దొరికితే దొంగలు.. .
సిరుగుప్పలో యథేచ్ఛగా ఇసుక దందా
సిరుగుప్ప : ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు శాఖ నగరంలో చాప కింద నీరులా జరుగుతున్న అక్రమ ఇసుక దందాను అరికట్టలేక పోవడం చూస్తుంటే నగరవాసులలో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇసుక అక్రమ దందారాయుళ్లు రాత్రి 11 గంటల నుంచి తెల్లవారు జామున 4 గంటల మధ్య, ఒక ట్రాక్టరు రూ.3000ల ప్రకారం ఒప్పందం చేసుకొంటున్నారు.
రాత్రి గస్తీ తిరుగుతున్న పోలీసులకు దొరికితే మాత్రం దొంగ ట్రాక్టరు సీజ్ అవుతుంది. లేకపోతే దొరలా వేలాది రూపాయల సంపాదన చేసుకుంటున్నారు. సిరుగుప్పలో క్లబ్‌లు, మట్కా, అన్న భాగ్య బియ్యం అక్రమ రవాణా తదితర వాటిని నివారించి, సిరుగుప్ప ప్రజల మన్ననలందుకున్న జిల్లా ఎస్‌పీ చేతన్ ఇసుక అక్రమ రవాణాపై కూడా దృష్టి సారించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు తాలూకాలో ఇళ్ల నిర్మాణానికి ఇసుక లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు పూటగడవటం కష్టంగా మారుతోంది.