
సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మర్రిగుంట జాతీయ రహదారి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ను తప్పించబోయి డిక్షన్ కంపెనీ బస్సు బోల్తా పడింది. 50 మందికి తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న రేణిగుంట పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ క్లియర్ చేయించారు.

మరో ఘటనలో.. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీలోని డ్రైవర్, క్లీనర్‌లు ఇద్దరు క్యాబిన్‌లో ఇరుక్కు పోయి నరకయాతన పడిన సంఘటన పోటుపాళెం క్రాస్ రోడ్డు సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. గూడూరు రూరల్ ఎస్‌ఐ మనోజ్‌కుమార్ కథనం.. గుంటూరు నుంచి మిర్చీ లోడ్డుతో వెళుతున్న లారీ పోటుపాళెం క్రాస్ రోడ్డు సమపంలోకి వేకువజామున వచ్చింది.
అప్పటికే అక్కడ రోడ్డుపై ఆగి ఉన్న మరో లారీని వెనుక వైపు నుంచి వేగంగా ఢీకొట్టి బోల్తాపడింది. లారీ క్యాబిన్ నుజ్జునుజ్జు కాగా అందులోనే డ్రైవర్, క్లీనర్ ఇరుక్కు పోయారు. రోడ్డుపై లారీ బోల్తా పడడంతో నెల్లూరు వైపు నుంచి వచ్చే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన మిర్చిలోడ్డు లారీ డ్రైవర్, క్లీనర్‌ను బయటకు తీసి గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తీసుకువెళ్లారు. రోడ్డుకడ్డంగా పడిన లారీని తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.