పది రోజుల క్రితం మరణించిన వి.టి.రాజశేఖర్ మండల్ నిశ్శబ్ద విప్లవం ప్రారంభం కాకముందే దళితవాదం వైపు మళ్లారు. ఒక కన్నడ అగ్రకుల శూద్ర శెట్టి అయినప్పటికీ దళితుల కోసం అదే పేరుతో(దళిత్ వాయిస్) ఒక పత్రికను స్థాపించారు. దానివల్ల సామాజిక ఒంటరితనాన్ని అనుభవించారు. ఆయన బలమైన జాత్యహంకార వ్యతిరేకి. చివరివరకూ దళిత ఉద్యమకారులకు, రచయితలకు అండగా నిలిచారు.
దళితులు–ఓబీసీల ఐక్యత కంటే దళితులు–ముస్లింల ఐక్యత గురించిన ఆయన ఆలోచన మరింత స్థిరమైనది. ముస్లింగా మారకపోయినా, ఇస్లాం మతానికి బలమైన మద్దతుదారుగా నిలిచారు. అంటరానితనానికి వ్యతిరేకంగా, దళిత విముక్తి ప్రచారకర్తగా ఆయన లాంటి ఏ ఉన్నత శూద్ర మేధావీ ఇప్పటివరకూ ఉద్భవించలేదు.
2024 నవంబర్ 20న 93 సంవత్సరాల వయస్సులో వి.టి.రాజశేఖర్ మరణం, ఒక కోణంలో నన్ను తీవ్రంగా బాధించినప్పటికీ, మరో కోణంలో ఆయన జీవితాన్నీ, వారసత్వాన్నీ వేడుకగా జరుపుకొనే వీలు కల్పించింది. ఆయన భారతదేశ వ్యాప్తంగానూ, దేశం వెలుపలా కూడా ఉన్న నాలాంటి ఉద్యమకారులకు, రచయితలకు ధైర్యం, విశ్వాసం కలిగించిన స్నేహితుడూ, మార్గదర్శకుడూ!
ఆయన వల్లే నా పుస్తకం ‘నేను హిందువు నెట్లయిత’ (వై ఐ యామ్ నాట్ ఎ హిందూ)కు 2008లో ‘లండన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియా’(లీసా) అవార్డు వచ్చింది. వెస్ట్‌మినిస్టర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ (బ్రిటిష్ పార్లమెంట్)లో నా ఉపన్యాసం తర్వాత జరిగిన అవార్డు వేడుకకుఆయన వ్యక్తిగతంగా హాజరయ్యారు. మేము లండన్‌లో ప్రపంచ రాజ కీయాల గురించి చర్చించుకుంటూ, కలిసి భోజనం చేస్తూ విలువైన సమయం గడిపాము.
ఆయన, ఆయన పత్రిక గురించి నాకు తెలియకముందే, ఒక చక్కటి సమీక్ష రాసి, నా పుస్తకానికి తన ‘దళిత్ వాయిస్’ పాఠకులలో ప్రాచుర్యం కలిగించారు. ఆయన భిన్నాభిప్రాయాలకు సంబంధించిన విషయాలపై వెంటనే తగాదాకు తెరతీయగల వ్యక్తి, కానీ అదే సమయంలో విషయాలు ఆమోదయోగ్యమైన స్థానాలకు మారిన ప్పుడు స్నేహాన్ని పునరుద్ధరించగల వ్యక్తి.
‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’లో పని అనుభవంతో, దృఢమైన పాత్రికేయ నేపథ్యంతో, బంట్ అని కూడా పిలువబడే కన్నడ శెట్టి సంఘం నుండి వచ్చిన వి.టి. రాజశేఖర్‌కు దళిత విముక్తిపై ఉన్న తిరుగులేని వైఖరి నిజంగా విశేషమైనది. చనిపోయే వరకు ఆయన దళితవాద నిబద్ధతతోనే ఉన్నారు. ఆయన తరాన్ని అలా ఉండనివ్వండి, అంటరానితనానికి వ్యతిరేకంగా, దళిత విముక్తి ప్రచారకర్తగా ఆయన లాంటి ఏ ఉన్నత శూద్ర మేధావీ ఇప్పటివరకూ ఉద్భవించలేదు.
‘దళిత్ వాయిస్’ని ప్రారంభించిన తర్వాత తన మధ్యతరగతి ఉన్నత కుల స్నేహితులందరినీ కోల్పోయానని ఆయన చెప్పారు.బెంగళూరులోని తన సొంత ఇంటి నుండి ఆ పత్రిక రచన, ముద్రణ, పంపిణీని ఒంటరిగా నిర్వహించారు.మండల్ నిశ్శబ్ద విప్లవం ప్రారంభం కాకముందే ఆయన దళితవాదం వైపు మళ్లారు. అప్పట్లో అంబేడ్కర్ అనంతర దళితులకు ఇంగ్లిష్ చదవడం, రాయడానికి సంబంధించిన పాండిత్యం లేదు. దళిత్ పాంథర్ మరాఠీ సాహిత్య ఉద్యమం కారణంగా దళిత్ అనే పదం కొన్ని మీడియా సర్కిళ్లలో మాత్రమే గుర్తించబడుతోంది.
ఆయన కూడా ఒక రిపోర్టర్‌గా బొంబాయి నగరంలో ఉన్నందున, ఏకంగా ఒక పత్రికను ప్రారంభించడం ద్వారా ‘దళిత’ అనే పదాన్ని ప్రాచుర్యంలోకి తేవడంలోని ప్రాముఖ్యతను వెంటనే అర్థం చేసు కున్నారు. కానీ ఒక కన్నడ అగ్ర కుల శూద్ర శెట్టికి ఆ నిర్ణయం తీసుకోవడం, పర్యవసానంగా సామాజిక ఒంటరితనాన్ని ఎదుర్కో వడం, ముఖ్యంగా తన జర్నలిస్టు సర్కిళ్లలో ఒక హింసాత్మక ప్రక్రియ అయి ఉండాలి!
ఒక లాభదాయకమైన జర్నలిస్టు ఉద్యోగాన్ని విడిచిపెట్టి, ఆ శీర్షికతో ఆంగ్ల పత్రికను ప్రారంభించడం మండల్‌కు ముందటి పరిస్థితుల్లో ఊహించుకోండి. 2024 లోనే దళిత, ఓబీసీ, ఆదివాసీలకు చెందిన జర్నలిస్టులు ఎంత మంది ఉన్నారని రాహుల్ గాంధీ ఒక జాతీయ మీడియా సమావేశంలో ప్రశ్నించగా, అందులో ఎవరూ చేయి ఎత్తలేదు.
అది కూడా ఒక ప్రధాన ప్రతిపక్ష రాజకీయ నేత, విదేశీ మీడియా సమక్షంలో... ఇదీ పరిస్థితి! దేశంలోని ప్రముఖ మీడియాలో ఉన్న ఆంగ్ల బ్రాహ్మణ జర్నలిస్టు కులతత్వపు వలయాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించిన ఒంటరి శూద్రుడు వీటీ రాజశేఖర్ అయివుండాలి! ప్రధాన స్రవంతి మీడియాలోని కులతత్వం కారణంగా ఆయన నిరాశతో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. తన ప్రత్యర్థులతో పోరాడేందుకు రాడికల్ దళిత్ జర్నల్‌ను ప్రారంభించానని నాకు చెప్పారు.
ఆయన భారతదేశంలోని అగ్రవర్ణ జర్నలిజంతో ఎప్పుడూ రాజీ పడలేదు. దళిత్ వాయిస్‌ను ప్రారంభించిన తర్వాత ఆయన కథనాలు ఏ జాతీయ ఆంగ్ల వార్తాపత్రికలోనూ కనిపించలేదు. భారతీయ మీడియా గురించి చర్చ జరిగినప్పుడల్లా ఆయన దాని కులతత్వాన్ని దుయ్యబట్టేవారు. అగ్ర కులాల భారతీయ వార్తాపత్రికలన్నీ ‘టాయి లెట్ పేపర్లు’ అనేవారు. నేను జాతీయ వార్తాపత్రికలలో రాస్తున్నానని తెలుసుకున్నప్పుడు, ఆయన నాతో ‘మీ ఆలోచనలను అగ్రవర్ణాల వారికి అమ్మవద్దు, వారు మారరు’ అన్నారు.
వాస్తవానికి నేను చిరునవ్వుతో దానిని అక్కడే వదిలేశాను. ఎందుకంటే ప్రధాన స్రవంతి మీడియాలో వీలైనంత ఎక్కువగా పాల్గొనాలనీ, రాయాలనీ నేను నమ్ముతాను. అలాంటి విభేదాలు ఉన్నప్పటికీ ఆయన చనిపోయే వరకు మా స్నేహం ఆప్యాయంగా కొనసాగింది.దళితులు–ఓబీసీల ఐక్యత కంటే దళితులు–ముస్లింల ఐక్యత గురించి ఆయన ఆలోచన మరింత స్థిరమైనది. దళితుల కంటే ఓబీసీలు ఆర్‌ఎస్‌ఎస్/బీజేపీతో కలిసి వెళ్తారని ఆయన అన్నారు. ఆయన ముస్లింగా మారకపోయినా, ఇస్లాం మతానికి బలమైన మద్దతుదారుగా నిలిచారు. తన పాకిస్తాన్ పర్యటనల కారణంగా కొంతకాలం పాటు ఆయన వీసా రద్దు చేయబడింది. ఆయన బలమైన జాత్యహంకార వ్యతిరేకి. యూదులకు వ్యతిరేకంగా పదే పదే వ్యాసాలు రాశారు.
తన జీవితం చివరి రోజుల్లో ఆరోగ్య కారణాల వల్ల బెంగళూరు నుండి మంగళూరుకు మారిన తర్వాత ఆయన మౌనం మరింత పెరిగింది. అయినప్పటికీ, తన 80వ దశకం చివరి వరకూ ప్రయాణిస్తూనే ఉన్నారు. 2016లో హైదరాబాద్ సెంట్రల్ యూని వర్సిటీలో రోహిత్ వేముల వ్యవస్థీకృత హత్యకు వ్యతిరేకంగాజరిగిన నిరసన సభకు హాజరయ్యేందుకు వచ్చినప్పుడు నేను చివరిసారిగా ఆయనను కలిశాను. దురదృష్టవశాత్తు క్యాంపస్‌లోకి ప్రవేశించడానికి ఆయనను అనుమతించలేదు. అయినప్పటికీ గేటు వద్ద చాలాసేపు నిల్చొని నిరసన తెలిపారు. అది దళితుల పట్ల ఆయనకున్న నిబద్ధత.
ఆయన ఎప్పుడూ ఖాదీ కుర్తా, పైజామా ధరించే వ్యక్తి. ఒక సాధారణ కన్నడ కాంగ్రెస్ రాజకీయ నాయకుడిలా కనిపిస్తారు. కానీ ఆయన నిజమైన మతం మారిన దళిత మేధావి.ఈ సంవత్సరం ప్రారంభంలో పాల్ దివాకర్ బృందం ‘దళిత్ వాయిస్’ను డిజిటలైజ్ చేశారు. ఆ వెబ్‌సైట్ ప్రారంభోత్సవానికిబెంగళూరు ఇండియన్ సోషల్ ఇన్ స్టిట్యూట్‌కు నన్ను ఆహ్వానించారు. దురదృష్టవశాత్తు నేను వెళ్ళలేకపోయాను. అయితే ఈ లెజెండరీ దళితుడు జీవించి ఉన్నప్పుడే అది జరిగింది.
శూద్ర అగ్రవర్ణం నుండి దళితవాదంలోకి మారి, వారి విముక్తి కోసం తన జీవితాంతం పోరాడగలిగే మరో రాజశేఖర్ ఉద్భవిస్తాడని అనుకోలేము. ఆయన దళిత్ వాయిస్ పత్రిక ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఆఫ్రికాలో, అనేక ముస్లిం దేశాలలో ప్రసిద్ధి చెందింది.ప్రపంచంలోని అత్యంత అణగారిన ప్రజల విముక్తి కోసం బతికిన ఆయన ఇంత సుదీర్ఘ జీవితం తర్వాత ఈ భూమిని విడిచి పెట్టారు. కాబట్టి, మనం కూడా జీవించి ఉన్నంత కాలం వీటీ రాజ శేఖర్ జీవితాన్ని, ఆలోచనలను, రచనలను వేడుకగా జరుపుకోవాలి. గుడ్ బై వీటీఆర్.
-వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త
- ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్
Comments
Please login to add a commentAdd a comment