
సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కాలినడకన తిరుమలకు వెళ్తున్న భక్తులపైకి 108 అంబులెన్స్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
వివరాల ప్రకారం.. తిరుపతిలో కాలినడకన తిరుమలకు వెళ్తున్న భక్తులపైకి 108 అంబులెన్స్ దూసుకెళ్లింది. భక్తులంతా పుంగనూరు నుంచి తిరుమలకు పాదయాత్రగా వస్తున్న సమయంలో చంద్రగిరి మండలం నరిశింగాపురం నారాయణ కళాశాల వద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
ఇక, ఈ ప్రమాదంలో మృతిచెందిన మహిళలు అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంపాలపల్లికి చెందిన పెద్దరెడ్డమ (40), శేగంవారిపల్లికి చెందిన లక్ష్మమ్మ (45)గా గుర్తించారు. అయితే, 108 అంబులెన్స్ మదనపల్లి నుంచి తిరుపతి రుయా ఆసుపత్రికి రోగిని తీసుకెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.