![Pokala Ashok Kumar Comments On LV Subramanyam - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/15/pokala.jpg.webp?itok=xblvubMz)
తిరుపతి మంగళం: టీటీడీ వంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో మూడేళ్లు ఈవోగా పనిచేసిన ఎల్వీ సుబ్రమణ్యం టీటీడీకి వ్యతిరేకంగా మాట్లాడడం దారుణమని టీటీడీ పాలకమండలి సభ్యుడు పోకల అశోక్‌కుమార్ పేర్కొన్నారు. తిరుపతిలో గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీటీడీ ఈవోగా పనిచేసిన ఎల్వీ సుబ్రమణ్యం శ్రీవారి విషయాన్ని రాజకీయం చేసి మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. కరోనా అనంతరం భక్తుల రద్దీ గణనీయంగా పెరుగుతోందని, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ పాలకమండలి, అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని చెప్పారు.
రెండోరోజు దర్శన టోకెన్లు జారీచేయకపోవడంతో భక్తుల సంఖ్య పెరిగి కొంతసేపు తోపులాట జరిగిందన్నారు. అంతేతప్ప భక్తుల పట్ల ఎవరూ అశ్రద్ధగా లేరని చెప్పారు. ఎల్వీ సుబ్రమణ్యం కేవలం చంద్రబాబుకు తొత్తుగా టీటీడీని రాజకీయం చేస్తున్నట్లు ఉందే తప్ప టీటీడీ మాజీ ఈవోగా మాట్లాడలేదని మండిపడ్డారు. టీటీడీ పాలకమండలి సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తోందన్నారు. టీటీడీ పాలకమండలిలో ఎంతమంది సభ్యులు ఉన్నారో తెలుసుకోకుండా మాట్లాడడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమన్నారు.
మాజీ ఈవోగా టీటీడీకి సలహాలు, సూచనలు ఇవ్వాలే తప్ప ఇలా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. స్వామి ప్రతిష్టను దిగజార్చి, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడితే సహించేదిలేదని హెచ్చరించారు. టీటీడీ విధివిధానాలపై అపార అనుభవం ఉన్న వ్యక్తి ధర్మారెడ్డి అని చెప్పారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేసి ప్రతి భక్తుడికి దర్శనం కల్పించాలనే ఆలోచనతో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఏఈవో ధర్మారెడ్డి వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దుచేశారని ఆయన గుర్తుచేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ నేతలు ఎం.వి.ఎస్.మణి, బండ్ల లక్ష్మీపతిరాయల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment