Building Construction workers
-
భవన నిర్మాణ కార్మికులకు అందుతున్న సంక్షేమం కనబడటం లేదా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని సర్కారు నిర్మాణాత్మక సంక్షేమాన్ని అందిస్తుంటే.. రామోజీరావు మాత్రం వక్ర రాతలతో ఈనాడు పత్రికలో ఆక్రోశం వెళ్లగక్కారు. ఆ కార్మికుల ‘సంక్షేమానికి సర్కారు ఎసరు’ అంటూ అసత్యాల పునాదులపై ఓ కథనాన్ని నిర్మించి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం విషయంలో గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి నక్కకు నాకలోకానికి ఉన్నంత వ్యత్యాసం స్పష్టంగా కన్పిస్తోంది. కార్మికుల బిడ్డల విద్యకు ఊతమిస్తున్న ప్రభుత్వం వివాహానికి సైతం ఆర్థిక సాయమందిస్తోంది. ఆ కుటుంబాలకు ఉచిత వైద్య సేవలు అందించి ఆరోగ్యానికి భరోసా ఇస్తోంది. భవన నిర్మాణ కార్మికులు ప్రమాదవశాత్తు మృతి చెందినా, వైకల్యం పొందినా ఆ కుటుంబానికి బీమా అందించి ప్రభుత్వం ధీమా కల్పిస్తోంది. వాస్తవానికి గతంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ద్వారా భవన నిర్మాణ కార్మికులు అనేక సంక్షేమ పథకాలతో ప్రయోజనాలు పొందుతున్నారు. రిజిస్టర్ కాకపోయినా బీమా ఈనాడు రాతలు ఎంత అభూత కల్పనలో ప్రభుత్వం అందించే సంక్షేమాన్ని బట్టి చూస్తే ఇట్టే అర్థమవుతుంది. రిజిస్టర్ అయినా, కాకపోయినా భవన నిర్మాణ కార్మికుడు ప్రమాదవశాత్తూ మరణిస్తే వైఎస్సార్ బీమా ద్వారా ప్రభుత్వం రూ. 5 లక్షలు ఇస్తోంది. గత ప్రభుత్వం రిజస్టర్ అయినవాళ్లకి మాత్రమే రూ. 5 లక్షలు ఇచ్చేది. రిజిస్టర్ కానివాళ్లకు కేవలం రూ. 50 వేలు మాత్రమే ఇచ్చేది. వివాహాలకు గతంలో ఇచ్చేది కేవలం రూ. 20 వేలు మాత్రమే. ఈ ప్రభుత్వం దాన్ని రెట్టింపు చేస్తూ రూ. 40 వేలు అందిస్తోంది. భవన నిర్మాణ కార్మికులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అయితే వారికి వేర్వేరు స్కేల్స్ ఉన్నాయి. వివిధ కేటగిరీల్లో గరిష్టంగా ఈ పథకంతో రూ. 1.5 లక్షల వరకూ లబ్ధి చేకూరుతుంది. ఇందులో బోర్డు నుంచి వచ్చేది కేవలం రూ. 40 వేలు. మిగతా డబ్బును ప్రభుత్వం ఖజానా నుంచి భవన నిర్మాణ కార్మికులకు అందిస్తోంది. గతంలో భవన నిర్మాణ కార్మికుల బిడ్డలకు స్కాలర్ షిప్‌లుగా కేవలం రూ. 1,200 మాత్రమే ఇచ్చేవారు. గ్రాడ్యుయేషన్‌కు ఏడాదికి రూ. 5 వేలు మాత్రమే ఇచ్చేవారు. ఈ ప్రభుత్వం పిల్లలను స్కూలుకు పంపే తల్లికే ఏడాదికి అమ్మఒడి రూపంలో రూ. 15 వేలు ఇస్తోంది. అవి కాకుండా విద్యాదీవెన, వసతి దీవెనలతో పాటు, విదేశీ విద్యా దీవెన తదితర కార్యక్రమాలన్నీ వర్తింపజేస్తోంది. ఇవికాకుండా ప్రభుత్వం అందించే అన్ని పథకాలతో అర్హులైన భవన నిర్మాణ కార్మికులు విస్తృతంగా ప్రయోజనం పొందుతున్నారు. ♦ సహజ మరణాలైతే గత ప్రభుత్వం రూ. 60 వేలు మాత్రమే ఇచ్చేది. ప్రస్తుత ప్రభుత్వం వైఎస్సార్ బీమా కింద రూ. 1 లక్ష అందిస్తోంది. ♦ ప్రమాదాల్లో వైకల్యం సంభవిస్తే ప్రస్తుత ప్రభుత్వం రూ. 5 లక్షలు అందిస్తోంది. ♦ గత ప్రభుత్వం హయాంలో రిజిస్టర్ అవ్వని కార్మికులు ప్రమాదవశాత్తు 50 శాతం, అంతకంటే ఎక్కువ వైకల్యం పొందితే రూ. 20 వేలు, 50 శాతంలోపు వైకల్యం అయితే రూ. 10 వేలు వచ్చేది. ప్రస్తుత ప్రభుత్వం ప్రమాద మరణాలకు రూ. 5 లక్షలు, వైకల్యం సంభవిస్తే రూ. 2.5 లక్షలు అందిస్తోంది. ♦ ఆస్పత్రుల్లో వైద్యానికి గత ప్రభుత్వం నెలకు రూ. 3 వేలు చొప్పున మూడు నెలల సాయం మాత్రమే అందించేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉచితంగా చికిత్స అనంతరం కూడా వైద్యులు సూచించిన విశ్రాంతి కాలానికి రోజుకు రూ. 225 గరిష్టంగా నెలకు రూ. 5 వేలు సాయం అందిస్తోంది. -
ఐశ్వర్యం వస్తుందని.. బాలుడి నరబలి
న్యూఢిల్లీ: మూఢనమ్మకం అభంశుభం తెలియని ఓ ఆరేళ్ల చిన్నారి ప్రాణం తీసింది. సంపద వస్తుందనే అంధ విశ్వాసంతో మానవత్వం మరిచి పసివాడిని నరబలి ఇచ్చారు. దేశ రాజధానిలో∙ఈ ఘోరం చోటుచేసుకుంది. బిహార్‌కు చెందిన అజయ్ కుమార్, అమర్ కుమార్ దక్షిణ ఢిల్లీ లోధి కాలనీలోని మురికివాడలో ఉంటున్నారు. అక్కడే యూపీకి చెందిన బాధిత బాలుడి కుటుంబం ఉంటోంది. వీరంతా భవన నిర్మాణ కార్మికులు. అజయ్, అమర్ శనివారం రాత్రి తమ గుడిసెలో పాటలు పాడుతూ పూజలు మొదలుపెట్టారు. అది చూసేందుకు బాలుడు వెళ్లాడు. పూజలు ముగిశాక అందరూ ఇళ్లకు వెళ్లిపోయారు. కానీ, తన కుమారుడు ఎంతకీ రాకపోయేసరికి వెతుక్కుంటూ తండ్రి వెళ్లాడు. ఆ గుడిసెలో నుంచి రక్తం చారికలుగా ప్రవహిస్తూ కనిపించింది. లోపల మంచం కింద తన కొడుకు విగతజీవిగా పడి ఉండటంతో హతాశుడయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డబ్బు వస్తుందనే మూఢ నమ్మకంతోనే తమ వద్దకు వచ్చిన బాలుడి తలపై మోది, చాకుతో గొంతుకోసి చంపినట్లు అజయ్, అమర్ పోలీసుల విచారణలో వెల్లడించారు. -
మృత్యు పిల్లర్
హైదరాబాద్: నగరానికి వలస పోయి చేతనైన పనిచేసుకుంటూ తమ పిల్లలకు కడుపు నింపుకుందామనుకున్న ఆ దంపతుల ఆశ తీరకుండానే ఆవిరైపోయింది. బతుకుదెరువు కోసం భవన నిర్మాణ కూలీలుగా ఇద్దరు చిన్నారులతో వలస వచ్చిన ఆ భార్యాభర్తలు నగరంలో జీవనం కొనసాగిస్తున్నారు. అయితే నిర్మాణంలో ఉన్న భవనానికి పునాది లేకుండా సిమెంట్ ఇటుకలతో నిర్మించిన ఓ పిల్లర్ వారి పిల్లల పాలిట మృత్యు శకటమైంది. తమ అభాగ్య జీవితాల్లో భాగ్య రేఖలు నింపుతారని కొండంత ఆశతో ఉన్న ఆ దంపతులకు ఆ పిల్లర్ తీరని గర్భశోకాన్ని మిగిల్చింది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగిన ఈ ఘటన వివరాలు సీఐ రవీందర్ చెప్పిన కథనం మేరకు..ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన దస్తగిరి, భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్‌కు వలసవచ్చి గోపన్‌పల్లిలోని బెల్ల్ల విస్తవిల్లాస్ ఆర్చ్‌లో ఉంటూ భవన నిర్మాణ కూలీలుగా పనిచేస్తున్నారు. శుక్రవారం బెర్ల విస్తవిల్లాస్ ఆర్చ్‌లోని భవనంలో కూలీ పనులు చేస్తుండగా వారి కూతుళ్లు అమ్ములు(6), ప్రవళిక(3) ఇద్దరు కలిసి భవనం ముందు ఆడుకుంటున్నారు. ఆ చిన్నారులు ఆడుకుంటుండగా మధ్యాహ్నం పిల్లర్ కుప్పకూలిపోయింది. అందులోని సిమెంట్ ఇటుకలు ఆ చిన్నారులపై పడటంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తల్లిదండ్రులు స్థానికుల సహాయంతో వారిని నల్లగండ్లలోని సిటిజన్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేసిన తరువాత అక్కడ నుండి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిర్మాణదారులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు పిల్లలు మృతి చెందిన విషయం తెలుసుకున్న గచ్చిబౌలి కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. సంఘటన గురించి పోలీసులు, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యత లేకుండా నిర్మించడమే కారణం గోపన్‌పల్లిలోని బెర్ల విస్తవిల్లార్ ఆర్చ్ పేరుతో ఓ సంస్థ ఇండిపెండెంట్ భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. భవన నిర్మాణాల్లో భాగంగా భవన డిజైన్ కోసమని సిమెంట్ ఇటుకలతో పునాది లేకుండానే ఓ పిల్లర్‌ను నిర్మించడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. -
కదం తొక్కిన భవన కార్మికులు
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘ కార్మికులు మంగళవారం కదం తొక్కారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం అక్కయ్యపాలెంలోని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ముఖ్య అతిథిగా సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పడాల రమణ పాల్గొని మాట్లాడారు. భవన నిర్మాణ కార్మిక చట్టాలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. చట్టం ద్వారా బోర్డుకు వస్తున్న నిధులను ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. అంతేకాకుండా సర్కారు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతోందని మండిపడ్డారు. కార్మికులకు ఉపయోగం లేని కిట్లు కొనుగోలు, శిక్షణ శిబిరాల పేరుతో కోట్లాది రూపాయలు అధికారుల జేబులో వేసుకుంటున్నారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాలలో సంక్షేమ బోర్డు పథకాల అమలను చంద్రబాబు ప్రభుత్వం పరిశీలించి మన రాష్ట్రంలో అమలుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 55 ఏళ్లు నిండిన భవన నిర్మాణ కార్మికులు మరణించాక బోర్డు ద్వారా నెలకు రూ.3వేలు పింఛనుమంజూరు చేయాలని కోరారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగి చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షుడు కోట సత్తిబాబు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. గౌరవ అధ్యక్షులు కూన కృష్ణారావు, వర్కింగ్ అ«ధ్యక్షుడు కోన లక్ష్మణ, నాయకులు సూర్యనారాయణ, ప్రతాప్, పొన్నాడ సాయి, నాగేశ్వరరావు, తిరుమలరావు, సూరిబాబు, వెంకటకుమార్, రమణీశ్వరి పాల్గొన్నారు. -
ఏపీలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం గాలికి
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్ర ప్రదేశ్‌లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నామమాత్రమేనని కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ వెల్లడించారు. రాజ్య సభలో బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఉద్దేశించిన పథకాలు చాలా మందికి దక్కడం లేదని చెప్పారు. ఈ కారణంగానే కార్మికుల రిజిస్ట్రేషన్ కూడా చెప్పుకొదగ్గంతగా లేదు. ఫలితంగా వారి సంక్షేమం కోసం శిస్తు రూపంలో వసూలు చేసిన వందలాది కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేయకుండా మిగిలిపోతున్నట్లుగా మంత్రి చెప్పారు. భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ శిస్తు చట్టం కింద ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1543 కోట్ల రూపాయలు వసూలు కాగా 2017 డిసెంబర్ 3 నాటికి కేవలం 412 కోట్ల రూపాయలను మాత్రమే కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేసిందని గంగ్వార్ వెల్లడించారు. భవన నిర్మాణ రంగంతోపాటు ఇతర నిర్మాణ రంగాల్లో పని చేస్తున్న కార్మికుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసి, వారందరినీ సంక్షేమ పథకాల పరిధిలోకి తీసుకురావలంటూ కార్మిక మంత్రిత్వ శాఖ పదే పదే ఆంధ్రప్రదేశ్‌తో సహా ఇతర రాష్ట్రాలకు ఆదేశాలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆయా రాష్ట్రాలలోని బిల్డింగ్ ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డులు కార్మికుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను తమ మంత్రిత్వ శాఖ జారీ చేసే ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తున్నవో లేదో పర్యవేక్షించడానికి కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఒక మోనిటరింగ్ కమిటీని కూడా కేంద్ర ప్రభుత్వం నియమించినట్లు మంత్రి తెలిపారు. ఈ-కామర్స్‌తో స్టోర్స్‌కు ముప్పు లేదు ఆన్లైన్ మార్కెటింగ్ సైట్లతో బ్రిక్ అండ్ మోర్టార్ స్టోర్లకు వచ్చిన ముప్పేమీ లేదని వాణిజ్య శాఖ సహాయ మంత్రి సీఆర్ చౌధరి చెప్పారు. ఈ-కామర్స్ డిస్కౌంట్ రేట్లకు జరుపుతున్న విక్రయాలు స్టోర్స్ అమ్మకాలను ప్రభావితం చేస్తున్న అంశం నీతి ఆయోగ్, ఆర్థిక మంత్రిత్వ శాఖ, వాణిజ్య మంత్రిత్వ శాఖల మధ్య భిన్నాభిప్రాయలకు దారితీస్తోందా అంటూ బుధవారం రాజ్య సభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ, ఆర్థిక రంగం పురోగమించాలన్న ఏకైక లక్ష్యంతోనే ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పని చేస్తుంటాయని అన్నారు. అమలులో ఉన్న నియమ నిబంధనలు, నియంత్రణలకు లోబడే ఆన్లైన్ మార్కెటింగ్ సైట్లు, బ్రిక్ అండ్ మోర్టార్ స్టోర్లు తమ బిజినెస్ మోడల్స్‌ను రూపొందించుకుంటాయని ఆయన చెప్పారు. అయితే ఈ-కామర్స్ సైట్లు తమ సైట్ ద్వారా విక్రయించే వస్తువులు లేదా సేవలకు సంబంధించిన ధరలను ప్రత్యక్షంగాను లేదా పరోక్షంగాను ప్రభావితం చేయకూడదని మంత్రి చెప్పారు. దీని వలన ఆన్లైన్ సైట్లకు స్టోర్ బిజినెస్ మధ్య లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఏర్పడుతుందని అన్నారు -
భవన నిర్మాణ కార్మికులకు ఈఎస్ఐ, ఈపీఎఫ్!
భువనేశ్వర్: కేంద్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు కూడా ఈఎస్ఐ, ఈపీఎఫ్ సదుపాయాలు కల్పించడానికి ప్రణాళిక సిద్ధం చేయనుందని కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. భువనేశ్వర్‌లో కార్మికుల జాతీయ భేటీలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. ఆటో డ్రైవర్లు, రిక్షా కార్మికులు, అంగన్వాడీ, ఆశా వర్కర్లకూ వీటిని కల్పించే ందుకు కసరత్తు జరుగుతోందన్నారు. రాష్ట్రాలకు నిర్మాణ పన్ను రూపేణా వచ్చిన రూ. 27,886 కోట్లలో రూ.5,800 కోట్లే ఖర్చు పెట్టాయని విమర్శించారు. భవన నిర్మాణ కార్మికుల చట్టం-1996 ప్రకారం ఆ సొమ్మును కార్మికుల అభివృద్ధి కోసం ఉపయోగించాలన్నారు.ఈ పన్ను రూపంలో ఒడిశా ప్రభుత్వం వసూలు చేసిన రూ. 940 కోట్లలో రూ. 120 కోట్లే ఖర్చు చేసిందన్నారు. ఈ సదస్సులో ఒడిశా, బిహార్, తెలంగాణ, మేఘాలయ, జార్ఖండ్, హరియాణాల కార్మిక మంత్రులు పాల్గొన్నారు. -
దొరికితే దొంగలు.. .
సిరుగుప్పలో యథేచ్ఛగా ఇసుక దందా సిరుగుప్ప : ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు శాఖ నగరంలో చాప కింద నీరులా జరుగుతున్న అక్రమ ఇసుక దందాను అరికట్టలేక పోవడం చూస్తుంటే నగరవాసులలో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇసుక అక్రమ దందారాయుళ్లు రాత్రి 11 గంటల నుంచి తెల్లవారు జామున 4 గంటల మధ్య, ఒక ట్రాక్టరు రూ.3000ల ప్రకారం ఒప్పందం చేసుకొంటున్నారు. రాత్రి గస్తీ తిరుగుతున్న పోలీసులకు దొరికితే మాత్రం దొంగ ట్రాక్టరు సీజ్ అవుతుంది. లేకపోతే దొరలా వేలాది రూపాయల సంపాదన చేసుకుంటున్నారు. సిరుగుప్పలో క్లబ్‌లు, మట్కా, అన్న భాగ్య బియ్యం అక్రమ రవాణా తదితర వాటిని నివారించి, సిరుగుప్ప ప్రజల మన్ననలందుకున్న జిల్లా ఎస్పీ చేతన్ ఇసుక అక్రమ రవాణాపై కూడా దృష్టి సారించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు తాలూకాలో ఇళ్ల నిర్మాణానికి ఇసుక లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు పూటగడవటం కష్టంగా మారుతోంది. -
భవన నిర్మాణ కార్మికులకు స్మార్టు కార్డులు
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులకు స్మార్ట్ కార్డులు జారీ చేస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ పథకంలో రాష్ట్రీయ పాస్ట్ బీమా, ఆమ్ ఆద్మీ బీమా యోజన, వృద్ధాప్య పింఛన్ తదితర మూడు అంశాలను పొందుపరుస్తామన్నారు.శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం ఆధ్వర్యంలో కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డిలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ మోడల్ ఐటీఐగా తీర్చిదిద్దేందుకు మల్లేపల్లిలోని ఐటీఐకి రూ.10 కోట్లు కేటాయించినట్టు చెప్పా రు. శ్రామికుల నైపుణ్యాన్ని పెంచేందుకు హైదరాబాద్‌కు దగ్గరలో వృత్తి విద్య యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామన్నారు. మంత్రి నాయిని మాట్లాడుతూ కార్మికుల డబ్బులు దుర్వినియోగం కాకుండా చూస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రూ.600 కోట్లు రావాల్సి ఉందన్నారు. రూ.420 కోట్లను ఏపీ సీఎం చంద్రబాబు అక్రమంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే అడ్డుకున్నట్టు చెప్పారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కామల్ల ఐలయ్య, అధ్యక్షులు కాలేబు, ప్రధాన కార్యదర్శి సీహెచ్ రాములు, కోశాధికారి లక్ష్మయ్య, కార్యదర్శి అల్వాల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.