ఎస్‌బీఐ పండుగ ధమాకా
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కొన్ని రుణాలపై వడ్డీరేట్లను తగ్గించింది. కారు, వినియోగ వస్తువులపై వడ్డీరేట్లను తగ్గించడంతోపాటు, ప్రాసెసింగ్ ఫీజులను సైతం తగ్గించాలని నిర్ణయించింది. పండుగ సీజన్‌లో రుణ డిమాండ్‌ను ఆకర్షించడంలో భాగంగా బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఐఓబీ, దేనా బ్యాంకులు కూడా ఇదే బాటలో నడిచాయి. ఇప్పటికే పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ), ఐడీబీఐ బ్యాంక్‌లు ఆటోమొబైల్స్‌సహా టెలివిజన్‌లు, ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్ల వంటి వినియోగ వస్తువులపై ప్రత్యేక వడ్డీరేట్లను ఆఫర్ చేశాయి. తాజా నిర్ణయంతో ఎస్‌బీఐ కూడా ఈ జాబితాలో చేరింది.
తగ్గింపు ఇలా...: బ్యాంకింగ్ దిగ్గజం రేట్ల తగ్గింపు విషయానికి వస్తే- కారు రుణాలపై వడ్డీరేటు 0.20 శాతం తగ్గింది. 10.55 శాతానికి చేరింది. ప్రాసెసింగ్ ఫీజు రుణ మొత్తంలో 0.51 శాతం తగ్గించింది. అంటే కనీస ప్రాసెసింగ్ ఫీజు రూ.1,020 నుంచి రూ.500 ఫ్లాట్ రేట్‌కు తగ్గుతుంది.
వేతన జీవులకు ప్రత్యేకం
తన బ్యాంకులో వేతన అకౌంట్‌లు ఉన్న ఖాతాదారులకు సంబంధించి వినియోగ వస్తువులు, కారు, ద్విచక్ర వాహనాల కొనుగోళ్ల విషయంలో కూడా ప్రత్యేక పండుగల రుణ పథకాలను బ్యాంక్ ఆవిష్కరించింది. ఈ ఆఫర్ కింద పలు డిస్కౌంట్లు లభించనున్నాయి. 12.05 శాతం నుంచి వడ్డీరేట్లపై రుణ లభ్యత అందుబాటులో ఉంటుంది. ఇందుకు సంబంధించి ‘ఉత్సవ్ కీ ఉమంగ్ ఎస్‌బీఐ కీ సంగ్’ ఆఫర్ అక్టోబర్ 7 నుంచి 31 జనవరి 2014 వరకూ అందుబాటులో ఉంటుంది.
నేపథ్యం ఇదీ...: కొన్ని రంగాలలో డిమాండ్ పెంపు లక్ష్యంగా కొంత తక్కువ రేటుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు రుణాలను మంజూరు చేయాలని, ఇందుకు తగిన పెట్టుబడులను ప్రభుత్వం బ్యాంకులకు పంప్ చేయాలని కేంద్రం గతవారం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే పలు బ్యాంకులు ఈ దిశలో అడుగులు వేస్తున్నాయి. ఆర్థిక మంత్రి పీ చిదంబరం, ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి అరవింద్ మాయారాం మధ్య ఇటీవల జరిగిన సమావేశం ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకుంది. ‘బడ్జెట్‌లో పేర్కొన్న రూ.14,000 కోట్ల కన్నా ఎక్కువగా, బ్యాంకులకు కావాల్సినంత మూలధన నిధులు సమకూర్చాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. ఈ చర్య మందగమనాన్ని ఎదుర్కొనేందుకు, ఉత్పత్తిని పెంచేందుకు కూడా దోహదపడగల దని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవలి పారిశ్రామికోత్పత్తి గణాంకాల ప్రకారం కన్సూమర్ డ్యూరబుల్స్ రంగం గతేడాది జూలైతో పోలిస్తే ఈసారి జూలైలో 9.3 శాతం మేర క్షీణించింది. గతేడాది ఏప్రిల్-జూలై మధ్యకాలంలో 6.1 శాతం వృద్ధి ఉండగా.. ఈసారి అదే వ్యవధిలో ఏకంగా 12 శాతం క్షీణించింది. కార్ల కొనుగోళ్లు సైతం గణనీయంగా పడిపోయాయి. కాగా ఈ ప్రణాళికలను ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ కేసీ చక్రవర్తి వ్యతిరేకిస్తున్నారు. ఇవి బ్యాంకుల అసెట్ క్వాలిటీపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని ఆయన ఇప్పటికే వ్యక్తం చేశారు.
ఐవోబీ కూడా...
వినియోగ వస్తువులపై రుణ రేట్లను ప్రభుత్వ రంగ ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్(ఐవోబీ) కూడా 2% వరకూ తగ్గించింది. దీనితో ఈ రేటు 13.25%కి తగ్గింది. తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. వేతన జీవులు వినిమయ వస్తువుల కొనుగోళ్లకు సంబంధించి ఒక కొత్త వ్యక్తిగత రుణ పథకాన్ని కూడా ఆవిష్కరించినట్లు బ్యాంక్ తెలిపింది.
దేనాబ్యాంక్ కాంబో లోన్ ప్లాన్...
దేనాబ్యాంక్ కూడా కొన్ని విభాగాలకు సంబంధించి వడ్డీరేట్లను తగ్గించింది. కోటి రూపాయల వరకూ గృహ రుణాలపై వడ్డీరేట్లను బేస్‌రేట్ 10.25%గా నిర్ణయించినట్లు తెలిపింది. ఆపైన ఈ రేటు 10.50%గా ఉంటుంది. హౌసింగ్ లోను తీసుకున్న వారికి కాంబో ప్లాన్‌గా కార్, కన్జూమర్ డ్యూరబుల్స్ రుణాన్ని కూడా అందచేస్తామని పేర్కొంది. కాంబోప్లాన్‌లోని కార్ రుణానికి బేస్ రేట్ వర్తిస్తుంది. వినియోగ వస్తువులపై రుణ రేటు 11.75%గా ఉంది. కాగా కాంబో ఆఫర్‌తో సంబంధం లేకుండా కార్‌రుణంపై రేటును 1% తగ్గించింది. దీనితో ఈ రేటు 11%కి చేరింది.