తిరుమల తిరుపతి దేవస్థానంపై చంద్రబాబు నిర్లక్ష్యం
నెయ్యి, వస్తువుల కొనుగోళ్లకు పర్చేజింగ్ కమిటీ లేదు
ఎటువంటి కమిటీ లేకనే శ్రీవారి బ్రహ్మోత్సవాలు, కొనుగోళ్లు
సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానంపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడి వందరోజులైనా తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నియామకం జరగలేదు. పాలకమండలి ఆలస్యమైతే వెంటనే స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేయాలన్నది నిబంధన. దీనీని సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు. కనీసం నెయ్యి, ఇతర వస్తువుల పర్చేజింగ్ కమిటీని కూడా నియమించలేదు. ఇవేమీ లేకుండానే శ్రీవారి బ్రహ్మోత్సవాలు, కొనుగోళ్లు జరిగిపోతున్నాయి.
ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. పాలక మండలి, కనీసం స్పెసిఫైడ్ అథారిటీ లేక తిరుమలపై భక్తుల సౌకర్యాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎటువంటి కమిటీ లేకుండా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం టీటీడీ చరిత్రలో ఇదే మొదటిసారి. ఇంత నిర్లక్ష్యమా అంటూ బాబు సర్కారుపై భక్తులు మండిపడుతున్నారు.కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు తిరుమల వచ్చారు. వైఎస్సార్‌సీపీ పాలనపై విమర్శలు చేశారు. నాడు అవినీతి, అక్రమాలు జరిగాయని, ప్రక్షాళన టీటీడీ నుంచే ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
అయినా ఇంతవరకు సరైన పాలన వ్యవస్థనే ఏర్పాటు చేయలేకపోయారు. నిత్యం వేలాది భక్తులు, కోట్ల రూపాయల్లో ఆదాయం ఉండే టీటీడీలో ఏ వస్తువు కొనాలన్నా పాలక మండలి ఆమోదం, పర్చేజింగ్ కమిటీ అనుమతులు తప్పనిసరి. పర్చేజింగ్ కమిటీలో మార్కెటింగ్ అధికారి, ఫైనాన్స్ అడ్వైజర్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ (ఎఫ్‌ఏ అండ్ సీఏఓ), జేఈవో, బోర్డు మెంబర్లు ఉంటారు. నెయ్యి వివాదం నేపథ్యంలో ఈ కమిటీ అత్యవసరం కూడా. అయితే మూడు నెలలుగా బోర్డు, పర్చేజింగ్ కమిటీ రెండూ లేవు. కనీసం ఉన్నతాధికారులతో కూడిన స్పెసిఫైడ్ అథారిటీ కూడా లేదు.
Comments
Please login to add a commentAdd a comment