప్పారు. ఇది మరింతగా పెరిగితే ఆర్‌బీఐ తన రిజర్వ్‌లను అధికంగా ఉపయోగించాల్సి ఉంటుందని తెలిపారు. లేదా రూపాయి బలహీనపడే ప్రమాదం ఉందని అంచనా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment