
బంగారం తరలింపులో లోపాలున్నాయన్నది నిజమేనని, శ్రీవారికి చెందిన బంగారం భక్తుల మనోభావాలతో ముడిపడిన వ్యవహారమని అన్నారు.
సాక్షి, అమరావతి : తిరుమల వెంకన్న బంగారం తరలింపులో వెలుగుచూసిన లోపాలపై రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంకు నివేదిక ఇచ్చారు. పెద్ద మొత్తంలో బంగారం తరలించే సమయంలో టీటీడీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని సీఎస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకు అధికారులు, టీటీడీ అజాగ్రత్తగా వ్యవహరించిందని చెప్పారు. బంగారం తరలింపులో లోపాలున్నాయన్నది నిజమేనని, శ్రీవారికి చెందిన బంగారం భక్తుల మనోభావాలతో ముడిపడిన వ్యవహారమని అన్నారు.
బంగారం తరలింపులో ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సిందని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాఖల సమీక్షలు నిర్వహించటంలో తప్పేమిటని అన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక రాజకీయ నేతలు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని హితవు పలికారు. ఈ విషయమై ఎన్నికల సంఘం నుంచి స్పష్టమైన నిబంధలనలు ఉన్నాయని తెలిపారు. టీటీడీ బంగారం తరలింపు వ్యవహారంపై కొనసాగిన విచారణ నివేదికను ముఖ్యమంత్రికి పంపించామని తెలిపారు.