‘ఫీజు’కు బూజు
ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ : ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి బూజు పట్టింది. 2013-14 విద్యా సంవత్సరంలో ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును పొడిగిస్తూ వచ్చిన ప్రభుత్వం చివరకు చేతులెత్తేసింది. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ వర్గాల్లోని పేద విద్యార్థులకు చదువుల నిమిత్తం చెల్లించాల్సిన ఫీజుల్లో రూ.38 కోట్ల బకాయిలు ఉన్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ సొమ్ము విడుదల అవుతుందో లేదోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సంబంధిత విద్యార్థులు అప్పులు చేసి మరీ కాలేజీల్లో ఫీజులు కట్టాల్సిన దుస్థితి నెలకొంది. 2014-15 విద్యా సంవత్సరంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమల్లో ఉంటుందా లేదోనని అధికారులు సందేహిస్తుండగా.. విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
భారీగా బకాయిలు : ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి సంబంధించి జిల్లాలో భారీగా బకాయిలు
పేరుకుపోయాయి. జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ 12వేల మంది ఎస్సీ విద్యార్థులకు ఇంకా రూ.6కోట్లు మేర ఫీజులను చెల్లించాల్సి ఉంది. మరోవైపు బీసీ సంక్షేమ శాఖ 35 వేల మంది బీసీ విద్యార్థులకు రూ.17 కోట్లు, 8వేల మంది ఈబీసీ విద్యార్థులకు రూ.15 కోట్ల మేర ఫీజు బకాయిలు చెల్లించాల్సి ఉంది. వాస్తవానికి జిల్లాలోని లక్ష మందికి పైగా విద్యార్థులకు ఏటా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో బాగంగా సుమారు రూ.90 కోట్ల నుంచి రూ.వంద కోట్ల వరకూ నిధులు మంజూరు చేయాల్సి ఉంది. 2013-14 విద్యా సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం రూ.52 కోట్లు విడుదల చేసినా ఆ సొమ్ములు ఇంకా పూర్తిస్థాయిలో విద్యార్థుల ఖాతాల్లోకి చేరలేదు. దీంతో బకాయిలు భారీగా పేరుకుపోయాయి.
కష్టాల్లో విద్యార్థులు
ఫీజుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేందుకు ఆధార్ యూఐడీ కావాల్సి ఉండటంతో దరఖాస్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఆధార్ నమోదు చేయించుకునేందుకు ఈఐడీ(ఎన్‌రోల్‌మెంట్ ఐడెంటిటీ) నంబర్ ఉంటే సరిపోదని యూనిక్ ఐడెంటిటీ నంబర్ కూడా కావాలని చెప్పటంతో ఆధార్ కార్డులు లేని విద్యార్థులు తంటాలు పడ్డారు. 2013-14 విద్యాసంవత్సరంలో కొత్తగా కాలేజీల్లో చేరిన విద్యార్థులు దరఖాస్తు చేయలేకపోయారు. సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి ఎస్సీ విద్యార్థులు 10వేల మంది, బీసీ విద్యార్థులు 22 వేలమంది, ఈబీసీ విద్యార్థులు 12,828 మంది మాత్రమే ఎన్‌రోల్ చేయించుకోగలిగారు. వీరితోపాటు రెన్యువల్ విద్యార్థుల్లో ఎస్సీలు 16,595మంది, బీసీ విద్యార్థులు 29 వేల మంది, ఈబీసీ విద్యార్థులు 13,990 మందికి దరఖాస్తుల పరిశీలన సందర్భంలో సమస్యలు తలెత్తాయి. ఇలాంటి కారణాల వల్ల వేలాదిమంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వర్తించలేదు. వర్తించిన వారిలోనూ చాలామందికి బకాయిలు పేరుకుపోయూయి.