సాక్షి, అమరావతి: శ్రీవారి ప్రసాదం, అన్నప్రసాదం తయారీ కోసం తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన 12 రకాల ఉత్పత్తుల సరఫరాకు రంగం సిద్ధమైంది. శ్రీవారికి సమర్పించే నైవేద్యంతో పాటు స్వామి దర్శనానికి వచ్చే లక్షలాది భక్తులకు నాణ్యమైన, రుచికరమైన ప్రసాదంతో పాటు.. అన్నప్రసాదాల తయారీలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించాలని టీటీడీ సంకల్పించింది.
పైలట్ ప్రాజెక్టుగా 2021–22 సీజన్‌లో 1,304 టన్నుల శనగలను ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా సేకరించి టీటీడీకి సరఫరా చేశారు. కాగా 2022–23 సీజన్ నుంచి 15 రకాల ఉత్పత్తుల కోసం టీటీడీ ప్రతిపాదించగా.. 12 రకాల ఉత్పత్తుల సరఫరాకు ఏపీ మార్క్‌ఫెడ్ ముందుకొచ్చింది. ఈ మేరకు రైతు సాధికార సంస్థతో కలిసి మార్క్‌ఫెడ్.. టీటీడీతో అవగాహన ఒప్పందం చేసుకుంది.
బియ్యం, కంది, మినుములు, శనగలు, పెసలు, బెల్లం, పసుపు పొడి, వేరుశనగ, మిరియాలు, కొత్తిమీర, మస్టర్డ్ సీడ్, చింతపండు రకాలకు సంబంధించి 15 వేల టన్నులు సరఫరా చేయనున్నారు. ఈ ఒప్పందం మేరకు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటల వారీగా సాగు చేస్తున్న 21,181 మంది రైతులను గుర్తించి రైతు సాధికార సంస్థ ద్వారా ప్రత్యేక శిక్షణనిచ్చారు. సాగు, ధరల నిర్ణయం, సేకరణ, నిల్వ, సరఫరా, కార్యకలాపాలను జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ సీఎం యాప్ ద్వారా పర్యవేక్షిస్తుంది.
15 శాతం ప్రీమియం ధర చెల్లింపు
జిల్లాల వారీగా గుర్తించిన రైతుల వివరాలను ఈ యాప్ ద్వారా ఎన్‌రోల్ చేసి ఆర్బీకేల్లో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల ద్వారా.. మార్కెట్ ధరల కంటే కనీసం 15 శాతం ప్రీమియం ధర చెల్లించి సేకరిస్తారు. ఇలా గడిచిన ఖరీఫ్ సీజన్‌లో సాగైన సోనామసూరి (స్లెండర్ వెరైటీ) ఆవిరి పట్టని పాత బియ్యం, బెల్లం, శనగలను సరఫరా చేస్తుండగా, మిగిలిన ఉత్పత్తులను ప్రస్తుత రబీ సీజన్ నుంచి సరఫరా చేయనున్నారు.
ఆర్బీకేల ద్వారా సేకరించిన ఈ ఉత్పత్తులను జిల్లా స్థాయిలో గుర్తించిన గోదాములు, కోల్డ్ స్టోరేజ్‌ల్లో నిల్వ చేస్తారు. సాగు, కోత, నిల్వ సమయాల్లో ఆయా ఉత్పత్తుల నాణ్యతను నిర్ధారించుకునేందుకు మూడు దశల్లో నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు లిమిటెడ్(ఎన్‌ఏబీఎల్) గుర్తింపు పొందిన థర్డ్ పార్టీ ల్యాబ్‌లో తనిఖీ చేస్తారు. రసాయన అవశేషాలు లేవని, నిర్దేశించిన ప్రమాణాలకనుగుణంగా ఫైన్ క్వాలిటీ(ఎఫ్‌ఏక్యూ) ఉత్పత్తులని నిర్ధారించుకున్న తర్వాతే ప్రాసెసింగ్ మిల్లుకు సరఫరా చేసేందుకు అనుమతినిస్తారు. అక్కడ ప్రాసెస్ చేశాక టీటీడీకి సరఫరా చేస్తారు.
ఇలా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసిన చెరకుతో తయారు చేసిన బెల్లం ఉత్పత్తులను ఈ నెల 10వ తేదీన టీటీడీకి సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నెలాఖరులోగా నిర్దేశించిన శనగలు, సోనామసూరి బియ్యాన్ని సరఫరా చేయనున్నారు.
15 శాతం ప్రీమియం ధర చెల్లిస్తున్నాం
టీటీడీకి 12 రకాల ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను సరఫరా చేస్తున్నాం. ఖరీఫ్‌లో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగైన బెల్లం, శనగలు, బియ్యం సరఫరా చేస్తున్నాం. మిగిలిన 9 ఉత్పత్తులను ప్రస్తుత రబీలో సేకరించి సరఫరా చేస్తాం.
–రాహుల్ పాండే, ఎండీ, ఏపీ మార్క్‌ఫెడ్
ప్రకృతి ఉత్పత్తులను ప్రోత్సహించడమే లక్ష్యం
ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసే రైతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఏపీ మార్క్‌ఫెడ్‌తో కలిసి టీటీడీతో ఒప్పందం చేసుకున్నాం. జిల్లాల వారీగా ఎకరంలోపు కమతాలు కలిగిన చిన్న, సన్నకారు రైతులను గుర్తించి వారు పండించిన ఉత్పత్తులను సేకరించి మార్క్‌ఫెడ్ ద్వారా టీటీడీకి సరఫరా చేస్తున్నాం.
–పి.విజయకుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, రైతు సాధికార సంస్థ
Comments
Please login to add a commentAdd a comment