
ముషీరాబాద్: జర్నలిస్టు, కవి, రచయిత, బహుజన మేధావి కోలపూడి ప్రసాద్ (56) ఆదివారం రాత్రి కన్నుమూశారు. కోప్రగా ఆయన అందరికీ సుపరిచితుడు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. వారం క్రితం కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మొదట పెరాలసిస్ రావడంతో కొన్ని అవయవాలు పనిచేయలేదు. కిమ్స్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో మృతి చెందారు.
ఏపీలోని నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన ప్రసాద్ మొదట్లో ఆర్ అండ్ బిలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేశారు. కొంతకాలం విరసంలో, అప్పటి పీపుల్స్‌వార్ పార్టీలో పనిచేశారు. అనంతరం ఆ పార్టీకి దూరమై హైదరాబాద్ వచ్చారు. జర్నలిస్టుగా అనేక పత్రికలలో పనిచేశారు. అనేక పాటలు, కవితలు, వ్యాసాలు రాసి బహుజన మేధావిగా గుర్తింపుపొందారు.
ముఖ్యంగా మోస్ట్ బ్యాక్‌వర్డ్ క్యాస్ట్స్ (ఎంబీసీ) సిద్ధాంతకర్తగా ప్రాచుర్యం పొందారు. కోలపూడి ప్రసాద్ (కోప్ర) మరణంపట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతిపట్ల బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, తెలంగాణ ఎమ్మార్పీఎస్ నేతలు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ, మేడి పాపయ్య మాదిగలతోపాటు బహుజన మేధావులు, కవులు, రచయితలు, ప్రజాసంఘాల ప్రతినిధులు సంతాపం తెలిపారు. కోప్ర మరణం బీసీ ఉద్యమానికి తీరనిలోటన్నారు.
చదవండి: కాల్పుల విరమణ దిశగా మావోలు?
Comments
Please login to add a commentAdd a comment