ప్రత్యేక అధికారులు విధిగా పర్యటించాలి.. | Officials visiting the special function | Sakshi
Sakshi News home page

ప్రత్యేక అధికారులు విధిగా పర్యటించాలి..

Published Tue, Feb 7 2017 2:13 AM | Last Updated on Thu, Mar 21 2019 8:29 PM

Officials visiting the special function

నల్లగొండ : ప్రత్యేక అధికారులు వారంలో ఒక రోజు విధిగా మండలాలను పర్యటించి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను తనిఖీ చేసి నివేదికలు ఇవ్వాలని కలెక్టర్‌ గౌవర్‌ ఉప్పల్‌ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో  సోమవారం  నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా.. వారి జీవన ప్రమాణాలు మెరుగు పర్చేవిధంగా ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని సూచించారు. పాఠశాలలు, ఆస్పత్రులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహాలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ ప్రగతి, హరితహారం, అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు వంటి తదితర అంశాలపై తనిఖీ చేయాలన్నారు. యాదవులకు చేయూతనిచ్చేందుకు గొర్రెల పెంపకాన్ని ప్రోత్సోహించేలా ఎక్కువ మొత్తంలో యూనిట్లను మంజూరు చేయాలన్నారు. జిల్లాలోని మిషన్‌ కాకతీయ చెరువులు, మధ్యతరహా, చిన్నతరహా చెరువులు, ప్రాజెక్టుల ప్రాంతాల్లో భారీగా చేప పిల్లలను పెంచేందుకు ప్రణాళికలు రూపొందించానల్నారు.

ప్రతి కుటుంబం జీవన స్థితిగతులను అధ్యయనం చేసి వివిధ ప్రభుత్వ పథకాలు అందించాలని సూచించారు. దళిత, గిరిజన ప్రాంతాల్లో పర్యటించి మౌలిక వసతుల కల్పనకు చేపట్టాల్సిన కార్యక్రమాలను రూపొందించాలన్నారు. ‘క్లీన్‌ ఏ విలేజ్‌’ కింద గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రజా ప్రతినిధులందరినీ భాగస్వాములను చేయాలన్నారు. క్లీన్‌ ఏ ఏవిలేజ్‌ కార్యక్రమంలో ఉత్తమ గ్రామ పంచాయతీలకు అవార్డులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. జిల్లా అభివృద్ధి ప్రణాళిక, జిల్లా రిసోర్స్‌ మ్యాప్‌లను వివిధ కార్యక్రమాల ద్వారా రూపొందించాలన్నారు. ఉత్తమ సేవలు అందించిన అధికారులను ప్రోత్సహించడంతో పాటు వారిని సన్మానించనున్నట్లు తెలిపారు. చేనేత, బీడీ కార్మికులకు గృహ నిర్మాణ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు మంజూరు చేస్తారని, ఈ మేరకు వారి డేటాను సేకరించి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు ఎన్ని నిధులు అవసరమవుతాయో అంచనాలు రూపొందించాలని సూచించారు. సమావేశంలో జేసీ నారాయణరెడ్డి, ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డీఆర్వో కీమ్యానాయక్, డీఆర్‌డీఓ ఆర్‌.అంజయ్య తదితరులు పాల్గొన్నారు.   

ఎయిడ్స్‌ నియంత్రణ కేంద్రాల్లో సదుపాయాలు కల్పిస్తాం : కలెక్టర్‌  
నల్లగొండ :  జిల్లాలోని ఎయిడ్స్‌ నియంత్రణ కేంద్రాల్లో అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తామని కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ తెలిపారు. తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన రాష్ట్ర స్థాయి ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ మేరకు  సంస్థ ప్రతినిధులు జిల్లాలోని ఎయిడ్స్‌ కేంద్రాల్లో లోటుపాట్ల వివరాలను కలెక్టర్‌ దృష్టికి తీసుతెచ్చారు. ఈ సందర్భంగా ఉప్పల్‌ మాట్లాడుతూ జిల్లాలోని 52 ఎయిడ్స్‌ నియంత్రణ కేంద్రాల్లో ఉన్నవారికి ప్రభుత్వ పరంగా అందాల్సిన పెన్షన్లు, మందులు, పౌష్టికాహారంతోపాటు ఇతర సదుపాయాలు కల్పిస్తామన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కూడా భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సమావేశంలో సంస్థ ప్రతినిధులు ప్రాజెక్టు డైరక్టర్‌ జాన్‌బాబు, ఏపీడీ రాంమోహన్,  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement