Illegal sand danda
-
బుసకనూ బొక్కేస్తున్నారు
సాక్షి, అవనిగడ్డ(కృష్ణా) : మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా బుసక, మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. నాలుగు రోజుల నుంచి అక్రమంగా రవాణా సాగుతున్నా అధికారులు స్పందించక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రాక్టర్లను స్పీడుగా తోలడం వల్ల ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయోనని ఈ ప్రాంత ప్రజలు భయాందోనలకు గురవుతున్నారు. భారీగా తవ్వకాలు మండల పరిధిలోని వేకనూరులో సొసైటీ భూములు, కృష్ణానది ఒడ్డు నుంచి బుసక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. నాలుగు రోజుల నుంచి ఇష్టారాజ్యంగా ఈ ప్రాంతంలో పొక్లెయిన్లు పెట్టి బుసకను తవ్వి అక్రమంగా తరలిస్తున్నారు. నాలుగు రోజుల్లో అవనిగడ్డ మండలంలో రూ.10 లక్షల విలువైన మట్టి, బుసకను అక్రమంగా తరలించారని ఎడ్లంక, పల్లెపాలెం వాసులు చెబుతున్నారు. ట్రాక్టర్లపై పట్టాలు కప్పకుండా తరలిస్తుండటంతో దుమ్మురేగి స్థానికులు, ట్రాక్టర్ల వెనుకవచ్చే వారి కళ్లల్లో పడుతోంది. దుమ్ముతో గ్రామస్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. బుసక ట్రాక్టర్ల వల్ల అవనిగడ్డ నుంచి ఎడ్లంక వెళ్లలేని పరిస్థితి నెలకొందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే కొందరు డ్రైవర్లు దౌర్జన్యానికి దిగుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తంచేశారు. పట్టించుకోని అధికారులు నాలుగు రోజుల నుంచి జరుగుతున్న అక్రమ బుసక రవాణాపై అధికారులు, పోలీసులకు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఎడ్లంక, పల్లెపాలెం ప్రజలు విమర్శిస్తున్నారు. ట్రాక్టర్ ట్రక్కులపై ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా స్థానిక పోలీసుస్టేషన్, తహసీల్దార్ కార్యాలయాల మీదుగానే యథేచ్ఛగా తరలివెళుతున్నా అధికారుల్లో స్పందన లేదని చెప్పారు. రెండు గ్రామాల నుంచి.. మండల పరిధిలోని రామచంద్రపురం, దక్షిణ చిరువోలులంక గ్రామాల నుంచి జోరుగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అక్రమ బుసక, మట్టి రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. దీనిపై అవనిగడ్డ తహసీల్దార్ ఎన్. నరసింహమూర్తిని వివరణ కోరగా మండలంలో ఎక్కడా బుసక, మట్టి, ఇసుక తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవని, వీఆర్వోలను పంపించి అలాంటివి జరిగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏడాదిలో పదివేల ట్రక్కులకు పైగా తరలింపు నాలుగు రోజుల నుంచి వేకనూరు లంకల్లో యథేచ్ఛగా బుసక, మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. రోజుకు 20 ట్రాక్టర్లకు పైగా బుసకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా ట్రాక్టర్లు నడపడం వల్ల రహదారులు దెబ్బతింటున్నాయి. ట్రక్కులపై ఎలాంటి పరజా లేకుండా వెళ్లడంతో కళ్ల నిండా దుమ్ము పడుతోంది. ఏడాదిలో ఎడ్లంక, వేకనూరు నుంచి పదివేలకు పైగా ట్రాక్టర్ ట్రక్కుల ఇసుకను తరలించారు. – దోవా గోవర్దన్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో నాలుగు రోజుల నుంచి మా ఊరి మీదుగా పెద్దఎత్తున బుసక అక్రమ రవాణా సాగుతోంది. ట్రాక్టర్లు చాలా స్పీడుగా వెళుతున్నాయి. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియడం లేదు. ఈ రోడ్డుపై వెళుతుంటే కళ్లనిండా బుసక, దుమ్ము పడుతోంది. రోడ్డుపై ప్రయాణించలేకపోతున్నాం. – కొల్లు గోపాలకృష్ణ, పాతఎడ్లంక -
దొరికితే దొంగలు.. .
సిరుగుప్పలో యథేచ్ఛగా ఇసుక దందా సిరుగుప్ప : ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు శాఖ నగరంలో చాప కింద నీరులా జరుగుతున్న అక్రమ ఇసుక దందాను అరికట్టలేక పోవడం చూస్తుంటే నగరవాసులలో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇసుక అక్రమ దందారాయుళ్లు రాత్రి 11 గంటల నుంచి తెల్లవారు జామున 4 గంటల మధ్య, ఒక ట్రాక్టరు రూ.3000ల ప్రకారం ఒప్పందం చేసుకొంటున్నారు. రాత్రి గస్తీ తిరుగుతున్న పోలీసులకు దొరికితే మాత్రం దొంగ ట్రాక్టరు సీజ్ అవుతుంది. లేకపోతే దొరలా వేలాది రూపాయల సంపాదన చేసుకుంటున్నారు. సిరుగుప్పలో క్లబ్‌లు, మట్కా, అన్న భాగ్య బియ్యం అక్రమ రవాణా తదితర వాటిని నివారించి, సిరుగుప్ప ప్రజల మన్ననలందుకున్న జిల్లా ఎస్పీ చేతన్ ఇసుక అక్రమ రవాణాపై కూడా దృష్టి సారించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు తాలూకాలో ఇళ్ల నిర్మాణానికి ఇసుక లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు పూటగడవటం కష్టంగా మారుతోంది. -
ఇసుకను పిండి కోట్లు దండి
ర్యాంపుల్లో యథేచ్ఛగా దందా అక్రమంగా తరలిపోతున్న ఇసుక కళ్లు మూసుకున్న అధికార యంత్రాంగం ‘దోచుకున్న వాడికి దోచుకున్నంత..’ అన్నట్టుగా ఉంది జిల్లాలో ఇసుక వ్యాపారం. నిబంధనల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇసుకను దొరకని ముడిసరుకుగా మార్చేయడంతో అధికార పార్టీ అండదండలతో ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా దండుకుంటోంది. ప్రభుత్వ అనుమతి ఉందనే సాకు చూపిస్తూ ర్యాంప్‌ల వద్ద ఎవరికి దొరికినంత వారు దోచేస్తూ కోట్లాది రూపాయలు అక్రమంగా వెనకేసుకుంటున్నారు. చోడవరం: చోడవరం, మాడుగుల నియోజకవర్గాల పరిధిలో ఇసుక రవాణా జోరుగా సాగుతుంది. అనధికార ర్యాంప్లతో పాటు అధికార ర్యాంప్ వద్ద కూడా అక్రమ ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. శారదా, పెద్దేరు, బొడ్డేరు, తాచేరు నదుల్లో నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న అన్ని గ్రామాల్లోనూ ఇసుక వ్యాపారం జరుగుతోంది. శారదానదిలో గోవాడ, అంబేరుపురం, గజపతినగరం, ముద్దుర్తి, రాయపురాజుపేట ,కలిగొట్ల, బోయిల కింతాడ, తారువ, మల్లంపాలెం, లక్కవరం, భోగాపురం వద్ద, బొడ్డేరు, పెద్దేరు నదుల్లో విజయరామరాజుపేట, జన్నవరం వీరనారాయణం, వీరవిల్లి అగ్రహారం, మాడుగుల, బెన్నవోలు, పీఎస్‌పేట, అంకుపాలెంలక్ష్మీపురం కల్లాలు వద్ద అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. -
అక్రమ ఇసుక దందాపై దాడిశెట్టి పోరు
బొద్దవరం డంపింగ్యూర్డులో నిల్వల్ని గుర్తించిన ఎమ్మెల్యే రాజా స్థానికాధికారులు స్పందించకపోవడంతో కలెక్టర్, ఆర్డీఓలకు ఫిర్యాదు రైతులు, పార్టీ నాయకులతో ఏడున్నర గంటలకు పైగా యూర్డులోనే నిరీక్షణ చివరికి వేలాది క్యూబిక్ మీటర్ల ఇసుక, 11లారీలు, రెండు జేసీబీల సీజ్ తుని :కోట్ల విలువ చేసే ఇసుక అక్రమంగా తరలిపోతుంటే అవినీతితో, అధికారపార్టీ నేతల ఒత్తిళ్లతో పట్టించుకోని అధికారులను తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తన పట్టుదలతో దిగివచ్చేలా చేశారు. అక్రమ ఇసుక నిల్వలను స్వయంగా గుర్తించిన ఆయన వాటిని స్వాధీనం చేసుకునే వరకూ పట్టువిడవ లేదు. ఏడున్నర గంటలపాటు అధికారుల కోసం నిరీక్షించి మరీ వేలాది క్యూబిక్ మీటర్ల అక్రమ ఇసుక నిల్వలను, తరలించడానికి ఉద్దేశించిన వాహనాలను పట్టించారు. ఇసుక అక్రమ దందాతో తాండవ ఒడ్డున పంట భూములు కోల్పోతున్న రైతులను ఆదుకోవాలని సంకల్పించిన ఎమ్మెల్యే రాజా రైతులు, మండల వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి శనివారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో కోటనందూరు మండలం బొద్దవరం వెళ్లారు. తాండవ నదిలో తవ్విన ఇసుకను నిల్వచేసిన డంపింగ్ యార్డుకు వెళ్లి, 11 లారీలు, రెండు జేసీబీలతోపాటు వేలాది క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలను గుర్తించారు. దీనిపై స్థానిక రెవెన్యూ, మండల పరిషత్ అధికారులకు సమచారమిచ్చారు. గంటలు గడుస్తున్నా స్థానిక అధికారులు స్పందించకపోవడంతో కలెక్టర్ అరుణ్‌కుమార్, పెద్దాపురం ఆర్డీవో విశ్వేశ్వరరావులకు ఫోన్లో ఫిర్యాదు చేశారు. కలెక్టర్ స్పందించి ఇసుక నిల్వలు, వాహనాలను సీజ్ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారులు వచ్చే వరకు కదిలేది లేదన్న ఎమ్మెల్యే రాత్రి తొమ్మిది గంటల వరకూ అక్కడే ఉండిపోయూరు. కాగా అధికార పార్టీ పెద్దలు చీకటిపడ్డాక ఇసుక అక్రమార్కులను ఉసిగొల్పి ఎమ్మెల్యేను, గ్రామస్తులను బెదిరించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తడంతో ఎస్పీ, డీఎస్పీలకు ఫోన్లో సమాచారం ఇచ్చారు. రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు, తహశీల్దారు పి.వరహాలయ్య, ఎంపీడీఓ మధుసూదన్‌లు వచ్చి ఇసుక తరలింపుకు ఉపయోగిస్తున్న వాహనాలను సీజ్ చేస్తామని చెప్పారు. అయితే లిఖితపూర్వకంగా చెబితేనే అక్కడ నుంచి కదులుతానని ఎమ్మెల్యే రాజా తేల్చిచెప్పడంతో చివరికి సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు. ఇదంతా జరిగే సరికి రాత్రి 10 గంటలైంది. రైతుల శ్రేయస్సుకు రాజీలేని పోరు: ఎమ్మెల్యే రాజా తాండవ నదిలో ఇసుకను గృహనిర్మాణదారుల కోసమంటూ పంచాయతీ జారీ చేసే పర్మిట్లను అడ్డుపెట్టుకుని రోజుకు రూ.కోటి పైగా విలువ చేసే ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ఎమ్మెల్యే రాజా విలేకరులకు చెప్పారు. కోటనందూరు నుంచి తుని మండలం వరకూ ఉన్న తాండవలో సుమారు పదిచోట్ల అధికారపార్టీ అండదండలతో ఇసుక మాఫియూ చెలరేగిపోతోందన్నారు. ఆరునెలలుగా ఇది జరుగుతున్నా ఒక్క అధికారీ పట్టించుకోలేదని ఆరోపించారు. విచ్చలవిడి తవ్వకాలతో నదీగమనం మారి సాగు భూములు నదిలో కలిసిపోతున్నాయని, బోరుబావుల్లో నీటి నిల్వలు తగ్గుతున్నాయని అన్నారు. రైతుల శ్రేయస్సు కోసం ఇసుకమాఫియాను అరికట్టేంత వరకూ రాజీ లేని పోరాటం చేస్తానన్నారు. ఎమ్మెల్యే వెంట మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ గొర్లి రామచ ంద్రరావు, మాజీ ఎంపీపీ గొర్లి అచ్చియ్యనాయుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు పెదపాటి అమ్మాజీ, పార్టీ నాయకులు దాడి బాబులు, వేముల రాజబాబు, చింతకాయల చినబాబ్జి, లగుడు శ్రీను, లంకప్రసాద్, ఎల్లపు సూర్యనారాయణ, సుర్ల అప్పలనాయుడు, కూరపాటి రమణ, బర్రి అప్పారావు, రేలంగి రమణాగౌడ్, మోతుకూరి వెంకటేష్, పలువురు రైతులు ఉన్నారు. ప్రోటోకాల్‌ను విస్మరించిన అధికారులు ఎమ్మెల్యే రాజా, రైతులు కలసి అనధికార ఇసుక నిల్వలపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా అధికారులు సకాలంలో స్పందించలేదు. చివరికి డిప్యూటీ తహశీల్దార్ ఆర్.వెంకటేశ్వరరావు వచ్చి లారీలు, జేసీబీలు,ఇసుక నిల్వల వివరాలను నమోదు చేశారు. స్థానిక పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ వివరణ కోరేందుకు ఫోన్లో ప్రయత్నిం చగా రెండు నిమిషాలు మాట్లాడాక స్విచాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కాగా ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేకి బందోబస్తు ఇవ్వవలసిన పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. ఎమ్మెల్యే బొద్దవరం వచ్చిన అరగంటకు వచ్చిన కోటనందూరు ఎస్సై గోపాలకృష్ణ పది నిమిషాల్లోనే ఉన్నతాధికారుల నుంచి ఫోన్ రాగా వెళ్లిపోయారు. అనంతరం తహశీల్దార్, ఎంపీడీఓ కూడా ఇలాగే వ్యవహరించారు.