OBC
-
మూగబోయిన దళితుల గొంతుక
పది రోజుల క్రితం మరణించిన వి.టి.రాజశేఖర్ మండల్ నిశ్శబ్ద విప్లవం ప్రారంభం కాకముందే దళితవాదం వైపు మళ్లారు. ఒక కన్నడ అగ్రకుల శూద్ర శెట్టి అయినప్పటికీ దళితుల కోసం అదే పేరుతో(దళిత్ వాయిస్) ఒక పత్రికను స్థాపించారు. దానివల్ల సామాజిక ఒంటరితనాన్ని అనుభవించారు. ఆయన బలమైన జాత్యహంకార వ్యతిరేకి. చివరివరకూ దళిత ఉద్యమకారులకు, రచయితలకు అండగా నిలిచారు. దళితులు–ఓబీసీల ఐక్యత కంటే దళితులు–ముస్లింల ఐక్యత గురించిన ఆయన ఆలోచన మరింత స్థిరమైనది. ముస్లింగా మారకపోయినా, ఇస్లాం మతానికి బలమైన మద్దతుదారుగా నిలిచారు. అంటరానితనానికి వ్యతిరేకంగా, దళిత విముక్తి ప్రచారకర్తగా ఆయన లాంటి ఏ ఉన్నత శూద్ర మేధావీ ఇప్పటివరకూ ఉద్భవించలేదు.2024 నవంబర్ 20న 93 సంవత్సరాల వయస్సులో వి.టి.రాజశేఖర్ మరణం, ఒక కోణంలో నన్ను తీవ్రంగా బాధించినప్పటికీ, మరో కోణంలో ఆయన జీవితాన్నీ, వారసత్వాన్నీ వేడుకగా జరుపుకొనే వీలు కల్పించింది. ఆయన భారతదేశ వ్యాప్తంగానూ, దేశం వెలుపలా కూడా ఉన్న నాలాంటి ఉద్యమకారులకు, రచయితలకు ధైర్యం, విశ్వాసం కలిగించిన స్నేహితుడూ, మార్గదర్శకుడూ! ఆయన వల్లే నా పుస్తకం ‘నేను హిందువు నెట్లయిత’ (వై ఐ యామ్ నాట్ ఎ హిందూ)కు 2008లో ‘లండన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియా’(లీసా) అవార్డు వచ్చింది. వెస్ట్‌మినిస్టర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ (బ్రిటిష్ పార్లమెంట్)లో నా ఉపన్యాసం తర్వాత జరిగిన అవార్డు వేడుకకుఆయన వ్యక్తిగతంగా హాజరయ్యారు. మేము లండన్‌లో ప్రపంచ రాజ కీయాల గురించి చర్చించుకుంటూ, కలిసి భోజనం చేస్తూ విలువైన సమయం గడిపాము.ఆయన, ఆయన పత్రిక గురించి నాకు తెలియకముందే, ఒక చక్కటి సమీక్ష రాసి, నా పుస్తకానికి తన ‘దళిత్ వాయిస్’ పాఠకులలో ప్రాచుర్యం కలిగించారు. ఆయన భిన్నాభిప్రాయాలకు సంబంధించిన విషయాలపై వెంటనే తగాదాకు తెరతీయగల వ్యక్తి, కానీ అదే సమయంలో విషయాలు ఆమోదయోగ్యమైన స్థానాలకు మారిన ప్పుడు స్నేహాన్ని పునరుద్ధరించగల వ్యక్తి. ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’లో పని అనుభవంతో, దృఢమైన పాత్రికేయ నేపథ్యంతో, బంట్ అని కూడా పిలువబడే కన్నడ శెట్టి సంఘం నుండి వచ్చిన వి.టి. రాజశేఖర్‌కు దళిత విముక్తిపై ఉన్న తిరుగులేని వైఖరి నిజంగా విశేషమైనది. చనిపోయే వరకు ఆయన దళితవాద నిబద్ధతతోనే ఉన్నారు. ఆయన తరాన్ని అలా ఉండనివ్వండి, అంటరానితనానికి వ్యతిరేకంగా, దళిత విముక్తి ప్రచారకర్తగా ఆయన లాంటి ఏ ఉన్నత శూద్ర మేధావీ ఇప్పటివరకూ ఉద్భవించలేదు.‘దళిత్ వాయిస్’ని ప్రారంభించిన తర్వాత తన మధ్యతరగతి ఉన్నత కుల స్నేహితులందరినీ కోల్పోయానని ఆయన చెప్పారు.బెంగళూరులోని తన సొంత ఇంటి నుండి ఆ పత్రిక రచన, ముద్రణ, పంపిణీని ఒంటరిగా నిర్వహించారు.మండల్ నిశ్శబ్ద విప్లవం ప్రారంభం కాకముందే ఆయన దళితవాదం వైపు మళ్లారు. అప్పట్లో అంబేడ్కర్ అనంతర దళితులకు ఇంగ్లిష్ చదవడం, రాయడానికి సంబంధించిన పాండిత్యం లేదు. దళిత్ పాంథర్ మరాఠీ సాహిత్య ఉద్యమం కారణంగా దళిత్ అనే పదం కొన్ని మీడియా సర్కిళ్లలో మాత్రమే గుర్తించబడుతోంది.ఆయన కూడా ఒక రిపోర్టర్‌గా బొంబాయి నగరంలో ఉన్నందున, ఏకంగా ఒక పత్రికను ప్రారంభించడం ద్వారా ‘దళిత’ అనే పదాన్ని ప్రాచుర్యంలోకి తేవడంలోని ప్రాముఖ్యతను వెంటనే అర్థం చేసు కున్నారు. కానీ ఒక కన్నడ అగ్ర కుల శూద్ర శెట్టికి ఆ నిర్ణయం తీసుకోవడం, పర్యవసానంగా సామాజిక ఒంటరితనాన్ని ఎదుర్కో వడం, ముఖ్యంగా తన జర్నలిస్టు సర్కిళ్లలో ఒక హింసాత్మక ప్రక్రియ అయి ఉండాలి!ఒక లాభదాయకమైన జర్నలిస్టు ఉద్యోగాన్ని విడిచిపెట్టి, ఆ శీర్షికతో ఆంగ్ల పత్రికను ప్రారంభించడం మండల్‌కు ముందటి పరిస్థితుల్లో ఊహించుకోండి. 2024 లోనే దళిత, ఓబీసీ, ఆదివాసీలకు చెందిన జర్నలిస్టులు ఎంత మంది ఉన్నారని రాహుల్ గాంధీ ఒక జాతీయ మీడియా సమావేశంలో ప్రశ్నించగా, అందులో ఎవరూ చేయి ఎత్తలేదు. అది కూడా ఒక ప్రధాన ప్రతిపక్ష రాజకీయ నేత, విదేశీ మీడియా సమక్షంలో... ఇదీ పరిస్థితి! దేశంలోని ప్రముఖ మీడియాలో ఉన్న ఆంగ్ల బ్రాహ్మణ జర్నలిస్టు కులతత్వపు వలయాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించిన ఒంటరి శూద్రుడు వీటీ రాజశేఖర్ అయివుండాలి! ప్రధాన స్రవంతి మీడియాలోని కులతత్వం కారణంగా ఆయన నిరాశతో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. తన ప్రత్యర్థులతో పోరాడేందుకు రాడికల్ దళిత్ జర్నల్ను ప్రారంభించానని నాకు చెప్పారు.ఆయన భారతదేశంలోని అగ్రవర్ణ జర్నలిజంతో ఎప్పుడూ రాజీ పడలేదు. దళిత్ వాయిస్‌ను ప్రారంభించిన తర్వాత ఆయన కథనాలు ఏ జాతీయ ఆంగ్ల వార్తాపత్రికలోనూ కనిపించలేదు. భారతీయ మీడియా గురించి చర్చ జరిగినప్పుడల్లా ఆయన దాని కులతత్వాన్ని దుయ్యబట్టేవారు. అగ్ర కులాల భారతీయ వార్తాపత్రికలన్నీ ‘టాయి లెట్ పేపర్లు’ అనేవారు. నేను జాతీయ వార్తాపత్రికలలో రాస్తున్నానని తెలుసుకున్నప్పుడు, ఆయన నాతో ‘మీ ఆలోచనలను అగ్రవర్ణాల వారికి అమ్మవద్దు, వారు మారరు’ అన్నారు. వాస్తవానికి నేను చిరునవ్వుతో దానిని అక్కడే వదిలేశాను. ఎందుకంటే ప్రధాన స్రవంతి మీడియాలో వీలైనంత ఎక్కువగా పాల్గొనాలనీ, రాయాలనీ నేను నమ్ముతాను. అలాంటి విభేదాలు ఉన్నప్పటికీ ఆయన చనిపోయే వరకు మా స్నేహం ఆప్యాయంగా కొనసాగింది.దళితులు–ఓబీసీల ఐక్యత కంటే దళితులు–ముస్లింల ఐక్యత గురించి ఆయన ఆలోచన మరింత స్థిరమైనది. దళితుల కంటే ఓబీసీలు ఆర్ఎస్ఎస్/బీజేపీతో కలిసి వెళ్తారని ఆయన అన్నారు. ఆయన ముస్లింగా మారకపోయినా, ఇస్లాం మతానికి బలమైన మద్దతుదారుగా నిలిచారు. తన పాకిస్తాన్ పర్యటనల కారణంగా కొంతకాలం పాటు ఆయన వీసా రద్దు చేయబడింది. ఆయన బలమైన జాత్యహంకార వ్యతిరేకి. యూదులకు వ్యతిరేకంగా పదే పదే వ్యాసాలు రాశారు.తన జీవితం చివరి రోజుల్లో ఆరోగ్య కారణాల వల్ల బెంగళూరు నుండి మంగళూరుకు మారిన తర్వాత ఆయన మౌనం మరింత పెరిగింది. అయినప్పటికీ, తన 80వ దశకం చివరి వరకూ ప్రయాణిస్తూనే ఉన్నారు. 2016లో హైదరాబాద్ సెంట్రల్ యూని వర్సిటీలో రోహిత్ వేముల వ్యవస్థీకృత హత్యకు వ్యతిరేకంగాజరిగిన నిరసన సభకు హాజరయ్యేందుకు వచ్చినప్పుడు నేను చివరిసారిగా ఆయనను కలిశాను. దురదృష్టవశాత్తు క్యాంపస్‌లోకి ప్రవేశించడానికి ఆయనను అనుమతించలేదు. అయినప్పటికీ గేటు వద్ద చాలాసేపు నిల్చొని నిరసన తెలిపారు. అది దళితుల పట్ల ఆయనకున్న నిబద్ధత.ఆయన ఎప్పుడూ ఖాదీ కుర్తా, పైజామా ధరించే వ్యక్తి. ఒక సాధారణ కన్నడ కాంగ్రెస్ రాజకీయ నాయకుడిలా కనిపిస్తారు. కానీ ఆయన నిజమైన మతం మారిన దళిత మేధావి.ఈ సంవత్సరం ప్రారంభంలో పాల్ దివాకర్ బృందం ‘దళిత్ వాయిస్’ను డిజిటలైజ్ చేశారు. ఆ వెబ్సైట్ ప్రారంభోత్సవానికిబెంగళూరు ఇండియన్ సోషల్ ఇన్ స్టిట్యూట్‌కు నన్ను ఆహ్వానించారు. దురదృష్టవశాత్తు నేను వెళ్ళలేకపోయాను. అయితే ఈ లెజెండరీ దళితుడు జీవించి ఉన్నప్పుడే అది జరిగింది.శూద్ర అగ్రవర్ణం నుండి దళితవాదంలోకి మారి, వారి విముక్తి కోసం తన జీవితాంతం పోరాడగలిగే మరో రాజశేఖర్ ఉద్భవిస్తాడని అనుకోలేము. ఆయన దళిత్ వాయిస్ పత్రిక ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఆఫ్రికాలో, అనేక ముస్లిం దేశాలలో ప్రసిద్ధి చెందింది.ప్రపంచంలోని అత్యంత అణగారిన ప్రజల విముక్తి కోసం బతికిన ఆయన ఇంత సుదీర్ఘ జీవితం తర్వాత ఈ భూమిని విడిచి పెట్టారు. కాబట్టి, మనం కూడా జీవించి ఉన్నంత కాలం వీటీ రాజ శేఖర్ జీవితాన్ని, ఆలోచనలను, రచనలను వేడుకగా జరుపుకోవాలి. గుడ్ బై వీటీఆర్.-వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త - ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ -
నాయబ్‌సింగ్ సైనీ అనే నేను..
చండీగఢ్: హరియాణా ముఖ్యమంత్రిగా ఓబీసీ నాయకుడు నాయబ్‌సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం చేశారు. పంచకులలోని దసరా గ్రౌండ్లో గురువారం అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఆయనతో రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. నూతన మంత్రుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. గురువారం వాలీ్మకి జయంతి కావడంతో ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారానికి బీజేపీ నాయకత్వం ఇదే రోజును ముహూర్తంగా ఎంచుకుంది. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, చిరాగ్ పాశ్వాన్తోపాటు బీజేపీ/ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, భూపేంద్ర పటేల్, ప్రమోద్ సావంత్, హిమంత బిశ్వ శర్మ, విష్ణుదేవ్ సాయి, పుష్కర్‌సింగ్ దామీ తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం కంటే ముందు సైనీ గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇటీవల జరిగిన హరియాణా శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను కమలం పార్టీ 48 స్థానాలు గెలుచుకుని వరుసగా మూడోసారి అధికారంలోకి వచి్చంది. మోదీ అభినందనలు హరియాణా సీఎం నాయబ్‌సింగ్ సైనీతోపాటు కొత్త మంత్రులకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. మంత్రివర్గం కూర్పు చక్కగా ఉందని ప్రశంసించారు. ఈ మేరకు గురువారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. హరియాణా ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేరుస్తుందని, రాష్ట్ర అభివృద్ధిని నూతన శిఖరాలకు చేరుస్తుందని పేర్కొన్నారు. పేదలు, రైతులు, యువత, మహిళలతోపాటు సమాజంలోని ఇతర వర్గాల సంక్షేమం, సాధికారత విషయంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందన్న విశ్వాసం తనకు ఉందన్నారు. బీజేపీతో మూడు దశాబ్దాల అనుబంధం బీజేపీ సీనియర్ సీనాయకుడు నాయబ్‌సింగ్ సైనీని మరోసారి అదృష్టం వరించింది. హరియాణా సీఎంగా వరుసగా రెండోసారి ఆయన ప్రమాణం చేశారు. ఈ ఏడాది మార్చి నెలలో ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. మనోహర్‌లాల్ ఖట్టర్ స్థానంలో ఆయనను బీజేపీ అధిష్టానం నియమించింది. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడంతోపాటు ఓబీసీల ఓట్లపై గురిపెట్టిన కమల దళం అదే వర్గానికి చెందిన సైనీని తెరపైకి తీసుకొచి్చంది. ఈ ప్రయోగం సత్ఫలితాలు ఇచి్చంది. హరియాణాలో బీజేపీ వరుసగా మూడోసారి నెగ్గింది. అనూహ్యంగా పార్టీని గెలిపించిన సైనీకే మళ్లీ సీఎం పీఠం దక్కింది. ఆయన సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు. సైనీ 1970 జనవరి 25న అంబాలా జిల్లాలోని మీర్జాపూర్ మాజ్రా గ్రామంలో జని్మంచారు. మూడు దశాబ్దాలుగా బీజేపీలో కొనసాగుతున్నారు. పార్టీలో వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో ఎమ్మెల్యేగా, 2019లో ఎంపీగా గెలిచారు. 2014 నుంచి 2019 దాకా మనోహర్‌లాల్ ఖట్టర్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2023 అక్టోబర్‌లో హరియాణా బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు ఖట్టర్ ఈ ఏడాది మార్చి సీఎం పదవితోపాటు కర్నాల్ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఖట్టర్ స్థానంలో సైనీ ముఖ్యమంత్రి అయ్యారు. మే నెలలో జరిగిన కర్నాల్ ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అక్టోబర్ 5న జరిగిన అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో లాడ్వా స్థానం నుంచి 16,054 ఓట్ల మెజారీ్టతో జయకేతనం ఎగురవేశారు. -
పార్లమెంట్ ఓబీసీ సంక్షేమ కమిటీ సభ్యునిగా బీద మస్తాన్ రావు
ఢిల్లీ, సాక్షి: పార్లమెంట్లో ఓబీసీ సంక్షేమ కమిటీ సభ్యునిగా వైఎస్సార్ర్సీపీ రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు ఎన్నికయ్యారు. ఓబీసీల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ కమిటీ పరిశీలించనుంది. ఎన్నిక పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఎంపీ బీద మస్తాన్‌రావు.. ముందుగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే.. ఓబీసీ లకు ఉద్యోగాలలో తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను కమిటీ తరఫున నిష్పక్షపాతంగా పరిశీలిస్తానని, ఓబీసీల సంక్షేమానికి సంబంధించిన విషయాల్ని పరిశీలించి పార్లమెంటుకు నివేదిక సమర్పిస్తానని చెప్పారు. -
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు!
ముంబై : తన గొంతెమ్మ కోర్కెలతో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఐఏఎస్ పరీక్ష గట్కెక్కేందుకు ఆమె పలు నకిలీ పత్రాలు సమర్పించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతుండగా..తాజాగా ఆమెకున్న కోట్లలో విలువ చేసే ఆస్తులు, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ (ఓబీసీ)నాన్ క్లిమిలేయర్ సర్టిఫికెట్లు మరింత భవిష్యత్తును మరింత ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.పూజా ఖేడ్కర్ ప్రకటన ప్రకారం.. గత ఏడాది తన ఆస్తులు ఎంతున్నాయనే వివరాల్ని జనవరి1,2024 అప్డేట్ చేసింది. వాటి ఆధారంగా పూజా ఖేడ్కర్‌కు మహరాష్ట్రలో సొంతంగా ఐదు ప్లాట్లు,రెండు అపార్ట్మెంట్లు ఉండగా..ఆ మొత్తం స్థిరాస్థుల విలువ రూ.22 కోట్లుగా ఉంది.దీంతో పాటు పూణే జిల్లా మహాలుంగేలో రూ.16 కోట్లు విలువ చేసే రెండు ఫ్లాట్లు, ధడవాలిలో రూ.4 కోట్ల విలువైన రెండు ప్లాట్లు, అహ్మద్‌నగర్‌లోని పచుండేలో రూ.25లక్షలు, నందూర్లో రూ.1 కోటి విలువ చేసే ల్యాండ్లు ఉన్నాయి. పచుండే,నందూరులోని ప్లాట్లు ఆమె తల్లి తనకు బహుమతిగా ఇచ్చినట్లు తెలిపింది. మొత్తం మీద ఆమెకు 22 ఎకరాలకు పైగా భూమి ఉంది.అహ్మద్‌నగర్,పూణేలో రెండు అపార్ట్మెంట్లు ఉన్నాయి. అహ్మద్‌నగర్‌లోని సవేదిలో రూ.45లక్షలు విలువ చేసే 984 చదరపు అడుగుల ఫ్లాట్, పూణేలోని కోంధ్వాలోని 724 చదరపు అడుగుల అపార్ట్మెంట్ విలువ రూ.75 లక్షలుగా ఉన్నట్లు వెల్లడించింది. ఈ మొత్తం ఆస్తుల ద్వారా ఖేడ్కర్ 2014-2019 మధ్య ఏడాదికి రూ.42 లక్షలు సంపాదించారు.పూణేకు చెందిన ఆర్టీఐ కార్యకర్త విజయ్ కుంభార్ ప్రకారం ఆమె తండ్రి ఆస్తుల విలువ రూ.40 కోట్లకు పైమాటే.పైగా ఓబీసీ నాన్ క్రిమిలేయర్ఐఏఎస్ పరీక్ష గట్టెక్కేందుకు పూజా ఖేడ్కర్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ పత్రాలు సమర్పించారు. ఈ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ ప్రయోజనం పొందే అభ్యర్ధుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం లేదా కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు. కానీ ఆమె ఆస్తులు,తల్లిదండ్రుల ఆస్తులు కోట్లలో ఉంటే ఐఏఎస్‌కు ఎలా ఎంపికయ్యారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కాగా పూజా ఖేడ్కర్ వ్యవహారం మరింత వివాదం కావడంతో ఆమె సమర్పించిన డాక్యుమెంట్లను పరీశీలించేందుకు కేంద్రం ఏక సభ్య ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది.రెండు వారాల్లో కమిటీ తన నివేదికను కేంద్రానికి సమర్పించనుంది. -
ప్రభుత్వానికి థాంక్స్.. కేటీఆర్
-
Rahul Gandhi: ప్రధాని మోదీ జన్మతః ఓబీసీ కాదు
ఝార్సుగూడ(ఒడిశా): ప్రధాని మోదీ జన్మతః ఇతర వెనుకబడిన వర్గం(ఓబీసీ)వ్యక్తి కాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తనను తాను ఓబీసీ అని చెప్పుకుంటూ ప్రజలను మోదీ తప్పుదోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. మోదీ ఘాంచి కులంలో పుట్టారని, 2000 సంవత్సరంలో గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం ఈ కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చిందని వివరించారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా గురువారం రాహుల్ గాంధీ ఒడిశాలోని ఝార్సుగూడలో జరిగిన సభలో మాట్లాడారు. గుజరాత్‌కు ముఖ్యమంత్రి అయ్యాక మోదీయే ఈ కులాన్ని ఓబీసీలో చేర్చారు. ఈ దృష్ట్యా, మోదీ పుట్టుకతోనే ఓబీసీకి చెందిన వ్యక్తి కారని పేర్కొన్నారు. అంతకుముందు, మోదీది తెలి కులమని పేర్కొన్న రాహుల్ ఆ తర్వాత తన ఉద్దేశం ఘాంచి కులమంటూ వివరణ ఇచ్చారు. దేశంలో సామాజిక న్యాయం సాధించకుండా ప్రధాని మోదీ కులగణనను ఎప్పటికీ చేపట్టలేరని రాహుల్ చెప్పారు. ఓబీసీలతో కరచాలనం చేయని మోదీ బిలియనీర్లను మాత్రం ఆలింగనం చేసుకుంటారని విమర్శించారు. ‘ఒడిశాలోని గిరిజనుల భూములను లాగేసుకునేందుకు కుట్ర జరుగుతోంది. రాష్ట్రంలోని అధికార బీజేడీ, బీజేపీల మధ్య పీ, డీ తేడా మాత్రమే ఉంది. మిగతాదంతా సేమ్ టూ సేమ్. ఒకే నాణేనికి ఈ పారీ్టలు రెండు పార్శా్వలు’అని రాహుల్ పేర్కొన్నారు. ఒడిశాలో సుమారు 200 కిలోమీటర్ల మేర సాగిన జోడో యాత్ర గురువారం ఛత్తీస్‌గఢ్‌లోకి ప్రవేశించింది. -
పేదరికమొకటే కులమన్నపుడు.. ఓబీసీనని ఎలా చెప్పుకుంటారు?
జగదల్పూర్: దేశంలో పేదరికం ఒక్కటే కులమన్న ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ తాను ఇతర వెనుకబడిన వర్గానికి (ఓబీసీ) చెందిన వాడినని ఎలా చెప్పుకుంటారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిలదీశారు. చత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్లో శనివారం రాహుల్ ఎన్నికల సభలో ప్రసంగించారు. గిరిజనులను ‘ఆదివాసీ’లకు బదులుగా వనవాసీలని సంబోధిస్తూ బీజేపీ వారిని అవమానిస్తోందని అన్నారు. ‘బీజేపీ నాయకులు ఆదివాసీలను వనవాసీలు అనే పేరుతో పిలుస్తున్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ఈ వనవాసీ పదాన్ని పరిచయం చేశాయి. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. మధ్యప్రదేశ్‌లో ఓ బీజేపీ నాయకుడు గిరిజన యువకుడిపై మూత్రం పోశాడు. దీన్ని వీడియో తీసి వైరల్ చేశారు. ఇదీ బీజేపీ ఆలోచనాధోరణి. అడవుల్లో జంతువుల్లా మిమ్మల్ని వారు చూస్తారు’ అని రాహుల్ పేర్కొన్నారు. ఆదివాసీలే దేశానికి అసలు సిసలైన యజమానులు. అందుకే బీజేపీ ఈ పదాన్ని వాడదు. ఆదివాసీలని సం¿ోదిస్తే... మీ భూమి, నీళ్లు, అడవులను మీకు ఇచ్చేయాల్సి వస్తుందని బీజేపీ భయమని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ధ్వజమెత్తారు. -
అధికారంలోకి రాగానే ఓబీసీ గణన
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ / సాక్షి, నాగర్‌కర్నూల్/కల్వకుర్తి/ సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఓబీసీ జనగణన చేపడతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చెప్పారు. దేశంలో 50 శాతానికి పైగా ఉన్న ఓబీసీలు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నారని తెలిపారు. అయితే దేశంలో ఎంతమంది ఓబీసీలు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు ఉన్నారో ఎవరూ చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. బీజేపీ పాలనలో దేశాన్ని నడిపించేది లోక్‌సభ, రాజ్యసభలోని ఎంపీలు కాదని, కేవలం 90 మంది అధికారుల చేతుల్లోనే ఈ ప్రభుత్వం ఉందని చెప్పారు. వీరిలో ముగ్గురు మాత్రమే ఓబీసీలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఓబీసీ అధికారులకు తగిన ప్రాధాన్యత లేదని.. ఓబీసీలకు శక్తి ఇవ్వడానికి బీజేపీ, బీఆర్ఎస్ ఇష్టపడవంటూ మండిపడ్డారు. దేశాన్ని నడిపించే అవకాశం ఓబీసీ, దళిత, గిరిజన, మైనార్టీలకు రాకూడదా? అని ప్రశ్నించారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో కాంగ్రెస్ విజయ భేరి బహిరంగ సభతో పాటు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో, సాయంత్రం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగుల్లో ఆయన మాట్లాడారు. మోదీ, కేసీఆర్‌లు ఉలిక్కిపడేలా చేశా.. ‘దేశంలో, రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్, బీజేపీ విద్వేషాలను పెంచాయి. వీటికి ఎక్కడా స్థానం లేదు. అందుకే నేను ప్రేమ, ఆప్యాయతలు పెంచేలా దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేశా. ఒక బజార్లో నేను ప్రేమను పంచే దుకాణాన్ని తెరిచా. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల సమరం కొనసాగుతోంది. ఓ వైపు దొరలు, కేసీఆర్, కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులు.. మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ఒకటిగా కలిసి పనిచేస్తున్నాయి. ఎక్కడైనా కాంగ్రెస్ పోటీ చేస్తే అక్కడ ఎంఐఎం అభ్యర్థులు ప్రత్యక్షమవుతారు. వారికి బీజేపీ నేతలే డబ్బులు పంపుతారు. కాళేశ్వరంలో కేసీఆర్ దోచుకున్న సొమ్ము కూడా ఆయా రాష్ట్రాల్లోని అభ్యర్థులకు చేరుతోంది. విపక్ష నేతలపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు జరుగుతాయి. సీఎం కేసీఆర్‌పై మాత్రం ఏ దాడులూ ఉండవు. ఇదెందుకో గ్రహించాలి. ప్రధాని మోదీ నన్ను రోజూ తిడుతూనే ఉంటారు. ఆయనతో యుద్ధం చేస్తున్నా. 24 గంటలు తిట్టేలా కదిలించా. నాపై 24 కేసులు పెట్టారు.. నా లోక్‌సభ సభ్వత్వాన్ని రద్దు చేశారు.. ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు కూడా లాక్కున్నారు. అయినా నేను భయపడలేదు. యావత్ హిందుస్తాన్, తెలంగాణే నా ఇల్లు.. అవసరమైతే కోట్లాది మంది ప్రజలే నన్ను అక్కున చేర్చుకుంటారు. కేసీఆర్ కూడా ప్రతి క్షణం ఉలిక్కి పడేలా చేశా. నా పేరు వినపడితే చాలు.. నిద్రలోనూ ఉలిక్కిపడుతున్నారు..’ అని రాహుల్ అన్నారు. ఒక్క ప్రాజెక్టు కూడా సరిగ్గా కట్టలేదు ‘రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరుతో ఇష్టారాజ్యంగా అంచనాలు పెంచారు. లక్ష కోట్ల సొమ్మును సీఎం కేసీఆర్ పేదల జేబు నుంచి లాక్కొని కనీసం ఒక్కదానిని కూడా సరిగ్గా కట్టలేదు. కుంగిపోయిన కాళేశ్వరం బ్యారేజీ నిర్మాణాన్ని సీఎం సమీక్షించాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ ఒక రాజులా పేదలపై పెత్తనం చెలాయిస్తున్నారు. మంత్రిత్వ శాఖల్లో ఎక్కువ డబ్బులు వచ్చే మద్యం, ఇసుక, భూమి వంటి వాటిని కేసీఆర్ కుటుంబ సభ్యులే చూసుకుంటున్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబానికి తప్ప ప్రజలకు లాభం జరగలేదు. అందుకే ప్రజలంతా కేసీఆర్‌కు బైబై అంటున్నారు. కేసీఆర్ దోచిన సొమ్ము కక్కించి ప్రతి పైసా పేదల ఖాతాల్లో వేస్తాం. నేను ప్రధాని మోదీలా కాదు. ఆయనలా మాట తప్పను. ఇచ్చిన మాట ప్రకారం హామీలన్నీ నెరవేరుస్తాం..’ అని చెప్పారు. ప్రతి ఎకరా తిరిగి పేదలకు పంచుతాం.. ‘భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో తీసుకొచ్చిన ధరణి సాంకేతిక పరిజ్ఞానం సాయంతో కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లక్ష ఎకరాలు మాయం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఎకరాను తిరిగి స్వా«దీనం చేసుకుంటాం. ఆ భూములను మళ్లీ పేదలకు పంచి పెడతాం. పేదలకు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం కూడా అందజేస్తాం..’ అని హామీ ఇచ్చారు. కేవలం 2% ఓట్లతో ఓబీసీని సీఎం ఎలా చేస్తారు? ‘తెలంగాణలో బీజేపీ లీడర్లు భుజాలు ఎగిరేసి తిరిగేటోళ్లు. కాంగ్రెస్ పార్టీ వాళ్ల గ్యాస్ తీసేసింది. కారు నాలుగు టైర్లను పంక్చర్ చేసింది. రాష్ట్రంలో ఓబీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ చెబుతోంది. కేవలం 2 శాతం ఓట్లతో సీఎంని ఎలా చేస్తారు. మోదీ అమెరికా వెళ్లి ఓబీసీని ప్రెసిడెంట్ చేస్తామని చెప్పినట్టుగా ఉంది. అమెరికాలో ఓబీసీ ప్రెసిడెంట్‌ను, ఇక్కడ మీరు.. సీఎంను ఏర్పాటు చేయలేరు..’ అని రాహుల్ ఎద్దేవా చేశారు. మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలి: రేవంత్ రాష్ట్రంలో అభివృద్ధితో పాటు మార్పు కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. రూ.లక్ష కోట్లు మింగి కాళేశ్వరం ప్రాజెక్టు సరిగా కట్టలేకపోయారని ఆరోపించారు. మొన్న మేడిగడ్డ కుంగితే, నిన్న సుందిళ్ల పగుళ్లు బారిందని అన్నారు. పని మంతుడు పందిరేస్తే, కుక్క తోక తగిలి కూలిపోయినట్టుగా సీఎం కేసీఆర్ పనితీరు ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి లక్షలాది ఎకరాలకు నీరందించింది కాంగ్రెస్సేనని చెప్పారు. జన గణనతోనే బీసీల అభివృద్ధి: భట్టి నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు కన్నీళ్లే మిగిలాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. బీసీల జనగణన జరిగితేనే బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రతి ఇంటికీ చేర్చాలని, భూసంస్కరణలు తీసుకొచ్చి పేదలకు భూములు పంచిన కాంగ్రెస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. సభల్లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మల్లురవి, పార్టీ అభ్యర్థులు కసిరెడ్డి నారాయణరెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, అనిరుధ్‌రెడ్డి, జి. మధుసూదన్‌రెడ్డి, వీర్లశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇలావుండగా అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన కల్వకుర్తి మండలం జిల్లెలకి చెందిన రైతు చంద్రయ్య కుటుంబసభ్యులను రాహుల్ పరామర్శించారు. చంద్రయ్య భార్య తిరుపతమ్మ, కొడుకు నితిన్‌తో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందంటూ ధైర్యం చెప్పారు. నేడు అంబట్పల్లిలో 5వేల మంది మహిళలతో సభ రాహుల్ గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లికి రానున్నారు. ఇక్కడ 5 వేల మంది మహిళలతో మహిళా సాధికారతపై సభ నిర్వహించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ(లక్ష్మీ బ్యారేజీ)లో పియర్లు కుంగిన ప్రాంతాన్ని కూడా రాహుల్ సందర్శించనున్నారు. దాదాపు మూడు గంటలపాటు అక్కడ ఉంటారని సమాచారం. కాగా హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం కాంగ్రెస్ చేసిన విజŠక్షప్తి మేరకు జిల్లా కలెక్టర్ అనుమతి ఇచ్చారు. రాహుల్‌తో నేతల భేటీ బుధవారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని నోవాటెల్ హోటల్లో కాంగ్రెస్ కీలక నేతలు పలువురు రాహుల్‌తో సమావేశమయ్యారు. రేవంత్, భట్టితో పాటు ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ రాజయ్య, షబ్బీర్ అలీ తదితరులు వీరిలో ఉన్నారు. కొడంగల్ నియోజకవర్గం బీఆర్ఎస్కు చెందిన సుమారు రెండొందల మంది కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. -
ఓ వైపు గాంధీ.. మరోవైపు గాడ్సే: రాహుల్ గాంధీ
భోపాల్: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే లోక్‌సభ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య జరిగే యుద్ధంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అభివర్ణించారు. ఒక వైపు మహాత్మాగాంధీ, మరోవైపు ఆయనని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే మధ్య ఎన్నికల పోరు జరగనుందన్నారు. తాము అధికారంలోకి వస్తే ఓబీసీల సంఖ్య తెలుసుకోవడానికి కులగణన చేపడతామని చెప్పారు. ఈ డిసెంబర్లో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌లోని షాజపూర్‌లో జన ఆక్రోశ్ ర్యాలీలో రాహుల్ గాంధీ శనివారం పాల్గొన్నారు. ‘‘ఈ సారి ఎన్నికల పోరు రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, మరోవైపు బీజేపీ, ఆరెస్సెస్, ఒక వైపు మహాత్మాగాంధీ మరోవైపు గాడ్సేలు నిలిచి పోరాడతారు. ప్రేమ, సోదరభావం ద్వేషానికి మధ్య ఈ పోరాటం ఉంటుంది’’ అని రాహుల్ చెప్పారు. బీజేపీ ప్రజలకి ఏం ఇస్తే వారు అదే తిరిగి ఇస్తారని, ఇన్నాళ్లూ బీజేపీ వారిలో విద్వేషం నింపిందని, ఇప్పుడు ప్రజలే బీజేపీని ద్వేషిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. ఈ దేశంలో ఆరెస్సెస్‌కు చెందిన కొందరు కేంద్ర ప్రభుత్వ అధికారులే చట్టాలు చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారని, బీజేపీ ప్రజాప్రతినిధులకి ఎలాంటి పాత్ర లేదని అన్నారు. ఆరెస్సెస్ చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం ఆడుతోందని రాహుల్ ఆరోపించారు. అవినీతి కేంద్రంగా ఎంపీ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కుల ప్రాతిపదికన జనాభా గణన చేపడతామని రాహుల్ మరోసారి స్పష్టం చేశారు. ఇతర వెనుకబడిన కులాల (ఓబీసీ) సంఖ్యను తెలుసుకోవడానికే కుల గణన చేపడతామన్నారు. అవినీతికి మధ్యప్రదేశ్ కేంద్రంగా మారిందని రాహుల్ ఆరోపించారు. బీజేపీ హయాంలో గత 18 ఏళ్లలో 18 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని రాహుల్ చెప్పారు. -
మహిళా రిజర్వేషన్ బిలుపై బీజేపీ నాయకురాలు అసంతృప్తి
న్యూఢిల్లీ: కొత్త పార్లమెంట్ భవనంలో మొదటి బిల్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టిన బీజేపీ ప్రభుత్వం ఈసారి బిల్లు ఆమోదం పొందుతుందన్న ఆశాభావంతో ఉండగా సీనియర్ బీజేపీ నేత ఉమాభారతి బిల్లుపై అసంతృప్తిని వ్యక్తం చేసారు. బిల్లులో ఓబీసీ మహిళల ప్రస్తావన లేకవడం నిరాశ కలిగించిందన్నారు. ప్రధానికి లేఖ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ మహళలకు ముస్లిం మైనారిటీ మహిళలకు చోటు కల్పించకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు సీనియర్ బీజేపీ నేత ఉమాభారతి. ఈ సందర్బంగా ఆమె ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఎట్టకేలకు పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడం చాలా సంతోషంగా ఉంది. కానీ బిల్లులో ఓబీసీల ప్రస్తావన లేకపోవడం నిరాశ కలిగించిందన్నారు. నమ్మకం కోల్పోతాం.. మొత్తం 33 శాతం రిజర్వేషన్లలో సగం ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ, వెనుకబడిన ముస్లిం మహిళలకు కేటాయించాలని కోరారు. లేదంటే వెనుకబడిన బీసీ ముస్లిం మహిళలలోనూ ఓబీసీ మహిళలలోనూ పార్టీ నమ్మకాన్ని కోల్పోతుందని అన్నారు. గతంలో హెచ్డి దేవెగౌడ ప్రభుత్వం ఇలాంటి బిల్లునే ప్రవేశ పెట్టగా అందులో కూడా తాను కొన్ని మార్పులు సూచించానని అటుపై ఆ బిల్లు స్టాండింగ్ కమిటీకి పంపించారని గుర్తు చేశారు. బిల్లు ఆమోదం పొందాలంటే.. ఇక మహిళా రిజర్వేషన్ బిల్లు సాకారం కావాలంటే రాజ్యాంగంలోని 239-ఏఏ, 330, 332, 334 అధికరణల సవరణ అవసరమని బిల్లులో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అలాగే జనగణన, డీలిమిటేషన్ తర్వాతే మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వచ్చాక పదిహేనేళ్ల పాటు అమలవుతుందని, తర్వాత ప్రత్యేక చట్టం ద్వారా చట్టాన్ని కొనసాగించాల్సి ఉంటుందని ప్రభుత్వం బిల్లులో పేర్కొంది. ఇది కూడా చదవండి: రాజ్యాంగంలో ఆ 'రెండు' పదాలు మిస్సింగ్: అధిర్ రంజన్ చౌదరి -
మహిళా రిజర్వేషన్ బిల్లు చరిత్రాత్మకం
సాక్షి, హైదరాబాద్: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌కు సంబంధించిన బిల్లు ఆమోదం విషయంలో కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. సోమవారం రాత్రి తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడాన్ని స్వాగతించారు. బిల్లులో పేర్కొన్న అంశాలపై స్పష్టత ఇవ్వాలని, ఆమోదంలో ఎలాంటి అడ్డంకులు తలెత్తకుండా చూడాలన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాల్సిందిగా ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు రోజుల క్రితం లేఖ రాసిన విషయాన్ని కవిత గుర్తు చేశారు. ఇదే తరహాలో చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్ బిల్లును కూడా ప్రవేశ పెడితే తాము మద్దతు ఇస్తామని కవిత ప్రకటించారు. కాగా మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో హైదరాబాద్‌లోని ఎమ్మెల్సీ కవిత నివా సం వద్ద సంబురాలు జరి గాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరు తూ ఇటీవల 40కి పైగా రాజకీయ పార్టీల నేతలకు ఎమ్మెల్సీ కవిత లేఖలు రాసిన విషయా న్ని ప్రస్తావిస్తూ మిఠాయిలు పంచారు. -
గ్రీజ్ అంటిన చేతితో తాకాడని.. దళితుడి ఒంటికి మలం రాశాడు!
చత్తర్‌పూర్: అనుకోకుండా గ్రీజ్ పూసిన చేతితో తాకినందుకు ఓబీసీ కులానికి చెందిన ఓ వ్యక్తి తనకు మలం పూశాడంటూ మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ దళితుడు ఆరోపించడం కలకలం రేపుతోంది. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. దశరథ్ అహిర్వార్ అనే వ్యక్తి బికౌరా గ్రామంలో పంచాయతీ మురుగుకాల్వ నిర్మాణ పనులు చేస్తున్నాడు. సమీపంలోని చేతి పంపు వద్ద రామ్‌కృపాల్ పటేల్ స్నానం చేస్తున్నాడు. గ్రీజ్ అంటిన చేతితో తాకడంతో ఆగ్రహించిన పటేల్ చేతిలోని మగ్గుతో మలాన్ని తీసుకువచ్చి అహిర్వార్ ముఖం, తల సహా ఒంటిపై రాశాడు. కులం పేరుతో దూషించాడు. పంచాయతీ పెద్దలు అహిర్వార్కు రూ.600 జరిమానా కూడా విధించారు. బాధితుడు కేసు పెట్టడంతో పటేల్‌పై కేసు నమోదయ్యాయి. వారు సరదాగా వస్తువులు విసిరేసుకున్నారు. అది కాస్తా ఇలా వికటించినట్టు విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు. కాగా, మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో గిరిజన యువకుడిపై ఒక వ్యక్తి మూత్రవిసర్జన చేసిన ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైన విషయం తెలిసిందే. -
ఎస్పీకి ఎదురుదెబ్బ... ఎన్డీయే కూటమిలో చేరిన కీలక పార్టీ..
లక్నో: 2024 ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. దేశంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇటు ప్రతిపక్ష పార్టీలన్నీ కూటమి దిశగా పావులు కదుపుతుండగా.. అటు.. ఎన్డీయే తన మిత్ర పక్షాలన్నిటినీ ఏకం చేయడానికి జులై 18న సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లో సమాజ్ వాదీ పార్టీకి రెండోసారి ఎదురుదెబ్బ తగిలింది. తన మద్దతుదారైన సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్బీస్పీ) బీజేపీతో చేతులు కలిపింది. మరో ఎమ్మెల్యే దారా సింగ్ చౌహాన్ కూడా బీజేపీలో చేరనున్నారు. తూర్పు యూపీలో ఓబీసీ సామాజిక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్బీస్పీ) ఎన్డీయే గూటికి చేరింది. ఈ మేరకు సామాజిక న్యాయం, దేశ భద్రత, వెనకబడిన, అణగారిన వర్గాల అభివృద్ధి కోసం బీజేపీతో కలిసి పోరాడేందుకు సిద్ధమైనట్లు ఆ పార్టీ అధినేత ఓం ప్రకాశ్ రాజ్‌భర్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రధాని మోదీకి, హోం మంత్రి అమిత్ షాకు, సీఎం యోగి ఆదిత్య నాథ్‌కు ధన్యవాదాలు తెలిపారు. भाजपा और सुभासपा आए साथ सामाजिक न्याय देश की रक्षा- सुरक्षा, सुशासन वंचितों, शोषितों, पिछड़ों, दलितों, महिलाओं, किसानों, नौजवानों, हर कमजोर वर्ग को सशक्त बनाने के लिए भारतीय जनता पार्टी और सुहेलदेव भारतीय समाज पार्टी मिलकर लड़ेगी। pic.twitter.com/CDMXCc9EAM — Om Prakash Rajbhar (@oprajbhar) July 16, 2023 యూపీలో యోగీ ఆదిత్యనాథ్ మొదటిసారి సీఎంగా ఉన్న కాలంలో ఓం ప్రకాశ్ మంత్రి పదవి పొందారు. ఆ తర్వాత దానికి రాజీనామా చేసి సమాజ్‌వాదీ పార్టీ తరపున చేరి 2022 ఎన్నికలో పోరాడారు. ప్రస్తుతం మళ్లీ ఎన్డీయే గూటికి చేరారు. దీనిపై బీజేపీపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 2024 ఎన్నికల్లో తమ 'వెనకబడిన, దళిత, మైనారిటీ' ఫార్ములాకు బీజేపీ భయపడిందని ఆరోపించారు. తిట్టినవారిని కూడా బీజేపీ తమ వర్గంలో కలిపేసుకుంటున్నారని అన్నారు. ఎస్బీస్పీ ఎన్డీయేలో చేరినప్పటికీ ఆ పార్టీ ఓటర్ల మద్దతు తమకే ఉంటుందని ఎస్పీ నాయకులు చెప్పారు. #WATCH | SBSP chief Om Prakash Rajbhar speaks on his decision of joining the NDA alliance "We met Union Home Minister Amit Shah on July 14 and discussed various issues and decided to fight the 2024 elections together. I want to thank PM Modi, HM Amit Shah, CM Yogi Adityanath… pic.twitter.com/gvI0whp1dl — ANI (@ANI) July 16, 2023 సమాజ్‌వాదీ పార్టీకి చెందిన దారా సింగ్ చౌహాన్ నిన్ననే తన అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. బీజేపీతో కలవడానికి అమిత్ షాను కలిశారు. ఈయన కూడా ఒకప్పుడు యోగీ వర్గం నుంచి రాజీనామా చేసి 2022లో బీజేపీకి వ్యతిరేకంగా ఎస్పీ తరపున పోరాడారు. తూర్పు యూపీ నుంచి బీసీ సామాజిక వర్గానికి ప్రాతినిథ్యం వహించిన చౌహాన్ మళ్లీ ఇప్పుడు సొంత గూటికే చేరారు. ఇదీ చదవండి: ఉత్తరాదిలో దంచికొడుతున్న వానలు.. మళ్లీ యమునకు పోటెత్తిన వరద.. రెడ్ అలర్ట్ జారీ.. -
త్రిముఖ పోరులో కన్నడనాట కులాల కోలాటం.. కరుణ కోసం పార్టీల ఆరాటం
మన దేశంలో ఎన్నికలంటేనే కులం చుట్టూ తిరుగుతుంటాయి. అందులోనూ కర్ణాటక రాజకీయాల్లో కులాలు, మతాల పాత్ర మరీ ఎక్కువ. లింగాయత్, వొక్కలిగ, ఓబీసీ, ముస్లిం వర్గాలు నాలుగు స్తంభాలుగా ఎన్నికల ఫలితాలను శాసిస్తూ వస్తున్నాయి. అందుకే మరోసారి వారి మనసు చూరగొనేందుకు బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్) సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి... కర్ణాటకలో త్రిముఖ పోరు నేపథ్యంలో కులాలవారీగా ఓటర్లను ఆకర్షించడంలో బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. జేడీ(ఎస్) మాత్రం ప్రధానంగా రాష్ట్ర జనాభాల్లో లింగాయత్‌ల తర్వాత అత్యధికంగా 15% ఓటర్లున్న వొక్కలిగ ఓటు బ్యాంకునే నమ్ముకుంది. 59 అసెంబ్లీ స్థానాలున్న పాత మైసూరు ప్రాంతంలో వొక్కలిగలు ఇప్పటికీ మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడను ఎంతగానో ఆరాధిస్తారు. ఆ ఓటు బ్యాంకును చీల్చే లక్ష్యంతో ఎన్నికల ముందు నుంచే కోటా రాజకీయాలకు బీజేపీ తెర తీసింది. దాంతో దాన్ని ఎలాగైనా కాపాడుకునే పనిలో జేడీ(ఎస్) తలమునకలుగా ఉంది. కోటాతో రాజకీయ ఆట అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే అధికార బీజేపీ అన్ని సామాజిక వర్గాల ఓట్లూ రాబట్టేలా వ్యూహాలు పన్నడం మొదలు పెట్టింది. 2018 ఎన్నికల్లో 100కు పైగా స్థానాలు సాధించినా మెజారిటీ మాత్రం అందలేదు. పాత మైసూరులోని 59 సీట్లలో ఆరు మాత్రమే దక్కడం అందుకు ప్రధాన కారణం. దాంతో ఈసారి సరిగ్గా ఎన్నికల వేళ ముస్లింల 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ సంచలనం నిర్ణయం తీసుకోవడమే గాక వాటిని బలమైన సామాజిక వర్గాలైన లింగాయత్, వొక్కలిగలకు చెరో 2 శాతం చొప్పున పంచింది. ఈ నిర్ణయం పాత మైసూరు ప్రాంతంలో తమ భాగ్యరేఖలను కాస్త మెరుగు పరుస్తుందని ఆశ పడుతోంది. అలాగే ఎస్సీ రిజర్వేషన్లను 15 నుంచి 17 శాతానికి పెంచడమే గాక అంతర్గత కోటాను అమలు చేయాలని కూడా నిర్ణయించింది. ఈ నిర్ణయాలను లింగాయత్‌లు, దళితుల్లో ఒక వర్గం ఆహ్వానించినా ముస్లింలు భగ్గుమంటున్నారు. బంజారాల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అంతర్గత రిజర్వేషన్లతో తమకు మరింత అన్యాయం జరుగుతుందన్న భయం వారిలో ఉంది. పాత మైసూరులో బీజేపీ ఏకంగా 41 మంది వొక్కలిగలకు టికెట్లిచ్చింది! వీరు వ్యవసాయం మీద ఆధారపడ్డవారే కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ కార్యక్రమాలు బాగా జనంలోకి వెళ్లేలా ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తరచూ పాత మైసూరులో పర్యటిస్తున్నారు. హింద్ వర్సెస్ అహిందా లింగాయత్, బ్రాహ్మణుల ఓట్లతో పాటుగా హిందూత్వ ఓటు బ్యాంకునే బీజేపీ బాగా నమ్ముకుంది. హిందూత్వ, దేశభక్తి, అభివృద్ధి నినాదాలతో ఓట్లు రాబట్టజూస్తోంది. బాహుబలిగా పేరొందిన లింగాయత్ నేత బి.ఎస్.యడియూరప్పనే ముందుంచి ఎన్నికల వ్యవహారాలను నడిపిస్తోంది. 51 మంది లింగాయత్‌లకు టికెట్లిచ్చింది. కానీ బలమైన లింగాయత్ నేతలైన మాజీ సీఎం జగదీశ్ శెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాది పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం బీజేపీలో తాజాగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తాను కనీసం 25 సీట్లలో బీజేపీ అవకాశాలకు గండి కొడతానన్న శెట్టర్ హెచ్చరికలను వారు గుర్తు చేస్తున్నారు. ఓబీసీలు ఎటువైపో...! వీరశైవ లింగాయత్‌లలో బీజేపీ ఓట్లలో 2 నుంచి 3% తమకు వస్తాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. హిందూత్వకు పోటీగా అహిందా (ఓబీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ) నినాదంతో ఓట్లు కొల్లగొట్టే పనిలో పడింది. ఓబీసీల్లో ఒకప్పుడు కాంగ్రెస్‌కు ఓటుబ్యాంకుగా ఉన్న బిల్వాస్, మొగవీరాస్, విశ్వకర్మ, కొలిస్‌లు కొన్నేళ్లుగా బీజేపీ వైపు తిరిగారు. ఈసారి లింగాయత్, వొక్కలిగలు ఏ ఒక్క పార్టీకీ పూర్తిస్థాయిలో మద్దతునిచ్చే అవకాశాలు లేవన్న అభిప్రాయాల నడుమ ఈ ఓబీసీల ఓటు బ్యాంకే కీలకంగా మారింది. వారి ఓటుబ్యాంకును ఈసారి బీజేపీ నిలబెట్టుకోని పక్షంలో దానికి కాంగ్రెస్ నుంచి గట్టి ముప్పు పొంచి ఉన్నట్టే! – సాక్షి, నేషనల్ డెస్క్ -
తెలంగాణలో ఓబీసీలకు సముచిత స్థానం.. ప్రధాని హామీ: సురేష్
సాక్షి, హైదరాబాద్: ఓబీసీలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని ఓబీసీ మోర్చా సోషల్ మీడియా జాతీయ సభ్యులు పెరిక సురేష్ పేర్కొన్నారు. ప్రతాప్‌గఢ్ ఎంపీ సంగమ్ లాల్ ఆధ్వర్యంలో ఓబీసీ మోర్చా ప్రతినిధులు ప్రధాని నరేంద్రమోదీని కలిసి ఓబీసీల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ అంశంపై సానుకూలంగా స్పందించారు. దేశంలో సామాజిక, ఆర్థిక అసమానతలను రూపుమాపడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని, వెనుక బడిన వర్గాలకు వెన్ను దన్నుగా నిలిచి తోడ్పాటు అందిస్తామని హామీ నిచ్చినట్లు సురేష్ తెలిపారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ వ్యతిరేక విధానాలతో ఓబీసీలు విసిగిపోయి బీజేపీ పట్ల ఆకర్షితులు అవుతున్నారని అన్నారు. ప్రస్తుతం బీజేపీలో ఓబీసీలకు తగిన ప్రాధాన్యం కల్పిస్తున్నారని, అయితే జనాభాకు అనుగుణంగా ఓబీసీలకు పార్టీలో మరింత ప్రాధాన్యత కల్పించాలని ప్రధాని మోదీని కోరినట్లు వెల్లడించారు. పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని, అందరి కృషితో రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, ఓబీసీలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని ప్రధాని హామీనిచ్చారని సురేష్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. చదవండి: పేపర్ లీక్ కేసులో కీలక ట్విస్ట్.. -
బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు
ఏలూరు (టూటౌన్): స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్ చెప్పారు. బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఏలూరులో ఆదివారం నిర్వహించిన సామాజిక చైతన్యసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బీసీల అభివృద్ధి, సంక్షేమానికి ప్రధాని మోదీ పెద్దపీట వేస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా గత పాలకుల విధానాల కారణంగా చేతివృత్తులు అంతరించిపోయే పరిస్థితి దాపురించిందని చెప్పారు. బీసీలను లక్ష్యంగా చేసుకుని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు తర్వాత వారిని చిన్నచూపు చూస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో తమ మిత్రపక్షమైన జనసేనతో కలిసి పనిచేస్తామని ఆయన చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ అధికారంలోకి రావడానికి సహకరించిన కేఈ కృష్ణమూర్తిని టీడీపీ నేత చంద్రబాబు నాయుడు పక్కనబెట్టారన్నారు. ఏపీలో బీసీలను అభివృద్ధి చేయడంలో, రాజకీయంగా ముందుంచడంలో బీజేపీ కృషిచేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో 56 కార్పొరేషన్లు ఉన్నాయని, బీజేపీ అధికారంలోకి వస్తే కార్పొరేషన్లకు రూ.10 వేలకోట్లు, కాంట్రాక్టులు ఇస్తామని చెప్పారు. రూ.3 వేల కోట్లతో మొక్కలు పెంచే కార్యక్రమాన్ని బీసీ కార్పొరేషన్లకే ఇస్తామన్నారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపీశ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఆరుజిల్లాలకు చెందిన మోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
BP Mandal: మండల్ దన్నుతో ఉద్యమించాలి!
ఇండియా జనాభాలో సగాని కన్నా ఎక్కువ ఉన్న వెనుక బడిన తరగతులవారు (బీసీలు)... తరతరాలుగా భారతీయ సమాజానికి సేవ చేస్తున్నారు. కానీ వారు మాత్రం అన్ని రంగాల్లో వెనక బడే ఉన్నారు. అందుకే బీసీల సామాజిక, ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేయడం కోసం 1953 జనవరిలో కాకా కలేల్కర్ కమిషన్‌ను అప్పటి ప్రభుత్వం నియమించింది. 1955 మార్చిలో కమిషన్ నివేదిక సమర్పించి బీసీల అభివృద్ధికి పలు సూచనలు చేసింది. ఆ నివేదికను ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. 1977లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక... కాక కలేల్కర్ కమిషన్ నివేదిక సమర్పించి చాలా ఏండ్లు అయిందని... కొత్త కమిషన్‌ను 1978 డిసెంబర్లో నియమించింది. దీనికి బిహార్ మాజీ ముఖ్య మంత్రి బీపీ మండల్ సారధ్యం వహించారు. మండల్ 1980 డిసెంబర్ 31న నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. కానీ దాని సూచనలు అమలుకు నోచుకోలేదు. దీంతో బీసీలంతా ఉద్యమించారు. బహుజన్ సమాజ్ పార్టీ ఉద్యమానికి అండగా నిలిచింది. చివరికి అప్పటి ప్రధాని వీపీ సింగ్ 1990 ఆగస్టు 7న మండల్ నివేదికను అమలు పరుస్తానని ప్రకటన చేశారు. ప్రధాని ప్రకటనతో దేశవ్యాప్తంగా ఆధిపత్య కులాలు ఆందోళనకు దిగాయి. అన్ని పార్టీలు మండల్ నివేదికకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేశాయి. బయట నుండి వీపీ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న బీజేపీ తన మద్దతును ఉపసంహరించి తానెవరి వైపో తేల్చి చెప్పింది. మండల్ కమిషన్‌ను అమలు చేయరాదని ఆధిపత్య కులాల వారు కోర్టును ఆశ్రయించారు. చివరకు 1993లో మండల్ నివేదిక అమలుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో బీసీలకు కేంద్ర విద్యాసంస్థల్లో, సర్వీసుల్లో 27 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. కేంద్ర రిజర్వేషన్ సౌకర్యం పొందే బీసీలను ‘అదర్ బ్యాక్వార్డ్ క్లాసెస్’ (ఓబీసీలు)గా వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద మండల్ కమిషన్ బీసీల అభివృద్ధికి 40 సూచనలు చేయగా అందులో ఒకటైన విద్యా, ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని మాత్రమే అమలుచేసి అప్పటి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. బీసీల అభ్యున్నతికి విలువైన సూచనలు చేసిన బీపీ మండల్ బీసీల మదిలో ఎప్పటికీ నిలిచిపోతారు. ఆయన 1918 ఆగస్టు 25న బిహార్ మధేపూర్ జిల్లా మోరో గ్రామంలో... రాస్ బీహారీ లాల్ మండల్ జమీందారీ కుటుంబంలో జన్మించారు. 1952 మొదటి సారిగా శాసనసభకు ఎన్నికైన మండల్ ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. రామ్ మనోహర్ లోహియా నాయకత్వంలో పనిచేసిన మండల్ 1967 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 69 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. దీంతో 1968 ఫిబ్రవరిలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. (క్లిక్: వారి విడుదల దేనికి సంకేతం?) బయట నుండి మద్దతునిచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకుల అవినీతిపై విచారణ జరిగితే... ఆ విచారణ నివేదికను బుట్టదాఖలు చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల్‌పై ఒత్తిడి చేసింది. అయినా నిజాయితీగా కాంగ్రెస్ అవినీతి నాయకులపై చర్య తీసుకున్నారు. దాంతో కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం కూలిపోయింది. నీతి కోసం నిలబడిన గొప్ప నాయకుడు బీపీ మండల్. 1974లో ఎమ్మేల్యే పదవికి రాజీనామా చేసి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ నాయకత్వంలో అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని 1977లో జనతా పార్టీ తరఫున లోకసభకు ఎన్నికయ్యారు. కులాలుగా చీలిపోయి ఉన్న బీసీలు ఏకమై... పార్టీలకు, సంఘాలకు అతీతంగా ఐక్యమై బీపీ మండల్ కమిషన్ ఇచ్చిన స్థైర్యంతో ముందుకు సాగి తమ హక్కులను సాధించుకోవాలి. (క్లిక్: 75 ఏళ్లుగా ఉరుకుతున్నా... ఉన్నకాడే!) - సాయిని నరేందర్ బీసీ స్టడీ ఫోరం వ్యవస్థాపక చైర్మన్ (ఆగస్టు 25న బీపీ మండల్ జయంతి) -
ఢిల్లీలో ఆగస్టు 7న జాతీయ ఓబీసీ మహాసభలు
కవాడిగూడ (హైదరాబాద్): బీసీలకు ఉద్యోగ, సామాజిక, ఆర్థిక రాజకీయ రంగాల్లో జనాభా దామాషా పద్ధతిపై ప్రాతినిధ్యం దక్కాలని కోరుతూ ఆగస్టు 7న ఢిల్లీలో తల్కటోర స్టేడియంలో జాతీయ ఓబీసీ మహాసభలను నిర్వహిస్తున్నట్లు కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్‌చారి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌లు తెలిపారు. మహాసభకు సంబంధించిన పోస్టర్‌ను దోమలగూడలోని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో గురువారం వారు ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్‌గౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఆగస్టు 7న అఖిల భారత ఓబీసీ మహాసభ: జాజుల
కవాడిగూడ (హైదరాబాద్): విద్య, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బీసీల జనాభా దామాషా పద్ధతిన ప్రాతినిధ్యం దక్కాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధంగా బీసీలకు రావాల్సిన హక్కుల కోసం ఆగస్టు 7న ఢిల్లీలో అఖిల భారత జాతీయ ఓబీసీ మహాసభను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. శనివారం ఈ మహాసభకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను దోమలగూడలోని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ప్రతిని«ధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ 75 ఏళ్ల స్వాతంత్ర పాలనలో 60%పైగా ఉన్న బీసీలకు 15% ప్రాతినిధ్యం కూడా ప్రభుత్వాలు కల్పించకపోవడం దురదృష్టకరమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తక్కువ బడ్జెట్ కేటాయిస్తున్నారని మండిపడ్డారు. -
ఓబీసీ నేతల జంప్.. కీలకంగా మారిన కేశవ్ ప్రసాద్.. యోగి లేకుంటే సీఎం అయ్యేవారే!
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లో కాషాయ పార్టీకి పట్టుకొమ్మలుగా ఉన్న ఓబీసీ నేతలు ఒక్కొక్కరుగా నిష్క్రమిస్తున్న వేళ... సామాజిక సమీకరణాలు మారకుండా చూసుకునేందుకు పార్టీ నమ్ముకున్న ఏకైక వ్యక్తి ‘కేశవ్ ప్రసాద్ మౌర్య’. ఐదేళ్ల కిందట యూపీ పీఠాన్ని అధిరోహించేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ముందుండి నాయకత్వం వహించిన ఆయనే ప్రస్తుత ఎన్నికల్లో పార్టీకి పెద్దదిక్కుగా మారారు. ఓబీసీల్లో బలమైన పట్టున్న కేశవ్ప్రసాద్నే ప్రధాన ముఖంగా పెట్టి ఎన్నికలను ఢీకొనే కార్యాచరణను తీసుకోవడంతో ఆయన ప్రాధాన్యం మరింత పెరిగింది. 2017లోనే ముఖ్యమంత్రి పదవికి ఆయన బలమైన పోటీదారుగా ఉన్నప్పటికీ, ఆశ్చర్యకరంగా యోగి ఆదిత్యనాథ్ తెరపైకి రాగా, ఈ మారు మాత్రం మౌర్యను సీఎంగా చూడాలనుకుంటున్న నేతల సంఖ్య గణనీయంగా పెరగడం ఆయన ఛరిష్మాను చెప్పకనే చెబుతోంది. (చదవండి: స్కూలు విద్యార్థి ఆత్మహత్య కేసులో దోషుల్ని విడిచిపెట్టం) సంఘ్ నుంచి డిప్యూటీ దాకా... యూపీలో అధికంగా ఓబీసీ వర్గాలకు చెందిన వారు 42 శాతం వరకు ఉండగా, వర్గాల్లో అధిక పట్టు కలిగిన వర్గంగా మౌర్యాలు ఉన్నారు. మౌర్య వర్గానికి చెందిన కేశవ్ ప్రసాద్‌కు తొలినుంచి జన్‌సంఘ్ బజ్రంగ్దళ్తో అనుబంధం ఉంది, గోసంరక్షణ, రామజన్మభూమి ఉద్యమాల్లో పాల్గొన్న కేశవ్‌ప్రసాద్ అనంతరం బీజేపీలో చేరి వివిధ విభాగాల్లో పనిచేశారు. అనంతరం 2002, 2007లో సిరతు నియోకవర్గం నుంచి ఓడిన కేశ్ప్రసాద్ తదనంతరం 2012లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 2014 ఎన్నికల్లో పుల్పూర్ స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు. జవహార్‌లాల్ నెహ్రూ ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండగా, దాన్ని బద్ధలు కొట్టడంతో ఈయన పేరు అందరికీ తెలిసింది. అనంతరం 2016లో సంఘ్ జోక్యంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల నాయకత్వ బాధ్యతలను పూర్తిగా తనపై మోసిన కేశవ్‌ప్రసాద్ ఏకంగా 200 ర్యాలీలు చేపట్టి 312 సీట్లు రావడంలో కీలకపాత్ర పోషించారు. ఈ సమయంలోనే కేశవ్‌ప్రసాద్‌ను సీఎంను చేస్తారని అంతా భావించినా అనూహ్యంగా యోగి తెరపైకి రావడంతో ఆయన ఎమ్మెల్సీగా ఎంపిక చేసి డిప్యూటీ సీఎం చేశారు. పీడబ్ల్యూడీ మంత్రిగా యూపీ అభివృధ్ధిలో తనదైన ముద్ర వేసిన కేశవ్‌ప్రసాద్ తనకిచ్చిన పనిని చేసుకుంటూ వెళ్లారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీకి చెందిన ఇద్దరు ఓబీసీ మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, ధారాసింగ్ చౌహాన్లు పార్టీని వీడటంతో పార్టీ ఒక్కసారిగా ఖంగుతింది. ఈ సమయంలో కేశవ్‌ప్రసాద్ మౌర్య అత్యంత కీలకంగా వ్యవహరించి, మరింతమంది ఓబీసీ నేతలు జారిపోకుండా చర్యలు చేపట్టారు. అదీగాక సమాజ్‌వాదీ పార్టీలో బలంగా ఉన్న యాదవేతర నేతలు బీజేపీలో చేరేలా కృషి చేశారు. దీంతో పాటే పార్టీ మిత్రపక్షాలు, అప్నాదళ్, నిషాద్ పార్టీలతో కేశవ్ మౌర్యకు ఉన్న మంచి సంబంధాలను దృష్టిలో పెట్టుకొని పార్టీ ఆయనకు సీట్ల సర్దుబాటుకు ప్రధాన అనుసంధాన కర్తగా పెట్టింది. ఆయన వల్లే సీట్ల సర్దుబాటు అంశం సాఫీగా సాగిందనే భావన ఉంది. ఇక ఆయను ప్రస్తుత ఎన్నికల్లో పోటీచేయించే అంశమై చర్చోపచర్చలు జరగ్గా, తన సొంత నియోకవర్గం సిరాతు నుంచి పోటీ చేసేందుకు ఆయన మొగ్గు చూపారు. ఈ స్థానంలో సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే శీతలా ప్రసాద్ సైతం కేశవ్‌ప్రసాద్‌కు సిరాత్ టిక్కెట్ కేటాయించడాన్ని స్వాగతించారు. తన గురువు కోసం సీటును త్యాగం చేయడం తనకేబి ఇబ్బందిగా లేదని ప్రకటించిందంటే కేశవ్‌ప్రసాద్‌పై లాంటి వ్యక్తో అర్థం చేసుకోవచ్చు. (చదవండి: ఆయనొక క్రౌడ్ పుల్లర్.. మాటలు తూటాల్లా పేలుతాయ్..) -
UP Assembly Election 2022: నువ్కొకటి కొడితే... నేను రెండేస్తా!
ఇప్పుడు సరిగ్గా.. ఇదే పంథాలో ఉత్తరప్రదేశ్ రాజకీయ యవనికపై టిట్ ఫర్ టాట్ క్రీడ రక్తికడుతోంది. అబ్బురపరిచే ఎత్తులతో సమాజ్‌వాదీ పార్టీ, బీజేపీ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. హిందుత్వ కార్డుతో ఓటర్లు సంఘటితం కాకుండా చూసుకుంటే సగం యుద్ధం గెలిచినట్లేనని భావించిన ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్... చాణక్యాన్ని ప్రదర్శించారు. కీలకమైన ఓబీసీ నేతలను లాగేశారు. తామేమి చేయకపోతే చేష్టలుడిగి చూస్తుండిపోయిందనేది ప్రజల్లోకి వెళుతుందని... దిక్కుతోచని స్థితిలోకి బీజేపీ వెళ్లిపోయిందని భావిస్తారని కమలదళం భయపడింది. ఎత్తుకు పైఎత్తుకు వేసింది. చిన్న కోడలు అపర్ణా యాదవ్‌ను లాగేయడం ద్వారా ములాయం సింగ్ ఇంట్లోనే చిచ్చు పెట్టింది. ఈ రాజకీయ సమయంలో వ్యూహాలు పదునెక్కుతున్న వైనంపై ‘సాక్షి’ సవివర కథనం... మౌర్య ఇచ్చిన షాక్‌తో ‘మైండ్ బ్లాంక్’ ఇతర వెనుకబడిన వర్గాల్లో (ఓబీసీల్లో) బలమైన నాయకులైన మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య జనవరి 12న, దారాసింగ్ చౌహాన్ 13న మంత్రి పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో కలకలం రేగింది. రోజుకో మంత్రి, ఒక ఎమ్మెల్యే చొప్పున పార్టీని వీడిపోవడంతో బీజేపీకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. మొత్తం ముగ్గురు మంత్రులు, 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీని వీడారు. కాషాయపార్టీ తేరుకునే లోగానే... ఓబీసీలను బీజేపీ అవమానిస్తోందని... అందుకే వారంతా సమాజ్‌వాదీ పార్టీలోకి క్యూ కడుతున్నారనే సందేశం బలంగా ప్రజల్లోకి వెళ్లింది. ములాయం ఇంట్లోనే ముసలం నష్టనివారణకు దిగిన బీజేపీ దిమ్మతిరిగేలా కొట్టాలని భావించి అసంతృప్తితో ఉన్న అఖిలేశ్ మరదలు అపర్ణా యాదవ్‌కు (సవతి సోదరుడు ప్రతీక్ యాదవ్ భార్య) గాలం వేసింది. సొంత మనిషినే ఆపలేకపోతే అఖిలేశ్ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటారు. సరిగ్గా బీజేపీ అక్కడే కొట్టి లక్ష్యాన్ని సాధించింది. మైండ్‌గేమ్ కీలక ఓబీసీ మంత్రులు పార్టీని వీడి వెళ్లిపోవడంతో తూర్పు యూపీలో నష్టం తప్పదని భావించిన బీజేపీ దీన్ని పూడ్చుకోవాలనే ఉద్దేశంతో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను గోరఖ్‌పూర్ నుంచి బరిలోకి దింపింది. తర్వాత బీజేపీ కేంద్రమంత్రులు, రాష్ట్ర నాయకులు ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్ ఎన్నికల బరిలోకి దిగడానికి భయపడుతున్నారని ప్రతిరోజూ వల్లెవేస్తూ ఎస్పీ చీఫ్‌ను పిరికివాడిగా చూపే ప్రయత్నం చేశారు. పరిస్థితి తీవ్రతను గ్రహించిన అఖిలేశ్ తాను మెయిన్‌పురి నుంచి పోటీ చేస్తానని గురువారం ప్రకటించారు. నిజానికి వీరిద్దరూ పోటీచేసింది... కంచుకోటలైన సొంత నియోజకవర్గాల నుంచే. నిజానికి ఈ విషయంలో ఏటికి ఎదురీదే గుండె ధైర్యాన్ని ప్రదర్శించి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఒకప్పటి తన కుడిభుజం సువేందు అధికారికి కంచుకోటగా మారిన ‘నందిగ్రామ్’ నుంచి పోటీచేస్తానని ప్రకటించి నివ్వెరపరిచారు. తాను నందిగ్రామ్ బరిలో ఉంటే సువేందు అధికారి సొంత నియోజకవర్గానికి బాగా సమయం కేటాయించాల్సి వస్తుందని, ఇతర ప్రాంతాల్లో ప్రచారానికి తిరగలేరనేది దీదీ ఎత్తు. తాను ఓడిపోయినా... మమత వ్యూహం మాత్రం బ్రహ్మాడంగా వర్క్ అవుట్ అయి దీదీ హ్యాట్రిక్ కొట్టారు. కొట్టారు.. తీసుకున్నాం. మాకూ టైమొస్తుంది.. మేమూ కొడతాం – 2017లో నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక ముగిశాక... చంద్రబాబు సర్కారు కుట్రపూరిత వేధింపులపై అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సంధించిన ఈ వాగ్భాణం ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయింది. ‘ఇది కదా... సిసలైన పోరాటయోధుడి గుండెధైర్యం’ అనుకున్నారు జనం. ప్రియాంక నినాదం తుస్సుమనేలా.. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో కొడిగట్టిన కాంగ్రెస్ కనీసం గౌరవప్రద స్థితిలో నిలిపితే.. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా సానుకూలత రావడానికి ఉపయోగపడుతుందని యూపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి ప్రియాంకా గాంధీ ‘లడకీ హూ... లడ్ సక్తీ హూ (ఆడబిడ్డను... పొరాడగలను)’ అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. తద్వారా ‘మేమెందుకు పురుషులతో సమానం కాదు. మాకేం తక్కువ’ని నేటితరం యువతుల్లో బలంగా నాటుకుపోయిన భావజాలాన్ని ప్రేరేపించారు. బాగా జనంలోకి వెళ్లిపోవడంతో ఈ నినాదంతో కాంగ్రెస్ యూపీ నలుమూలగా నిర్వహించిన మారథాన్లకు యువతుల నుంచి భారీ స్పందన వచ్చింది. ప్రియాంక ఎత్తుగడ ఫలించింది. దాంతో ఆమె 40 శాతం అసెంబ్లీ టిక్కెట్లను మహిళలకు కేటాయిస్తామని ప్రకటించి.. చేతల్లో చూపడం ద్వారా మహిళా ఎజెండాను మరిం త ముందుకు తీసుకెళ్లారు. చదవండి: (కరోనానే పెద్ద పరీక్ష!) ఈ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి ప్రియాంక పోరాట సన్నద్ధంగా ఉన్న ముగ్గురు యువతుల ఫోటోతో కూడిన హోర్డింగ్‌లు, పోస్టర్ల ను యూపీ వ్యాప్తంగా విస్తృతంగా అతికిం చారు. ఈ ముగ్గురిని లీడ్ చేస్తూ మధ్యలో ఉన్న యువతి పేరు ప్రియాంకా మౌర్య, వృత్తిరీత్యా డాక్టర్. మంచి వక్త. లింగ సమానత్వం కోసం ప్రియాంకా గాంధీ చేపట్టిన ఈ ఉద్యమాన్ని బలంగా తీసుకెళ్లిందని ప్రియాం క మౌర్య. ఆమె స్వభావం, ఆహార్యం దీనికి బాగా ఉపకరించాయి. దాంతో ఈ ఉద్యమానికి ప్రియాంక మౌర్య బ్రాండ్ అంబాసిడర్‌గా, పర్యాయపదంగా మారారు. సరిగ్గా బీజేపీ ఇక్కడే గురిచూసి కొట్టింది. 40 శాతం టిక్కెట్లు కేటాయిస్తే మహిళల్లో కాంగ్రెస్‌కు మంచి సానుకూలత వస్తుందని, అసలే ఒకవైపు ఎస్పీ– రాష్ట్రీయ లోక్‌దళ్ పొత్తులో తమ హిందూత్వ కార్డు నిర్వీర్యమైన పోయిన పరిస్థితుల్లో ప్రియాంకా గాంధీ ఎత్తుగడ తమకు భారీ నష్టం కలుగుజేస్తుందని భయపడ్డ బీజేపీ మాస్టర్ గేమ్ ఆడింది. ‘అడపిల్లను... పోరాడగలను’ అనే నినాదానికి బ్రాండ్ అం బాసిడర్‌గా ఉన్న ప్రియాంక మౌర్యను లాగేస్తే కాంగ్రెస్‌ను చావుదెబ్బ కొట్టొచ్చని భావించి అమలులో పెట్టేసింది. మహిళలకు 40 టిక్కెట్లు ఇచ్చామని కాంగ్రెస్ గొప్పలు చెప్పుకుంటోందని.. చేతల విషయానికి వచ్చే సరికి కష్టజీవి ప్రియాంక మౌర్యకే మొండి చేయి చూపిందనే సందేశాన్ని ప్రజల్లోకి బలంగా పంపింది. ఇప్పుడిక ప్రియాంకా గాంధీ మహిళలకు ఇచ్చే టికెట్లు 50 శాతానికి పెంచినా, ఈ విషయాన్ని ఎన్నికల ర్యాలీల్లో 500 సార్లు చెప్పినా జనం నమ్మరు. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
బీజేపీకి షాకిచ్చేలా.. మాస్టర్ స్ట్రోక్.. మైండ్‌గేమ్!
ఉత్తరప్రదేశ్‌లో ఏదో జరుగుతోంది. నిన్న మొన్నటి దాకా బీజేపీ మంచి స్థితిలో ఉన్నట్లు కనిపించింది. కానీ ఉన్నట్టుండి ఈ వలసలేమిటి? ఒకరివెంట మరొకరు పోటీలుపడి ఓబీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు బీజేపీని ఎందుకు వీడుతున్నారు. బీసీల ప్రయోజనాలను సమాజ్‌వాదీ పార్టీ మాత్రమే కాపాడగలదా? బీజేపీ మునిగిపోయే నౌకా? నాయకగణంలో, జనసామాన్యంలో ఇప్పుడీ అభిప్రాయం బలపడుతోంది. బీజేపీలో ‘ఆల్ ఈజ్ నాట్ వెల్’ అనేది బాగా ప్రబలింది. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ బృందానికి సరిగ్గా ఇదే కావాలి. అంతా వారనుకున్నట్లే జరుగుతోంది. ఆడించినట్లే రక్తి కడుతోంది. వ్యూహరచనలో, క్షేత్రస్థాయిలో తమకు తిరుగులేదని భావిస్తున్న బీజేపీ పెద్దలకు అఖిలేశ్ ఇచ్చిన గట్టి ఝలక్ ఇది. ఎన్నికల నగారా మోగాక.. అసలుసిసలు ‘సినిమా’ చూపిస్తున్న వైనమిది. ఇదంతా ఈనెల 11న ప్రముఖ ఓబీసీ నేత, మంత్రి స్వామి ప్రసాద్ మౌర్యతో మొదలైంది. ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసి బీజేపీకి గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించారు. మౌర్య మద్దతుదారులైన నలుగురు ఎమ్మెల్యేలు అదే బాట పట్టారు. చిన్న అలజడి మొదలైంది. 12న మరో ఓబీసీ ముఖ్యనేత, మంత్రి దారాసింగ్ చౌహాన్ బీజేపీకి టాటా చెప్పారు. 13న మరో ఓబీసీ నేత ధరమ్‌సింగ్ సైనీ కాషాయదళాన్ని వీడారు. మూడురోజుల్లో ముగ్గురు మంత్రులు... ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీని విడిచి వెళ్లిపోయారు. చిన్న పాయ కాస్తా ముందుకెళ్లిన కొద్దీ నదిగా మారుతున్న దృశ్యం గోచరమవుతోంది. బీజేపీ మిత్రపక్షమైన అప్నాదళ్ (సోనేలాల్)కూ సెగ తగిలింది. ఈ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఎస్పీ పంచన చేరుతున్నట్లు ప్రకటించారు. ఎన్నికల వేళ కప్పదాట్లు సహజమే అయినా... నలుగురైదుగురు పోతే ఫర్వాలేదు. అలాకాకుండా కీలక ఓబీసీ నేతలు పక్కా ప్రణాళిక ప్రకారం బీజేపీని టార్గెట్ చేస్తూ... కాషాయదళంలో ఓబీసీలను, దళితులను చిన్నచూపు చూస్తున్నారనే సందేశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ‘బౌన్సర్లు’ వేస్తున్నారు. ఆల్‌రౌండర్ ఆదిత్యనాథ్ యోగి (రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల యూపీ సీఎంను క్రికెట్ పరిభాషలో ఆల్‌రౌండర్‌గా అభివర్ణించారు), జట్టు కెప్టెన్ జేపీ నడ్డా (బీజేపీ అధ్యక్షుడు), కోచ్... అమిత్ షా (ప్రధాన వ్యూహకర్త)లకూ అఖిలేశ్ టీమ్ షాక్‌ల మీద షాక్‌లు ఇస్తూనే ఉంది. పసిగట్టలేకపోయారా? ఫర్వాలేదనుకున్నారా? ఎన్నికల వేళ ఏ పార్టీ అయినా, ప్రభుత్వమైనా అప్రమత్తంగా ఉంటుంది. అసంతృప్తులు, అనుమానం ఉన్నవారి కదలికలపై నిఘా ఉంటుంది. వారేం చేస్తున్నారు... ఎవరిని కలుస్తున్నారనే దానిపై ఓ కన్నేసి ఉంచుతాయి. అలాంటిది కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీయే అధికారంలో ఉండి, ఐబీ, రాష్ట్ర నిఘా విభాగాలు రాబోయే ఈ వలసల ఉద్యమాన్ని ఎందుకు పసిగట్టలేకపోయాయి. ఒకవేళ కొంత సమాచారం ఉన్నా ఆ పోతే ఒకరిద్దరు పోతారు, దాంతో మనకొచ్చే నష్టమేముందని బీజేపీ అగ్రనేతలు తేలిగ్గా తీసుకున్నారా? ఈ స్థాయి ప్రణాళికాబద్ధమైన దాడిని ఊహించలేకపోయారా?. ఇప్పుడు నష్టనివారణకు దిగి ఎస్పీ, కాంగ్రెస్‌ల నుంచి ఇద్దరిని చేర్చుకున్నా జరిగిన డ్యామేజీని ఇలాంటివి పూడుస్తాయా? కసికొద్దీ ఇంకా కొంతమందిని లాగినా చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే అవుతుందనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. చెప్పి... మరీ! ఈనెల 11న మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య రాజీనామా చేయగానే నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్‌పవార్ మొత్తం 13 మంది ఎమ్మెల్యేలు, ఇంకొందరు నేతలు ఎస్పీలోకి వస్తారని ప్రకటించారు. జనవరి 20వ తేదీదాకా బీజేపీలో రోజుకు ఒకటి రెండు వికెట్లు పడుతూనే ఉంటాయని, 20న నాటికి బీజేపీని వీడిన మంత్రులు, ఎమ్మెలేల సంఖ్య 18కి చేరుతుందని ఎస్పీ మిత్రపక్షమైన సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఓంప్రకాశ్ రాజ్బర్ బుధవారం ప్రకటించారు. 20 దాకా రాజీనామాల పరంపర కొనసాగుతుందని, రోజుకొక మంత్రి, ఎమ్మెల్యే కాషాయపార్టీకి గుడ్‌బై చెబుతారని రాజీనామా చేస్తూ మంత్రి ధరమ్‌సింగ్ గురువారం చెప్పారు. భవిష్యత్తు చేరికలపై ఎస్పీ మాట్లాడకుండా... బయటి వారు మాట్లాడుతుండటం... ఇదంతా ఒక విస్తృత అవగాహనతో జరుగు తోందనేది దానికి అద్దం పడుతోంది. నిజానికి పార్టీ మారేటపుడు ఎవరూ అంత ఆషామాషీగా అడుగు వేయరు. భవిష్యత్తుకు సంబంధించిన స్పష్టమైన భరోసా, తాము కోరిన నియోజకవర్గాల్లో తమ వారికి టికెట్లు ఖరారు చేసుకున్నాకే... బయటపడతారు. రాజీనామా చేస్తారు. అంటే అఖిలేశ్ వీరిందరితో ఎంతోకాలంగా టచ్‌లో ఉన్నట్లే లెక్క. పైగా ఎవరెవరు వస్తే ప్రయోజనం, ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వగలం... అనేది బాగా కసరత్తు చేశారు ఎస్పీ చీఫ్. అధికార, బీజేపీ వేగులకు ఉప్పందకుండా ఎంతో జాగ్రత్తగా ఈ డీల్‌ను పూర్తి చేయడం అఖిలేశ్ వయసుతో పాటే రాజకీయ వ్యూహాల్లో ఆరితేరారనే విషయాన్ని చాటిచెబుతోంది. ఇది ఒక ఎత్తైతే... తమ ప్రణాళికను అమలులో పెట్టిన తీరు బీజేపీ చాణక్యులనే నివ్వెరపరుస్తుండొచ్చు. అఖిలేశ్‌ను కలవడం... ఫొటోలు దిగడం, బయటకు వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు తాము బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం అంతా పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిపోతోంది. వీరి రాజీనామా ప్రకటన వెలువడిందో లేదో నిమిషాల్లో అఖిలేశ్ ట్విట్టర్ హ్యాండిల్ వారు ఎస్పీ చీఫ్‌తో దిగిన ఫొటోలు ప్రత్యక్షమవుతున్నాయి. అంతా కట్టగట్టుకొని ఏ 20 మందో ఒకేసారి బీజేపీని వీడితే... అది ఒక్కరోజుకే టీవీ చానళ్లకు, పత్రికలకు వార్త అవుతుంది. మరుసటి రోజు ఫోకస్ వేరే అంశాలపైకి మళ్లుతుంది. అలాకాకుండా విడతల వారీగా వలసలు చోటుచేసుకుంటే రోజూ మీడియాలో సమాజ్‌వాదీ కవరేజీయే. పత్రికల్లో, టీవీల్లో రోజూ ఎస్పీలో చేరికలపై వార్తలు ఉంటే... ప్రజల్లోకి ఒకరకమైన సానుకూల సందేశం వెళుతుంది. బీజేపీ అధికార, అంగ, అర్థబలాన్ని ఎదుర్కొనగలమా అని లోలోపల సంశయంలో ఉన్న ఎస్పీ శ్రేణుల్లో నైతిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిపోతాయి. వారు ద్విగుణీకృత ఉత్సాహంతో క్షేత్రస్థాయిలో పనిచేస్తారు. ప్రజల్లోనూ ఎస్సీకే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయనే భావన వస్తే... తటస్థ ఓటర్లు కూడా కొంతమేరకు సైకిల్ వైపు మొగ్గే అవకాశాలుంటాయి. అన్నింటికంటే ముఖ్యమైన అంశం... తమకు ఎదురులేదనే భావనలో ఉన్న బీజేపీని ఈ అనూహ్య పరిణామాలు ఆత్మరక్షణలోకి నెట్టేస్తాయి. ఊగిసలాటలో ఉన్న నాయకులు ఎస్సీవైపు చూసేలా ఈ పరిణామాలు ప్రోత్సహిస్తాయి. ఎవరుంటారో... ఎవరు పోతారో తెలియని పరిస్థితుల్లో బీజేపీ సొంత నాయకులనే అనుమాన చూపులు చూసే పరిస్థితి. ఒక్కసారి గనక బీజేపీ అవకాశాలు సన్నగిల్లుతున్నాయనే అభిప్రాయం బలపడితే... మునిగే నౌకలో ఉండటానికి ఎవరూ ఇష్టపడరు. కమలదళానికి సరైన ప్రత్యామ్నాయంగా ఉన్న ఎస్పీలోకి నాయకులు క్యూ కడతారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే అఖిలేశ్ విడతల వారీగా బీజేపీని దెబ్బకొట్టే వ్యూహాన్ని ఎంచుకున్నారు. చక్కటి మైండ్‌గేమ్ ఆడుతున్నారు. పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న బీజేపీ తదుపరి ఎలాంటి పావులు కదుపుతుందో చూడాలి. – నేషనల్ డెస్క్, సాక్షి -
జీవించే హక్కు అందరి సొంతం కాదా?
ఢిల్లీలో ఇటీవల జరిగిన జాతీయ స్థాయి శూద్ర ఓబీసీల సదస్సు చేసిన డిక్లరేషన్ చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రకటన అని చెప్పాలి. కులాలవారీ జన గణనను సాధించడం, రిజర్వుడ్ ఉద్యోగాలను కొల్లగొట్టడానికి ఉపాధి రంగాన్ని మొత్తంగా ప్రైవేటీకరించడాన్ని నిరోధించడం, జాతీయ సంపదను అగ్రకుల పారిశ్రామికవేత్తల చేతుల్లో పెట్టడాన్ని అడ్డుకోవడం కోసం మరో కీలకమైన శూద్ర ఓబీసీల ఉద్యమం అవసరముందని ఇది స్పష్టం చేసింది. బ్యాంకులు, రైల్వేలు, ఎయిర్‌లైన్స్‌ను ప్రైవేటీకరించడం పూర్తయితే ఇకపై వాటిలో శూద్ర ఓబీసీలకు, దళితులకు, ఆదివాసీలకు ఉద్యోగాలు ఉండవని తెలిసిందే. ప్రస్తుత పాలకవర్గ శక్తులు వెనుకబడిన వర్గాలకు మంచి జీవితం అందించడంపై ఏ మాత్రం శ్రద్ధ పెట్టడం లేదు. కాబట్టే శూద్ర ఓబీసీ దళిత, ఆదివాసీ శక్తులు రెండో స్వాతంత్య్ర సమరానికి సిద్ధం కావాలి. ఢిల్లీలో ఇటీవలే ముగిసిన శూద్ర ఓబీసీ సదస్సు ఇస్తున్న సందేశమిదే! ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో 2021 డిసెంబర్ 21న భారీస్థాయి జాతీయ శూద్ర ఓబీసీల సదస్సు జరిగింది. వందలాది శూద్ర ఓబీసీ కార్యకర్తలు, వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నేతలు, వివిధ యూనివర్శిటీలు, పౌరసమాజ సంస్థలకు చెందిన మేధావులు ఈ సదస్సుకు హాజరయ్యారు. మొట్టమొదటి శూద్ర ఓబీసీ డిక్లరేషన్ని వీరు తీసుకొచ్చారు. ఇది దేశం మొత్తానికి చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రకటన. చరిత్రాత్మకమైన రైతుల పోరాటం... భారతీయ వ్యవసాయ మార్కెట్లను హిందుత్వశక్తులు ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకంగా శూద్ర ఓబీసీలు చేసిన పోరాటం మాత్రమే. ఆ తర్వాత కులాలవారీ జనగణనను సాధించడం, రిజర్వుడ్ ఉద్యోగాలను కొల్లగొట్టడానికి ఉపాధి రంగాన్ని మొత్తంగా ప్రైవేటీకరించడాన్ని నిరోధించడం, జాతీయ సంపదను అగ్రవర్ణ పారిశ్రామికవేత్తల చేతుల్లో పెట్టడాన్ని అడ్డుకోవడం కోసం మరొక కీలకమైన శూద్ర ఓబీసీల ఉద్యమం ఇప్పుడు నడుస్తోంది. అయితే శూద్ర ఓబీసీ శక్తులను బలహీనపర్చి వారిని ప్రాచీన భారతదేశంలోని బానిసల్లాగా మార్చడానికి హిందుత్వ శక్తులు కుట్రపన్నుతున్నాయి. శూద్ర ఓబీసీల సదస్సు నిర్వాహక కమిటీకి మండల్ ఉద్యమ హీరో శరద్ యాదవ్ నేతృత్వం వహించారు. కాగా, చగన్ భుజ్‌బల్ (ఎన్సీపీ కేబినెంట్ మంత్రి, మహారాష్ట్ర), తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ అధ్యక్షుడు), కనిమొళి కరుణానిధి (ఎంపీ, డీఎంకే), కంచ ఐలయ్య (ఎడిటర్, విజన్ ఫర్ ఎ న్యూ పాత్) సునీల్ సర్దార్ (ప్రెసిడెంట్, సత్య శోధక్ సమాజ్) ఈ కమిటీ సభ్యులుగా వ్యవహరించారు. సమృద్ధ భారత్ ఫౌండేషన్–ఢిల్లీ, మహాత్మా ఫూలే సమతా పరిషద్–మహారాష్ట్ర సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించాయి. ఢిల్లీ డిక్లరేషన్‌పై పలువురు పండితులు, రాజకీయ నేతలు, కార్యకర్తలు ప్రసంగించి, లోతుగా చర్చించారు. రాబోయే నెలల్లో వివిధ రాష్ట్రాల్లో అనుసరించాల్సిన భవిష్యత్ కార్యాచరణపై వీరు చర్చిం చారు. దేశంలో మండల్ అనంతర పోరాటాలు ఎన్నింటికో నాయకత్వం వహించిన లాలూ ప్రసాద్ యాదవ్ వర్చువల్‌గా మాట్లాడారు. సామాజిక న్యాయాన్ని సాధించాలంటే కులాలవారీ జనగణన ఒక్కటే మార్గమని ఆయన స్పష్టంగా చెప్పారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా, చగన్ భుజ్‌బల్, డీఎంకే ఎంపీ టీకేఎస్ ఇళంగోవన్, కాంగ్రెస్ మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, హరియాణా మాజీ మంత్రి అజయ్ యాదవ్‌తోపాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు, మేధావులు ఈ ప్రకటనలోని లక్ష్యాల సాధనకు, దేశవ్యాప్తంగా శూద్ర ఓబీసీ శక్తులను సంఘటితం చేయడానికి అవసరమైన రాజకీయ, బౌద్ధిక ఎజెండాను రూపొందించారు. సుప్రసిద్ధ రచయిత్రి అరుంధతీ రాయ్ ఈ సదస్సుకు శక్తిమంతమైన సందేశం పంపారు. భారతదేశంలో సామాజిక బాధ్యత కలిగిన ప్రతి మేధావికీ కులాలవారీ జనగణన ఉమ్మడి లక్ష్యంగా ఉండాలని ఆమె వక్కాణించారు. ప్రస్తుతం కేంద్రప్రభుత్వంలో ఉన్న పాలక రాజకీయ వ్యవస్థ శూద్ర ఓబీసీలను బలహీనపర్చాలని ప్రయత్నిస్తోంది. రిజర్వేషన్ వ్యవస్థను రద్దు చేయాలని, ద్విజ గుత్తాధిపత్య కుటుంబాలను పైకి తేవాలని అది కంకణం కట్టుకుంది. ఈ పరిస్థితుల్లో కులాలవారీ జనగణన కోసం, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం పోరాటం దేశీయ ఆహార ఉత్పత్తిదారులకు, హస్తకళల నిపుణులకు జీవన్మరణ సమస్యగా మారుతోంది. వ్యవసాయ సంస్కరణ చట్టాలకు వ్యతిరేకంగా గత 13 నెలలుగా మన దేశంలోని రైతులు చావో రేవో చందంగా పోరాడుతూ వచ్చారు. ఈ క్రమంలో 750 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి ఓటు వేసిన శూద్రఓబీసీలు తమను కూడా వారు భరతమాత ముద్దుబిడ్డల్లాగే చూస్తారని నమ్మారు. కానీ ఏడేళ్ల పాలనా కాలంలో నేటి పాలకులు తమ రైతు వ్యతిరేక, ఓబీసీ వ్యతిరేక వైఖరిని చాటుకున్నారు. 1990లలోని మండల్ ఉద్యమంతో సామాజిక న్యాయ పోరాటం ముగియలేదని, అది ఇప్పటికీ కొనసాగుతోందని ఢిల్లీ డిక్లరేషన్ వాగ్దానం చేసింది. దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ మండల్ రిజర్వేషన్ కోసం నాడు పోరాడిన శూద్రులు, ఇప్పుడు రిజర్వేషన్ల కోసం ప్రయత్నిస్తున్న మరాఠాలు, జాట్లు, కాపు వంటి కులాలకు చెందిన శూద్రులు ప్రస్తుత ప్రమాదానికి వ్యతిరేకంగా సర్వశక్తులూ ఉపయోగించాల్సి ఉంది. బీజేపీ ఆరెస్సెస్ అధికారంలోకి రాగానే వ్యవసాయం సంపద్వంతమౌతుందని, లంచగొండితనం తగ్గిపోతుందని రెడ్లు, కమ్మ, వెలమలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ), కేరళలో నాయర్లు, బెంగాల్లో మహిష్యాలు నిజంగానే భావించారు. కానీ జరుగుతున్నదేమిటి? మునుపటిలా చిన్నపాటి అవినీతి స్థానంలో లక్షలాది కోట్ల రూపాయలను రుణమాఫీ ద్వారా గుత్తసంస్థలకు కట్టబెడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వ యాజమాన్యంలోని అన్ని బ్యాంకులను, రైల్వేలను, ఎయిర్‌లైన్స్‌ను ప్రైవేటీకరించడం గురించి ఆలోచిస్తున్నారు. ప్రైవేటీకరించిన సంస్థల్లో శూద్ర ఓబీసీలకు, దళితులకు, ఆదివాసీలకు ఉద్యోగాలు లేవన్న విషయం తెలిసిందే. ఆరెస్సెస్ బీజేపీ మద్దతుదారులు తమ పిల్లలను ఉత్తమమైన ఇంగ్లిష్ మీడియం ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చేర్పించి చదివిస్తున్నారు. పైగా ఇంగ్లిష్‌ను ఆధునిక సంస్కృతం లాగా చేసి ద్విజుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉంచాలని ఆర్ఎస్ఎస్ కోరుకుంటోంది. శూద్ర ఓబీసీల్లో అతి కొద్దిమంది మాత్రమే ఈ గేమ్ ప్లాన్‌ని అర్థం చేసుకుంటున్నారు. వారి పిల్లలను సంపద లేని వ్యవసాయ రంగంలోకి నెట్టేస్తున్నారు. పైగా ఆహారాన్ని, మతాన్ని అధికారంతో ముడిపెడుతున్నారు. ఇది శూద్ర ఓబీసీల చుట్టూ పన్నుతున్న అతి పెద్ద ఉచ్చు. భవిష్యత్తులో వీరి పిల్లల మెదళ్లు, శరీరాలు బలహీనంగా మారిపోతాయి. మొత్తం మీద పాలక వర్గ శక్తులు వీరికి మంచి జీవితం అందించడంపై ఏ మాత్రం శ్రద్ధపెట్టడం లేదు. శూద్ర దళిత ఆదివాసీ శక్తుల అజ్ఞానాన్నే తప్ప వారిలో విజ్ఞానాన్ని పాలకులు ప్రేమించడం లేదు. శూద్ర ఓబీసీ మేధావులు ప్రప్రథమంగా వీరి ఆటను పసిగట్టడం ప్రారంభించాయి. ఈ వర్గాల నుంచి అత్యున్నత విద్యావంతులైన మేధావులు, చింతనాపరులు, రచయితలు, పోరాటకారులు ఆవిర్భవించకపోతే వీరి పిల్లలు తిరిగి బానిసలుగా మారిపోతారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు అటు గ్రామాల్లోనూ, ఇటు ప్రైవేటీకరించిన పరిశ్రమల్లోనూ ఉపాధి దొరకడం లేదు. యజమానుల కంపెనీల్లో, కొద్దిమంది సంపన్నుల కంపెనీల్లో సెక్యూరిటీ సిబ్బందిగా మాత్రమే శూద్ర ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు చేరుతున్నారు. వీటిలో నెలకు పదివేల రూపాయల కంటే తక్కువ వేతనంతో పనిచేస్తున్నారు. ఈ కంపెనీలు మొత్తంగా ప్రైవేట్ కంపెనీలే. బిజినెస్ కుటుంబాలు ఆరెస్సెస్ – బీజేపీ శాఖల సమన్వయంతో వీటిని నిర్వహిస్తున్నాయి. ఢిల్లీలో జరిగిన శూద్ర ఓబీసీల సదస్సు ఈ ప్రక్రియను గుర్తించింది కూడా! అసలు విషయం మరొకటుంది. దళితులు, ఉదివాసీలను అలా పక్కన బెట్టండి. చివరకు శూద్ర ఓబీసీలు కూడా మేధావులు, చింతనాపరులుగా మారడానికి పాలక వ్యవస్థ ఏ మాత్రం అంగీకరించడం లేదు. ప్రపంచస్థాయి విజ్ఞానం వీరికి కూడా అందాలని పాలకవ్యవస్థ భావించడం లేదు. ఆరెస్సెస్ అగ్రనేతల ప్రసంగాలు పదే పదే దీన్నే నిరూపిస్తున్నాయి. కాబట్టే శూద్ర ఓబీసీ, దళిత, ఆదివాసీ శక్తులు రెండో స్వాతంత్య్ర సమరానికి సిద్ధం కావాలి. ఢిల్లీ సరిహద్దుల్లో మొన్నటి వరకు పోరాడి మరణించిన రైతు హీరోల మార్గం వీరికి ఆదర్శం కావాలి. దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవలే జరిగిన శూద్ర ఓబీసీ సదస్సు ఇస్తున్న సందేశమిదే! ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
కుల గణనపై కుటిల రాజకీయాలు
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్నా ఓబీసీల పరిస్థితి దారుణంగా ఉందని చెప్పకతప్పదు. ఓబీసీలు అన్ని విధాలుగా ముందుకు వచ్చేందుకు కేంద్రం అడ్డుపడుతోంది. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం, తెలంగాణ సర్కారు కుల గణన చేయాలని అసెంబ్లీ తీర్మానం చేయడం ఒక సాహసోపేతమైన చర్యే నని చెప్పవచ్చు. కానీ, బీజేపీ మాత్రం దేశవ్యాప్తంగా కుల గణనపై కుటీల రాజకీయాలు చేస్తోంది. ఈ విషయంలో కాంగ్రెస్ కూడా ఏమి తక్కువ తినలేదు. జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లకు బీసీల హక్కులు, సామాజిక న్యాయం పట్ల సోయే లేదు. అణగారిన ప్రజలు అప్పుడూ ఇప్పుడూ అధికారానికి దూరంగా ఉన్నా, కనీసం సామాజిక న్యాయానికి కూడా దూరమేనా అనే ఆందోళన యావత్ బీసీ సమాజాన్ని ఆవహించింది. కొత్తగా కులాల గణనను చేపడితే, గతంలో మండల్ కమిషన్ చెప్పిన 52 శాతం కంటే ఎక్కువగానే ఓబీసీ జనాభా ఉండొచ్చన్నది సర్వత్రా వినిపిస్తున్న టాక్. దీంతో కోటా కోసం మరిన్ని ఉద్యమాలు జరిగే అవకాశం ఉంటుందని అగ్రకుల అధికారవర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇది బీజేపీ, కాంగ్రెస్‌కు రాజకీయంగా నష్టం కల్గించవచ్చని అనధికారిక విశ్లేషణలు, వ్యాఖ్యానాలు చేస్తున్నారు. (చదవండి: ‘ఆఖరి మైలు’ జనహృదయానికి దగ్గరయితే...) దేశంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితిని నిశితంగా గమనిస్తే 2017 అసెంబ్లీ, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రత్యే కించి యూపీలో బీజేపీ ఓబీసీల కారణంగా బాగా లాభపడి నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మిగతా ప్రాంతాల్లో ఓబీసీలను అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఉపయో గించుకుంటున్నాయి. కానీ వారికి ఏ విధమైన లబ్ధి చేకూర్చడం లేదు. ఏపీ, తెలంగాణల్లో వైసీపీ, టీఆర్ఎస్ సాధ్యమైనంత మేరకు అవకాశం కల్పిస్తున్నాయి. జనాభా సేకరణ–2021లో కులగణనను చేర్చడం సాధ్యంకాదని కేంద్ర ప్రభుత్వం భారత సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించిన అఫిడవిట్లో పేర్కొనడం నిజంగా బాధాకరం. ఈ నిర్ణయం అనేక తర్జనభర్జనల తర్వాత తీసుకున్నదని నరేంద్ర మోదీ సర్కారు సమర్థించుకుంటోంది. సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో వెనుకబడిన వర్గాల కులగణన చెయ్యడం పరిపాలనాపరంగా చాలా కష్టమైనదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కష్టపడి చేసినా నమ్మదగిన, సరియైన సమాచారం రాదని, ఆ సమాచారాన్ని అధికారిక అవసరాలకు వాడు కోలేమని ప్రభుత్వం చెబుతోంది. కుల గణన డిమాండ్‌ను తిరస్కరించడానికి చెప్పిన ఈ వాదనలు పక్కా అబద్ధాలే. (చదవండి: ఆర్థికమే కాదు... సామాజికం కూడా!) భారత దేశానికి స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్ పాలనలో 1881 నుంచి 1941 వరకు ప్రతి దశాబ్దానికొకసారి జరిగిన జనగణనలో కుల వివరాలు సేకరించారు. ఇప్పుడు అందరూ వాడుతున్న కులగణన లెక్కలు 1931 జనగణన లోనివే అన్న విషయం ఎంతమందికి తెలుసు. అప్పటి నుంచి ఇప్పటివరకు అసలు కులగణన జరగడం లేదు. మనమెంతో మనకే తెలియని పరిస్థితి ఉంది. దీనిపై పోరాడాల్సిన అవసరం, ఆవశ్యకత యావత్ బహుజన సమాజంపై ఉంది. బీపీ మండల్ కమిషన్ ఈ గణాంకాలపై ఆధారపడే వెనక బడిన కులాల జనాభాను 52 శాతంగా అంచనా వేసిందని సామాజిక రంగ నిపుణులు చెబుతుంటారు. ప్రస్తుతం రాజకీయ పార్టీలు సోషల్ ఇంజనీరింగ్, సామాజికీకరణలు అంటూ పద బంధాలు వాడేది ఆ కమిషన్ సిఫార్సుల ఆధారంగానే. మరి తాజా వివరాలు వస్తే... మనకు మరింత న్యాయం జరుగుతుంది కదా. 2011లో యూపీఏ–2 ప్రభుత్వ హయాంలో దేశ వ్యాపితంగా కుల గణన జరిగింది. అందులో 98.87 శాతం సమాచారం సక్రమంగా ఉందని 2016లో భారత సెన్సెస్ కమిషనర్ గ్రామీణాభివృద్ధి పార్లమెంటరీ కమిటీ ముందు ప్రకటించినట్టు వార్తలు వచ్చాయి. 2011 కులగణనలో జరిగిన కొన్ని సాంకేతిక లోపాలు దిద్దుబాటు చేసుకోగలిగినవే అయినా, వాటిని కేంద్ర ప్రభుత్వం భూతద్దంలో చూపి కులగణన అవసరాన్ని తిరస్కరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆరోపించినట్టు కులగణన వృథా అనుకోరాదు. దాని ద్వారా లభించే శాస్త్రీయమైన, సరైన సమాచారం వివిధ తరగతుల పరిస్థితిని అర్థం చేసుకోవడానికి సామాజిక న్యాయాన్ని అందించేందుకు ఉపయోగపడుతుంది. దీని కోసం జరిగే సమరంలో కులగణన ద్వారా అందే వాస్తవ సమాచారం ఒక ఆయుధంగా వినియోగపడుతుంది. అందుకే కులగణన జరగాలని కోరుతున్నాం. (చదవండి: ఈ వెనుకడుగు వ్యూహాత్మక ముందడుగు) తెలంగాణ బీజేపీ నేతల ద్వంద్వ వైఖరి అటు కేంద్రంలోనూ... ఇటు రాష్ట్రంలోనూ ఓబీసీ కుల గణనపై బీజేపీ వైఖరిలోని కపటత్వం అందరికీ తెలుస్తున్నది. ఇటీవల బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ తొలుత రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ గణన చేపట్టాలని ఒక కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు. ఆయన మాటల తీరు నిజంగా హాస్యాస్పదం. ఆయన సొంత ప్రభుత్వానికి ఓబీసీ ప్రెసిడెంట్‌గా కనీసం లేఖ కూడా రాయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. పైగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించాలట. మరి బీజేపీ ప్రభుత్వాలకు ఎందుకు ఆయన ప్రత్యేకంగా లేఖలు రాయడం లేదో వివరణ చెప్పాల్సి ఉంది. రాష్ట్రంలో ఆ పార్టీ బీసీ నేతలకు కీలక పదవులు ఇస్తూ... సమూహ లబ్ధి జరిగే కుల గణన అంశాన్ని విస్మరించడం నిజంగా దుర్మార్గం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా బీసీ కుల గణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కుల గణన, రిజర్వేషన్లపై జాతీయ స్థాయిలో రాజకీయ పక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి కేంద్రంపై పోరాటం చేస్తామని కేసీఆర్ ప్రకటించటం బీసీల పట్ల కేసీఆర్‌కు ఉన్న చిత్తశుద్ధిని ప్రతిబింబిస్తుంది. (చదవండి: మహిళలు... కొంచెం ఎక్కువ సమానం) గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంటు ఎన్ని కల వరకు భారతదేశంలో కులానికి ఎంత ప్రాధా న్యముందో అందరికీ తెలిసిందే. కులాలవారీగా జనాభా లెక్కల సేకరణ చేపడితే హిందూ ఓట్లలో చీలిక వస్తుందన్న భయం బీజేపీకి ఏర్పడుతోంది. కులాలను పక్కనబెట్టి మతపరంగా ఎక్కువ జనాభాను తనవైపు తిప్పుకున్న బీజేపీ, ఇప్పుడు తన ఓటు బ్యాంకును చీల్చుకోవడానికి ఇష్టపడటం లేదు. కులాలవారీ జనగణన వల్ల కుల అస్తిత్వం, గుర్తింపు శాశ్వతమైపోతుందని ఆ పార్టీ భయపడుతోంది. సమాజంలో మార్పు రాదని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే, కుల గుర్తింపు అనేది తమకు అవసరమని మిగతా వర్గాలు వాదిస్తున్నాయి. ఓబీసీలకు సమూల మార్పు కావాలంటే... కేంద్రంలో అధికారం వెలగబెట్టే జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలకు రాబోయే ప్రతి ఎన్నికలో బుద్ధి చెప్పడం అవశ్యం. - మన్నారం నాగరాజు వ్యాసకర్త రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ లోక్‌సత్తా పార్టీ -
2011 ఎస్ఈసీసీ డేటాలో లోపాలు!
న్యూఢిల్లీ: పదేళ్ల క్రితం చేపట్టిన సామాజికార్థిక కులగణన(ఎస్ఈసీసీ–2011) గణాంకాల్లో లోపాలున్నాయని, ఓబీసీల డేటాకు సంబంధం లేదని కేంద్రం మంగళవారం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. లోపభూయిష్ట సమాచారం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందనే ఈ నివేదికను బహిర్గతం చేయలేదని తెలిపింది. ఓబీసీలకు రిజర్వేషన్లను తాము సమర్థిస్తామని, అయితే ఇందుకు సంబంధించిన ప్రక్రియ సుప్రీం రాజ్యాంగ బెంచ్ తీర్పునకు అనుగుణంగా ఉండాలని పేర్కొంది. చదవండి: లైన్ క్లియర్.. పన్నీరు, పళనిలకు భారీ ఊరట ఎస్ఈసీసీ 2011 వివరాలను తమకందించేలా కేంద్రాన్ని ఆదేశించాలని మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. తాము ఎన్నిమార్లడిగినా కేంద్రం ఈ గణాంకాలు అందించడం లేదని మహారాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీనిపై సమాధానమిచ్చిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ఈ గణాంకాల ఆధారంగా రిజర్వేషన్లు, ఇతర ఏ అంశాలను చేపట్టలేమని, ఇందులో లోపాలున్నాయని తెలిపారు.