no action plan
-
అడవిపై గొడ్డలి వేటు
సాక్షి, ఆదిలాబాద్ : అధికారుల నిర్లక్ష్యంతో రానురాను అడవులు మాయమయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. జిల్లాలో 1,83, 210 హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ ఉండగా, ఇప్పటికే లక్ష హెక్టార్లకు పైగా క్షీణించిపోయింది. మిగిలిన భాగాన్నైనా కాపాడితేనే అడవుల జిల్లా అనే పేరు ఉంటుంది. లేదంటే ఒకప్పుడు అడవులు ఉండేవని చదువుకోవాల్సి వస్తుంది. క్షీణించిన అటవీలో గజ్వేల్ స్ఫూర్తితో సహజసిద్ధమైన అటవీని పెంచాలనే ప్రయత్నాలు ప్రారంభించినా..ఉన్న అటవీని రక్షించాలనే తపన అధికారుల్లో కనిపించకపోవడం గమనార్హం. దిగువ సిబ్బందిపైనే వేటు అటవీలో గొడ్డలివేటు వంటి అలజడి జరిగినప్పుడు అటవీశాఖ అధికారులు దిగువ సిబ్బందిపైనే వేటు వేస్తారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తాజాగా జరిగిన వాయిపేట్ సంఘటనలోనూ ఇలాంటి విమర్శలే వచ్చాయి. వాయిపేట్ ఘటనలో ఓ బీట్ ఆఫీసర్, ఓ సెక్షన్ ఆఫీసర్లపై సస్పెష్షన్ వేటు వేశారు. అయితే రేంజ్ ఆఫీసర్‌పై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై యువ సిబ్బందిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే సస్పెన్షన్ వేటు పడిన వారి స్థానంలో ఇతర సెక్షన్, బీట్ ఆఫీసర్లను నియమించారు. దీనిపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు వాయిపేట్ అటవీ విధ్వంసం జరిగినప్పుడు అక్కడే పనిచేసిన ఈ అధికారులకు తిరిగి అక్కడే పోస్టింగ్ ఇవ్వడం విస్మయం కలిగిస్తోంది. అయితే గ్రామస్తులతో మమేకమయ్యే పరిస్థితి ఉండడంతోనే వారికి తిరిగి అక్కడే పోస్టింగ్ ఇచ్చినట్లు అటవీశాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. అధికారుల వైఫల్యం.. అటవీశాఖ పరంగా జిల్లాలో తొమ్మిది రేంజ్‌లు ఉండగా, 75 సెక్షన్లు, 170 బీట్లు ఉన్నాయి. సాధారణంగా సెక్షన్, బీట్ ఆఫీసర్లకు ద్విచక్ర వాహనాలను ప్రభుత్వమే కల్పించింది. నిరంతరం అటవీని పర్యవేక్షించాల్సిన వీరు విధుల్లో నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయన్న విమర్శలు లేకపోలేదు. బీట్ ఆఫీసర్ నెలలో 30 రోజులు, సెక్షన్ ఆఫీసర్ నెలలో 20 రోజులు తమ విస్తీర్ణం పరిధిలో తిరిగి అటవీకి సంబంధించిన సమాచారాన్ని పైఅధికారులకు చేరవేస్తుండాలి. అలాగే డ్యూటీకి సంబంధించి నిరంతరంగా డైరీలో నమోదు చేస్తుండాలి. వీరిపై ఫారెస్టు రేంజ్ అధికారి పర్యవేక్షణ ఉండాల్సి ఉన్నా నామమాత్రం అవుతుంది. దీంతోనే క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడుతుందన్న విమర్శలు ఉన్నాయి. వాయిపేట ఘటన ఒక్కరోజుతో జరిగింది కాదని, ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలోని చెట్లను నరికివేయడానికి కొన్ని రోజులు పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తం ఘటన జరిగే వరకు బీట్, సెక్షన్ అధికారులకు కనీసం సమాచారం లేకపోవడం ఇక్కడ విస్మయం కలిగిస్తోంది. దీన్నిబట్టి క్షేత్రస్థాయిలో అటవీ అధికారులు పర్యవేక్షించడం లేదన్నది తేటతెల్లం అవుతోంది. కింది నుంచి పైవరకు అధికారులు పట్టణ ప్రాంతాల్లో ఉంటూ అడపాదడపా విధులకు వెళ్తుండడంతోనే ఇలాంటి సంఘటనలు జరిగినా సమాచారం ఉండడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అటు స్మగ్లర్లు కానీ, ఇటు గ్రామస్తులు గాని అనువైన సమయం కోసం ఎదురుచూసి ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. వాయిపేట ఘటన దసరాకు ముందు జరిగినట్టు చెబుతున్నారు. ఆ సమయంలో అటవీ అధికారులు దృష్టి సారించకపోవడంతో ఈ నష్టం జరిగిపోయింది. పోస్టులు ఖాళీయే.. అటవీశాఖ క్షేత్రస్థాయిలో ఖాళీ పోస్టులు వెక్కిరిస్తున్నాయి. ప్రతీ 400 హెక్టార్లకు ఒక బీట్ ఆఫీసర్ ఉండాల్సి ఉండగా ఎన్నో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 170 బీట్ ఆఫీసర్ పోస్టులకు ఇటీవల వరకు కేవలం 35 మంది మాత్రమే పనిచేశారు. తాజాగా 65 మందిని ప్రభుత్వం నియమించింది. మరోపక్క సెక్షన్ ఆఫీసర్లకు సంబంధించి 75 పోస్టులకు 10 ఖాళీగా ఉన్నాయి. ఇక జిల్లా అటవీశాఖ అధికారి (డీఎఫ్ఓ) తర్వాత 3 ఎఫ్డీఓ పోస్టులు ఆదిలాబాద్, ఇచ్చోడ, ఉట్నూర్‌కు ఉన్నాయి. వీరి కింద 9 మంది ఎఫ్ఆర్ఓలు ఉన్నారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్.. ఇలా అటవీ శాఖలో అధికారుల పోస్టులు వికేంద్రీకృతమై ఉన్నాయి. నిరంతరం పర్యవేక్షణ సరిగ్గా జరిగితేనే అటవీని రక్షించే పరిస్థితి ఉంటుంది. లేదంటే అడవులు మైదానాలుగా తయారయ్యే పరిస్థితి లేకపోలేదు. -
‘అధికార’ గిమ్మిక్కులు
సాక్షి, అమరావతి : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ ప్రభుత్వం రుణమాఫీ పేరుతో మభ్యపెడుతోంది. గత ఏడాది జూన్‌లోనే నాల్గో విడత రుణమాఫీకి సంబంధించిన సొమ్ము రైతు ఖాతాల్లో జమ కావాలి. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు రైతుల రుణమాఫీ గురించి పట్టించుకోలేదు. ఈ ఏడాది జనవరిలోనే నాలుగు, ఐదు విడతల రుణమాఫీ సొమ్ము రైతు ఖాతాల్లో జమ చేస్తామని హడావుడి చేసింది. జిల్లాలోనే 5.90 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.913 కోట్ల నిధులను జమ చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం రైతు రుణమాఫీ గురించి పట్టించుకోకుండా, అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు కొంత సొమ్ము విదిల్చి జిమ్మిక్కులు చేసింది. రైతులకు ఇవ్వాల్సిన రుణమాఫీ సొమ్ము గురించి పట్టించుకోలేదు. అయితే ఎన్నికల పోలింగ్‌కు కేవలం రెండు రోజుల గడువు ఉన్న నేపథ్యంలో రెండు విడతల సొమ్ము కాకుండా, నాల్గో విడత రుణమాఫీ సొమ్ము జమ చేశామని, బ్యాంకులకు రుణ ఉపశమన పత్రాలు, ఆధార్ కార్డు బ్యాంకులో ఇస్తే రైతుల ఖాతాల్లో సొమ్ము జమ అవుతుందని ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో రైతులను మభ్య పెట్టడం తప్ప, సొమ్ము రైతుల ఖాతాల్లో జమ అవుతుందన్న నమ్మకం లేదనే భావన రైతు సంఘాల నాయకులతోపాటు, రైతుల్లో వ్యక్తమవుతోంది. విడుదలకాని పరిహారం రైతుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. గతేడాది రబీలో ప్రభుత్వం మొక్కజొన్న, జొన్న పంటలకు సంబంధించి గిట్టుబాటు ధర లేకపోవటంతో, క్వింటాకు రూ.200 చొప్పున రైతులకు అదనపు సాయం ఇస్తామని చెప్పి రైతుల జాబితాలను సిద్ధం చేసింది. దీనికి సంబంధించి వేలాది మంది రైతులకు రూ.53 కోట్లు ఇంతవరకు రైతుల ఖాతాల్లో చేరలేదు. ప్రభుత్వం నిధులు విడుదల చేశామని చెబుతున్నా, క్షేత్ర స్థాయిలో కార్యరూపం దాల్చలేదు. మొక్కజొన్న, జొన్న రైతులు అదనపు సాయం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది వరి పంట చేతికొచ్చే సమయంలో వచ్చిన పెథాయ్ తుపాను వరి రైతు వెన్ను విరిచింది. పంట నీట మునగడంతో పాటు, కల్లంలో ధాన్యం తడిచి పంట మొలకెత్తడంతో పాటు, ధాన్యం రంగు మారిపోయింది. రైతులు భారీగా నష్టపోయారు. నష్టపోయిన రైతులకు సంబంధించి ప్రభుత్వం సర్వే చేసి, రూ.67 కోట్లు నష్ట పరిహారం ఇస్తున్నట్లు ప్రకటించింది. అది ఇప్పటి వరకు రైతులకు మాత్రం చేరలేదు. జిల్లాలో తొమ్మిది కరువు మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటలు ఎండిపోయి దెబ్బతిన్నాయి. సర్వే చేసిన వ్యవసాయాధికారులు రూ.43 కోట్లు, పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని ప్రతిపాదనలు పంపారు. ఇంతవరకు ప్రభుత్వం రైతులకు ఒక్క పైసా కూడా విదల్చలేదు. దీంతో ప్రభుత్వం విడుదల చేస్తామని చెబుతున్న నాల్గో విడత రుణమాఫీపై రైతులు పెదవి విరుస్తున్నారు. -
బుసకనూ బొక్కేస్తున్నారు
సాక్షి, అవనిగడ్డ(కృష్ణా) : మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా బుసక, మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. నాలుగు రోజుల నుంచి అక్రమంగా రవాణా సాగుతున్నా అధికారులు స్పందించక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రాక్టర్లను స్పీడుగా తోలడం వల్ల ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయోనని ఈ ప్రాంత ప్రజలు భయాందోనలకు గురవుతున్నారు. భారీగా తవ్వకాలు మండల పరిధిలోని వేకనూరులో సొసైటీ భూములు, కృష్ణానది ఒడ్డు నుంచి బుసక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. నాలుగు రోజుల నుంచి ఇష్టారాజ్యంగా ఈ ప్రాంతంలో పొక్లెయిన్లు పెట్టి బుసకను తవ్వి అక్రమంగా తరలిస్తున్నారు. నాలుగు రోజుల్లో అవనిగడ్డ మండలంలో రూ.10 లక్షల విలువైన మట్టి, బుసకను అక్రమంగా తరలించారని ఎడ్లంక, పల్లెపాలెం వాసులు చెబుతున్నారు. ట్రాక్టర్లపై పట్టాలు కప్పకుండా తరలిస్తుండటంతో దుమ్మురేగి స్థానికులు, ట్రాక్టర్ల వెనుకవచ్చే వారి కళ్లల్లో పడుతోంది. దుమ్ముతో గ్రామస్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. బుసక ట్రాక్టర్ల వల్ల అవనిగడ్డ నుంచి ఎడ్లంక వెళ్లలేని పరిస్థితి నెలకొందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే కొందరు డ్రైవర్లు దౌర్జన్యానికి దిగుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తంచేశారు. పట్టించుకోని అధికారులు నాలుగు రోజుల నుంచి జరుగుతున్న అక్రమ బుసక రవాణాపై అధికారులు, పోలీసులకు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఎడ్లంక, పల్లెపాలెం ప్రజలు విమర్శిస్తున్నారు. ట్రాక్టర్ ట్రక్కులపై ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా స్థానిక పోలీసుస్టేషన్, తహసీల్దార్ కార్యాలయాల మీదుగానే యథేచ్ఛగా తరలివెళుతున్నా అధికారుల్లో స్పందన లేదని చెప్పారు. రెండు గ్రామాల నుంచి.. మండల పరిధిలోని రామచంద్రపురం, దక్షిణ చిరువోలులంక గ్రామాల నుంచి జోరుగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అక్రమ బుసక, మట్టి రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. దీనిపై అవనిగడ్డ తహసీల్దార్ ఎన్. నరసింహమూర్తిని వివరణ కోరగా మండలంలో ఎక్కడా బుసక, మట్టి, ఇసుక తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవని, వీఆర్వోలను పంపించి అలాంటివి జరిగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏడాదిలో పదివేల ట్రక్కులకు పైగా తరలింపు నాలుగు రోజుల నుంచి వేకనూరు లంకల్లో యథేచ్ఛగా బుసక, మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. రోజుకు 20 ట్రాక్టర్లకు పైగా బుసకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా ట్రాక్టర్లు నడపడం వల్ల రహదారులు దెబ్బతింటున్నాయి. ట్రక్కులపై ఎలాంటి పరజా లేకుండా వెళ్లడంతో కళ్ల నిండా దుమ్ము పడుతోంది. ఏడాదిలో ఎడ్లంక, వేకనూరు నుంచి పదివేలకు పైగా ట్రాక్టర్ ట్రక్కుల ఇసుకను తరలించారు. – దోవా గోవర్దన్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో నాలుగు రోజుల నుంచి మా ఊరి మీదుగా పెద్దఎత్తున బుసక అక్రమ రవాణా సాగుతోంది. ట్రాక్టర్లు చాలా స్పీడుగా వెళుతున్నాయి. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియడం లేదు. ఈ రోడ్డుపై వెళుతుంటే కళ్లనిండా బుసక, దుమ్ము పడుతోంది. రోడ్డుపై ప్రయాణించలేకపోతున్నాం. – కొల్లు గోపాలకృష్ణ, పాతఎడ్లంక -
నిమ్మకూరులో మట్టి మాఫియా
సాక్షి , అమరావతిబ్యూరో: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపణలు అక్షరాలా నిజం చేస్తున్నారు అధికార పార్టీ నేతలు. చినబాబు లోకేష్ దత్తత గ్రామంలో నీరు–చెట్టు పథకంలో భారీ అవినీతి చోటుచేసుకుంది. చెరువును నిబంధనలకు విరుద్ధంగా తవ్వి మట్టిని అమ్మిసొమ్ము చేసుకుంటున్నారు. చినబాబు దత్తత గ్రామం కావడంతో అధికారులు సైతం ఆ వైపు కన్నెత్తి చూడటంలేదు. మంత్రి నారా లోకేష్ దత్తత తీసుకున్న నిమ్మకూరు గ్రామంలో 8 ఎకరాల ఊర చెరువును నీరు చెట్టు కార్యక్రమంలో భాగంగా చెరువు అభివృద్ధి పనులను గత నెల 12వ తేదీన జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం ప్రారంభించారు. దీనిలో భాగంగా తొలుత చెరువులోని మట్టి తవ్వకాలు మొదలుపెట్టారు. చినబాబుకు అత్యంత సన్నిహితుడుగా ఉన్న గ్రామస్థాయినేత ఓ వ్యక్తి చెరువుమట్టిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నాడు. నిబంధనల ప్రకారం 3 మీటర్ల మాత్రమే చెరువును తవ్వాల్సి ఉండగా దీనికి విరుద్ధంగా 15 నుంచి 20 మీటర్ల వరకు మట్టిని తోడేస్తూ విక్రయిస్తున్నారు. ట్రాక్టరు మట్టి రూ.300.. ఒక్కో ట్రాక్టరు మట్టి ని రూ.300 చొప్పున గ్రామంలోని వ్యాపార, వాణిజ్య, రహదారి నిర్మాణాదారులకు విక్రయిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్‌కు మూడొందలు వంతున స్థానిక నేతకు ముట్టజెప్పాలి. ఆపై ట్రాక్టర్ యజమాని మాత్రం అదనంగా అమ్ముకోవాలి.. గత నెలలో ప్రారంభమయిన చెరువు పూడికతీత పనుల్లో ఇప్పటి వరకు సుమారు 6 వేల ట్రాక్టర్ల మట్టి విక్రయించినట్లు తెలుస్తోంది . మట్టి అమ్మకాలకు సుమారు రూ.7లక్షల వరకు ఆ నేత లబ్ధిపొందినట్లు సమాచారం. మట్టి విక్రయాలతో పాటు పూడికతీత పనులకు నీరు–చెట్టు పథకం ద్వారా మంజూరు చేసిన దాదాపు రూ.8.5 లక్షలు నిధులు కూడా మిగులుదల అయినట్లేనని స్థానికలు ఆరోపిస్తున్నారు. మట్టి విక్రయాల ద్వారా ఆదాయం రుచిమరిగిన ఆ నేత ఆ చెరువు పక్కనేఉన్న చిన్న చెరువుల నుంచి 10 వేల ట్రాక్టర్ల మట్టిని తవ్వేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిసింది. కన్నెత్తి చూడని అధికారులు.. నిమ్మకూరు గ్రామంలో ఈ విధంగా నిబంధనలకు విరుద్ధంగా మట్టి అక్రమ తవ్వకాలు జరుపుతున్నా ఏ అధికారి పట్టించుకోక పోవడం దారుణం. లోకేష్ దత్తత గ్రామంలోని ఈ విధమైన మట్టి మాఫియా టీడీపీ అక్రమాలకు పరాకాష్టగా నిలుస్తోందని అర్థమవుతోంది. కలెక్టరు సైతం పట్టించుకోకపోవడం దురదృష్టకరం. -
యాక్షనే.. ప్లానేదీ!
ఆకివీడు : ‘వెనుకబడిన వర్గాలు ఆర్థికంగా స్థిరపడేందుకు అన్నివిధాలా చర్యలు తీసుకుంటున్నాం. వారి స్వయం సమృద్ధికి రుణాలు అందజేస్తున్నాం’ అని గొప్పలు చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వానిది కపట నాటకమని తేలిపోయింది. ఈ ఏడాది ఇప్పటివరకూ బీసీ, ఎస్సీ, ఎస్టీల రుణాల కోసం సర్కారు యాక్షన్ ప్లాన్ రూపొందించలేదు. కాపుల రుణాల మంజూరుకు ప్రకటన చేసినా.. ఇప్పటివరకూ ఒక్కరికి కూడా మంజూరు చేయలేదు. సర్కారు ఏటా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా రుణాల మంజూరుకు ప్రణాళిక రూపొందిం చేంది. ఈ ప్రక్రియ ఆగస్టు నాటికి పూర్తయ్యేది. సెప్టెంబర్‌లో దరఖాస్తుల స్వీకరించేది. ఈ ఏడాది ఇప్పటివరకూ రుణ ప్రణాళిక ఖరారు చేయలేదు. దీంతో ఆ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రుణ ప్రణాళికపై స్పష్టత లేకపోవడంతో ఆన్లైన్లో ఆ వర్గాల సర్వర్లు తెరుచుకోవవడం లేదు. ఫలితంగా ప్రజలు మండల స్థాయి అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటివరకూ రుణాల ప్రకటన చేయకపోవడమేమిటని నిలదీస్తున్నారు. వారికి సమాధానం చెప్పలేక మండలస్థాయి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఆన్లైన్లో సర్వర్ ఓపెన్ కానప్పటికీ దరఖాస్తు చేసుకోవచ్చని కంటితుడుపు సమాధానం చెబుతున్నారు. కాపుల ఆందోళన నేపథ్యంలో.. ఇదిలా ఉంటే కాపుల ఆందోళన నేపథ్యంలో 20 రోజుల క్రితం సర్కారు హడావుడిగా రుణాలు ఇస్తున్నట్టు ప్రకటించింది. దరఖాస్తులూ స్వీకరించింది. గత ఏడాది కాపు కార్పొరేషన్ ద్వారా రుణాల కోసం జిల్లాలో 43 వేల దరఖాస్తులు అందగా, వీరిలో కేవలం కొందరికి మాత్రమే రుణాలు అందజేసింది. ఈ ఏడాది రూ.70 కోట్లు విడుదల చేశామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకూ రుణాల మంజూరు ప్రారంభించలేదు. ఈ ఏడాది జిల్లాలో 11,776 దరఖాస్తులు వచ్చాయి. ఇవి కాకుండా కాపు కార్పొరేషన్ వద్ద గత ఏడాది వచ్చిన 41 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం 52వేల దరఖాస్తులు కాపు కార్పొరేషన్ వద్ద ఉన్నాయి. విడుదల చేసిన రూ.70 కోట్లు వీరందరికీ సరిపోతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా నిబంధనలు రుణాల మంజూరుకు అడ్డంకిగా ఉన్నాయి. కేవలం కాపుల కన్నీరు తుడవడానికే ప్రభుత్వం రుణాలిస్తామని ప్రకటన చేసిందనే వాదన వినబడుతోంది. ముస్లిం, మైనార్టీలదీ అదే దుస్థితి ఈ ఏడాది ముస్లిం, మైనార్టీ వర్గాల వారికిచ్చే రుణాలకూ కార్యాచరణ ప్రణాళిక విడుదల కాలేదు. దీంతో ముస్లింలు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి బ్యాంకుల్లో రుణాలు ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారైనా న్యాయం చేయాలని కోరుతున్నారు. చిచ్చుపెట్టేందుకే... కులాల మధ్య తెలుగుదేశం ప్రభుత్వం చిచ్చుపెడుతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ యాక్షన్ ప్లాన్ విడుదల చేయకుండా జాప్యం చేస్తోంది. ఏటా విడుదల చేసే యాక్షన్ ప్లాన్ ఇవ్వకపోవడంలో ఆంతర్యమేమిటి. కాపులకు రెండవ విడత రుణాలు ఇస్తున్నట్టు ప్రకటించినా.. మంజూరులో విధించిన నిబంధనలతో ఎవరికీ రుణాలు దక్కే అవకాశం లేదు. ఇప్పటికే 50 వేలకుపైగా దరఖాస్తులు కాపు రుణాల కోసం కార్పొరేషన్‌కు అందాయి. – నంద్యాల సీతారామయ్య, కాపు సంఘ నాయకుడు పట్టించుకోరే.. మైనార్టీల శ్రేయస్సును ప్రభుత్వం విస్మరించింది. ముస్లిం, మైనార్టీలకు రుణాల మంజూరులో వివక్ష∙చూపుతోంది. నిరుపేద ముస్లింలు ఎంతోమంది రుణాల కోసం నిరీక్షిస్తున్నారు. పలావు బండ్లు, ఇతర చిరు వ్యాపారాలు చేసుకునేందుకు కొటేషన్లు, అంచనాలు ఇవ్వమంటే ఎలా తెస్తారు. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి. – మహ్మద్ జక్కీ, వైఎస్సార్ సీపీ నాయకుడు, ఆకివీడు బీసీ యాక్షన్ ప్లాన్ ఖరారు కాలేదు బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాల మంజూరుకు యాక్షన్ ప్లాన్ ఇవ్వలేదు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదు. గత ఏడాది 4200 మందికి రూ.21 కోట్లు రుణాలుగా అందజేశాం. కాపు కార్పొరేషన్ ద్వారా రెండో విడత రుణాల కోసం 11,776 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతంలో వచ్చిన దరఖాస్తులనూ పరిశీలిస్తాం. ఈ ఏడాది కాపు రుణాల కోసం రూ.70 కోట్లు మంజూరయ్యాయి. – పెంటోజీరావు, ఈడీ, బీసీ కార్పొరేషన్, ఏలూరు.