ఆర్థికవృద్ధికి ఊతం...పన్నుల్లో ఉపశమనం
న్యూఢిల్లీ : ఆర్థిక వృద్ధి మరింత పుంజుకునేలా చేస్తూ, ఉద్యోగవకాశాలను పెంచడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ పన్ను పరిమితుల్లో పలు రకాల చర్యలు తీసుకుంటోంది. తక్కువ పన్ను చెల్లించేవారికి, వ్యాపారాలకు, నిపుణులకు పన్నుల్లో ఉపశమనం కల్పించనున్నట్టు ప్రకటించింది. పన్నుమినహాయింపు పరిమితిని ఆదాయపు పన్ను యాక్ట్ 1961, సెక్షన్ 80సీ ప్రకారం ఏడాదికి రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచింది. అదనంగా రూ.50వేలను నేషనల్ పెన్షన్ స్కీమ్ కు సహాయపడేలా ప్రకటన విడుదల చేసింది. చిన్న పన్ను చెల్లింపుదారులకు, వ్యాపారాలకు, ఉద్యోగస్తులకు పన్నుల్లో కొంత ఉపశమనం కల్పిస్తూ రెవెన్యూ శాఖ తీసుకొనే చర్యలను బడ్జెట్ లో ప్రకటించిన సంగతి తెలిసిందే.
రూ.2 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ కల్గిన చిన్న వ్యాపారస్తులకే ముందస్తు పన్నుల వర్తిస్తాయని రెవెన్యూ శాఖ ప్రకటన విడుదలచేసింది. అదేవిధంగా రూ.50లక్షల ఆదాయం వరకు ఉన్న ప్రొఫెషనల్స్ కూ ముందస్తు పన్నుల ప్రయోజనం కల్పించనున్నట్టు పేర్కొంది. కొత్తగా తయారీ కంపెనీలు ఏర్పాటు చేసే వారికి కార్పొరేట్ పన్నులో 25 శాతం రాయితీ ఇవ్వనున్నారు. గృహరంగానికి ఇచ్చే పన్ను లబ్దిని కూడా పెంచడంతో నిర్మాణ పరిశ్రమకు ఊతం కల్పించనున్నారు.
రాయల్టీ, టెక్నికల్ సర్వీసులపై పన్నుల రేటును 25 నుంచి 10 శాతానికి కుదించారు. కొత్తగా ప్రారంభించబోయే కంపెనీలకు(స్టార్టప్) మూడు సంవత్సరాలు 100శాతం పన్నుల రాయితీని కల్పిస్తూ రెవెన్యూ శాఖ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక వృద్ధికి మరింత ఊతం అందిస్తూ ఉద్యోగవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.