టీటీడీ ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్‌ పునరుద్ధరించాలి | Vijaya Sai Reddy Comments On TTD FCRA registration | Sakshi
Sakshi News home page

టీటీడీ ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్‌ పునరుద్ధరించాలి

Published Thu, Feb 3 2022 5:40 AM | Last Updated on Thu, Feb 3 2022 8:33 AM

Vijaya Sai Reddy Comments On TTD FCRA registration - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ)కు సంబంధించిన ఎఫ్‌సీఆర్‌ఏ (విదేశీ విరాళాల నియంత్రణ చట్టం) రిజిస్ట్రేషన్‌ను తక్షణమే పునరుద్ధరించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ జీరో అవర్‌లో బుధవారం ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. టీటీడీ చేపట్టే వివిధ సామాజిక, విద్య, ధార్మిక, సాంస్కృతిక కార్యకలాపాల నిర్వహణకు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేయవలసి వస్తుందని, శ్రీవారి ఆలయాన్ని సందర్శించే భక్తులతోపాటు విదేశాల్లోని భక్తులు ఇచ్చే విరాళాల సాయంతో టీటీడీ ఈ కార్యక్రమాలను చేపడుతోందని వివరించారు.

సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ టీటీడీ ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించడానికి ఇటీవల కేంద్ర హోంశాఖ నిరాకరించిందని చెప్పారు. రిజిస్ట్రేషన్‌ పునరుద్ధరణ కోసం టీటీడీ చట్టపరమైన అన్ని నిబంధనలను పాటించినా హోంశాఖ తిరస్కరించడం విచారకరమన్నారు. గత డిసెంబర్‌ 31 నాటికి టీటీడీ సమర్పించిన వార్షిక రిటర్న్‌ల ప్రకారం టీటీడీ విదేశీ విరాళాల బ్యాంకు ఖాతాలో రూ.13.4 కోట్లు ఉన్నట్లు తెలిపారు. డిసెంబర్‌ 2021 తర్వాత టీటీడీ ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్‌ పునరుద్ధరణ చేయనందున టీటీడీ ఈ నిధులను వినియోగించుకోలేని నిస్సహాయ స్థితిలో ఉందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా హిందువుల్లో టీటీడీకి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యపై దృష్టి సారించి ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

రెండేళ్లలో బంగారుపాలెం–గుడిపాల హైవే..
బెంగళూరు–చెన్నై ఎక్స్‌ప్రెస్‌ వేలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 30 కిలోమీటర్ల మేర విస్తరించే రహదారిని రెండేళ్లలో పూర్తిచేయాలని గడవు పెట్టినట్లు రోడ్డు రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. భారత్‌మాల పరియోజనలో భాగమైన ఈ రహదారిని రూ.1,138 కోట్లతో నిర్మించడానికి 2020 ఆగస్టు 8న ఆమోదం తెలపగా 2021 సెప్టెంబర్‌ 15న కాంట్రాక్టును జారీచేసినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌లో అంచనాకు మించి వ్యయం అయ్యే అవకాశం లేదన్నారు. పనులు పూర్తిచేయడానికి నిర్దేశించిన కాలపరిమితి అతిక్రమించడం జరగదని చెప్పారు.

సహకార రంగంపై కోవిడ్‌ ప్రభావాన్ని అంచనా వేయలేదు
దేశంలో సహకార రంగంపై కోవిడ్‌ మహమ్మారి ప్రభావాన్ని అంచనా వేయడానికి ఎలాంటి అధ్యయనం జరపలేదని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు జవాబుగా కేంద్ర హోం, సహకారశాఖ మంత్రి అమిత్‌ షా తెలిపారు. కోవిడ్‌ మహమ్మారి కారణంగా అన్ని రంగాల మాదిరిగానే సహకార రంగంపైన కూడా తీవ్ర ప్రభావం పడిందని చెప్పారు. కోవిడ్‌ కారణంగా ఎదురైన సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు వివిధ రంగాలకు ప్రభుత్వం ప్యాకేజీలు ప్రకటించిందని తెలిపారు.

సెప్టెంబర్‌ కల్లా విశాఖ ఐఐఎం క్యాంపస్‌ పూర్తి
విశాఖపట్నంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) క్యాంపస్‌ పనులు సెప్టెంబర్‌ కల్లా పూర్తవుతాయని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్‌ సర్కార్‌ తెలిపారు. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ప్రాజెక్టు నాలుగు నెలలు ఆలస్యం అయిందని వైఎస్సార్‌సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు ప్రశ్నకు మంత్రి జవాబుగా చెప్పారు.

రాయ్‌పూర్‌–వైజాగ్‌ కారిడార్‌కు నిధులు
భారతమాల పరియోజనలో భాగంగా నిర్మించనున్న రాయ్‌పూర్‌–వైజాగ్‌ కారిడార్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు ప్యాకేజీలకు  రూ.3,183.09 కోట్లకు అనుమతి ఇచ్చినట్లు కేంద్ర జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 356 కిలోమీటర్ల అవార్డు పూర్తయిందని, దీంట్లో ఏపీలో 99.6 కిలోమీటర్లు ఉందని వైఎస్సార్‌సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

సెంట్రల్‌ వర్సిటీకి రూ.450 కోట్లు
ఆంధ్రప్రదేశ్‌లోని సెంట్రల్‌ వర్సిటీ ఏర్పాటుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) మేరకు రూ.450 కోట్లకు అనుమతి ఇచ్చినట్లు కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సుభాష్‌ సర్కార్‌ చెప్పారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణారావు అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ.. 2019–20 నుంచే అనంతపురం జిల్లాలో కేంద్రీయ వర్సిటీ కార్యకలాపాలు ప్రారంభించిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని సెంట్రల్‌ వర్సిటీ, గిరిజన వర్సిటీలకు గత అక్టోబర్‌ 1వ తేదీ నాటికి ఎలాంటి పోస్టులు మంజూరు చేయలేదని పేర్కొన్నారు.

21 హైవే పనులు మంజూరు
ఆంధ్రప్రదేశ్‌లో 2014 తర్వాత రూ.64,684 కోట్లతో ఆల్‌–వెదర్‌ రోడ్లుగా ఉండే 149 జాతీయ రహదారుల పనులు చేపట్టామని జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఈ 66 పనుల్లో రూ.22,556 కోట్లతో 62 పూర్తయ్యాయని, రూ.27,800 కోట్లతో పనులు పురోగతిలో ఉన్నాయని బీజేపీ సభ్యుడు టి.జి.వెంకటేశ్‌ ప్రశ్నకు జవాబుగా చెప్పారు. ఇటీవల రూ.14,328 కోట్లతో 21 పనులు మంజూరు చేసినట్లు తెలిపారు.

తామర తెగులుపై దృష్టిపెట్టాలి
త్రిప్స్‌ పర్విస్పినస్‌ (తామర తెలుగు) వ్యాపించడంతో ఆంధ్రప్రదేశ్‌లో 80 శాతం మిర్చి పంట తీవ్రంగా దెబ్బతిందని బీజేపీ సభ్యుడు జి.వి.ఎల్‌.నరసింహారావు చెప్పారు. ఆయన ప్రత్యేక ప్రస్తావన కింద మాట్లాడుతూ మామిడి వంటి అనేక ఉద్యాన పంటల్లో కూడా ఈ తెగులు కనిపించిందని తెలిపారు. ఈ తెగులును తక్షణమే ఎదుర్కోవడంపై దృష్టి సారించాలని కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement