విచారణ వలకు.. తిమింగలాలు చిక్కేనా?
► భూ అక్రమాలపై విచారణకు అధికారుల కసరత్తు
► అన్ని వివరాలతో రాష్ట్ర అధికారులకు సమగ్ర నివేదిక
► దాన్ని పరిశీలించాక.. వారంలో వేదిక నిర్ణయం
► స్కాముల సూత్రధారులందరూ టీడీపీ నేతలే
► అందుకే విచారణపై సర్వత్రా అనుమానాలు
విశాఖ సిటీ: జిల్లాలో జరిగిన భూ అక్రమాలపై ఈనెల 15న నిర్వహించనున్న బహిరంగ విచారణకు జిల్లా యంత్రంగా కసరత్తు చేస్తోంది. ఇందుకోసం అవసరమైన నివేదికను గురువారం సాయంత్రం రాష్ట్ర రెవెన్యూ, భూపరిపాలన ప్రధాన కమిషనరేట్‌కు పంపింది. ఈ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం రాష్ట్ర స్థాయి అధికారులు బహిరంగ విచారణ వేదిక ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై జిల్లా అధికారులకు వారం రోజుల్లో ఆదేశాలు జారీచేయనున్నారు.
విమర్శలు వెల్లువెత్తడంతోనే..
రికార్డులు మార్చేసి.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులతో కుమ్మక్కై అధికార పార్టీ నేతలు సాగించిన 6 వేలకుపైగా ఎకరాల భూ దందాపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. ఈ విచారణకు సిద్ధమైన విషయం తెలిసిందే. జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ స్వయంగా ఈ దందా వ్యవహారం బట్టబయలు చేయడం సంచలనం కలిగించింది. ఈ నేపథ్యంలో బహిరంగ విచారణ కోసం ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి సహా రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనరేట్ నుంచి సీనియర్ అధికారుల బృందం, సర్వే బృందం హాజరుకానుంది. ఇందుకు అవసరమైన నివేదికలు తయారు చేయడంలో రెండు రోజులుగా జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. గురువారం సాయంత్రం నివేదికలను కమిషనరేట్‌కు పంపారు.
⇒ ఏఏ మండలాల్లో రికార్డులు గల్లంతయ్యాయి, దాని కారణాలను ఈ నివేదికలో పొందుపరిచారు.
⇒పాత అసైన్‌మెంట్ భూములు, వాటిలో ఏవైనా నిర్మాణాలు జరిగి ఉంటే.. వాటికి సంబంధించిన పత్రాలు, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ వివరాలను పేర్కొన్నారు.
⇒గత ఆరు నెలలుగా ఈ తరహా కేసులు ఎన్ని వచ్చాయి. వాటిని ఎలా పరిష్కరించారు. జిల్లాలోని 43 మండలాల్లో ఎక్కడ ఎక్కువగా భూములకు సంబంధించిన ఫిర్యాదులు నమోదయ్యాయనే అంశాలను రెవెన్యూ శాఖకు పంపిన నివేదికలో పేర్కొన్నారు.
వారం రోజుల్లో వేదిక ప్రకటన
జిల్లా యంత్రాంగం పంపిన ఈ నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత.. బహిరంగ విచారణ ఎక్కడ నిర్వహించాలనే అంశంపై సంబం«ధిత శాఖ అధికారులు ప్రకటిస్తారు. రెండు వారాల సమయం ఉన్న నేపథ్యంలో అందరికీ అందుబాటులో ఉండేలా వేదికను గుర్తించాలని ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో ప్రజావాణి నిర్వహించే హాల్‌లో విచారణ చేపట్టాలనే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే పెద్ద సంఖ్యలో ఫిర్యాదుదారులున్న నేపథ్యంలో ఈ సమావేశ మందిరం సరిపోదన్న వాదన కూడా ఉంది. రాష్ట్ర అధికారుల సూచన మేరకు విచారణ వేదికను ఎంపిక చేస్తామని వారి ఆదేశాల మేరకు సమయం, ప్రాంతాన్ని వెల్లడిస్తామని జాయింట్ కలెక్టర్ సృజన తెలిపారు.