
ఆంక్షలు లేని ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కావాలి
ఏలూరు సిటీ : రాష్ట్రంలో ఆంక్షలు లేని ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని పూర్తిస్థాయిలో పేదవర్గాల విద్యార్థులందరికీ అందించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రవిచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం చిట్టివలసపాకల ప్రాంతంలోని ఇఫ్టూ జిల్లా కార్యాలయంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలుపై ఆయా ప్రజా, విద్యార్థి, యువజన సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రవిచంద్ర మాట్లాడుతూ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో చదువుతున్న మన రాష్ట్ర విద్యార్థుల ఫీజులను ఏపీ ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. బీసీ, ఓబీసీ, మైనార్టీ, వికలాంగులైన విద్యార్థులకు ఆదాయ పరిమితిని రూ.2 లక్షలకు పెంచాలన్నారు.
రూ.1200 కోట్ల ఫీజు బకాయిలను, తెలంగాణలో చదువుతున్న ఆంధ్ర విద్యార్థులకు సంబంధించిన బకాయిలు రూ.196 కోట్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.రామ్మోహన్, ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బి.ప్రభాకర్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి.రవికుమార్, ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి బీఏ సాల్మన్‌రాజు తదితరులు పాల్గొన్నారు.