Srivari Prasadam
-
TTD: లడ్డూలు ఇక రెండే
తిరుమల/తిరుపతి కల్చరల్: తిరుమల శ్రీవారి లడ్డూ అంటే భక్తులకు ఎంతో సెంటిమెంట్. స్వామివారి దర్శనం జన్మజన్మల పుణ్యఫలంగా భావించే వీరికి ఈ లడ్డూ ప్రసాదం స్వీకరించడం ద్వారా స్వామి అనుగ్రహం లభిస్తుందని వారి ప్రగాఢ విశ్వాసం. అందుకే తిరుమలకు వచ్చేవారు సరాసరి 10–20 లడ్డూలను తీసుకెళ్తారు. ఇలా తీసుకెళ్లిన వీటిని ఆఫీసుల్లో.. ఇంటి చుట్టుపక్కల వారికి భక్తిప్రపత్తులతో పంచిపెట్టడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఇంత విశిష్టత కలిగిన శ్రీవారి లడ్డూపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తాజాగా ఆంక్షలు విధిస్తూ కోతలు పెట్టింది. ఉచితంగా ఇచ్చే లడ్డూకు అదనంగా కేవలం రెండు మాత్రమే విక్రయించాలని నిర్ణయించింది. పైగా.. ఆధార్ కార్డు ఉంటేనే అంటూ మెలిక పెట్టింది. దీనిని గురువారం నుంచే అమలు చేస్తోంది. గతంలో కోరినన్ని లడ్డూలు ఇచ్చేవారని, ఇప్పుడు కొత్తగా ఉచిత లడ్డుతో పాటు కేవలం రెండు అదనపు లడ్డూలకే పరిమితం చేయడం ఏమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వం దళారీ వ్యవస్థను అరికట్టేందుకు భక్తులు కోరినన్ని లడ్డూలు ఇస్తే కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వ నిర్ణయం దళారీ వ్యవస్థను పెంచిపోషించేలా ఉందని వారు విమర్శిస్తున్నారు. కాగా, ఈ విషయంపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ దళారులను అరికట్టేందుకే ఆధార్‌తో లడ్డూ ప్రసాదాలు విక్రయించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. -
ప్రకృతి ఫలసాయం.. శ్రీవారి ప్రసాదం!
సాక్షి, అమరావతి: శ్రీవారి ప్రసాదం, అన్నప్రసాదం తయారీ కోసం తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన 12 రకాల ఉత్పత్తుల సరఫరాకు రంగం సిద్ధమైంది. శ్రీవారికి సమర్పించే నైవేద్యంతో పాటు స్వామి దర్శనానికి వచ్చే లక్షలాది భక్తులకు నాణ్యమైన, రుచికరమైన ప్రసాదంతో పాటు.. అన్నప్రసాదాల తయారీలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించాలని టీటీడీ సంకల్పించింది. పైలట్ ప్రాజెక్టుగా 2021–22 సీజన్లో 1,304 టన్నుల శనగలను ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా సేకరించి టీటీడీకి సరఫరా చేశారు. కాగా 2022–23 సీజన్ నుంచి 15 రకాల ఉత్పత్తుల కోసం టీటీడీ ప్రతిపాదించగా.. 12 రకాల ఉత్పత్తుల సరఫరాకు ఏపీ మార్క్‌ఫెడ్ ముందుకొచ్చింది. ఈ మేరకు రైతు సాధికార సంస్థతో కలిసి మార్క్‌ఫెడ్.. టీటీడీతో అవగాహన ఒప్పందం చేసుకుంది. బియ్యం, కంది, మినుములు, శనగలు, పెసలు, బెల్లం, పసుపు పొడి, వేరుశనగ, మిరియాలు, కొత్తిమీర, మస్టర్డ్ సీడ్, చింతపండు రకాలకు సంబంధించి 15 వేల టన్నులు సరఫరా చేయనున్నారు. ఈ ఒప్పందం మేరకు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటల వారీగా సాగు చేస్తున్న 21,181 మంది రైతులను గుర్తించి రైతు సాధికార సంస్థ ద్వారా ప్రత్యేక శిక్షణనిచ్చారు. సాగు, ధరల నిర్ణయం, సేకరణ, నిల్వ, సరఫరా, కార్యకలాపాలను జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ సీఎం యాప్ ద్వారా పర్యవేక్షిస్తుంది. 15 శాతం ప్రీమియం ధర చెల్లింపు జిల్లాల వారీగా గుర్తించిన రైతుల వివరాలను ఈ యాప్ ద్వారా ఎన్రోల్ చేసి ఆర్బీకేల్లో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల ద్వారా.. మార్కెట్ ధరల కంటే కనీసం 15 శాతం ప్రీమియం ధర చెల్లించి సేకరిస్తారు. ఇలా గడిచిన ఖరీఫ్ సీజన్లో సాగైన సోనామసూరి (స్లెండర్ వెరైటీ) ఆవిరి పట్టని పాత బియ్యం, బెల్లం, శనగలను సరఫరా చేస్తుండగా, మిగిలిన ఉత్పత్తులను ప్రస్తుత రబీ సీజన్ నుంచి సరఫరా చేయనున్నారు. ఆర్బీకేల ద్వారా సేకరించిన ఈ ఉత్పత్తులను జిల్లా స్థాయిలో గుర్తించిన గోదాములు, కోల్డ్ స్టోరేజ్‌ల్లో నిల్వ చేస్తారు. సాగు, కోత, నిల్వ సమయాల్లో ఆయా ఉత్పత్తుల నాణ్యతను నిర్ధారించుకునేందుకు మూడు దశల్లో నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు లిమిటెడ్(ఎన్ఏబీఎల్) గుర్తింపు పొందిన థర్డ్ పార్టీ ల్యాబ్‌లో తనిఖీ చేస్తారు. రసాయన అవశేషాలు లేవని, నిర్దేశించిన ప్రమాణాలకనుగుణంగా ఫైన్ క్వాలిటీ(ఎఫ్ఏక్యూ) ఉత్పత్తులని నిర్ధారించుకున్న తర్వాతే ప్రాసెసింగ్ మిల్లుకు సరఫరా చేసేందుకు అనుమతినిస్తారు. అక్కడ ప్రాసెస్ చేశాక టీటీడీకి సరఫరా చేస్తారు. ఇలా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసిన చెరకుతో తయారు చేసిన బెల్లం ఉత్పత్తులను ఈ నెల 10వ తేదీన టీటీడీకి సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నెలాఖరులోగా నిర్దేశించిన శనగలు, సోనామసూరి బియ్యాన్ని సరఫరా చేయనున్నారు. 15 శాతం ప్రీమియం ధర చెల్లిస్తున్నాం టీటీడీకి 12 రకాల ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను సరఫరా చేస్తున్నాం. ఖరీఫ్‌లో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగైన బెల్లం, శనగలు, బియ్యం సరఫరా చేస్తున్నాం. మిగిలిన 9 ఉత్పత్తులను ప్రస్తుత రబీలో సేకరించి సరఫరా చేస్తాం. –రాహుల్ పాండే, ఎండీ, ఏపీ మార్క్‌ఫెడ్ ప్రకృతి ఉత్పత్తులను ప్రోత్సహించడమే లక్ష్యం ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసే రైతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఏపీ మార్క్‌ఫెడ్‌తో కలిసి టీటీడీతో ఒప్పందం చేసుకున్నాం. జిల్లాల వారీగా ఎకరంలోపు కమతాలు కలిగిన చిన్న, సన్నకారు రైతులను గుర్తించి వారు పండించిన ఉత్పత్తులను సేకరించి మార్క్‌ఫెడ్ ద్వారా టీటీడీకి సరఫరా చేస్తున్నాం. –పి.విజయకుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, రైతు సాధికార సంస్థ -
జీడిపప్పులో నాణ్యత లేదు
తిరుపతి అలిపిరి: శ్రీవారి ప్రసాదాల తయారీ కోసం సరఫరా చేస్తున్న జీడిపప్పు నాణ్యత లేనందున.. సంబంధిత కాంట్రాక్టును వెంటనే రద్దు చేయాలని అధికారులను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశించారు. భక్తుల నుంచి ఫిర్యాదులు రావడంతో టీటీడీ మార్కెటింగ్ గోడౌన్‌ను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రసాదాల తయారీకి సిద్ధంగా ఉంచిన జీడిపప్పును పరిశీలించారు. ప్రస్తుతం 3 కంపెనీలు జీడిపప్పు సరఫరా చేస్తుండగా.. అందులో ఒక కంపెనీ సరఫరా చేస్తున్న జీడిపప్పులో నాణ్యత లోపించినట్లు గుర్తించారు. దుమ్ము, విరిగిపోయినవి ఉన్నట్లు తేల్చారు. వెంటనే సదరు సంస్థ కాంట్రాక్టు రద్దు చేయాలని వైవీ సుబ్బారెడ్డి ఆదేశించారు. అనంతరం యాలకులను పరిశీలించారు. వాసన తక్కువగా ఉండటంతో.. నాణ్యతను తేల్చేందుకు ప్రభుత్వ పరీక్షా కేంద్రానికి పంపాలని అధికారులను ఆదేశించారు. ఆవు నెయ్యి వాసన కూడా సరిగ్గా లేదని అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వామివారి ప్రసాదాల తయారీ కోసం ఏటా రూ.500 కోట్ల ఖర్చుతో జీడిపప్పు, నెయ్యి, యాలకులను కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. అయితే వీటిలో నాణ్యత లోపిస్తోందని భక్తుల నుంచి ఫిర్యాదులు అందాయన్నారు. దీంతో ఆకస్మిక తనిఖీలు చేపట్టామని పేర్కొన్నారు. సరుకులను టీటీడీ ల్యాబ్‌లో పరీక్షించడంతో పాటు సెంట్రల్ ఫుడ్ అండ్ రీసెర్చ్ ల్యాబ్‌కు పంపించాలని అధికారులను ఆదేశించామన్నారు. ఆయన వెంట మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం ఉన్నారు. -
శ్రీవారి ప్రసాదాల తయారీలో సిరిధాన్యాలు వినియోగించాలి
తిరుమల: శ్రీవారి ప్రసాదాల తయారీలో వారానికి రెండు పర్యాయాలు సిరిధాన్యాలు ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దృష్టికి తీసుకువెళతామని టీటీడీ బోర్డు సభ్యుడు మూరంశెట్టి రాములు చెప్పారు. సినీ నటుడు భరత్ రెడ్డితో పాటు ఆయన శ్రీవారిని ఆదివారం దర్శించుకున్నారు. ఆలయం వెలుపల రాములు మాట్లాడుతూ.. శ్రీవారికి సిరిధాన్యాలతో ప్రసాదాలను తయారుచేసేలా ప్రయత్నిస్తామని తెలిపారు. టీటీడీ బోర్డు చైర్మన్, ఈవో, అదనపు ఈవోతోపాటు ప్రజల అభిప్రాయాలను తీసుకుని అమలు చేసేందుకు యత్నిస్తామన్నారు. భరత్ రెడ్డి మాట్లాడుతూ..ప్రజల ఆహార పద్ధతులు మారాల్సి ఉందని, సిరిధాన్యాలతోనే ప్రజలకు ఆరోగ్యకర జీవితం లభిస్తుందన్నారు. తమ మిల్లెట్ మార్వెల్స్ సంస్థను పాన్ ఇండియా స్థాయిలో ప్రారంభించేందుకు మరో సంస్థతో కలిసి ముందుకెళతామన్నారు. వారి వెంట సినీ నటుడు సప్తగిరి తదితరులున్నారు. -
శ్రీవారి ప్రసాదంగా శ్రీగంధం మొక్కలు
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు, రైతులకు ప్రసాదంగా శ్రీగంధం (ఎర్రచందనం) మొక్కలు పంపిణీ చేయాలని యోచిస్తున్నట్లు టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. బుధవారం ఆయన తిరుమలలోని శ్రీగంధం వనాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శేషాచలంలో 7,500 ఎకరాల అటవీ విస్తీర్ణం ఉందని, అందులో 250 ఎకరాల్లో శ్రీగంధం, మరో 250 ఎకరాల్లో ఎర్రచందనం పెంచుతామన్నారు. ఇప్పటికే 10 లక్షల ఎర్రచందనం మొక్కల పెంచామని, వచ్చే ఏడాదికి మొత్తం 25 లక్షల ఎర్రచందనం మొక్కలు పెంచనున్నట్లు వెల్లడించారు. -
శ్రీవారి బుందీపోటులో అగ్నిప్రమాదం
తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీ కేంద్రం బుందీ పోటులో గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది. బుందీపోటులో ప్రసాదం తయారు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో ఆలయ సిబ్బంది వెంటనే భద్రత అధికారులకు సమాచారం అందించారు. భద్రత అధికారులు బుందీపోటు సిబ్బంది సంయుక్తంగా రంగంలోకి దిగి మంటలను ఆర్పివేశారు.