శ్రీవారి ప్రసాదంపై టీటీడీ వివాదాస్పద నిర్ణయం
కొత్త విధానం గురువారం నుంచే అమల్లోకి..
గతంలో కోరినన్ని లడ్డూలు ఇచ్చేవారు
తిరుమల/తిరుపతి కల్చరల్: తిరుమల శ్రీవారి లడ్డూ అంటే భక్తులకు ఎంతో సెంటిమెంట్. స్వామివారి దర్శనం జన్మజన్మల పుణ్యఫలంగా భావించే వీరికి ఈ లడ్డూ ప్రసాదం స్వీకరించడం ద్వారా స్వామి అనుగ్రహం లభిస్తుందని వారి ప్రగాఢ విశ్వాసం. అందుకే తిరుమలకు వచ్చేవారు సరాసరి 10–20 లడ్డూలను తీసుకెళ్తారు. ఇలా తీసుకెళ్లిన వీటిని ఆఫీసుల్లో.. ఇంటి చుట్టుపక్కల వారికి భక్తిప్రపత్తులతో పంచిపెట్టడం అనాదిగా వస్తున్న సంప్రదాయం.
ఇంత విశిష్టత కలిగిన శ్రీవారి లడ్డూపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తాజాగా ఆంక్షలు విధిస్తూ కోతలు పెట్టింది. ఉచితంగా ఇచ్చే లడ్డూకు అదనంగా కేవలం రెండు మాత్రమే విక్రయించాలని నిర్ణయించింది. పైగా.. ఆధార్ కార్డు ఉంటేనే అంటూ మెలిక పెట్టింది. దీనిని గురువారం నుంచే అమలు చేస్తోంది. గతంలో కోరినన్ని లడ్డూలు ఇచ్చేవారని, ఇప్పుడు కొత్తగా ఉచిత లడ్డుతో పాటు కేవలం రెండు అదనపు లడ్డూలకే పరిమితం చేయడం ఏమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
గత ప్రభుత్వం దళారీ వ్యవస్థను అరికట్టేందుకు భక్తులు కోరినన్ని లడ్డూలు ఇస్తే కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వ నిర్ణయం దళారీ వ్యవస్థను పెంచిపోషించేలా ఉందని వారు విమర్శిస్తున్నారు. కాగా, ఈ విషయంపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ దళారులను అరికట్టేందుకే ఆధార్‌తో లడ్డూ ప్రసాదాలు విక్రయించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment