సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని సర్కారు నిర్మాణాత్మక సంక్షేమాన్ని అందిస్తుంటే.. రామోజీరావు మాత్రం వక్ర రాతలతో ఈనాడు పత్రికలో ఆక్రోశం వెళ్లగక్కారు. ఆ కార్మికుల ‘సంక్షేమానికి సర్కారు ఎసరు’ అంటూ అసత్యాల పునాదులపై ఓ కథనాన్ని నిర్మించి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశారు.
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం విషయంలో గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి నక్కకు నాకలోకానికి ఉన్నంత వ్యత్యాసం స్పష్టంగా కన్పిస్తోంది. కార్మికుల బిడ్డల విద్యకు ఊతమిస్తున్న ప్రభుత్వం వివాహానికి సైతం ఆర్థిక సాయమందిస్తోంది. ఆ కుటుంబాలకు ఉచిత వైద్య సేవలు అందించి ఆరోగ్యానికి భరోసా ఇస్తోంది.
భవన నిర్మాణ కార్మికులు ప్రమాదవశాత్తు మృతి చెందినా, వైకల్యం పొందినా ఆ కుటుంబానికి బీమా అందించి ప్రభుత్వం ధీమా కల్పిస్తోంది. వాస్తవానికి గతంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ద్వారా భవన నిర్మాణ కార్మికులు అనేక సంక్షేమ పథకాలతో ప్రయోజనాలు పొందుతున్నారు.
రిజిస్టర్ కాకపోయినా బీమా
ఈనాడు రాతలు ఎంత అభూత కల్పనలో ప్రభుత్వం అందించే సంక్షేమాన్ని బట్టి చూస్తే ఇట్టే అర్థమవుతుంది. రిజిస్టర్ అయినా, కాకపోయినా భవన నిర్మాణ కార్మికుడు ప్రమాదవశాత్తూ మరణిస్తే వైఎస్సార్ బీమా ద్వారా ప్రభుత్వం రూ. 5 లక్షలు ఇస్తోంది. గత ప్రభుత్వం రిజస్టర్ అయినవాళ్లకి మాత్రమే రూ. 5 లక్షలు ఇచ్చేది. రిజిస్టర్ కానివాళ్లకు కేవలం రూ. 50 వేలు మాత్రమే ఇచ్చేది. వివాహాలకు గతంలో ఇచ్చేది కేవలం రూ. 20 వేలు మాత్రమే.
ఈ ప్రభుత్వం దాన్ని రెట్టింపు చేస్తూ రూ. 40 వేలు అందిస్తోంది. భవన నిర్మాణ కార్మికులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అయితే వారికి వేర్వేరు స్కేల్స్ ఉన్నాయి. వివిధ కేటగిరీల్లో గరిష్టంగా ఈ పథకంతో రూ. 1.5 లక్షల వరకూ లబ్ధి చేకూరుతుంది. ఇందులో బోర్డు నుంచి వచ్చేది కేవలం రూ. 40 వేలు. మిగతా డబ్బును ప్రభుత్వం ఖజానా నుంచి భవన నిర్మాణ కార్మికులకు అందిస్తోంది. గతంలో భవన నిర్మాణ కార్మికుల బిడ్డలకు స్కాలర్ షిప్‌లుగా కేవలం రూ. 1,200 మాత్రమే ఇచ్చేవారు.
గ్రాడ్యుయేషన్‌కు ఏడాదికి రూ. 5 వేలు మాత్రమే ఇచ్చేవారు. ఈ ప్రభుత్వం పిల్లలను స్కూలుకు పంపే తల్లికే ఏడాదికి అమ్మఒడి రూపంలో రూ. 15 వేలు ఇస్తోంది. అవి కాకుండా విద్యాదీవెన, వసతి దీవెనలతో పాటు, విదేశీ విద్యా దీవెన తదితర కార్యక్రమాలన్నీ వర్తింపజేస్తోంది. ఇవికాకుండా ప్రభుత్వం అందించే అన్ని పథకాలతో అర్హులైన భవన నిర్మాణ కార్మికులు విస్తృతంగా ప్రయోజనం పొందుతున్నారు.
♦ సహజ మరణాలైతే గత ప్రభుత్వం రూ. 60 వేలు మాత్రమే ఇచ్చేది. ప్రస్తుత ప్రభుత్వం వైఎస్సార్ బీమా కింద రూ. 1 లక్ష అందిస్తోంది.
♦ ప్రమాదాల్లో వైకల్యం సంభవిస్తే ప్రస్తుత ప్రభుత్వం రూ. 5 లక్షలు అందిస్తోంది.
♦ గత ప్రభుత్వం హయాంలో రిజిస్టర్ అవ్వని కార్మికులు ప్రమాదవశాత్తు 50 శాతం, అంతకంటే ఎక్కువ వైకల్యం పొందితే రూ. 20 వేలు, 50 శాతంలోపు వైకల్యం అయితే రూ. 10 వేలు వచ్చేది. ప్రస్తుత ప్రభుత్వం ప్రమాద మరణాలకు రూ. 5 లక్షలు, వైకల్యం సంభవిస్తే రూ. 2.5 లక్షలు అందిస్తోంది.
♦ ఆస్పత్రుల్లో వైద్యానికి గత ప్రభుత్వం నెలకు రూ. 3 వేలు చొప్పున మూడు నెలల సాయం మాత్రమే అందించేది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉచితంగా చికిత్స అనంతరం కూడా వైద్యులు సూచించిన విశ్రాంతి కాలానికి రోజుకు రూ. 225 గరిష్టంగా నెలకు రూ. 5 వేలు సాయం అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment