CII Annual Conference
-
కొత్త ప్రభుత్వ లక్ష్యం అత్యుత్తమ బడ్జెట్
న్యూఢిల్లీ: ఎన్నికల ఫలితాల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వ తక్షణ లక్ష్యం.. జూలైలో అత్యుత్తమ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడమేనని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు లోక్‌సభలో మంచి మెజారిటీతో ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి వస్తారని ఆర్థిక మంత్రి ఉద్ఘాటించారు. ఎన్నికల అనంతరం మోదీ వరుసగా మూడోసారి ప్రధాని అవుతారని స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక వాణిజ్య శిఖరాగ్ర సమావేశంలో ఆమె ఈ మేరకు పారిశ్రామిక దిగ్గజాలను ఉద్దేశించి ప్రసంగించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జూలైలో పూర్తి సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం జరుగుతుందని పేర్కొన్న ఆమె, దీనిని అత్యుత్తమంగా రూపొందించడానికి సీఐఐతో చర్చలు జరుపుతామని అన్నారు. భారత్ వృద్ధి తీరు స్థిరంగా కొనసాగుతుందని, దీనికి సంబంధించి దేశం ముందు ఎన్నో అవకాశాలు ఉన్నాయని వివరించారు. దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకం కానుందన్నారు. సోలార్, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా రంగాల పురోగతికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు యువతకు గణనీయమైన ఉద్యోగ అవకాశాలను అందిస్తాయని అన్నారు. -
ప్రథమార్ధంలో మెరుగ్గా ఉద్యోగావకాశాలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో (ఏప్రిల్–సెప్టెంబర్) ఉద్యోగాల కల్పనకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కంపెనీల సీఈవోలు భావిస్తున్నారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన సర్వేలో మెజారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు ఈ విషయం వెల్లడించారు. ఇటీవల రెండో జాతీయ మండలి సమావేశం సందర్భంగా సీఐఐ నిర్వహించిన ఈ సర్వేలో 136 మంది సీఈవోలు పాల్గొన్నారు. ‘అధిక ద్రవ్యోల్బణం, కఠిన పరపతి విధానం, ముడి సరుకుల ధరల పెరుగుదల, అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి వంటి అనేక సవాళ్లను ఇటు దేశీయంగా అటు ఎగుమతులపరంగా భారతీయ పరిశ్రమ గట్టిగా ఎదుర్కొనడంతో పాటు వ్యాపారాల పనితీరుపై సానుకూల అంచనాలను సీఈవోల సర్వే ప్రతిఫలిస్తోంది‘ అని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. దీని ప్రకారం.. ► స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 7–8 శాతం స్థాయిలో ఉంటుందని 57 శాతం మంది సీఈవోలు తెలిపారు. 7 శాతం లోపే ఉంటుందని 34 శాతం మంది అంచనా వేశారు. ► దాదాపు సగం మంది చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు (49 శాతం) ప్రథమార్ధంలో (హెచ్1) గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ మెరుగ్గా ఉంటుందని పేర్కొన్నారు. ► ద్రవ్యోల్బణం ఎగుస్తుండటంతో ద్రవ్య పరపతి విధానాన్ని కఠినతరం చేస్తారనే అంచనాలు ఉన్నప్పటికీ ప్రథమార్ధంలో పరిస్థితులు మెరుగ్గానే ఉండగలవన్నది సీఈవోల అభిప్రాయం. ► ప్రథమార్ధంలో ఆదాయాల వృద్ధి 10–20 శాతం స్థాయిలో ఉండొచ్చని 44 శాతం మంది సీఈవోలు అంచనా వేశారు. 32 శాతం మంది 20 శాతం పైగా ఉండొచ్చని తెలిపారు. ► లాభాల వృద్ధి 10 శాతం పైగా ఉంటుందని 45 శాతం మంది, దాదాపు 10 శాతం వరకూ ఉంటుందని 40 శాతం మంది సీఈవోలు అంచనా వేశారు. ► ముడి వస్తువుల రేట్ల పెరుగుదలతో హెచ్1లో తమ లాభాలపై 5–10 శాతం మేర ప్రతికూల ప్రభావం పడుతుందని 46 శాతం మంది, 10–20 శాతం స్థాయిలో ఉండొచ్చని 28 శాతం మంది చెప్పారు. ► ముడి వస్తువుల ధరల పెరుగుదలతో ఇటీవలి కాలంలో తమ ఉత్పత్తుల రేట్లు పెంచినట్లు 43 శాతం మంది వెల్లడించారు. ఆ భారాన్ని తామే భరించడమో లేదా సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం ద్వారా వ్యయాలను తగ్గించుకోవడమో చేసినట్లు మిగతా వారు పేర్కొన్నారు. ► హెచ్1లో ద్రవ్యోల్బణం 7–8 శాతం స్థాయిలో ఉంటుందని దాదాపు సగం మంది (48 శాతం) అంచనా వేస్తున్నారు. ► ముడి వస్తువుల రేట్ల పెరుగుదల, ద్రవ్యోల్బణంపరమైన ఒత్తిళ్లు నెలకొన్నందున రాష్ట్రాల ప్రభుత్వాలు .. ఇంధనాలపై వ్యాట్‌ను తగ్గించాలని మూడొంతుల మంది సీఈవోలు అభిప్రాయపడ్డారు. ► ఎగుమతులపరంగా చూస్తే రూపాయి మారకం విలువ మరింత పడిపోతుందని, డాలర్‌తో పోలిస్తే 80 స్థాయికి పైగా పతనం కావచ్చని మెజారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు అభిప్రాయపడ్డారు. ఫలితంగా ఎగుమతులపరంగా తమకు ప్రయోజనం చేకూరుతుందని 55 శాతం మంది తెలిపారు. ► దిగుమతులపరంగా చూస్తే మాత్రం హెచ్1లో ముడి వస్తువుల సరఫరాపై ఒక మోస్తరు ప్రభావం పడొచ్చని 50 శాతం మంది సీఈవోలు పేర్కొన్నారు. ► ఇటీవలి భౌగోళిక రాజకీయ పరిణామాలు, కోవిడ్ సంబంధ లాక్డౌన్ల ప్రభావాల కారణంగా సరఫరాలపరంగా స్వల్ప సవాళ్లు ఎదుర్కొన్నట్లు 30 శాతం మంది సీఈవోలు చెప్పారు. అయితే, తమ అవసరాల కోసం చైనాపై ఆధారపడటం కొంత తగ్గించుకున్నట్లు వివరించారు. -
తెలంగాణ భారత్‌లో భాగం కాదా? కేంద్రంపై కేటీఆర్ ఆగ్రహం
‘పార్లమెంటు సాక్షిగా విభజన చట్టంలోని హామీలను కేంద్రం తుంగలో తొక్కింది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీ ఏర్పాటు వంటి హామీలను గాలికి వదిలేసింది. పారిశ్రామిక అభివృద్ధిలో కీలకమైన రైల్వే నెట్‌వర్క్‌ను బలోపేతం చేయాలనే డిమాండ్‌పై కేంద్రం స్పందించడం లేదు. బుల్లెట్ ట్రైన్, హైస్పీడ్ నెట్‌వర్క్‌లలోనూ తెలంగాణకు దక్కిందేమీ లేదు.’ - కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ ఏర్పడిన నాటి నుంచీ కూడా కీలకమైన పారిశ్రామిక రంగంలో, న్యాయంగా దక్కాల్సిన ప్రాజెక్టులు, పథకాలు, ప్రోత్సాహకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ కొనసాగుతోంది. నవ జాత శిశువు లాంటి తెలంగాణ తన కాళ్ల మీద తాను నిలబడటానికి సాయం అందించాలని ఏళ్లుగా కోరుతున్నా కేంద్రం నుంచి స్పందన రావ డం లేదు. ఇలా వివక్ష చూపితే ఎలా.. మేం భారత్‌లో భాగం కాదా? ఇప్పుడు తెలంగాణ అభి వృద్ధి కోసం, తెలంగాణ ప్రజల కోసం మా గొం తును గట్టిగా విప్పాల్సిన అవసరం, సమయం వచ్చింది..’’ అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన వార్షిక సదస్సులో కేటీఆర్ ప్రసంగించారు. పారిశ్రామిక రంగంతో పాటు వివిధ రంగాల్లో తెలంగాణ పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని తప్పుబట్టారు. నినాదం ఇస్తేనే సరిపోదు.. కేంద్ర ప్రభుత్వం మేకిన్ ఇండియా అని నినాదం ఇస్తే సరిపోదని, చేతల్లో చూపాలని కేటీఆర్ అన్నారు. ‘‘ఇలా వివక్ష చూపితే తయారీ రంగంలో చైనాతో భారత్ ఎలా పోటీపడగలదు. మేం భారత్‌లో భాగం కాదా? ప్రాజెక్టులు, నిధుల విష యంలో రాజకీయాలను పక్కన పెట్టండి. మేకిన్ ఇండియా సాధ్యపడాలంటే రాష్ట్రాలు అడిగిన ప్రాజెక్టులు మంజూరు చేయండి. కేంద్రం మద్దతు ఉంటే మరింత మందికి ఉద్యోగావకాశాలు ఇవ్వ గలం. కేంద్రం రాష్ట్రాలతో కలిసి పనిచేయాల్సిందే’’ అని స్పష్టం చేశారు. సంక్షేమంతోపాటు పారి శ్రామిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. టీఎస్ఐపాస్ వంటి పారిశ్రామిక విధానాన్ని తెచ్చి.. రూ.1.12 లక్షల కోట్ల పెట్టుబడులతో 15 వేల కంపెనీలను రాష్ట్రానికి రప్పించామని, సుమారు 15 లక్షల ఉద్యోగాలు కల్పించామని కేటీఆర్ వివరించారు. గత ఆరేండ్లలో వ్యవసాయం మొదలుకుని ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ వంటి కీలక రంగాల్లో రాష్ట్రం ఎంతో ప్రగతి చూపినా కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందలేదని మండిపడ్డారు. వివిధ వేదికల మీద రాష్ట్రాన్ని ప్రశంసిస్తున్న కేంద్ర మంత్రులు తెలంగాణకు అణా పైసా సాయం చేయడం లేదని విమర్శించారు. విభజన హామీలు తుంగలో పార్లమెంటు సాక్షిగా విభజన చట్టంలోని హామీలను కేంద్రం తుంగలో తొక్కిందని కేటీఆర్ మండిపడ్డారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు వంటి హామీలను గాలికొదిలేసిందని విమర్శించారు. పారిశ్రామిక అభివృద్ధిలో కీలకమైన రైల్వే నెట్‌వర్క్‌ను బలోపేతం చేయాలనే డిమాండ్‌పై కేంద్రం స్పందించడం లేదని.. బుల్లెట్ ట్రైన్, హైస్పీడ్ నెట్‌వర్క్‌లలోనూ తెలంగాణకు దక్కిందేమీ లేదని చెప్పారు. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. రాష్ట్ర ఏర్పాటుకంటే ముందే మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టును అడ్డుకోవడం ద్వారా తెలంగాణలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనకు ఎన్డీయే ప్రభుత్వం మోకాలడ్డుతోందని విమర్శించారు. రాష్ట్ర ఐటీ ఎగుమతులు ఆరేండ్లలో రూ.57 వేల కోట్ల నుంచి రూ.1.40 లక్షల కోట్లకు చేరినా.. కేంద్రం నుంచి ప్రోత్సాహం కరువైందని.. అదనపు ఎలక్ట్రానిక్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్, హైదరాబాద్ ఫార్మాసిటీలో మౌలిక వసతులకు రూ.3,900 కోట్లు ఇవ్వాలన్న విజ్ఞప్తులపై మౌనం పాటిస్తోందని తెలిపారు. జీనోమ్ వ్యాలీలో వ్యాక్సిన్ టెస్టింగ్ కేంద్రం ఏర్పాటు, డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడారు మంజూరు, ఏరోస్పేస్ డిఫెన్స్ రంగంలో రీసెర్చ్, ఇన్నోవేషన్ కోసం డిఫెన్స్ ఇంక్యుబేటర్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఎయిరో ఇంజన్ కారిడార్ మంజూరు వంటి విజ్ఞప్తులను కేంద్రం పట్టించుకోవడమే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, సిరిసిల్లలో పవర్ లూమ్ క్లస్టర్, నేషనల్ టెక్స్టైల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటు విషయంలో మొండి చేయి చూపుతున్నారని కేటీఆర్ వివరించారు. గతేడాదితో పోలిస్తే ఎగుమతుల్లో 2020–21లో 15.5 శాతం వృద్ధిరేటును నమోదు చేసినా డ్రైపోర్టుపై స్పందన లేదని చెప్పారు. హైదరాబాద్ వెలుపలికి ఐటీని విస్తరిస్తం హైదరాబాద్ వెలుపల ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరిస్తామరని.. నల్గొండ, రామగుండం, సిద్దిపేటలో ఐటీ హబ్స్ ఏర్పాటు చేస్తామని కేటీఆర్ చెప్పారు. ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించడం ద్వారా కంపెనీలకు వ్యయం తగ్గడంతో పాటు స్థానికులకు ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. ఇప్పటికే కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లో పలు ఐటీ కంపెనీలు అడుగుపెట్టాయని.. వరంగల్‌లో టెక్ మహీంద్రా, సైయంట్, మైండ్ట్రీతోపాటు పలు స్టార్టప్స్, ఎస్ఎంఈలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని వెల్లడించారు. కాగా సీఐఐ వార్షిక సదస్సులో భాగంగా పరిశ్రమలతో పాటు వివిధ కేటగిరీలకు చెందిన సంస్థలకు ఈ సందర్భంగా అవార్డులు అందజేశారు. -
మళ్లీ గాడిలో పడతాం!
న్యూఢిల్లీ: భారత్ తిరిగి మునుపటి ఆర్థిక వృద్ధి బాటలోకి అడుగుపెడుతుందన్న విశ్వాసాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. రైతులు, చిన్న పరిశ్రమలు, వ్యాపారవేత్తల సాయంతో దీన్ని సాధిస్తామన్న ఆశాభావం వ్యక్తం చేశారు. లాక్డౌన్ కాలంలో ప్రభుత్వం తీసుకున్న సంస్కరణల చర్యలు దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తాయన్నారు. భారత్ తిరిగి వృద్ధి దిశలోకి వెళ్లేందుకు గాను.. సంకల్పం, సమగ్రత, పెట్టుబడులు, సదుపాయాలు, ఆవిష్కరణలపై దృష్టి సారించాల్సి ఉంటుందన్నారు. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఈ ఉద్దేశాలను ప్రతిఫలిస్తాయన్నారు. భారత్ క్రెడిట్ రేటింగ్‌ను పెట్టుబడుల విషయంలో అతి తక్కువ రేటింగ్‌కు (బీఏఏ3) డౌన్‌గ్రేడ్ చేస్తూ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ నిర్ణయం తీసుకున్న మరుసటి రోజే ప్రధాని ఈ విధంగా స్పందించడం గమనార్హం. మంగళవారం జరిగిన సీఐఐ వార్షిక సదస్సును ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మాట్లాడారు. ఇటువంటి పరీక్షా కాలంలో దేశీయ పరిశ్రమలు గ్రామీణ భారతంతో కలసి పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశ గతిని మార్చేందుకు అవసరమైతే మరిన్ని నిర్మాణాత్మక సంస్కరణలు చేపడతామని ప్రకటించారు. కీలకమైన రంగాల్లో దేశీయ అవసరాలను స్థానికంగానే తీర్చుకునే లక్ష్యంతో కూడిన స్వయం సమృద్ధ భారత్ (ఆత్మ నిర్భర్ భారత్) ప్రణాళికను ప్రధాని మరోసారి ప్రస్తావించారు. ఈ లక్ష్య సాధనలో పరిశ్రమల వెన్నంటి నిలుస్తామన్నారు. వైరస్ బారి నుంచి ప్రజల ప్రాణాలను కాపాడుతూ, మరోవైపు ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణ, వృద్ధి వేగవంతానికి చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. అవకాశాలను సొంతం చేసుకోవాలి... ‘‘విశ్వసనీయమైన, నమ్మకమైన భాగస్వామి కోసం ప్రపంచం చూస్తోంది. భారత్‌కు తగిన సామర్థ్యం, శక్తి, బలాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు ఏర్పడిన విశ్వసనీయత నుంచి ఈ రోజు అన్ని పరిశ్రమలు లాభపడాలి. మీరు ఓ రెండు అడుగులు ముందుకు వేస్తే మీకు మద్దతుగా ప్రభుత్వం నాలుగు అడుగులు వేస్తుంది. నేను మీకు అండగా ఉంటానని ప్రధానమంత్రిగా హామీ ఇస్తున్నాను’’ అంటూ దేశ వృద్ధిలో పరిశ్రమలు పెద్ద పాత్ర పోషించాలన్న ఆకాంక్షను ప్రధాని తన మాటల ద్వారా వ్యక్తం చేశారు. ‘‘భారత్‌లో బలమైన కంపెనీలు ఏర్పాటు కావాలి. అవి ప్రపంచ శక్తులుగా మారాలి. తద్వారా ఉపాధికల్పన జరిగి ప్రజాసాధికారతకు దారితీయాలి. స్థానికంగా బలమైన సరఫరా వ్యవస్థలను నెలకొల్పినట్టయితే అది అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలను బలోపేతం చేస్తుంది. ప్రపంచం కోసం భారత్‌లో తయారీని చేపట్టాలి’’ అంటూ ప్రధాని తన ఆశయాలను విపులీకరించారు. నిత్యావసరం కాని వస్తు దిగుమతులను కనిష్ట స్థాయికి తగ్గించాలంటూ అందుకు పరిశ్రమలు దేశీయంగానే ఉత్పత్తిని పెంచే చర్యలు చేపట్టాలని కోరారు. ఫర్నిచర్, ఎయిర్ కండీషనర్లు, పాదరక్షలు, తోలు పరిశ్రమలను ప్రాధాన్య రంగాలుగా గుర్తించినట్టు ప్రధాని చెప్పారు. మొబైల్ ఫోన్లు, రక్షణ పరికరాల దిగుమతులను తగ్గించుకుంటున్నట్టు తెలిపారు. -
పర్యాటక రంగం.. 50 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: పర్యాటక రంగం 2022 నాటికి 50 బిలియన్ డాలర్ల (రూ.3.55 లక్షల కోట్లు) ఆదాయ లక్ష్యాన్ని సాధించాలని నీతి ఆయోగ్ అమితాబ్ కాంత్ సూచించారు. ఈ రంగానికి వృద్ధి అవకాశాలు, ఉపాధి కల్పన అవకాశాలు అపారంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. సీఐఐ 15వ వార్షిక పర్యాటక సదస్సు ఢిల్లీలో గురువారం జరిగింది. దీనికి కాంత్ హాజరై మాట్లాడారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీ ఉపాధి అవకాశాలు కల్పించే సామర్థ్యం పర్యాటకానికి ఉందన్నారు. ‘‘2018లో భారత పర్యాటక రంగం 28.6 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. దీన్ని 2022 నాటికి 50 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లే లక్ష్యాన్ని పెట్టుకోవాలి’’అని ఆయన పేర్కొన్నారు. -
చట్టబద్ధమైన పన్నులు కట్టాల్సిందే..
నోటీసులను వేధింపులుగా భావించనక్కర్లేదు ఎగవేతదారులకు భారత్ స్వర్గధామం కాదు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ న్యూఢిల్లీ: చట్టబద్ధమైన పన్నులు కట్టాలంటూ నోటీసులివ్వడాన్ని పన్నులపరమైన వేధింపులుగా పరిగణించనక్కర్లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. పన్ను బకాయిలను తప్పనిసరిగా చెల్లించాల్సిందేనన్నారు. అలాగే, భారత్‌ను పన్ను రహిత స్వర్గధామంగా భావించరాదని ఆయన చెప్పారు. దాదాపు 100 విదేశీ సంస్థాగత ఇన్వెస్ట్మెంట్ సంస్థలకు 5-6 బిలియన్ డాలర్ల మేర పన్నుల నోటీసులు ఇవ్వడాన్ని సమర్థించిన జైట్లీ .. భారత్‌లో చట్టబద్ధమైన పన్నులను చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. చట్టబద్ధమైన ప్రతీ పన్ను డిమాండ్‌నూ ట్యాక్స్ టైజం అంటూ వ్యాఖ్యానిస్తే వెనక్కి తగ్గిపోయేంత బలహీన పరిస్థితిలో భారత్ లేదని జైట్లీ స్పష్టం చేశారు. గడిచిన కొన్నాళ్లుగా భారత మార్కెట్లలో పన్నులు చెల్లించకుండా పొందిన లాభాలపై తాజాగా 20 శాతం కనీస ప్రత్యామ్నాయ పన్నులు (మ్యాట్) కట్టాలంటూ ఆదాయ పన్ను శాఖ దాదాపు 100 ఎఫ్ఐఐలకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పన్నుల నోటీసులపై ఏవైనా అభ్యంతరాలు ఉన్న పక్షంలో కావాలంటే న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని, అయితే చట్టబద్ధంగా చెల్లించాల్సిన వాటిని మాత్రం చెల్లించి తీరాల్సి ఉంటుందని జైట్లీ చెప్పారు. పెట్టుబడులకు కేంద్రంగా ఎదగాలనుకునే ఏ వర్ధమాన దేశం కూడా ట్యాక్స్ టైజం వంటి వాటికి పాల్పడే దుస్సాహసం చేయబోదన్నారు. మరోవైపు ఎఫ్ఐఐలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లపై (ఎఫ్‌పీఐ) మ్యాట్ విధింపునకు ముందు అన్ని అంశాలను క్షుణ్నంగా పరిశీలించినట్లు రెవెన్యూ శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ చెప్పారు. అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ (ఏఏఆర్)కు కూడా మ్యాట్ వర్తిస్తుందని చెప్పిన మీదటే ఆదాయ పన్ను అసెసింగ్ అధికారులు డిమాండ్ నోటీసులు పంపినట్లు ఆయన తెలిపారు. పన్నుల చట్టాలు సరళతరం.. పన్నుల రేట్లను క్రమబద్ధీకరించే దిశగా ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధానాలను సరళతరం చేసే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందని జైట్లీ చెప్పారు. బ్లాక్‌మనీపై కొత్త చట్టాన్ని ప్రస్తావిస్తూ.. విదేశాల్లో నల్లధనం దాచిపెట్టుకున్న వారు స్వచ్ఛందంగా వెల్లడించి, తగు పన్నులు కట్టేందుకు తగినంత సమయం ఇస్తామన్నారు. ఇక వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానంపై విస్తృత ఏకాభిప్రాయం ఉందని, ఏప్రిల్ 20న మొదలయ్యే తదుపరి బడ్జెట్ సెషన్లో ఇందుకు సంబంధించిన సవరణ బిల్లు ఆమోదం పొందగలదని జైట్లీ ధీమా వ్యక్తం చేశారు. పన్నులపరమైన సంస్కరణల్లో దేశ చరిత్రలోనే ఇది అత్యంత ముఖ్యమైనది కాగలదని ఆయన చెప్పారు. అటు భూసేకరణ చట్టంలో సవరణలకు ఆమోదం పొందడం పెను సవాలేనని జైట్లీ పేర్కొన్నారు. కంపెనీల కష్టాలపై కమిటీ.. కొత్త కంపెనీల చట్టం సజావుగా అమలయ్యేలా చూసే దిశగా.. కార్పొరేట్లు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించేందుకు కేంద్రం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు జైట్లీ చెప్పారు. కంపెనీల చట్టంలో ప్రతిపాదిత సవరణలకు పార్లమెంటు ఆమోదం పొందటం తమ తక్షణ ప్రాధాన్యతాంశంగా ఆయన తెలిపారు. ఒక చట్టం అమల్లోకి వచ్చిన మరుసటి ఏడాదే దానికి సవరణలు కూడా చేయాల్సి రావడం చాలా అరుదంటూ.. గత ప్రభుత్వానికి చురకలు వేశారు. అవినీతి నిరోధక చట్టానికి సవరణలు.. వివిధ కుంభకోణాల్లో పలువురు పరిశ్రమ దిగ్గజాలు, విధానకర్తలపై క్రిమినల్ కేసులు దాఖలవుతున్న నేపథ్యంలో అవినీతి నిరోధక చట్టానికి సవరణలు చేపట్టాలని యోచిస్తున్నట్లు జైట్లీ చెప్పారు.