సాక్షి, లక్నో: ప్రభుత్వ రంగ బ్యాంకులో మరో భారీ కుంభకోణం వెలుగు చూసింది. ప్రభుత్వ రంగ బ్యాంకు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ)కు రుణాల ఎగవేతకు సంబంధించి సీబీఐ తాజాగా మరో కేసు నమోదు చేసింది. ప్రైవేట్ చక్కెర ఉత్పాదక సంస్థ శింబోలీ షుగర్స ఓబీసీకి రూ.109 కోట్ల మేర రుణాలు ఎగవేసిన కేసులో పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ అల్లుడు, శింభోలీ షుగర్స్ డిప్యూటీ డైరెక్టర్ గురుపాల్ సింగ్ కీలక నిందితుడుగా ఉన్నారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంస్థ శింభోలీ షుగర్స్ రుణాల చెల్లింపులో విఫలంకావడంతో ఓబీసీ సీబీఐకి ఫిర్యాదు చేసింది. దీంతో ఈ కేసులో పంజాబ్ సీఎం కుమార్తె జై ఇందర్ సింగ్ భర్త, కంపెనీ డిప్యూటీ డైరెక్టర్లలో ఒకరైన గురుపాల్ సింగ్, శింభోలీ సీఎండీ, సీఈవో, సీఎఫ్‌వో సహా,13మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. మొత్తం ఎనిమిది కంపెనీల్లో గురుపాల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. 20111 లో చక్కెర రైతులు 5700మందికి సహాయం చేసే ఉద్దేశంతో ఆర్‌బీఐ పథకంకింద 150కోట్ల మేర రుణం మంజూరైంది. అయితే ఈ మొత్తం రైతులకు పంపణీ చేయకుండా అక్రమార్గాల్లో కంపెనీ అకౌంట్‌లో మళ్లించారనేది సీబీఐ ప్రధాన ఆరోపణ. అలాగే శింభోలీ సిబ్బందితోపాటు బ్యాంక్ అధికారులు కొందరిపై సైతం కేసు రిజిస్టర్ అయింది. ఈ వార్తలతో శింబోలి షుగర్స్‌షేరు 15 శాతం కుప్పకూలి నష్టాల్లో ట్రేడ్ అవుతోంది.
ఢిల్లీ, హపూర్, నోయిడాలలో కంపెనీల డైరెక్టర్ల నివాసాలు, ఫ్యాక్టరీ, కార్పోరేట్ ఆఫీస్, రిజిస్ట్రేషన్ ఆఫీసు సహా ఎనిమిది ప్రాంగణాలలో సోదాలు నిర్వహించామని సిబిఐ అధికార ప్రతినిధి అభిషేక్ దయాల్ వెల్లడించారు. నిందితులపై నేరపూరిత కుట్ర, మోసంఅవినీతి నిరోధక చట్టంకింత కేసు నమోదు చేశామన్నారు. సీబీఐ ఎఫ్ఐఆర్ ప్రకారం, 97.85 కోట్ల రూపాయల నగదును బ్యాంకు ప్రకటించగా, అసలు రుణం రూ.109.08 కోట్లకు చేరింది. మరోవైపు ఈ రుణాన్ని తీర్చేందుకు జనవరి 28, 2015 లో రూ.110కోట్ల మరో కార్పొరేట్ రుణాన్ని మంజూరు చేసిన బ్యాంకు మొత్తం రుణాన్ని రూ.113 కోట్లుగా తేల్చింది. అయితే 2016 నవంబరులో ఎన్‌పీఏగా ప్రకటించింది. కాగా 2017 నవంబరు 17న బ్యాంకు సిబిఐకి ఫిర్యాదు చేయగా, ఫిబ్రవరి 22, 2018 న మాత్రమే నమోదు చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment