అవనిగడ్డ సెంటర్‌లో ట్రక్కుపై పట్టాలేకుండా వెళ్తున్న బుసక ట్రాక్టర్
సాక్షి, అవనిగడ్డ(కృష్ణా) : మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా బుసక, మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. నాలుగు రోజుల నుంచి అక్రమంగా రవాణా సాగుతున్నా అధికారులు స్పందించక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రాక్టర్లను స్పీడుగా తోలడం వల్ల ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయోనని ఈ ప్రాంత ప్రజలు భయాందోనలకు గురవుతున్నారు.
భారీగా తవ్వకాలు
మండల పరిధిలోని వేకనూరులో సొసైటీ భూములు, కృష్ణానది ఒడ్డు నుంచి బుసక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. నాలుగు రోజుల నుంచి ఇష్టారాజ్యంగా ఈ ప్రాంతంలో పొక్లెయిన్లు పెట్టి బుసకను తవ్వి అక్రమంగా తరలిస్తున్నారు. నాలుగు రోజుల్లో అవనిగడ్డ మండలంలో రూ.10 లక్షల విలువైన మట్టి, బుసకను అక్రమంగా తరలించారని ఎడ్లంక, పల్లెపాలెం వాసులు చెబుతున్నారు. ట్రాక్టర్లపై పట్టాలు కప్పకుండా తరలిస్తుండటంతో దుమ్మురేగి స్థానికులు, ట్రాక్టర్ల వెనుకవచ్చే వారి కళ్లల్లో పడుతోంది. దుమ్ముతో గ్రామస్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. బుసక ట్రాక్టర్ల వల్ల అవనిగడ్డ నుంచి ఎడ్లంక వెళ్లలేని పరిస్థితి నెలకొందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే కొందరు డ్రైవర్లు దౌర్జన్యానికి దిగుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తంచేశారు.
పట్టించుకోని అధికారులు
నాలుగు రోజుల నుంచి జరుగుతున్న అక్రమ బుసక రవాణాపై అధికారులు, పోలీసులకు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఎడ్లంక, పల్లెపాలెం ప్రజలు విమర్శిస్తున్నారు. ట్రాక్టర్ ట్రక్కులపై ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా స్థానిక పోలీసుస్టేషన్, తహసీల్దార్ కార్యాలయాల మీదుగానే యథేచ్ఛగా తరలివెళుతున్నా అధికారుల్లో స్పందన లేదని చెప్పారు.
రెండు గ్రామాల నుంచి..
మండల పరిధిలోని రామచంద్రపురం, దక్షిణ చిరువోలులంక గ్రామాల నుంచి జోరుగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అక్రమ బుసక, మట్టి రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. దీనిపై అవనిగడ్డ తహసీల్దార్ ఎన్. నరసింహమూర్తిని వివరణ కోరగా మండలంలో ఎక్కడా బుసక, మట్టి, ఇసుక తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవని, వీఆర్వోలను పంపించి అలాంటివి జరిగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఏడాదిలో పదివేల ట్రక్కులకు పైగా తరలింపు
నాలుగు రోజుల నుంచి వేకనూరు లంకల్లో యథేచ్ఛగా బుసక, మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. రోజుకు 20 ట్రాక్టర్లకు పైగా బుసకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా ట్రాక్టర్లు నడపడం వల్ల రహదారులు దెబ్బతింటున్నాయి. ట్రక్కులపై ఎలాంటి పరజా లేకుండా వెళ్లడంతో కళ్ల నిండా దుమ్ము పడుతోంది. ఏడాదిలో ఎడ్లంక, వేకనూరు నుంచి పదివేలకు పైగా ట్రాక్టర్ ట్రక్కుల ఇసుకను తరలించారు.
– దోవా గోవర్దన్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు
ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో
నాలుగు రోజుల నుంచి మా ఊరి మీదుగా పెద్దఎత్తున బుసక అక్రమ రవాణా సాగుతోంది. ట్రాక్టర్లు చాలా స్పీడుగా వెళుతున్నాయి. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియడం లేదు. ఈ రోడ్డుపై వెళుతుంటే కళ్లనిండా బుసక, దుమ్ము పడుతోంది. రోడ్డుపై ప్రయాణించలేకపోతున్నాం.
– కొల్లు గోపాలకృష్ణ, పాతఎడ్లంక
Comments
Please login to add a commentAdd a comment