సాక్షి, హైద్రాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనలో దేవదేవుడైన శ్రీవేంకటేశ్వరస్వామి ఆస్తులకే రక్షణ లేకుండా పోయిందని, దేవాలయాల భూములు, ఆస్తులే కాదు నగలూ దోచుకునే పరిస్థితి నెలకొందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనలో వేంకటేశ్వరస్వామి ఆలయ పరిస్థితే ఇలా ఉంటే... రాష్ట్రంలోని కనకదుర్గ, సింహాచలం, ద్వారకా తిరుమల, అంతర్వేది, శ్రీశైలం తదితర ఆలయాల పరిస్థితి ఏమిటి? అనే సందేహం ప్రజలకు కలుగుతోందన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీటీడీకి చెందిన 1,381 కేజీల బంగారం ఎలాంటి కాగితాలు లేకుండా వ్యాన్‌లోకి ఎలా చేరిందని ప్రశ్నించారు. ఎన్నికల హడావుడి ఉన్న సందర్భంలో ఇంత భారీగా బంగారం రవాణా చేస్తున్నపుడు టీటీడీ అధికారులు ఎందుకు రక్షణగా లేరని ఆయన నిలదీశారు.
ముఖ్యంగా చెన్నై నుంచి తిరుపతి వచ్చేటపుడు ఆ వాహనం హైవేలో కాకుండా వేపంపట్టు అనే గ్రామాల మీదుగా ఎందుకు ప్రయాణించాల్సి వచ్చిందనేది ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ప్రతి చెత్త విషయంపైనా గంటల తరబడి చెప్పిందే చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీ బంగారంపై స్పందించకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు. ప్రజల మనోభావాలు దెబ్బతినే ఈ విషయంపై ఎందుకు సమీక్షించడం లేదో తమ పార్టీ తరపున ప్రశ్నిస్తున్నామన్నారు. ‘టీటీడీ ప్రధాన అర్చకులైన రమణదీక్షితులును తొలుత ఇంటికి పంపారు.. ఆ తరువాత ముగ్గురు ప్రధాన అర్చకులనూ తొలగించారు... ఓ ప్రణాళిక ప్రకారం ఉత్తర భారతదేశానికి చెందిన సింఘాల్‌ను ఈఓగా నియమించారు. ఆ తరువాత మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడిని టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా నియమించారు. ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలిస్తే దొంగతనం, దోపిడీ చేయడానికి ఎలా వ్యూహం పన్నుతూ వచ్చారనే విషయం అర్థమవుతోంది’ అని సాయిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.
టీటీడీ బంగారం తరలింపుపై ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం నియమించిన మన్మోహన్‌సింగ్ ఇవ్వబోయే నివేదికను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. టీటీడీలోనే కాదు, గోవిందరాజస్వామి ఆలయంలో రెండు కిరీటాలు దొంగతనానికి గురయ్యాయని, దేవాలయ ఆస్తులన్నీ దొంగలపాలు అవుతున్నాయని తాను తొలి నుంచీ చెబుతున్నానని ఆయన అన్నారు. ఈ కిరీటాలను కరిగించారని, నామ్‌కే వాస్తే అన్నట్లుగా కొంత బంగారం జమచేసే పరిస్థితులు టీడీపీ పాలనలో నెలకొన్నాయని ఆయన అన్నారు. ఏ ఇళ్లను సోదా చేస్తే కిరీటాలు దొరుకుతాయో విచారణ చేసే పోలీసులకు తెలుçసని అన్నారు. ఇలా చిల్లరదొంగలను పట్టుకుని శిక్షించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు.
కూల్చిన ఆలయాల నిర్మాణాల మాటేమిటి?
విజయవాడలో 40 దేవాలయాలను కూలగొట్టి వాటిని మళ్లీ కట్టిస్తామని ఒక్క దేవాలయాన్ని కూడా చంద్రబాబు నిర్మించలేదని అన్నారు. విజయవాడలో పలు మసీదులు, చర్చిలు పడగొట్టారని, మసీదులు మళ్లీ కట్టిస్తామని చంద్రబాబు చెప్పారని ఆ హామీ ఇవాళ్టికీ నెరవేర్చలేదన్నారు. చంద్రబాబు గోదావరి పుష్కరాలకు రూ.3000 కోట్లు, కృష్ణా పుష్కరాలకు రూ.3000 కోట్లు ఖర్చుచేసి దుర్వినియోగం చేశారన్నారు. దేవుడి సొమ్ము అంటే భయం లేకుండా దొంగతనం చేయగల వ్యక్తి చంద్రబాబు అనడంలో ఎలాంటి సందేహం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌కు అడ్డమైన బుద్ధులన్నీ నేర్పారని అయితే మనుమడు దేవాన్ష్ అన్నీ జాగ్రత్తగా ఆలకిస్తున్నాడని ఏదో ఒక రోజున... తాతయ్యా! రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశావ్.. ద్రోహం చేశావ్ అని ప్రశ్నిస్తారని... అప్పుడు ఏం సమాధానం చెబుతారనే విషయం చంద్రబాబు విజ్ఞతకే వదలి వేస్తున్నానని ఆయన అన్నారు.
నాలుగేళ్లు టీటీడీ సభ్యునిగా ఉన్నందునే...
తాను నాలుగేళ్లు టీటీడీ సభ్యుడిగా ఉన్నాను కనుక అక్కడి విధివిధానాలు తనకు తెలుసునని ఎవరు ఎన్ని వందల కోట్ల రూపాయల విలువజేసే కిరీటం స్వామి వారికి సమర్పించినా దాని విలువను ఒక్క రూపాయిగానే పరిగణిస్తారన్నారు. ఆ కిరీటాన్ని ఫలానా వ్యక్తి స్వామి వారికి కానుకగా ఇచ్చారని మాత్రమే రికార్డుల్లో ఉంటుందని దాని విలువ మాత్రం ఎక్కడా ఉండదన్నారు. బంగారం పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి తిరిగి ఇస్తున్నారని ఈవో చెబుతున్నారని, మరయితే దారిని ఎందుకు మళ్లించారని ఆయన అన్నారు. ఇన్‌వాయిసే కాకుండా వే బిల్లు కూడా లేకపోవడం అనుమానాలు రేకెత్తిస్తోందన్నారు. పోలీసు భద్రత లేకుండా బంగారాన్ని తరలించడంపై ప్రజలకు అనుమానాలు ఉన్నాయన్నారు. మూడేళ్ల బాండ్ అయితే పంజాబ్ నేషనల్ బ్యాంకుకు ఆనాడు ఎంత బంగారం వెళ్లిందని ప్రశ్నించారు. ఒకసారి సంబంధం లేదని, మరోసారి ఆ బంగారం తమదేనని ఈవో చెబుతున్నారన్నారు. పరిపాలించే వ్యక్తి దొంగతనానికి, దోపిడీకి అలవాటుపడ్డ వాడు కాబట్టే ఈ అనుమానాలొస్తున్నాయన్నారు. ఎలాంటి సందేహం లేదని బంగారం, ఆభరణాలు, నిధులు దోపిడీకి గురయ్యాయన్నారు.
ఎవరెవరు ఎంతెంత దోచుకున్నదీ త్వరలో వెల్లడిస్తా
రాష్ట్ర బడ్జెటే రూ.అయిదన్నర లక్షల కోట్లు లేనపుడు అంత మొత్తం ఎలా దోచుకుంటారని తనను అడిగారని బడ్జెట్‌లో ఉన్న మొత్తాన్నే దోచుకోవాలని లేదని బడ్జెట్‌లో లేనివి చాలా ఉంటాయన్నారు. వాటన్నింటినీ దోచుకుని హవాలా రూపంలో తరలిస్తారన్నారు. వచ్చే వారం రోజుల్లో ఏ రకంగా ఎంత దోపిడీ జరిగిందీ, రాష్ట్ర ఖజానాను ఎలా దోచుకున్నదీ, దోపిడీకి ఎవరు ఏ రకంగా తోడ్పడిందీ, ఏ కలెక్టర్ ఏ పాత్ర నిర్వహించారనే విషయాన్ని మీడియా సమావేశాల్లో చెబుతానని సాయిరెడ్డి స్పష్టం చేశారు. మాజీ జేడీ లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా రూ. లక్ష కోట్లు అనే దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ సహకారంతో టీడీపీ చేసిందని, తాము తొలి నుంచీ చేసిన వాణిజ్య లావాదేవీలన్నీ చట్ట పరిధిలోనే చేశామని అన్నారు.
తమపై వచ్చిన కేసులన్నీ దొంగ కేసులేనని తప్పకుండా వీటి నుంచి బయట పడతామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కుటుంబరావు వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నలకు స్పందిస్తూ స్టాక్ బ్రోకర్ అయిన ఆయనను అదే అన్నానని, అందులో ఉన్న తప్పేంటో తనకు తెలియదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తాను ఇచ్చిన వివరణ అక్షరాలా వాస్తవమని అందులో ఎలాంటి అబద్ధాలు లేవన్నారు. ఆర్థిక మంత్రిని అడిగితే ఆయనే ఈ విషయాన్ని ధ్రువీకరిస్తారు చూడండన్నారు.
Comments
Please login to add a commentAdd a comment