సమన్వయమే సమస్య
-
ఓవైపు విద్యార్థులు లేక హాస్టళ్లు మూసివేత
-
మరోవైపు సీట్ల కోసం వందలాది మంది పడిగాపులు
-
సర్దుబాటు చేయలేకపోతున్న అధికారులు
-
సంక్షేమ హాస్టళ్ల మనుగడకు ప్రమాదం
కరీంనగర్ సిటీ : జిల్లా కేంద్రంలోని బీసీ బాలుర కళాశాల వసతిగృహంలో వంద సీట్లున్నాయి. ఈ విద్యాసంవత్సరం 105 రెన్యువల్స్ (ఇప్పటికే ఉన్న విద్యార్థుల సంఖ్య) చేయగా కొత్తగా 175 దరఖాస్తులు వచ్చాయి. ఇవి పెండింగ్‌లో ఉండగానే మరో వంద మంది విద్యార్థులు హాస్టల్‌లో ప్రవేశానికి ఎదురుచూస్తున్నారు.
ముత్తారం మండల కేంద్రంలో బీసీ బాలుర కళాశాల వసతిగహం ఏర్పాటు చేసినప్పటి నుంచి విద్యార్థులు చేరకపోవడంతో దానిని మూసివేశారు. వార్డెన్‌కు గోదావరిఖని హాస్టల్ ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించారు. సదరు హాస్టల్‌ను ఈ సంవత్సరం మంథనిలో ప్రారంభించారు. అక్కడా అడ్మిషన్లు లేవు. విద్యార్థులను చేర్పించేందుకు వార్డెన్ నానా పాట్లు పడుతున్నారు.
ఇది జిల్లాలో బీసీ సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి. విద్యార్థులు లేరంటూ ఓ చోట హాస్టళ్లను మూసివేస్తుండగా, మరో చోట హాస్టల్‌లో ప్రవేశానికి వందలాది మంది విద్యార్థులు పడిగాపులు కాస్తున్నారు. ప్రీమెట్రిక్, కళాశాల స్థాయి వసతిగహాల్లో సీట్ల కోసం పట్టణ ప్రాంతాల్లో విపరీతంగా డిమాండ్ ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో కనీస స్థాయిలో విద్యార్థులు లేక హాస్టళ్లు మూతపడుతున్నాయి. జిల్లాలో కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి ప్రాంతాల్లోని హాస్టళ్లలో చేరేందుకు విద్యార్థులు క్యూ కడుతున్నా.. సీట్లు లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ఒక్కో హాస్టల్‌లో సుమారు వంద సీట్లు ఉండగా.. అంతకు రెండుమూడు రెట్లు విద్యార్థుల నుంచి డిమాండ్ వస్తోంది. కానీ ప్రతి సంవత్సరం చాలా హాస్టళ్లలో సీట్లు లేవని విద్యార్థులను వెనక్కి పంపిస్తున్నారు. మరో పక్క విద్యార్థుల నుంచి ఆదరణ లేని హాస్టళ్లను మూసివేస్తున్నారు.
కరీంనగర్‌లో బీసీ కళాశాల స్థాయి బాలికల వసతిగృహాలు రెండున్నాయి. ఒక్కో హాస్టల్‌కు వంద సీట్ల చొప్పున 200 సీట్లున్నాయి. కాని మరో వంద మంది విద్యార్థినులు హాస్టల్‌లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో హాస్టల్‌లో 25 మంది చొప్పున రెండింటిలో కలిపి 50 మంది విద్యార్థులకు అవకాశం కల్పించారు. మరో 50 మంది విద్యార్థులు సీట్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఫార్మసీ, బీటెక్, ఎడ్‌సెట్, పీజీ కౌన్సెలింగ్‌లు పూర్తి కాగానే మరింత మంది విద్యార్థులు హాస్టళ్లలో ప్రవేశం కోసం క్యూకట్టే పరిస్థితి ఉంది.
కరీంనగర్‌లోని ఒక బీసీ హాస్టల్, రెండు ఎస్సీ హాస్టళ్లను విలీనం చేసి ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌ను ప్రారంభించారు. ఇందులో బీసీలకు వంద సీట్లకు మాత్రమే మంజూరు ఉండగా, అదనంగా మరో వంద మంది విద్యార్థులు ప్రవేశం కోసం నిరీక్షిస్తున్నారు. పురాతన ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం ఉండడం, అదే ఆవరణలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఉండడంతో డిమాండ్ అధికంగా ఏర్పడింది. మరోపక్క వేములవాడలోని బీసీ బాలిక కళాశాల వసతిగృహంలో అసలు విద్యార్థులే లేకపోవడం గమనార్హం.
సమన్వయం చేస్తేనే మనుగడ
విద్యార్థులు లేరంటూ హాస్టళ్ల మూసివేతకు ఉత్సాహం చూపిస్తున్న అధికారులు, అదే సమయంలో విద్యార్థుల నుంచి ఆదరణ ఉన్న హాస్టళ్లను పట్టించుకున్న పాపానపోవడం లేదు. మండల స్థాయిలో విద్యార్థులు అంతగా హాస్టళ్ల పట్ల ఆసక్తి చూపడం లేదు. మోడల్ స్కూళ్లు, కస్తూరిబా, గురుకుల విద్యాలయాలు నెలకొల్పడం, కరువుతో ప్రజలు గ్రామాలను విడిచిపెట్టి పట్టణాలకు వలస రావడం తదితర కారణాలతో హాస్టళ్లలో సీట్లు భర్తీ కావడం లేదు. అలాంటి హాస్టళ్లను మూసివేస్తున్నారు. అదే సమయంలో డిమాండ్ ఉన్న హాస్టళ్లను ప్రోత్సహించలేకపోతున్నారు. ఒక అంచనా ప్రకారం కరీంనగర్‌లో ప్రస్తుతం ఉన్న హాస్టళ్లకు అదనంగా ఒక ప్రీమెట్రిక్ బాలుర, ఒక కళాశాల స్థాయి బాలుర, ఒక కళాశాల స్థాయి బాలికల హాస్టళ్లను ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. విద్యార్థుల ఆదరణ అంతగా లేని హాస్టళ్ల నుంచి సీట్లను కోత పెట్టి, డిమాండ్ ఉన్న హాస్టళ్లలో సీట్లు పెంచితే ఈ సమస్యను అధిగమించే అవకాశముంది. అప్పుడే సంక్షేమ హాస్టళ్ల మనుగడ సాధ్యమవుతుంది. ఉన్నతాధికారులు ఆ దిశగా సమన్వయం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
సీట్లు పెంచడానికి ప్రయత్నిస్తున్నాం
–బీసీ సంక్షేమ శాఖ డీడీ ఎంబీకే.మంజుల
డిమాండ్ అధికంగా ఉన్న హాస్టళ్లలో సీట్లను పెంచడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రై వేట్ భవనాల్లో కళాశాల స్థాయి హాస్టళ్లు ఉండడం వల్ల పూర్తిస్థాయిలో వీలు పడడం లేదు. ఇప్పటికే వంద ఉన్న సంఖ్యను అవసరమున్న చోట 120, 150కు పెంచాం. విద్యార్థులు చేరకపోవడంతో దామెరకుంట, ఎలిగేడు, ముల్కనూరు, బొమ్మనపల్లి హాస్టళ్లను ఈ సంవత్సరం మూసివేశాం. సమన్వయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం.