ఏపీలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం గాలికి | AP Scores Poor In Implementation Of Workers Welfare Schemes | Sakshi
Sakshi News home page

ఏపీలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం గాలికి

Published Wed, Apr 4 2018 7:59 PM | Last Updated on Thu, Aug 9 2018 2:42 PM

AP Scores Poor In Implementation Of Workers Welfare Schemes - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్ర ప్రదేశ్‌లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నామమాత్రమేనని కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ వెల్లడించారు. రాజ్య సభలో బుధవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఉద్దేశించిన పథకాలు చాలా మందికి దక్కడం లేదని చెప్పారు. ఈ కారణంగానే కార్మికుల రిజిస్ట్రేషన్‌ కూడా చెప్పుకొదగ్గంతగా లేదు. ఫలితంగా వారి సంక్షేమం కోసం శిస్తు రూపంలో వసూలు చేసిన వందలాది కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేయకుండా మిగిలిపోతున్నట్లుగా మంత్రి చెప్పారు.

భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ శిస్తు చట్టం కింద ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం 1543 కోట్ల రూపాయలు వసూలు కాగా 2017 డిసెంబర్‌ 3 నాటికి కేవలం 412 కోట్ల రూపాయలను మాత్రమే కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేసిందని  గంగ్వార్‌ వెల్లడించారు. భవన నిర్మాణ రంగంతోపాటు ఇతర నిర్మాణ రంగాల్లో పని చేస్తున్న కార్మికుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసి, వారందరినీ సంక్షేమ పథకాల పరిధిలోకి తీసుకురావలంటూ కార్మిక మంత్రిత్వ శాఖ పదే పదే ఆంధ్రప్రదేశ్‌తో సహా ఇతర రాష్ట్రాలకు ఆదేశాలిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ఆయా రాష్ట్రాలలోని బిల్డింగ్‌ ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డులు కార్మికుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను తమ మంత్రిత్వ శాఖ జారీ చేసే ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తున్నవో లేదో పర్యవేక్షించడానికి కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఒక మోనిటరింగ్‌ కమిటీని కూడా కేంద్ర ప్రభుత్వం నియమించినట్లు మంత్రి తెలిపారు.

ఈ-కామర్స్‌తో స్టోర్స్‌కు ముప్పు లేదు
ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సైట్లతో బ్రిక్‌ అండ్‌ మోర్టార్‌ స్టోర్లకు వచ్చిన ముప్పేమీ లేదని వాణిజ్య శాఖ సహాయ మంత్రి  సీఆర్‌ చౌధరి చెప్పారు. ఈ-కామర్స్‌ డిస్కౌంట్‌ రేట్లకు జరుపుతున్న విక్రయాలు స్టోర్స్‌ అమ్మకాలను ప్రభావితం చేస్తున్న అంశం నీతి ఆయోగ్‌, ఆర్థిక మంత్రిత్వ శాఖ, వాణిజ్య మంత్రిత్వ శాఖల మధ్య భిన్నాభిప్రాయలకు దారితీస్తోందా అంటూ బుధవారం రాజ్య సభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ, ఆర్థిక రంగం పురోగమించాలన్న ఏకైక లక్ష్యంతోనే ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పని చేస్తుంటాయని అన్నారు.

అమలులో ఉన్న నియమ నిబంధనలు, నియంత్రణలకు లోబడే ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సైట్లు, బ్రిక్‌ అండ్‌ మోర్టార్‌ స్టోర్లు తమ బిజినెస్‌ మోడల్స్‌ను రూపొందించుకుంటాయని ఆయన చెప్పారు. అయితే ఈ-కామర్స్‌ సైట్లు తమ సైట్‌ ద్వారా విక్రయించే వస్తువులు లేదా సేవలకు సంబంధించిన ధరలను ప్రత్యక్షంగాను లేదా పరోక్షంగాను ప్రభావితం చేయకూడదని మంత్రి చెప్పారు. దీని వలన ఆన్‌లైన్‌ సైట్లకు స్టోర్‌ బిజినెస్‌ మధ్య లెవెల్‌ ప్లేయింగ్‌ ఫీల్డ్‌ ఏర్పడుతుందని అన్నారు
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement