Gold Illegal Transportation
-
టీటీడీ బంగారంపై చీకట్లో నివేదిక!
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి బంగారంపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ ఇచ్చిన విచారణ నివేదిక ఏమైందనే ప్రశ్న అధికార వర్గాలు, కోట్లాది మంది శ్రీవారి భక్తుల్లో చర్చనీ యాంశంగా మారింది. టీటీడీ బంగారం తరలింపుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం విచారణకు ఆదేశించడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుబట్టడం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. అసలు అది టీటీడీకి చెందిన బంగారమేనా? లేక మరొకరిదా? అనే సందేహాలు కలుగుతున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. చెన్నైలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి బంగారం తరలింపు గురించి తనకు తెలియదని తొలుత టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ప్రకటించడం వీటికి బలం చేకూర్చుతోంది. బంగారం తరలింపుపై ప్రత్యేక సీఎస్ మన్మోహన్సింగ్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ గత నెల 25న ముఖ్యమంత్రి చంద్రబాబుకు పంపడం తెలిసిందే. వారం గడుస్తున్నా చర్యలేవి? బంగారం తరలింపుపై ఉన్నతాధికారులిచ్చిన నివేదిక చంద్రబాబుకు వద్దకు చేరి వారం గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా బుధవారం సీఎం నిర్వహించిన మీడియా సమావేశంలోసీఎస్ విచారణకు ఆదేశించడాన్ని తప్పుబట్టడం గమనార్హం. సీఎస్ ఓవర్ యాక్షన్ చేశారంటూ నిందించారు. ఏదో జరిగిపోయిందంటూ విచారణకు అదేశించడం ఏమిటంటూ సీఎం ప్రశ్నించారు. సీఎం వ్యాఖ్యలను గమనిస్తే ఇందులో కచ్చితంగా ఏదో గోల్మాల్ జరిగి ఉంటుందనే అనుమానం బలపడుతోందని సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. సీఎస్‌పై చంద్రబాబు చిందులు అసలు ఏం జరిగిందనే విషయాన్ని ప్రజలకు వెల్లడించకుండా అసలు సీఎస్ విచారణకు ఆదేశించడమే తప్పు అన్నట్లుగా సీఎం చంద్రబాబు ప్రవర్తించడంపై పలు సందేహాలు ఉత్పన్నం అవుతున్నాయని మరో సీనియర్ అధికారి పేర్కొన్నారు. చైన్నై బ్యాంకు నుంచి టీటీడీకి చెందిన బంగారాన్ని తిరుమలకు తరలిస్తుంటే ఆ విషయం తనకు తెలియదని ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ప్రకటించారని, సీఎస్ విచారణకు ఆదేశించిన మరుసటి రోజే హడావుడిగా ఈవో విలేకరుల సమావేశం ఎందుకు నిర్వహించారనేది అనుమానాలకు తావు ఇస్తోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈవో చెబుతున్న విషయాలనే ముఖ్యమంత్రి కూడా మీడియాతో ప్రస్తావిస్తున్నారంటే ఇందులో ఏదో మతలబున్నట్లు బోధపడుతోందని పేర్కొంటున్నారు. బంగారం తరలింపును సీఎం చాలా తేలిగ్గా కొట్టిపారేయడం పట్ల భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈవో తప్పిదాలను ప్రస్తావించిన నివేదిక టీటీడీ బంగారం వివాదానికి సంబంధించి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ వాదన సరికాదని, బ్యాంకుతోపాటు ఈవో నిబంధనలు పాటించలేదని విచారణ నివేదికలో మన్మోహన్సింగ్ స్పష్టం చేశారు. ఈమేరకు సీఎస్‌కు ప్రాథమిక నివేదిక సమర్పించారు. బంగారం తరలింపులో లోపాలను అందులో ప్రస్తావించారు. బంగారం టీటీడీకి చేరే వరకు తనకు సంబంధం లేదని ఈవో పేర్కొనడం సరికాదన్నారు. గడువు తీరిన బంగారాన్ని బ్యాంకు నుంచి టీటీడీ ట్రెజరీకి తరలించే సమయంలో ఈవో లేఖ ఇవ్వకపోవడం ఉద్దేశపూర్వకంగానేనా? అనే విషయంలో సందేహాలున్నాయని నివేదికలో పేర్కొన్నారు. బ్యాంకులో బంగారం భద్రపరచిన తేదీతోపాటు గడువు తీరాక ఎంత జమ చేయాలో కూడా లేఖలో ప్రస్తావిస్తూ తరలించేందుకు చర్యలు తీసుకోవాల్సిన ఈవో అవేమీ పాటించలేదని నివేదికలో స్పష్టం చేశారు. స్వామివారికి కానుకల రూపంలో వచ్చిన బంగారు ఆభరణాలను పలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారని, అయితే తాజా ఉదంతంతో గడువు తీరాక అదంతా తిరిగి టీటీడీ ట్రెజరీకి చేరుతోందా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న తరుణంలో పోలీసుల తనిఖీల ద్వారా ఈ ఘటన వెలుగులోకి వచ్చిందన్నారు. తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే ఆభరణాల బంగారాన్ని కరిగించే ముందు విలువైన స్టోన్స్ ఎక్కడ భద్రపరుస్తున్నారో కూడా విచారించాలనే అభిప్రాయాన్ని నివేదికలో వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో మరింత పారదర్శకంగా వ్యవహరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. -
దోపిడీ దొంగలు కొట్టేసుంటే..!
సాక్షి, అమరావతి: తమిళనాడులోని పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) నుంచి తిరుపతికి 1,381 కిలోల బంగారాన్ని తరలిస్తున్న వ్యాన్‌ను దొంగలు దోపిడీ చేసుంటే పరిస్థితి ఏమిటి? దోపిడీ దొంగలే పోలీస్ దుస్తుల్లో వచ్చి తనిఖీ చేసి బంగారానికి రశీదులు లేనందున దొంగ బంగారం సీజ్ చేస్తున్నామని తీసుకెళ్లుంటే ఏమయ్యేది? దురదృష్టవశాత్తూ ఇలా జరిగుంటే ఎంత ఉపద్రవం కలిగేది? కలియుగ వైకుంఠ దైవమైన శ్రీవారి కోట్లాది మంది భక్తులను వేధిస్తున్న ప్రశ్నలివి. ఈ ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అధికారుల్లోనూ ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ బంగారం విలువ రూ.415 కోట్లే కావచ్చు. ఇది శ్రీవారికి పెద్ద మొత్తం కాకపోవచ్చు. కానీ స్వామి వారి బంగారమే దోపిడీ అయితే భక్తుల, ప్రజల మనోభావాల మాటేమిటి? అని అధికారులు అంతర్మథనం చెందుతున్నారు. తమిళనాడులో లోక్‌సభ ఎన్నికలకు ముందు రోజు ఈనెల 17న ఎన్నికల కమిషన్ అధికారులు (రెవెన్యూ, పోలీసు సిబ్బంది) తనిఖీ సందర్భంగా వాహనంలో తరలిస్తున్న 1,381 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం.. తర్వాత అది తిరుమల – తిరుపతి దేవస్థానం (టీటీడీ)ది అని చెప్పడంతో వారికి ఇచ్చిన విషయం విదితమే. ఇంత విలువైన స్వామి వారి బంగారానికి సరైన రక్షణ, ఆధార పత్రాలు లేకుండా ఎలా తరలిస్తారు? ఇది అసలు టీటీడీదేనా? మరెవరిదైనా దొంగ బంగారమైతే స్వామి వారిదని కథ అల్లారా? అనే అనుమానాలు కూడా భక్తుల మదిని తొలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విచారణ జరిపి నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. ఆయన దీనిని పరిశీలించి ముఖ్యమంత్రికి సమర్పించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ), పోలీసు, బ్యాంకింగ్, టీటీడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారుల్లోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. టీటీడీది బాధ్యతారాహిత్యం కాదా? తాము డిపాజిట్ చేసిన స్వామి వారి బంగారాన్ని టీటీడీ ఖజానాకు చేర్చాల్సిన బాధ్యత పంజాబ్ నేషనల్ బ్యాంకుదేనని కార్యనిర్వహణాధికారి (ఈఓ) అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొనడాన్ని అన్ని వర్గాలు తప్పు పడుతున్నాయి. అధికార వర్గాలు ఈ వాదనను తీవ్రంగా ఖండిస్తున్నాయి. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన స్వామి వారి బంగారాన్ని అగ్రిమెంట్లతో ముడి పెట్టడం ఏమాత్రం సమంజసం కాదు. డిపాజిట్ గడువు ఎప్పుడు ముగుస్తుంది? మా బంగారాన్ని ఎప్పుడు ఎలా తరలించి మాకు అప్పగిస్తారు? మీరు అప్పగింతకు ఎప్పుడు.. ఎవరు వస్తున్నారు? తరలింపునకు అనుసరిస్తున్న రక్షణ చర్యలేమిటి? ఏమేమి పత్రాలు కావాలి? వాటిని తెస్తున్నారా? మేము ఎలాంటి పత్రాలు ఇవ్వాలి? అనే కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం కచ్చితంగా టీటీడీ అధికారుల తప్పిదమే. శ్రీవారి బంగారం తీసుకొచ్చి ఇవ్వాల్సిన బాధ్యత పీఎన్‌బీదే అనే విషయం వాస్తవమే. మార్గంమధ్యలో ఏదైనా జరగరానిది జరిగి ఈ బంగారం మాయమైతే.. అనే కనీస ఊహ కూడా లేకుండా వ్యవహరించడం తప్పు. బంగారం పోతే ఇన్సూరెన్సు ఉందా? లేదా? అనేది ఇక్కడ ప్రశ్నే కాదు. మొన్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నది ఎన్నికల కమిషన్ అధికారులు కాకుండా పోలీసులు/ విజిలెన్స్ అధికారుల ముసుగులో ఉన్న దోపిడీ దొంగలైతే పరిస్థితి ఏమిటి? కేసులు, పోలీసు జాగిలాలు, దర్యాప్తు బృందాలు పరుగులు తీయాల్సి వచ్చేది. అదే జరిగితే స్వామి వారి భక్తుల్లో అలజడి వస్తే దానికి బాధ్యులెవరు? అసలు ఈ ప్రశ్నలు ఊహించడానికే భయమేస్తోంది’ అని ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి వ్యాఖ్యానించారు. పీఎన్బీదీ అవగాహన రాహిత్యమా? ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని వ్యాన్‌లో తరలిస్తుంటే మధ్యలో ఎవరైనా తనిఖీ చేస్తే పత్రాలు చూపించాల్సి వస్తుందన్న కనీస అవగాహన పీఎన్బీ అధికారులకు ఎలా లేకుండా పోయిందన్నది వేయి డాలర్ల ప్రశ్నగా మారింది. ఇది అనుమానాలకు తావిస్తోంది. ‘బంగారాన్ని బ్యాంకు నుంచి టీటీడీకి తరలిస్తున్నట్లు అధికారిక ధ్రువపత్రాలు వాహనంలోని అధికారులు వెంట పెట్టుకుని వెళ్లాల్సి ఉంది. ఇలా పత్రాలు తీసుకెళ్లక పోవడం తీవ్ర తప్పిదం. అలాగే స్వామివారి బంగారాన్ని ప్రయివేటు లాజిస్టిక్ వాహనాల్లో సాధారణంగా బ్యాంకు నగదు తీసుకెళ్లినట్లు తీసుకెళ్లడం లోపభూయిష్ట విధానం. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య తరలించాల్సి ఉండగా.. సాదాసీదాగా కూరగాయలను తీసుకెళ్లినట్లు తరలించడం దారుణం’ అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. కాగా, ఈ వ్యవహారం వివాదానికి దారితీసినా మొత్తంమీద మంచే జరిగినట్లు చెప్పక తప్పదని అధికార వర్గాలు అంటున్నాయి. దీనివల్లే స్వామి వారికి చెందిన 1,381 కిలోల బంగారం తరలింపులో భద్రత డొల్లేనని తేలిందని, భవిష్యత్తులో ఇలా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి మార్గం ఏర్పడిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
టీడీపీ పాలనలో దేవుళ్లకే శఠగోపం
సాక్షి, హైద్రాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనలో దేవదేవుడైన శ్రీవేంకటేశ్వరస్వామి ఆస్తులకే రక్షణ లేకుండా పోయిందని, దేవాలయాల భూములు, ఆస్తులే కాదు నగలూ దోచుకునే పరిస్థితి నెలకొందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనలో వేంకటేశ్వరస్వామి ఆలయ పరిస్థితే ఇలా ఉంటే... రాష్ట్రంలోని కనకదుర్గ, సింహాచలం, ద్వారకా తిరుమల, అంతర్వేది, శ్రీశైలం తదితర ఆలయాల పరిస్థితి ఏమిటి? అనే సందేహం ప్రజలకు కలుగుతోందన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీటీడీకి చెందిన 1,381 కేజీల బంగారం ఎలాంటి కాగితాలు లేకుండా వ్యాన్‌లోకి ఎలా చేరిందని ప్రశ్నించారు. ఎన్నికల హడావుడి ఉన్న సందర్భంలో ఇంత భారీగా బంగారం రవాణా చేస్తున్నపుడు టీటీడీ అధికారులు ఎందుకు రక్షణగా లేరని ఆయన నిలదీశారు. ముఖ్యంగా చెన్నై నుంచి తిరుపతి వచ్చేటపుడు ఆ వాహనం హైవేలో కాకుండా వేపంపట్టు అనే గ్రామాల మీదుగా ఎందుకు ప్రయాణించాల్సి వచ్చిందనేది ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ప్రతి చెత్త విషయంపైనా గంటల తరబడి చెప్పిందే చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీ బంగారంపై స్పందించకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు. ప్రజల మనోభావాలు దెబ్బతినే ఈ విషయంపై ఎందుకు సమీక్షించడం లేదో తమ పార్టీ తరపున ప్రశ్నిస్తున్నామన్నారు. ‘టీటీడీ ప్రధాన అర్చకులైన రమణదీక్షితులును తొలుత ఇంటికి పంపారు.. ఆ తరువాత ముగ్గురు ప్రధాన అర్చకులనూ తొలగించారు... ఓ ప్రణాళిక ప్రకారం ఉత్తర భారతదేశానికి చెందిన సింఘాల్‌ను ఈఓగా నియమించారు. ఆ తరువాత మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడిని టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా నియమించారు. ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలిస్తే దొంగతనం, దోపిడీ చేయడానికి ఎలా వ్యూహం పన్నుతూ వచ్చారనే విషయం అర్థమవుతోంది’ అని సాయిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. టీటీడీ బంగారం తరలింపుపై ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం నియమించిన మన్మోహన్సింగ్ ఇవ్వబోయే నివేదికను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. టీటీడీలోనే కాదు, గోవిందరాజస్వామి ఆలయంలో రెండు కిరీటాలు దొంగతనానికి గురయ్యాయని, దేవాలయ ఆస్తులన్నీ దొంగలపాలు అవుతున్నాయని తాను తొలి నుంచీ చెబుతున్నానని ఆయన అన్నారు. ఈ కిరీటాలను కరిగించారని, నామ్‌కే వాస్తే అన్నట్లుగా కొంత బంగారం జమచేసే పరిస్థితులు టీడీపీ పాలనలో నెలకొన్నాయని ఆయన అన్నారు. ఏ ఇళ్లను సోదా చేస్తే కిరీటాలు దొరుకుతాయో విచారణ చేసే పోలీసులకు తెలుçసని అన్నారు. ఇలా చిల్లరదొంగలను పట్టుకుని శిక్షించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు. కూల్చిన ఆలయాల నిర్మాణాల మాటేమిటి? విజయవాడలో 40 దేవాలయాలను కూలగొట్టి వాటిని మళ్లీ కట్టిస్తామని ఒక్క దేవాలయాన్ని కూడా చంద్రబాబు నిర్మించలేదని అన్నారు. విజయవాడలో పలు మసీదులు, చర్చిలు పడగొట్టారని, మసీదులు మళ్లీ కట్టిస్తామని చంద్రబాబు చెప్పారని ఆ హామీ ఇవాళ్టికీ నెరవేర్చలేదన్నారు. చంద్రబాబు గోదావరి పుష్కరాలకు రూ.3000 కోట్లు, కృష్ణా పుష్కరాలకు రూ.3000 కోట్లు ఖర్చుచేసి దుర్వినియోగం చేశారన్నారు. దేవుడి సొమ్ము అంటే భయం లేకుండా దొంగతనం చేయగల వ్యక్తి చంద్రబాబు అనడంలో ఎలాంటి సందేహం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌కు అడ్డమైన బుద్ధులన్నీ నేర్పారని అయితే మనుమడు దేవాన్ష్ అన్నీ జాగ్రత్తగా ఆలకిస్తున్నాడని ఏదో ఒక రోజున... తాతయ్యా! రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశావ్.. ద్రోహం చేశావ్ అని ప్రశ్నిస్తారని... అప్పుడు ఏం సమాధానం చెబుతారనే విషయం చంద్రబాబు విజ్ఞతకే వదలి వేస్తున్నానని ఆయన అన్నారు. నాలుగేళ్లు టీటీడీ సభ్యునిగా ఉన్నందునే... తాను నాలుగేళ్లు టీటీడీ సభ్యుడిగా ఉన్నాను కనుక అక్కడి విధివిధానాలు తనకు తెలుసునని ఎవరు ఎన్ని వందల కోట్ల రూపాయల విలువజేసే కిరీటం స్వామి వారికి సమర్పించినా దాని విలువను ఒక్క రూపాయిగానే పరిగణిస్తారన్నారు. ఆ కిరీటాన్ని ఫలానా వ్యక్తి స్వామి వారికి కానుకగా ఇచ్చారని మాత్రమే రికార్డుల్లో ఉంటుందని దాని విలువ మాత్రం ఎక్కడా ఉండదన్నారు. బంగారం పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి తిరిగి ఇస్తున్నారని ఈవో చెబుతున్నారని, మరయితే దారిని ఎందుకు మళ్లించారని ఆయన అన్నారు. ఇన్వాయిసే కాకుండా వే బిల్లు కూడా లేకపోవడం అనుమానాలు రేకెత్తిస్తోందన్నారు. పోలీసు భద్రత లేకుండా బంగారాన్ని తరలించడంపై ప్రజలకు అనుమానాలు ఉన్నాయన్నారు. మూడేళ్ల బాండ్ అయితే పంజాబ్ నేషనల్ బ్యాంకుకు ఆనాడు ఎంత బంగారం వెళ్లిందని ప్రశ్నించారు. ఒకసారి సంబంధం లేదని, మరోసారి ఆ బంగారం తమదేనని ఈవో చెబుతున్నారన్నారు. పరిపాలించే వ్యక్తి దొంగతనానికి, దోపిడీకి అలవాటుపడ్డ వాడు కాబట్టే ఈ అనుమానాలొస్తున్నాయన్నారు. ఎలాంటి సందేహం లేదని బంగారం, ఆభరణాలు, నిధులు దోపిడీకి గురయ్యాయన్నారు. ఎవరెవరు ఎంతెంత దోచుకున్నదీ త్వరలో వెల్లడిస్తా రాష్ట్ర బడ్జెటే రూ.అయిదన్నర లక్షల కోట్లు లేనపుడు అంత మొత్తం ఎలా దోచుకుంటారని తనను అడిగారని బడ్జెట్లో ఉన్న మొత్తాన్నే దోచుకోవాలని లేదని బడ్జెట్లో లేనివి చాలా ఉంటాయన్నారు. వాటన్నింటినీ దోచుకుని హవాలా రూపంలో తరలిస్తారన్నారు. వచ్చే వారం రోజుల్లో ఏ రకంగా ఎంత దోపిడీ జరిగిందీ, రాష్ట్ర ఖజానాను ఎలా దోచుకున్నదీ, దోపిడీకి ఎవరు ఏ రకంగా తోడ్పడిందీ, ఏ కలెక్టర్ ఏ పాత్ర నిర్వహించారనే విషయాన్ని మీడియా సమావేశాల్లో చెబుతానని సాయిరెడ్డి స్పష్టం చేశారు. మాజీ జేడీ లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా రూ. లక్ష కోట్లు అనే దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ సహకారంతో టీడీపీ చేసిందని, తాము తొలి నుంచీ చేసిన వాణిజ్య లావాదేవీలన్నీ చట్ట పరిధిలోనే చేశామని అన్నారు. తమపై వచ్చిన కేసులన్నీ దొంగ కేసులేనని తప్పకుండా వీటి నుంచి బయట పడతామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కుటుంబరావు వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నలకు స్పందిస్తూ స్టాక్ బ్రోకర్ అయిన ఆయనను అదే అన్నానని, అందులో ఉన్న తప్పేంటో తనకు తెలియదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తాను ఇచ్చిన వివరణ అక్షరాలా వాస్తవమని అందులో ఎలాంటి అబద్ధాలు లేవన్నారు. ఆర్థిక మంత్రిని అడిగితే ఆయనే ఈ విషయాన్ని ధ్రువీకరిస్తారు చూడండన్నారు. -
బంగారం తరలింపులో లోపాలు నిజమే : సీఎస్
సాక్షి, అమరావతి : తిరుమల వెంకన్న బంగారం తరలింపులో వెలుగుచూసిన లోపాలపై రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంకు నివేదిక ఇచ్చారు. పెద్ద మొత్తంలో బంగారం తరలించే సమయంలో టీటీడీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని సీఎస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకు అధికారులు, టీటీడీ అజాగ్రత్తగా వ్యవహరించిందని చెప్పారు. బంగారం తరలింపులో లోపాలున్నాయన్నది నిజమేనని, శ్రీవారికి చెందిన బంగారం భక్తుల మనోభావాలతో ముడిపడిన వ్యవహారమని అన్నారు. బంగారం తరలింపులో ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సిందని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాఖల సమీక్షలు నిర్వహించటంలో తప్పేమిటని అన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక రాజకీయ నేతలు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని హితవు పలికారు. ఈ విషయమై ఎన్నికల సంఘం నుంచి స్పష్టమైన నిబంధలనలు ఉన్నాయని తెలిపారు. టీటీడీ బంగారం తరలింపు వ్యవహారంపై కొనసాగిన విచారణ నివేదికను ముఖ్యమంత్రికి పంపించామని తెలిపారు. (చదవండి : బంగారంపై తడబాటు ఎందుకు?) -
టీటీడీ బంగారంపై తవ్వే కొద్దీ నిజాలు..!
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో పట్టుబడ్డ బంగారంపై తవ్వే కొద్దీ నిజాలు వెలుగుచూస్తున్నాయి. బంగారంపై టీటీడీ ద్వంద్వ వైఖరి, తమిళనాడు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను బెదిరించి, పలు రకాలుగా ఒత్తిడి చేసి బంగారాన్ని విడిపించుకుపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. తమిళనాడులో ఈ నెల 18న ఎన్నికల పోలింగ్ జరగనుండగా 17 రాత్రి తిరువళ్లూరు జిల్లా సరిహద్దు పూందమల్లి తహశీల్దారు పరిధిలో రూ.400 కోట్లకు పైగా విలువైన 1,381 కిలోల బంగారు కడ్డీలను అక్కడి ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్న సంగతి తెలిసిందే. సీక్వెల్ గ్లోబల్ క్రిటికల్ లాజిస్టిక్స్ కంపెనీకి చెందిన వాహనంలో బంగారం తరలిస్తుండగా ఈ వాహనానికి ముందు, వెనుక రెండు వాహనాలు ఉన్నాయి. ఒక వాహనానికి పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రైవేటు సాయుధ బందోబస్తు ఉంది. పట్టుబడ్డప్పుడు టీటీడీకి చెందిన బంగారమని వాహనాల్లోని వ్యక్తులు మౌఖికంగా చెప్పారేగానీ అందుకు తగిన ఆధారాలు వారి వద్ద లేవు. అంతేకాకుండా ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మొత్తం మూడు వాహనాలు కాగా రెవెన్యూ రికార్డుల్లో మాత్రం రెండే వాహనాలని రికార్డు చేశారు. మరి మూడో వాహనం ఏమైనట్లు? అది ఎవరికి చెందినది? బంగారం ఉన్న వాహనానికి ముందు, వెనక ఉన్న వాహనాల్లో ఒకటి అకస్మాత్తుగా ఎందుకు అదృశ్యమైనదో ఆ ఏడుకొండలవాడికే తెలియాలి. బంగారం పట్టుబడగానే ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు రెవెన్యూ శాఖాధికారులకు అప్పగించారు. రెవెన్యూ శాఖ బంగారాన్ని ట్రెజరీలో భద్రపరిచి ఆదాయపన్ను (ఐటీ) శాఖాధికారులకు సమాచారం ఇచ్చింది. టీటీడీ నిర్లక్ష్యంపై ఐటీ శాఖ అనుమానాలు చెన్నై నుంచి తిరుపతికి రోడ్డు మార్గంలో బంగారం రవాణాలోనూ, పొందడంలోనూ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల అంతులేని నిర్లక్ష్యంపై ఐటీ శాఖ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. బంగారం పట్టుబడ్డప్పుడు ఈ అంశంపై అనేక ప్రశ్నలను సంధించింది. వాహనంలోని వారు బంగారం టీటీడీకి చెందినదని చెప్పారు. అయితే, అధికారులు వాకబు చేయగా తమకేమీ సంబంధం లేదని టీటీడీ బదులిచ్చింది. అంతలోనే మరికొద్దిసేపటికి బంగారం తమదేనని, తీసుకోవడానికి అధికారులు వస్తున్నారంటూ మాటమార్చింది. బంగారం తమదే అయితే టీటీడీకి ఈ తడబాటు ఎందుకని ఐటీ శాఖ ప్రశ్నిస్తోంది. వందల కోట్ల విలువైన బంగారం టీటీడీకి చేరుకుంటున్నప్పుడు దాన్ని పొందేందుకు టీటీడీ ఈవో ప్రత్యేక అధికారుల బృందాన్ని తగిన పత్రాలతో ముందుగానే సిద్ధం చేయాల్సి ఉంది. ఫలానా రోజు బంగారం వస్తుందనే సమాచారాన్ని కూడా సదరు బృందానికి ముందురోజే తెలియజేయాల్సి ఉంది. అంతేకాకుండా బంగారాన్ని భద్రం చేసేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాల్సి ఉంది. అయితే, బంగారం పట్టుబడ్డాక తమిళనాడు అధికారులు తెలియజేసిన తర్వాత కూడా ఆ బంగారంతో తమకేమీ సంబంధం లేదని చెప్పడం.. ఆ తర్వాత తేరుకుని తమదేనని చెప్పడంపై ఐటీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రూ.400 కోట్లకు పైగా విలువ చేసే బంగారంపై టీటీడీ ఇంత నిర్లక్ష్యంగా ఉండటాన్ని ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈసీపై టీటీడీ ఈవో ఒత్తిడి బంగారం తమకు చేరే వరకు పంజాబ్ నేషనల్ బ్యాంకుదే బాధ్యత అని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వాదిస్తున్నారు. ఇది నిజమే అనుకున్నా బంగారం ఎప్పుడు వస్తోంది? ఎలా వస్తోంది? అనే అవగాహన లేకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఖరీదైన సరుకును రవాణా చేసే క్రమంలో పంపేవారు, పత్రాలు ఎంత ముఖ్యమో పొందుతున్న వ్యక్తులు లేదా సంస్థలు కూడా అంతే ముఖ్యం. అయితే, బంగారం విషయంలో పంపుతున్నవారి పత్రాలు ఉన్నాయి కానీ టీటీడీకి చెందిన బంగారమే అనే విషయంలో స్పష్టత లేదని ఐటీ శాఖ అధికారులు అంటున్నారు. పట్టుబడ్డ బంగారం అధిక మొత్తంలో ఉండటంతో ఈ కేసు ఐటీ పరిధిని దాటి డైరెక్టర్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) చేతుల్లోకి వెళ్లిందని చెబుతున్నారు. డీఆర్ఐ అధికారులు కస్టమ్స్ క్లియరెన్స్, పంజాబ్ నేషనల్ బ్యాంకు పత్రాలను తనిఖీ చేశారు. మొత్తం వ్యవహారాన్ని తమిళనాడు ఎన్నికల ప్రధాన అధికారి నిర్ణయానికి వదిలేశారు. దీంతో టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ నుంచి ఆయనపై ఒత్తిళ్లు పెరిగాయి. ‘ఇది టీటీడీకి చెందినదని తెలుసా.. దేవుడి బంగారానికి కూడా తనిఖీలా.. నేను కూడా ఐఏఎస్ అధికారినే.. చెబితే వినిపించుకోరా?’ అంటూ పరుష పదజాలంతో ఈసీని బెదిరించినట్లు ఐటీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా పలుకోణాల్లో ఈసీపై ఒత్తిడి పెంచడంతో తిరువళ్లూరు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించి బంగారం అప్పగించినట్లు తెలుస్తోంది. బంగారం తమదే అయినప్పుడు టీటీడీ హడావిడిగా ఇంత హైరానా పడటం, ఈసీని బెదిరించడం, ఒత్తిళ్లకు గురిచేయడంలోని ఔచిత్యం ఏమిటనే వాదన ఐటీ వర్గాల్లో వినిపిస్తోంది. -
బంగారం తరలింపు: గోల్‌మాలేనా.. గోవిందా!
ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో పోలీసుల తనిఖీల్లో బయటపడింది కాబట్టి ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని, లేదంటే బ్యాంకుల నుంచి బంగారం తిరిగి టీటీడీ ట్రెజరీకి చేరుతోందా? లేదా మరో చోటుకి వెళ్తోందా? అనే అనుమానాలు వ్యక్తం కావడానికి టీటీడీతో పాటు పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా అవకాశం కలిగించిందని మన్మోహన్సింగ్ విచారణ నివేదికలో చెప్పినట్లు సమాచారం. సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బంగారం వివాదంపై ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ వాదన సరికాదని ఈ అంశంపై విచారణ చేసిన రాష్ట్ర రెవెన్యూ(దేవాదాయ) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్సింగ్ తేల్చిచెప్పారు. బంగారం వ్యవహారంలో అటు బ్యాంకు గానీ, ఇటు ఈవో గానీ పాటించాల్సిన నియమ నిబంధనలేవీ పాటించలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎల్.వి.సుబ్రహ్మణ్యంకు ప్రాథమిక నివేదిక సమర్పించారు. మన్మోహన్సింగ్, దేవాదాయ శాఖ కమిషనర్ పద్మ సచివాలయంలో ఎల్.వి.సుబ్రహ్మణ్యంను కలిశారు. టీటీడీ బంగారం తరలింపులో చోటుచేసుకున్న లోపాలను వివరించారు. ఆ బంగారం తరలింపు బాధ్యత పంజాబ్ నేషనల్ బ్యాంకుదేనని, అది టీటీడీకి చేరే వరకూ తనకు సంబంధం లేదని ఈవో సింఘాల్ వ్యాఖ్యానించడం సరికాదని ప్రాథమిక నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా ఈ విషయంలో నిబంధనలను పాటించలేదనే నివేదికలో వెల్లడించినట్లు సమాచారం. ఉద్దేశపూర్వకంగానే లేఖ ఇవ్వలేదా? బ్యాంకులో పెట్టిన బంగారం గడువు తీరిపోయి టీటీడీ ట్రెజరీకి తరలిస్తున్న నేపథ్యంలో.. ఆ బంగారం తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినదేనని లేఖ ఇవ్వాల్సి ఉందని, కానీ, ఇక్కడ ఉద్దేశపూర్వకంగానే లేఖ ఇవ్వలేదా? అనే సందేహాలున్నాయని విచారణ నివేదికలో మన్మోహన్సింగ్ పేర్కొన్నట్లు తెలిసింది. ఏ రోజున బ్యాంకులో బంగారం పెట్టిందీ.. గడువు తీరాక ఎంత బంగారం టీటీడీకి జమ చేయాలో కూడా ఆ లేఖలో టీటీడీ ఈవో వివరించాల్సి ఉంటుందని, సదరు లేఖతో సహా బంగారం తరలింపునకు పంజాబ్ నేషనల్ బ్యాంకు చర్యలు తీసుకోవాల్సి ఉందని, అయితే ఇవేమీ పాటించలేదని నివేదికలో తేల్చిచెప్పినట్లు సమాచారం. ఆభరణాల్లోని రాళ్లు, రత్నాలను ఏం చేస్తున్నారు? స్వామి వారికి కానుకల రూపంలో వచ్చిన బంగారు ఆభరణాలను పలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారని, అయితే అలా డిపాజిట్ చేసిన బంగారం గడువు తీరాక తిరిగి టీటీడీ ట్రెజరీకి చేరుతోందా? లేదా? అనే దానిపై తాజా ఘటన తరువాత సందేహాలు తలెత్తుతున్నాయనే అభిప్రాయాన్ని విచారణ నివేదికలో మన్మోహన్సింగ్ వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎన్నికల నియామవళి అమల్లో ఉన్న నేపథ్యంలో పోలీసులు తనిఖీల్లో బయటపడింది కాబట్టి ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని, లేదంటే బ్యాంకుల నుంచి బంగారం తిరిగి టీటీడీ ట్రెజరీకి చేరుతోందా? లేదా మరో చోటుకి వెళ్తోందా? అనే అనుమానాలు వ్యక్తం కావడానికి టీటీడీతో పాటు పంజాబ్ నేషనల్ బ్యాంకులు అవకాశం కలిగించాయని చెప్పినట్లు సమాచారం. స్వామి వారికి ఆభరణాల రూపంలోనే భక్తులు బంగారం సమర్పిస్తారని, ఆ బంగారాన్ని కరిగించి కడ్డీలుగా మార్చడానికి ముందు ఆ ఆభరణాల్లో ఉన్న విలువైన రాళ్లు, రత్నాలను ఎక్కడ భద్రపరుస్తారో కూడా విచారించాల్సి ఉంటుందనే అభిప్రాయాన్ని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ‘‘డిపాజిట్ చేసిన బంగారం బ్యాంకు నుంచి టీటీడీ ట్రెజరీకి చేరే వరకూ తనకు సంబంధం లేదంటూ ఈవో చేసిన వాదన సరిగా లేదు. ఆయన పాటించాల్సిన నియమ నిబంధనలను పాటించలేదు. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా నిబంధనలు పాటించలేదు. తగిన భద్రత లేకుండా బంగారాన్ని తరలించడం ఏమిటి? ఇందులో టీటీడీ ఈవో, పంజాబ్ నేషనల్ బ్యాంకు తప్పిదాలకు పాల్పడ్డారు. భవిష్యత్తులో స్వామి బంగారం, ఆభరణాల విషయంలో మరింత పారదర్శకతతో వ్యవహరించాలి. దీనిపై ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలి’’ అని విచారణ నివేదికలో మన్మోహన్సింగ్ సిఫార్సు చేసినట్లు సమాచారం. భక్తుల మనోభావాలతో వ్యాపారమా? తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించుకునే బంగారాన్ని టీటీడీ పాలక మండలి వ్యాపార వస్తువుగా మార్చేసిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. హుండీ ద్వారా వచ్చే బంగారాన్ని అధికారులు కడ్డీలుగా మార్చి, బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారు. బ్యాంకులేమో ఆ బంగారాన్ని విక్రయించి, వచ్చిన సొమ్మును వడ్డీలకు ఇచ్చుకుంటున్నాయి. టీటీడీ డిపాజిట్ చేసిన బంగారంపై బ్యాంకులు చెల్లించే వడ్డీ 2 శాతంలోపే. అదే బంగారాన్ని అమ్మేసి, వచ్చిన సొమ్మును ప్రజలకు అప్పుగా ఇచ్చి 7 నుంచి 9 శాతం దాకా వడ్డీలు వసూలు చేస్తున్నాయి. అంటే బ్యాంకులు ఏ స్థాయిలో లాభపడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. గడువు తీరిన తర్వాత తమ వద్ద ఉండే ఇతర బంగారం, లేదంటే దేశవిదేశాల్లో కొనుగోలు చేసి టీటీడీకి బ్యాంకులు తిరిగి ఇచ్చేస్తున్నాయి. అంటే భక్తులు సమర్పించిన బంగారం అచ్చంగా అదే తిరిగి రాదు. ఇలా బంగారం డిపాజిట్లతో టీటీడీ ప్రతిఏటా రూ.60 కోట్ల దాకా వడ్డీ ఆర్జిస్తున్నట్లు అంచనా. శ్రీవారి ఖజానాలో 9,259 కిలోల బంగారం తమిళనాడులో తనిఖీల్లో పట్టుబడ్డ 1,381 కిలోల బంగారంపై భక్తుల్లో అనుమానాలు వెంటాడుతున్నాయి. దాన్ని ప్రస్తుతం టీటీడీ ఖజానాకు చేర్చారు. ఆ బంగారాన్ని పంజాబ్ నేషనల్ బ్యాంకు స్విట్జర్లాండ్‌లో కొనుగోలు చేసి, విమానంలో భారత్‌కు తరలించినట్లు సమాచారం. టీటీడీ ఖజానాలో ప్రస్తుతం కడ్డీల రూపంలో 9,259 కిలోలకు పైగా బంగారం ఉన్నట్లు అంచనా. ఈ మొత్తం బంగారాన్ని నగదు రూపంలోకి మార్చాలని టీటీడీ పాలక మండలి యోచిస్తున్నట్లు సమాచారం. బంగారం డిపాజిట్లపై బ్యాంకులిచ్చే వడ్డీ 2 శాతం లోపే ఉండడం, నగదు డిపాజిట్లపై వడ్డీ 8 శాతానికి పైగానే ఉండడంతో బంగారాన్ని నగదు రూపంలో మారిస్తే అదనంగా 6 శాతం వడ్డీ వస్తుందని భావిస్తున్నారు. -
బంగారం వివాదంలో..టీటీడీకి సంబంధమే లేదు
తిరుపతి అర్బన్ : చెన్నైలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) నుంచి తిరుపతికి తీసుకొస్తూ పట్టుబడ్డ 1,381 కిలోల బంగారం వ్యవహారంలో టీటీడీకి ఎలాంటి సంబంధంలేదని ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ స్పష్టంచేశారు. సోమవారం తిరుపతిలోని పరిపాలనా భవనంలో ఈవో మీడియాతో మాట్లాడారు. 2000వ సంవత్సరం ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు.. 2015కు చెందిన రిజర్వ్ బ్యాంకు నిబంధనల మేరకు టీటీడీ బంగారాన్ని జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే 2016 ఏప్రిల్ 18న పంజాబ్ నేషనల్ బ్యాంకులో టీటీడీకి చెందిన 1,311 కిలోల బంగారాన్ని డిపాజిట్ చేసినట్లు ఆయన వెల్లడించారు. అందుకుగానూ ఈనెల 18తో గడువు ముగిసే ఆ డిపాజిట్‌కు వడ్డీతో కలిపి పీఎన్బీ అధికారులు టీటీడీకి 1,381 కిలోల బంగారాన్ని అప్పగించాల్సి ఉందన్నారు. అయితే, ఎన్నికల ప్రక్రియలో భాగంగా తమిళనాడు పోలీసుల జరిపిన తనిఖీల్లో ఆ బంగారం పట్టుబడడం, అనంతరం పూర్తి విచారణ, పరిశీలన తర్వాత ఎన్నికల అధికారులు దానిని విడుదల చేసినట్లు ఈవో వివరించారు. ఈ కారణంగానే రెండు రోజులు ఆలస్యంగా ఈనెల 20న రాత్రి తిరుపతిలోని టీటీడీ ఖజానాకు బంగారం చేరిందన్నారు. ఈ సమయంలో తమ బంగారు విభాగం నిపుణులు, సంబంధిత అధికారులు నాణ్యత, పరిమాణం అంశాలను పరిశీలించాకే 1,381 కిలోలను తీసుకోవడం పూర్తిచేశామన్నారు. కానీ, తాము బ్యాంకులో డిపాజిట్ చేసిన బంగారాన్ని వడ్డీతో కలిపి తిరిగి తమకు అప్పగించే వరకు పూర్తి బాధ్యత పీఎన్బీ అధికారులదేనని ఈవో వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో బంగారం తరలింపు విషయంలో చోటుచేసుకున్న వివాదానికి టీటీడీ ఏమాత్రం బాధ్యత వహించబోదన్నారు. టీటీడీకి చెందిన బంగారం డిపాజిట్ విషయంలో పూర్తిగా ఆర్బీఐ నిబంధనల మేరకే వ్యవహరిస్తున్నామని ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ స్పష్టంచేశారు. అందుకే అయితే ‘బోర్డు మీటింగ్’ అక్కర్లేదు చెన్నై పీఎన్బీ నుంచి తిరుపతికి తరలించిన బంగారం వివాదం కోసమే అయితే టీటీడీ బోర్డు మీటింగ్ అక్కర్లేదని ఈవో సింఘాల్ స్పష్టంచేశారు. ఈ విషయంలో టీటీడీ పూర్తి పారదర్శకంగానే వ్యవహరించిందన్నారు. అయితే, ఈ వివాదం అంశంపై త్వరలో బోర్డు మీటింగ్ నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ ప్రకటించారన్న అంశానికి ఈవో పైవిధంగా స్పందించారు. గడువు ముగిసిన బంగారం డిపాజిట్లను తిరిగి ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం, లేదా ఇతరత్రా నిర్ణయాలు మాత్రం బోర్డుతో పాటు ఆయా సబ్ కమిటీల నిర్ణయాల మేరకే ఉంటాయన్నారు. ఈ విషయంపై స్వామీజీలు చేస్తున్న వ్యాఖ్యలకు ఈ ప్రెస్‌మీట్ ద్వారా సమాధానం లభించినట్లేనని ఈవో తెలిపారు. సూచనలిచ్చేందుకే సీఎస్ విచారణకు ఆదేశం ఇదిలా ఉంటే.. 1,381 కిలోల బంగారం విషయంలో నాలుగు రోజులుగా రగులుతున్న వివాదం దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం టీటీడీ అధికారులకు ఏమైనా సూచనలు ఇచ్చేందుకే విచారణకు ఆదేశించి ఉంటారని ఈవో పేర్కొన్నారు. టీటీడీ పాలనతోపాటు ఇతర అనేక విషయాల్లో సంపూర్ణ అవగాహన కలిగిన ఆయన విచారణను తాము స్వాగతిస్తామన్నారు. -
అంతు చిక్కని ‘బంగారం’ గుట్టు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన 1,381 కిలోల బంగారం వ్యవహారంలో అనేక గుట్టుమట్లు దాగి ఉన్నాయన్న అనుమానాలు బలపడుతు న్నాయి. మామూలుగా అయితే నిర్ణీత పరిమాణం దాటిన ఏ వస్తువునైనా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించాలంటే వేబిల్లు తప్పనిసరి. ఇది లేకుండా రవాణా జరిగేవన్నీ దొంగ సరుకు కిందే లెక్కగడతారు. అయితే, ఈ 1,381 కిలోల బంగారం తరలింపులో ‘ఈ–వేబిల్లు’ జాడ ఎక్కడా కనిపిం చడం లేదు. వాస్తవానికి బంగారం గోల్డ్ డిపాజిట్ స్కీం కింద పంజాబ్ నేషనల్ బ్యాంకులో దాచిన శ్రీవారి బంగారానికి వడ్డీతో కలిపి 1,381 కిలోల బంగారాన్ని బ్యాంకు (పీఎన్బీ) టీటీడీకి అప్పగించాల్సి ఉంది. ఇదే సమయంలో పీఎన్బీ 1,381 కిలోల బంగారాన్ని స్విట్జర్లాండ్‌లో కొనుగోలు చేసినట్లు కొన్ని డాక్యుమెంట్లను టీటీడీ అధికారులు బయటపెడుతున్నారు. బంగారం కడ్డీలను 56 బాక్సుల్లో జ్యురిచ్ ఎయిర్‌పోర్టు నుంచి ఈనెల 12న విమానం మార్గంలో చెన్నైకు చేరవేసేలా ఒక కార్గో సంస్థతో ఒప్పందం జరిగింది. ఇందుకు సంబంధించి జ్యురిచ్ ఎయిర్‌పోర్టు నుంచి చెన్నై ఎయిర్‌పోర్టుకు బంగారం తరలించే ఎయిర్ వే బిల్లులను టీటీడీ అధికారులు చూపుతున్నారు కానీ.. చెన్నై నుంచి టీటీడీకి ఆ బంగారాన్ని తరలించడానికి సంబంధించిన ఈ–వేబిల్లు గురించి టీటీడీ ఉన్నతాధికారులను అడిగితే.. పీఎన్బీ అధికారులు ఆ వేబిల్లు తమకివ్వలేదని చెబుతున్నారు. వారం రోజుల ముందు తేదీలతో ఇన్వాయిస్ కాగా, గడువు ముగిసిన బంగారం డిపాజిట్లను తిరిగి టీటీడీకి అప్పగించడానికే బ్యాంకు అధికారులు 1,381 కిలోల బంగారాన్ని స్విట్జర్లాండ్‌లో కొనుగోలు చేశారని టీటీడీ అధికారులు చెబుతుంటే.. ఎయిర్ వే మార్గంలో దేశానికి తరలించిన బంగారానికి సంబంధించిన కమర్షియల్ ఇన్వాయిస్ (బంగారం ఎవరిదన్నది తేల్చే పత్రాలు)లో కనీసం టీటీడీ అన్న పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. అంతేకాక.. ఆ కమర్షియల్ ఇన్వాయిస్లో తిరుపతిలోని ‘జీ4ఎస్ ఇంటర్నేషనల్ సంస్థ’కు అని పేర్కొన్నారు. దీనికితోడు 12వ తేదీన విమాన మార్గంలో చెన్నై వచ్చిన బంగారానికి తిరుపతిలో డెలివరీ చేయడానికి 11వ తేదీనే కమర్షియల్ ఇన్వాయిస్ తీసుకోవడం మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయి. నిజానికి.. టీటీడీ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం ఏప్రిల్ 18వ తేదీతో బ్యాంకులో స్వామివారి బంగారం డిపాజిట్ గడువు ముగుస్తుంది. కానీ, తిరుపతిలోని జీ4ఎస్ ఇంటర్నేషనల్ సంస్థకు బంగారాన్ని అప్పగించడానికి ఏప్రిల్ 11వ తేదీన ఇన్వాయిస్ తీసుకున్నారు. తమిళనాడులో బంగారం పట్టుబడి, తర్వాత టీటీడీ ఖజనాకు అది చేరాక ఇప్పుడు ఆ బంగారం, ఈ బంగారం ఒక్కటేనని టీటీడీ అధికారులు చెబుతున్నారు. గతంలోనూ అనేక ఆరోపణలు కాగా, స్వామి వారి అతి పురాతనమైన ఆభరణాలు విదేశాలకు తరలి వెళ్తున్నాయని గత కొన్నేళ్లుగా అనేక ఆరోపణలొచ్చాయి. తిరుమల ఆలయ ప్రధానార్చకులుగా పనిచేసిన రమణదీక్షితులు సైతం ఇలాంటి అనుమానాలు వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో తాజాగా పట్టుబడ్డ బంగారం వ్యవహారంతో.. తిరుమల శ్రీవారి బంగారం పేరుతో అక్రమ లావాదేవీలు ఏమైనా జరుగుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రశ్నలకు జవాబేది? – బంగారం పట్టుబడిన సమయంలో అది తమదేనని టీటీడీ అధికారులు ఎవ్వరూ వివరణ ఇవ్వలేదంటున్న ఈవో సింఘాల్.. ఐటీ శాఖ వివరాలు అడిగితే ఆ బంగారంతో తమకు సంబంధంలేదని చెప్పకుండా పీఎన్బీలో డిపాజిట్ చేసిన వివరాలను ఎందుకిచ్చారు? – బంగారం తరలింపునకు సంబంధించి రెండు కాగితాలను ఇచ్చిన టీటీడీ అధికారులు.. కీలకమైన ఈ–వేబిల్లుల వివరాలు ఎందుకు దాచిపెట్టారు? – ఏప్రిల్ 18న డిపాజిట్ల గడువు ముగిశాక తరలించే బంగారం కోసం వారం రోజుల ముందుగానే అంటే ఏప్రిల్ 11నే ఇన్వాయిస్ తీయడం.. ఈ ఇన్వాయిస్లో ఎక్కడా టీటీడీ పేరు లేకపోవడం ఏమిటి? – ఈ ఇన్వాయిస్లో చెన్నై మింట్ రోడ్డులోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి తిరుపతిలోని జీ4ఎస్ ఇంటర్నేషనల్ సంస్థకు పంపుతున్నట్లు మాత్రమే ఎందుకు ఉంది? – స్విట్జర్లాండ్‌లోని బ్రిటీష్ ఎయిర్వేస్లో ఏప్రిల్ 12న బంగారాన్ని కొరియర్ చేసినట్లు రికార్డులు స్పష్టంచేస్తుంటే దానికంటే ఒకరోజు ముందే ఏప్రిల్ 11నే ఇన్వాయిస్ ఎందుకు తీసారు? కాగా, ఇంత భారీ విలువ కలిగిన బంగారాన్ని చెన్నై నుంచి తిరుపతి ట్రెజరీకి పంపుతుంటే దానికి సంబంధించి తమకు ముందస్తు సమాచారం కూడా ఇవ్వలేదని సింఘాల్ చెప్పడం అనుమానాలను మరింత పెంచుతున్నాయి. -
పసిడిపై దిగుమతి సుంకం తగ్గింపు?
బడ్జెట్లో ప్రకటించే అవకాశం న్యూఢిల్లీ: కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) పూర్తి అదుపులో ఉన్న నేపథ్యంలో పసిడిపై దిగుమతి సుంకాన్ని కేంద్రం రానున్న బడ్జెట్లో 2 నుంచి 4 శాతం వరకూ తగ్గించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారకద్రవ్యం విలువ మధ్య నికర వ్యత్యాసాన్ని క్యాడ్‌గా వ్యవహరిస్తారు. దేశంలో రత్నాలు, ఆభరణాల తయారీ విభాగం వృద్ధికి, ఎగుమతులు పెరగడం లక్ష్యంగా కేంద్రం దిగుమతి సుంకాల తగ్గింపు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. దేశ ఎగుమతుల్లో ఈ విభాగం కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్లో ఈ రంగం నుంచి ఎగుమతుల్లో వృద్ధిలేకపోగా (2013 డిసెంబర్‌తో పోల్చితే) 1.2 శాతం క్షీణించి (మైనస్) 2.66 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. దాదాపు 35 లక్షల మంది ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. నవంబర్‌లో 152 టన్నుల పసిడి దిగుమతులు డిసెంబర్లో 39 టన్నులకు పడిపోయాయి. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద అత్యంత ప్రాముఖ్యత కలిగిన రంగాలుగా గుర్తించిన 25 విభాగాల్లో రత్నాలు, ఆభరణాల రంగం కూడా ఒకటి. ఈ నేపథ్యంలో పసిడిపై దిగుమతి సుంకాన్ని 2- 4 శాతం శ్రేణిలో తగ్గించే అవకాశం ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 2013లో క్యాడ్ 4 శాతానికి పైగా పెరిగి, డాలర్ మారకంలో రూపాయి విలువ దాదాపు 68 వరకూ బలహీనపడిన పరిస్థితుల్లో పసిడి దిగుమతులపై కేంద్రం 10 శాతానికి సుంకాలను పెంచింది. ఆభరణాల విషయంలో ఈ దిగుమతి సుంకం 15 శాతంగా ఉంది. దీనితో అంతర్జాతీయంగా పసిడి ధర దిగివచ్చినా, ఆ ప్రభావం దేశంలో కనబడలేదు. ఒక దశలో 10 గ్రాములకు ప్రీమియం (దేశీయ-అంతర్జాతీయ ధరల మధ్య వ్యత్యాసం) రూ.3 వేలకు పైగా కనబడింది. దీనితో దేశంలోకి బంగారం అక్రమ రవాణా పెరుగుతూ వస్తోంది.