రెవెన్యూ ఉక్కిరిబిక్కిరి | Revenue Is Choked | Sakshi
Sakshi News home page

రెవెన్యూ ఉక్కిరిబిక్కిరి

Published Wed, Jun 20 2018 7:54 AM | Last Updated on Wed, Jun 20 2018 7:54 AM

Revenue Is Choked

కర్నూలు(అగ్రికల్చర్‌) : 1985లో మండల వ్యవస్థ ఏర్పాటైంది. అప్పట్లో జిల్లా జనాభా 22 లక్షలు. అందుకు అనుగుణంగా రెవెన్యూ శాఖకు సంబంధించి మండల రెవెన్యూ అధికారి కార్యాలయాలకు పోస్టులు మంజూరు చేశారు. ప్రస్తుత జనాభా దాదాపు 45 లక్షలు. పదేళ్లకోసారి రెవెన్యూ శాఖను పునర్‌ వ్యవస్థీకరించాల్సి ఉంది. కానీ ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో 33ఏళ్ల క్రితం ఉన్న పోస్టులతోనే పని కానిచ్చేస్తున్నారు. ఫలితంగా సిబ్బంది పై పనిభారం అధికమవుతోంది. ఒక్కోసారి రాత్రి పొద్దుపోయే వరకు పనిచేయడంతో పాటు సెలవు రోజుల్లోనూ పనిచేయాల్సి వస్తోంది. లేకపోతే మెమోలు అందుకోవాల్సి వస్తోందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  


అప్పటి జనాభా ప్రకారం.. 
మండలాలకు 1985లో జనాభా ప్రాతిపదికన ఎమ్మార్వో, సూపరింటెండెంట్, ఒక సీనియర్‌ అసిస్టెంటు, ఇద్దరు జూనియర్‌ అసిస్టెంట్లు, ఒక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు మంజూరు చేశారు. నియోజకవర్గ కేంద్రాల మండలాలకు ఒక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ పోస్టు, ఒక ఎన్నికల డీటీ పోస్టును అదనంగా కేటాయించారు.  
చుక్కల భూముల క్రమబద్ధీకరణకు సిబ్బంది కొరత..
కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా జిల్లాకు మూడు తహసీల్దారు, మూడు డీటీ పోస్టులు, ఒక డిప్యూటీ కలెక్టర్‌ పోస్టు మంజూరు చేసింది. 2017లో చుక్కల భూముల క్రమబద్ధీ్దకరణకు ప్రత్యేక చట్టాన్ని తెచ్చిన ప్రభుత్వం పోస్టులను మాత్రం కేటాయించలేదు. డిప్యుటేషన్‌పై సిబ్బందిని నియమించుకోవాలని మాత్రమే సూచించింది. ఇప్పటికే పని ఒత్తిడి, సిబ్బంది కొరతతో సతమతమవుతున్న రెవెన్యూ యంత్రాంగం చుక్కల భూముల క్రమబద్దీకరణ చట్టంతో ఊపిరితిప్పుకోలేకపోతున్నారు. మండలస్థాయి నుంచి జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు సిబ్బంది కరువయ్యారు. వీటికి సిబ్బందిని డిప్యుటేషన్‌పై నియమించుకొని దరఖాస్తుల పరిశీలనకు చర్యలు తీసుకున్నారు. 


 ఉన్న పోస్టుల్లోనూ ఖాళీలు.. 
1985లో మంజూరు చేసిన పోస్టులయిన భర్తీగా ఉన్నాయా అంటే అదీ లేదు. గ్రామ రెవెన్యూ అధికారి, జూనియర్‌ అసిస్టెంట్‌ మొదలుకొని సీనియర్‌ అసిస్టెంట్లు, డీటీలు, తహసీల్దారు కేడర్‌ వరకు అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీఆర్వో పోస్టులు 792 ఉండగా 150 వరకు ఖాళీగా ఉన్నాయి. జూనియర్‌ అసిస్టెంటు పోస్టులు 216 ఉండగా 35 పోస్టులు, సీనియర్‌ అసిస్టెంటు పోస్టులు 198 ఉండగా 25 పోస్టులు, తహసీల్దారు పోస్టులు 72 ఉండగా 6 పోస్టులు, డీటీ పోస్టులు 123 ఉండగా 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంతంత మాత్రం ఉన్న సిబ్బందిని కూడా వివిధ అవసరాలకు డిప్యుటేషన్‌పై బదిలీ చేస్తుండటం వల్ల ఉన్న సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది.   

రెవెన్యూ సిబ్బందిపై పని ఒత్తిడి..  
1985లో మండలాల్లో సగటున వందల్లోనే విద్యార్థులకు సర్టిఫికెట్‌లు ఇచ్చేవారు. ప్రస్తుతం వేలాది మంది విద్యార్థులకు ఇవ్వాల్సి వస్తోంది. ఎన్నికల విధులు, భూముల వ్యవహారాలు, విద్యార్థులు, రైతులు, ఇతర వర్గాలకు అవసరమైన ధ్రువపత్రాల జారీ, ప్రొటోకాల్‌ విధులు, ప్రజా పంపిణీ, లాం అండ్‌ ఆర్డర్, విపత్తుల నిర్వహణ, పంటల నమోదు, భూముల సర్వే, మైనింగ్‌ వ్యవహారాలు, ఇతర శాఖల వ్యవహారాలు తదితర విధులు, బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా చుక్కల భూముల క్రమబద్ధీక రణ విధులు నిర్వహిస్తున్నారు.   

సిబ్బందిని పెంచాలి 
జనాభా ప్రాతిపదికన తహసీల్దారు, ఆర్డీఓ, కలెక్టర్‌ కార్యాలయాలకు పోస్టులను పెంచాలి. ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఉన్న వారిని ఇతర అవసరాలకు డిప్యుటేషన్‌పై బదిలీ చేస్తున్నారు. దీంతో సిబ్బందిపై పని భారం అధికమవుతోంది. అన్ని కేటగిరి పోస్టులను పెంచడంతో పాటు, చుక్కల భూముల క్రమబద్దీకరణ చట్టం అమలుకు ప్రత్యేక పోస్టులు మంజూరు చేయాలని మా అసోసియేషన్‌ తరఫున డిమాండ్‌ చేస్తాం.  – రాజశేఖర్‌బాబు, జిల్లా అధ్యక్షుడు, జిల్లా రెవెన్యూ సర్వీస్‌ అసోసియేషన్‌    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement