యాక్షనే.. ప్లానేదీ!
Published Fri, Sep 16 2016 1:06 AM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
ఆకివీడు : ‘వెనుకబడిన వర్గాలు ఆర్థికంగా స్థిరపడేందుకు అన్నివిధాలా చర్యలు తీసుకుంటున్నాం. వారి స్వయం సమృద్ధికి రుణాలు అందజేస్తున్నాం’ అని గొప్పలు చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వానిది కపట నాటకమని తేలిపోయింది. ఈ ఏడాది ఇప్పటివరకూ బీసీ, ఎస్సీ, ఎస్టీల రుణాల కోసం సర్కారు యాక్షన్ ప్లాన్ రూపొందించలేదు. కాపుల రుణాల మంజూరుకు ప్రకటన చేసినా.. ఇప్పటివరకూ ఒక్కరికి
కూడా మంజూరు చేయలేదు.
సర్కారు ఏటా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా రుణాల మంజూరుకు ప్రణాళిక రూపొందిం చేంది. ఈ ప్రక్రియ ఆగస్టు నాటికి పూర్తయ్యేది. సెప్టెంబర్‌లో దరఖాస్తుల స్వీకరించేది. ఈ ఏడాది ఇప్పటివరకూ రుణ ప్రణాళిక ఖరారు చేయలేదు. దీంతో ఆ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రుణ ప్రణాళికపై స్పష్టత లేకపోవడంతో ఆన్‌లైన్‌లో ఆ వర్గాల సర్వర్లు తెరుచుకోవవడం లేదు. ఫలితంగా ప్రజలు మండల స్థాయి అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటివరకూ రుణాల ప్రకటన చేయకపోవడమేమిటని నిలదీస్తున్నారు. వారికి సమాధానం చెప్పలేక మండలస్థాయి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో సర్వర్ ఓపెన్ కానప్పటికీ దరఖాస్తు చేసుకోవచ్చని కంటితుడుపు సమాధానం చెబుతున్నారు.
కాపుల ఆందోళన నేపథ్యంలో..
ఇదిలా ఉంటే కాపుల ఆందోళన నేపథ్యంలో 20 రోజుల క్రితం సర్కారు హడావుడిగా రుణాలు ఇస్తున్నట్టు ప్రకటించింది. దరఖాస్తులూ స్వీకరించింది. గత ఏడాది కాపు కార్పొరేషన్ ద్వారా రుణాల కోసం జిల్లాలో 43 వేల దరఖాస్తులు అందగా, వీరిలో కేవలం కొందరికి మాత్రమే రుణాలు అందజేసింది. ఈ ఏడాది రూ.70 కోట్లు విడుదల చేశామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకూ రుణాల మంజూరు ప్రారంభించలేదు. ఈ ఏడాది జిల్లాలో 11,776 దరఖాస్తులు వచ్చాయి. ఇవి కాకుండా కాపు కార్పొరేషన్ వద్ద గత ఏడాది వచ్చిన 41 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం 52వేల దరఖాస్తులు కాపు కార్పొరేషన్ వద్ద ఉన్నాయి. విడుదల చేసిన రూ.70 కోట్లు వీరందరికీ సరిపోతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా నిబంధనలు రుణాల మంజూరుకు అడ్డంకిగా ఉన్నాయి. కేవలం కాపుల కన్నీరు తుడవడానికే ప్రభుత్వం రుణాలిస్తామని ప్రకటన చేసిందనే వాదన వినబడుతోంది.
ముస్లిం, మైనార్టీలదీ అదే దుస్థితి
ఈ ఏడాది ముస్లిం, మైనార్టీ వర్గాల వారికిచ్చే రుణాలకూ కార్యాచరణ ప్రణాళిక విడుదల కాలేదు. దీంతో ముస్లింలు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి బ్యాంకుల్లో రుణాలు ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారైనా న్యాయం చేయాలని కోరుతున్నారు.
చిచ్చుపెట్టేందుకే...
కులాల మధ్య తెలుగుదేశం ప్రభుత్వం చిచ్చుపెడుతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ యాక్షన్ ప్లాన్ విడుదల చేయకుండా జాప్యం చేస్తోంది. ఏటా విడుదల చేసే యాక్షన్ ప్లాన్ ఇవ్వకపోవడంలో ఆంతర్యమేమిటి. కాపులకు రెండవ విడత రుణాలు ఇస్తున్నట్టు ప్రకటించినా.. మంజూరులో విధించిన నిబంధనలతో ఎవరికీ రుణాలు దక్కే అవకాశం లేదు. ఇప్పటికే 50 వేలకుపైగా దరఖాస్తులు కాపు రుణాల కోసం కార్పొరేషన్‌కు అందాయి.
– నంద్యాల సీతారామయ్య, కాపు సంఘ నాయకుడు
పట్టించుకోరే..
మైనార్టీల శ్రేయస్సును ప్రభుత్వం విస్మరించింది. ముస్లిం, మైనార్టీలకు రుణాల మంజూరులో వివక్ష∙చూపుతోంది. నిరుపేద ముస్లింలు ఎంతోమంది రుణాల కోసం నిరీక్షిస్తున్నారు. పలావు బండ్లు, ఇతర చిరు వ్యాపారాలు చేసుకునేందుకు కొటేషన్లు, అంచనాలు ఇవ్వమంటే ఎలా తెస్తారు. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి.
– మహ్మద్ జక్కీ, వైఎస్సార్ సీపీ నాయకుడు, ఆకివీడు
బీసీ యాక్షన్ ప్లాన్ ఖరారు కాలేదు
బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాల మంజూరుకు యాక్షన్ ప్లాన్ ఇవ్వలేదు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదు. గత ఏడాది 4200 మందికి రూ.21 కోట్లు రుణాలుగా అందజేశాం. కాపు కార్పొరేషన్ ద్వారా రెండో విడత రుణాల కోసం 11,776 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతంలో వచ్చిన దరఖాస్తులనూ పరిశీలిస్తాం. ఈ ఏడాది కాపు రుణాల కోసం రూ.70 కోట్లు మంజూరయ్యాయి.
– పెంటోజీరావు, ఈడీ, బీసీ కార్పొరేషన్, ఏలూరు.
Advertisement